సాయంత్రం నాలుగు గంటలు అయింది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ సందర్శకులతో సందడిగా ఉంది. ఆరోజు ఆదివారం. కొంతమందికి ఆటవిడుపు. మరి కొంతమందికి ఏరోజైనా ఒకటే. బ్రతుకు బండి నడవాలంటే మూడు వందల అరవై ఐదురోజులు ఆ తీరంలో బ్రతుకు సమరం సాగించవలసిందే. ఆ సాగర తీరంలో ఒక మూలగా దుప్పటి పరుచుకుని దాని నిండా బొమ్మలు పెట్టుకుని పక్కన చంటి బిడ్డను కూర్చోబెట్టుకుని బొమ్మల అమ్ముతోంది ఓ యువతి. అది ఆమె బ్రతుకు సమరం. ఉదయం పూట రహదారి పక్కన సాయంకాలం సాగర తీరం లో బొమ్మలు అమ్మడం ఆమె దినచర్య. ఉదయమేఇంత ముంత కట్టుకుని షావుకారు దగ్గర బొమ్మలు తెచ్చుకుని తట్టలో బొమ్మలు పెట్టుకుని ఒక చేత్తో బిడ్డను నడిపించుకుంటూ బ్రతుకు సమరం ప్రారంభిస్తుంది. సాయంకాలానికి షావుకారు ఇచ్చిన రోజు కూలీతో బ్రతుకు జీవనం సాగిస్తుంది. ఆమె పేరు నరసమ్మ. ఆమె పక్కనే కూర్చుని ఇసుకలో ఆడుకుంటున్న ఆ పోరడి పేరు రాజు. రాజు ఉదయం నుంచి ఒకటే ఏడుపు. బొమ్మలు కావాలని. పాపం చేతిలో ఎన్నో బొమ్మలు ఉన్న ఒక బొమ్మ కూడా ఆ పిల్లాడికి పిచ్చి ఆడించలేని ఆర్థిక పరిస్థితి ఆమెది. ఒక బొమ్మ ఖరీదుతో ఒకరోజు జీవితం నడిచిపోతుంది నరసమ్మ కి. అందుకే ఉదయం నుంచి ఏదో సాకు చెబుతూ రాజుని ఊరుకోబెడుతోంది. అయినా తోటి పిల్లలు అందరూ తన దగ్గరకు వచ్చి బొమ్మలు కొనుక్కుంటూ ఉంటే రాజు బొమ్మ అడగడంలో తప్పేముంది. తల్లి ఆర్థిక పరిస్థితి వాడికి ఏం తెలుస్తుంది పాపం. బొమ్మలతో ఆడుకునే వయసు. అమ్మనీ కావలసింది అడగడమే తెలుసు బిడ్డకి. అలా ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు రాజు. రాత్రి వరకు బొమ్మలన్నీ అమ్మి షావుకారుకి సొమ్ము ఇద్దామని కొట్టుకు వెళ్లిన నరసమ్మని "ఏమ్మా రాజు నిద్రపోయాడా అంటూ పలకరించాడు షావుకారు. "అవునయ్యా ఉదయం నుంచి ఒకటే ఏడుపు బొమ్మలు కావా లంటూ చెప్పింది నరసమ్మ. "పిల్లవాడిని ఏడిపించడం ఎందుకమ్మా ఒక బొమ్మ ఇవ్వలేకపోయావా అంటూ నవ్వుతూ చెప్పాడు షావుకారు. "అయ్యా మా పరిస్థితిని తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు. మాది పిల్లలకి బొమ్మలు కొనిచ్చే పరిస్థితి కాదు కదా అంటూ చెప్పింది నరసమ్మ. ఏమిటో ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇస్తాడు దేవుడు. అన్నీ ఉన్న మాలాంటి వాళ్లంటే దయ లేదు దేవుడికి అనుకున్నాడు షావుకారు. అందుకే రాజు అంటే షావుకారికి ప్రత్యేకమైన అభిమానం. నరసమ్మ కుటుంబం గురించి బాగా ఎరుగన్న వ్యక్తి షావుకారు. పైగా నరసమ్మ చాలా నిజాయితీ ఉన్న వ్యక్తి. ఎవరైనా అయితే ఈపాటికి బొమ్మ పగిలిపోయిందని అబద్ధం చెప్పి పిల్లలకి ఆ బొమ్మలు ఇస్తారు. నరసమ్మ పది సంవత్సరాల నుంచి అదే షావుకారి దగ్గర బొమ్మలు తీసుకుని అమ్ముతూ ఉంటుంది. రోజు కూలికి. ఏ ఒక్క రోజు కూడా తేడా చేయలేదు. రాత్రి ఒక గంట లేట్ అయినా తీసుకెళ్లిన బొమ్మలన్నీ అమ్మితే కానీ తిరిగి రాదు నరసమ్మ. ఇదిగో నీ రోజు కూలీ పట్టుకెళ్ళంటూ డబ్బు చేతిలో పెట్టాడు షావుకారు. ఆ డబ్బు షావుకారుకు తిరిగి యిచ్చేసి కావాల్సిన సామాన్లు తీసుకుని ఇంటికి బయలుదేరేముందు "అయ్యా రేపు నేను రాను అoటూ చెప్పింది నరసమ్మ. ఎందుకు? అని అడిగాడు షావుకారు . రేపు రాజుగాడి పుట్టినరోజు. రేపు సింహాద్రి అప్పన్న గుడికి వెళ్తాం అంటూ చెప్పి వెళ్ళిపోయింది నరసమ్మ. ఇంటికి వెళ్లి పనులన్నీ పూర్తి చేసుకుని మంచం ఎక్కిన నరసమ్మ కి మనసు మనసులో లేదు. రేపొద్దున్న రాజు లేచి మళ్లీ బొమ్మ గురించి ఏడిస్తే ఏం చేయాలి? పోనీ ఎవరినైనా సహాయం అడుగుదామంటే నరసమ్మ తల్లిదండ్రులు నరసమ్మ పెళ్లి తర్వాత సంవత్సరానికి చనిపోయారు. కట్టుకున్న భర్త తప్ప తాగి కడుపులో పుండుపడి రాజు పుట్టిన ఏడాదికే చనిపోయాడు. ఇంకెవరున్నారు? పోనీ షావుకారిని బొమ్మ అడుగుదామంటే ఇప్పటికే షావుకారు దగ్గర కొంత బాకీ ఉంది. రాజు గాడి కోరిక ఖరీదు చాలా తక్కువ. కనీసం వాడి పుట్టినరోజు నాడైనా వాడి కోరిక తీర్చాలని అనుకుంది నరసమ్మ. కానీ తీరే మార్గమే కనపడలేదు.ఇంత చిన్న కోరికను తీర్చలేని ఆర్థిక పరిస్థితితో రేపొద్దున్న వాడిని ఎలా పెంచి పెద్ద చేయాలి అది ఆలోచనలో పడి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది నరసమ్మ. అలా నరసమ్మ ఉదయం లేచేటప్పటికి బారెడు పొద్దు ఎక్కింది. గబగబా స్నానం చేసి గుడిసె తలుపు తీసేటప్పటికీ ఎదురుగుండా పెద్ద బుట్టతో రంగురంగుల బొమ్మలు. ఈ బొమ్మలు ఎవరు తీసుకొచ్చి ఉంటారు అబ్బా అని ఆలోచిస్తే అప్పుడు షావుకారుతో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది నరసమ్మ కి. అయినా షావుకారు బొమ్మలు ఇవ్వాలనుకుంటే నిన్ననే ఇచ్చేవాడే మరి ఎవరు ఇచ్చారు ?అబ్బా అసలు రాజుగాడు పుట్టినరోజు అని షావుకారికి తప్ప ఎవరికి తెలియదు కదా! అనుకుంది నరసమ్మ. కానీ పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో బెంగతో మంచం ఎక్కిన షావుకారు భార్య ఇలా గుప్త దానాలు చేస్తుంటుందని షావుకారుకి కూడా తెలియదు. ఒక భగవంతుడికి తెలుసు. నరసమ్మ షావుకారుల మధ్య నడిచిన సంభాషణ షావుకారు భార్య ప్రతిరోజు చాటుగా వింటుందనే సంగతి ఎవరికి తెలియదు. ఏ స్త్రీ శాపమో తగిలి పిల్లలు లేకుండా అయిపోయారని రోజు బాధపడుతూ ఉంటుంది షావుకారి భార్య. కారణం షావుకారుకి అమ్మాయిలు పిచ్చి. ఆ బొమ్మలు చూసి రాజుగాడు కళ్ళల్లో సంతోషం. ఉదయం నుంచి సాయంకాలం వరకు వాటితో ఆడుతూనే ఉన్నాడు. మర్నాడు షావుకారి కొట్టుకు వెళ్లి నరసమ్మ షావుకారు కాళ్ళ మీద పడింది. ఎందుకో అర్థం కాలేదు షావుకారికి. మీరు చేసిన సహాయం మర్చిపోలేను , పుట్టినరోజు పూట నా పిల్లవాడి కోరిక తీరింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నరసమ్మ. లోపల నుంచి ఇదంతా గమనిస్తున్న షావుకారి భార్య మనసులో ఆనంద పడింది. ఒక బిడ్డ కు తల్లి కాలేకపోయినా ఒక బిడ్డ కోరిక తీర్చే అవకాశం దేవుడు ఇచ్చినందుకు మురిసిపోయింది.