వరాహావతారం - చెన్నూరి సుదర్శన్

Varaahavataram

వరంగల్ పందులకు ప్రసిద్ధి...

నేను చెప్పేది దాదాపు ఏబది యేండ్ల క్రింది మాట అయినా యిప్పటికీ అది జగత్‍విఖ్యాతమే....

అప్పుడు నేను చదివేది నాలుగో తరగతి.

మా ముత్తవ్వ (అమ్మమ్మ తల్లి) పేరు వీరమ్మ. ఆమె నివాసం వరంగల్ గిర్మాజి పేట లోని బొడ్రాయి దగ్గర.. అద్దె ఇల్లు..

తల్లి అంటే మా అమ్మమ్మకు స్వంత తల్లేమీ గాదామె.. మారు మనువు తల్లి. మా అమ్మమ్మ పుట్టిన కొన్నాళ్ళకే ఆమె కన్నతల్లి అన్యకులస్థునితో లేచి పోయిందట.. మాముత్తాత అయిన రామయ్యతాత నిరాదరణ వల్ల.

మా రామయ్య తాత యిల్లనక, యిల్లాలనక వీధినాటకాలు వేస్తూ ఊరూరా తిరిగేవాడు. అలా బెడిసి కొట్టిన అతని భార్య స్థానాన్ని భర్తీ చేసింది మా వీరమ్మ.. రామయ్య నటనకు పడిపోయి.

అయినా ఏమాటకామాటే చెప్పుకోవాలి. మా అమ్మమ్మను తన కన్నకూతురు లాగే చూసుకొంది. కుటుంబ వృద్ధి కోసం ప్రాకులాడింది.

వీరమ్మ వచ్చిన వేళా విశేషమైతేనేమి.. క్రమేణా నాటకాలు అంతరిస్తున్నవేళ అయితేనేమి మాతాతయ్య నాటకాలకు స్వస్తి చెప్పి చేనేత రంగంలోని నూలు అద్దకం పనిలో స్థిరపడ్డాడు.

మాఅమ్మమ్మకు కట్నం కానుకలిచ్చి అత్తావారింటికి పంపించే సరికి యిల్లు కాస్తా గుల్లైంది..‘దొంగైతే కనబడినవే దోచు.. అల్లుడైతే అగుపడనివి గూడా ఊడ్చు’ అన్నట్లు. అయినా పెళ్ళి చేశాంగదా అని వదిలించుకోలేదు వీరమ్మ. ఒక్కని సంపాదనతో యిల్లు గడవదని నాల్గు రాళ్ళు వెనుకేసుకోవాలంటే ‘వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడ’న్నట్లు, తనూ ఏదైన పని చేయాలనే తపనతో బీడీ కార్మీకు రాలుగా రూపాంతరం చెందింది. ఆ సంపాదనతో అమ్మమ్మకు తొలికాన్పు.. బారసాల ఖర్చులన్నీ ఎల్లదీసింది.

అలా సాగిపోయే అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా వీరమ్మ కడుపూ పండింది. ఒక వారసుడు పుట్టాడు.. పేరు లక్ష్మయ్య. తనూ నాకు తాతయ్యే

అవుతాడు. లేక, లేక లేటు సంతానమయ్యె.. అబ్బిన చదువు చాలని, అందని చదువును అటకెక్కించి చెడు సావాసాలకు చేరువయ్యాడు లక్ష్మయ్య తాత.

“అవ్వ నాపెళ్ళెప్పుడే.. అవ్వనా పెళ్ళెప్పుడే” అంటూ వీరమ్మ ప్రాణాలు తోడేస్తూ కాళ్ళకడ్డు పడే వాడు.

దాంతో వీరమ్మ చేసేది లేక చిన్నతనంలోనే సుశీలమ్మ మెళ్ళో తాళి కట్టించింది.

“పెళ్ళైనంక సంకలు గొట్టుకుంట పెండ్లాం సుట్టు తిర్గుడుగాదు.. యిద్దర్ని యింట్ల కూకో బెట్టి ఆంబోతుల్లెక్క సాదేటోల్లెవ్వరు లేరిక్కడ. నువ్వేదైనా పని సూసుకోవాలె... నీ పెండ్లానికి సుత ఏదైనా పని సూయించాలె..” అని షరతు విధించి మరీ పెళ్ళి చేసింది.

రామయ్య తాతకివేమీ పట్టవు. తనపనేదో తనే.. దేనికైనా తలూపడమే.. గంగిరెద్దులా..

సుశీలమ్మ అందాన్ని చూడ రెండు కళ్ళు సరిపోవు. ముట్టుకున్న చోట మరక పడుతుంది. అంతటి అపురూప వర్ణం.. ఆమె మేను ఛాయ. పైగా అందగత్తె. మాతాతయ్య పాలు గావడం ఆమె ఆర్థిక స్థోమతే కారణం.

పెళ్ళైన కొద్ది రోజులకే “కోడలా నీకు మీయింట్ల బీడీలు సేసుడు అలవాటే గదా.. నువ్వు బీడీలు సెయ్యి నేను పొయ్యికాడి పని సూసుకుంట” అని తమలపాకులు తాకినా కమిలి పోయే సుశీలమ్మ చేతులకు తునికాకు కత్తిరిస్తూ బీడీలు చేసే చేట అప్పగించింది. తను యింటి పని వంట పని చూసుకొనేది వీరమ్మ. అయినా ఏమాత్రం తీరిక దొరికినా ఒళ్ళు దాచుకోకుండా కోడలుకు

చెయ్యి అందించేది. అందుకే సుశీలమ్మ కుమిలి పోలేదు.

లక్ష్మయ్య తాత కొత్త పెళ్ళాం మురిపెంలో ఏపనీ పాట అవడం లేదనీ కొన్ని రోజులు ఓపిక పట్టి తనే నడుం బిగించింది.. “లచ్చుంగా( లక్ష్మయ్య) పెండ్లాం అచ్చిందని సంబరపడ్తానవ్ గాని కర్సులు ఓ పక్క పెరుగుతానై. నీకు ముందుగాల్నే సెప్పిన గదా.. నీకు ప్రెస్సుల పని సూసిన.. సారివ్వాలరమ్మన్నడు పోదాం పద” అని లక్ష్మయ్య తాతను వెంటబెట్టుకొని వెళ్ళి వెంకట రమణా ముద్రణాలయంలో చేర్పించింది. అప్పట్లో ‘సృజన’

అనే మాస పత్రిక ఆ ప్రెస్‍లోనే ముద్రించ బడేది.

వీరమ్మ శివభక్తురాలు. వేములవాడ రాజన్న అంటే ప్రాణం..

శివుని ప్రీతిపదం రోజైన ప్రతీ సోమవారం రోజటి కంటే పెందరాళే లేచి కాలకృత్యాలు తీర్చుకొని, తలంటు స్నానమాచరించి ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకొని రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టు బెట్టుకొని ముందుగా యింట్లో శివపూజ చేసేది. ఆతర్వాత మెడలో పూలమాలలో ఒద్దికగా కూర్చిన శివలింగం ధరించి, విభూతి రాసుకున్న చేతిలో పూలమాలాంకృత శూలం ధరించి వీధుల్లో తిరుగుతూ దేవుని పేరు మీద జోగెత్తేది (భిక్షాటన). దానంగా వచ్చిన బియ్యంతో పరమాన్నం వండి దేవుడికి నైవేద్యం పెట్టేది. కొట్టిన కొబ్బరికాయ ముక్కలు, అరటి పండు ముక్కలకు చెక్కర కలిపి మోతుకాకు దొప్పల్లో పరమాన్నంతో బాటు పెట్టి వీధి లోకి వెళ్ళేది.

“వెములాడ రాజేసుని పలారముల్లో..” అని కేక వేస్తూ.. వచ్చినవాళ్ళకంతా పంచి పెట్టాక గాని తను ఎంగిలి పడకపోయేది. యిక ఆరాత్రి ఉపవాసమే.. అదే

రాత్రి ఎనిమిదయ్యిందంటే వీరమ్మకు దేవుడచ్చేది (శివశ్శక్తి, శివసత్తి).. దేవునితో తమ కష్టసుఖాలు చెప్పుకొని తగు నివారణోపాయాలు తెలుసుకోవాలని దూర ప్రాంతాల నుండి గూడా జనం వచ్చే వారు. సాధారణంగా అందరూ మహిళలే. వీరమ్మ పూనకంలో దేవుని పలుకులపై జనానికంత గురి.

ఆరాత్రి గూడా ఉదయంలాగే శివ పూజ చేసి చిన్న చాప మీద మర్రి కాలు పెట్టి కూర్చునేది.. కణ, కణలాడే నిప్పులున్న చిప్పలో సాంబ్రాణి వేసి దట్టంగా పొగలు లేవగానే వీరమ్మ తలవెండ్రుకలను విరబోసుకొని తలవంచి పొగపట్టిచ్చేది.

దేవున్ని అడగడానికై వచ్చిన వాళ్ళంతా నిశ్శబ్దంగా కూర్చొని దేవుని రాకకై ఎదురి చూసేవాళ్ళు.

వీరమ్మ ముందుగా చేతులు పైకెత్తి వేళ్ళు విరుచుకొనేది. తర్వాత బ్రేవ్..! బ్రేవ్..! అంటూ త్రేన్పులు తీసేది. కొద్దిసేపటికే ఒళ్ళంతా జలదరించుకుంటూ తూగిపోయేది. ఆబ్రేవులు కాస్తా ఆవేశ పూరిత దేవుని స్మరణ రాగాలుగా మారేవి. ముందు కూర్చున్న వాళ్ళంతా “శరణు.. శరణు..” అంటూ రెండు చేతులతో దండాలు పెడ్తూ వేడుకొనేవారు.

“కోరమీసాల కొమురెల్లి మల్లన్నా.. అబ్బియా..”

“శరణు.. శరణు..”

“ఎద్దుపై కూకున్న యముడాల రాజన్నా.. అబ్బియా..”

“శరణు.. శరణు..”

యిలా రెండు , మూడు నిముషాల సేపు దేవుల్ల పేర్లను వల్లె వేసేది.

తర్వాత వచ్చిన వాళ్ళలో ఎవరికైనా ఒక్కరికే తన సమస్య ఏకరువు పెట్టుకునే అవకాశం దక్కేది. పిల్లలు తప్పిపోయారనో, ఆరోగ్యం బాగుండడం లేదనో, వస్తువులు దొంగిలించపడ్డాయనో.. చెప్పి వానికి తరుణోపాయాలు అడిగి తెలుసుకునే వారు. ఏదైనా ఒక్క సమస్యే అడగాలి. రెండు సమస్యలడిగినా దేవునాగ్రహనాకి గురౌతారు. భక్తుల సమస్య తీరగానే యిక నాకు సెలవు అంటూ వేగంగా తల విసురుతూ, విసురుతూ.. నేలకేసి నుదురు కొట్టుకొని మూర్ఛిల్లేది.

ఆదృశ్యం చూసి నేను వణికి పోయేవాణ్ణి. మరో నిముషం తర్వాత మేల్కొని మామూలు స్వరంతో.. “దేవుడేంసెప్పుండేంది” అడిగి తెలుసు కునేది వీరమ్మ. నాకాశ్చర్యమేసేది తనకేమీ జ్ఞప్తికి లేనందుకు.

దేవున్ని అడిగి తెలుసుకున్న వారు తమ సంతోషం కొద్దీ రూపాయో లేదా రెండు రూపాయలోదేవునికి సమర్పించుకునే వారు.

అలా వీరమ్మ అదనపు సంపాదన కేవలం సోమవారానికే గాక మిగతా రోజులకు గూడా విస్తరించి, అసలు నోటు చూడందే దేవుడు తననావహించనంత వరకు వచ్చింది.

ప్రజలమూఢనమ్మకాలను సొమ్ము జేసుకోవడం తప్పలేదామెకు. కుటుంబ భారం పెరిగిపోతుండడం దానికి తోడు అందరూ నావాల్లే అనుకొని ఆర్థికంగా సహాయ సహకారాలందిచడం.. అంతెందుకు మా అమ్మమ్మకిద్దరు కూతుళ్ల పెళ్ళిళ్ళను గూడా తనే ముందుండి చేసింది. అలా మావీరమ్మ పురుడు సహకారంతో యీపుడమిపై కళ్ళు తెరచిన మాఅమ్మమ్మ పెద్ద బిడ్డ కొడుకునే నేను.

అందుకే నాకు వీరమ్మ అంటే వల్లమానిన అభిమానం. వీరమ్మ యింటికి తఱచుగా వెళ్ళాలని ఉన్నా అక్కడి పందులకు భయపడి వెళ్ళడానికి జంకే వాణ్ణి.

అందుకే అన్నాను.. వరంగల్ పందులకు ప్రసిద్ధీ అని.

ఆ గిర్మాజీపేటలో ఎవరికీ మరుగు దొడ్లు ఉండేవి కావు.

ఏవయసు వారైనా యింట్లో ఓమూలకున్న నీళ్ళ చెంబు దానికి సహాయ సహకారాలందించే ఒక దుడ్డు కర్రను చేతబూని బయటికి వెళ్ళాలి. ఏదైనా ఒక శిథిలమైన యిల్లే మరుగు దొడ్డికి ఆశ్రయం. ఆదొడ్డినిండా ఒక ప్రక్క బీడీలకుపయోగించిన తర్వాత మిగిలిన వ్యర్థ తునికాకు తుక్కు కుప్పలు, కుప్పలు.. మరో ప్రక్క వస్తాదులకు వస్తాదుల్లాంటి తెగ బలిసిన నల్లని ఆకారంలో రోత బుట్టించే పందులు.. గుంపులు.. గుంపులు..

దుడ్డు కర్రను గోడ గడియారం లోని పెండ్యులంలా నిరంతరంగా ఊపుతూ వాని భీకర రొదల సంగీతాన్నాస్వాదిస్తూ మన పని కానిచ్చేసుకొని దూరంగా పరుగెత్తి తదుపరి కార్యక్రమ పూర్తిచేసు కోవాలి. లేదంటే వాటి పనికి మనం అడ్డుగా ఉన్నట్లు తోచి మనల్ని అవి ముందుకు దున్నేస్తాయి. ఆభయంకర వాతావరణం చెప్పనలవి కాని జుగుప్సాకరం. ఆపూట అన్నమే సహించేది కాదు నాకు.. అక్కడి వాళ్ళకది అలవాటై పోయింది.

ఓరోజు నేను నేను వీరమ్మ వీధిలో అడుగు పెట్టేసరికి స్పృహ కోల్పోయిన మా లక్ష్మయ్య తాతను మా రామయ్య తాత ఒళ్ళో పడుకో బెట్టుకొని హాస్పిటల్‍కు తీసుకెళ్తున్నాడు. నేను కంగారుగా ఏమైందంటూ ఆరా తీశాను.

“పందిని కొట్టిండు” అంటూ నింపాదిగా జవాబిచ్చాడు రామయ్య తాత

బీడీని వెలిగించుకుంటూ..“పందిని కొడితే మరి తాతకేమైంది తాతా?..” అని నేనో ప్రక్క అడుగుతుంటే యింటికి వెళ్ళు మీ వీరమ్మ చెబ్తుందన్నట్లుగా రిక్షా ముందుకు సాగి పోయింది.

“లచ్చుంగాడు భోజనానికచ్చేది సూసి, నేను కంచం కడుకత్తనని ఇంటెన్కకు పోయిన. ఇంతట్లనే ఇంట్ల పంది సొచ్చిందట. దాన్ని సూసి వాడు పొయ్యిల కట్టె తోటి బలంగా పందిని సూటి సూసి కొట్టిండు. అది పంది ఈపుకు తాకి ఎగురచ్చి మల్ల వాని చాతికే తాకింది. బేవోసైండు. నేను లబ్బ, లబ్బ మొత్తుకుంటాంటె నల్గురు జమైండ్లు. యింతట్లనే రామయ్య తాత సుత అచ్చిండు. ముకంమ్మీద కొన్ని నీల్లు సల్లినం. కొంచెం ఓసర్లకచ్చిండు కొడుకు. బుక్కెడు నీల్లు తాగిచ్చి దవకాన్లకు తీసుక పొమ్మన్న. నువ్వైతె ముందుగాల బువ్వ తిను. నువ్వు తిన్నంక ఇద్దరం కల్సి దవకాన్లకు పోదాం..” అని చెప్తుంటే నాకు నవ్వాగింది గాదు. పందిని కొడితే దానికేం గాలేదు గాని ఫలితంగా తాత దవకాన్లకు పోవాల్సి వచ్చెనని పడీ, పడీ నవ్వసాగాను. వీరమ్మ గూడా నా నవ్వులో శృతి కల్పింది.

అలా పందులు అక్కడివారితో సహ జీవనం చేసేవి. గిర్మాజి పేటలో పిల్లల కంటే పందుల సంఖ్యే ఎక్కువ అనడం ఏమాత్రమూ అతిశయోక్తి గాదు. ఓ రకంగా అవి మాకు కొంత వరకు మేలే చేస్తున్నాయి. మోరీలు (మురికి కాలువలు) శుభ్ర పర్చుకుంటూ.. అందుకేనేమో మ్యున్సిపాలిటీ వాళ్ళు గూడా పందులను ప్రోత్సహిస్తున్నారనడములోనూ వాస్తవముంది..

***

దాదాపు ప్రతీ వేసవి సెలవుల్లో వీరమ్మ యింటికి వెళ్ళే వాణ్ణి.

ఓ సంవత్సరం సెలవుల్లో ..

షరా మామూలే.. ఉదయాన్నే మూలకున్న నీళ్ళ చెంబు తీసుకొని ఆపద్భాంధవుడైన దుడ్డు కర్ర కోసం వెతక సాగాను.

అది గమనించిన వీరమ్మ “దుడ్డుకర్ర లేకుంటెవాయె మనువడా.. నా గారాల పట్టి వరాలును పిలుత్తాగు” అంటూ “వరాలూ..!” అని కేకేసింది. నాకు తెలియని యీ కొత్తగా వరాలెవ్వరా’ అని నేను ఆశ్చర్యంగా చూడ సాగాను.

యింటి వెనకాలున్న తనగూట్లో నుండి ఒక తెల్లని పంది మగధీరుడులా పరుగెత్తుకొస్తున్నది. నేను నోరెల్ల బెట్టాను..

“అదేంది పం...” అనబోయిన నానోటికి ఠక్కున తాళం వేసింది వీరమ్మ.

“దాన్ని వరాహం అను లేదా మేము దానికి పెట్టిన పేరు వరాలు అను. కాని మరో పేరుతోటి పిల్వద్దు. నువ్వైతే పోయిరాపో.. నీ ఎంబడి వరాలత్తది. అచ్చినంక కతంత సెప్తా..” అంటూ వీరమ్మ హంస వర్ణంలో మెరిసిపోతున్న వరహానికి ఏవేవో సైగలు జేస్తూ చెప్పింది.

నేను బిక్కు, బిక్కు మంటూ చెంబు పట్టుకొని బయలు దేరాను. అది నా వెనకాలే బాడి గార్డులా నడుస్తూంది. దాని ఠీవి దర్పం చూస్తే దాన్ని పంది అనడం నాకూ మనస్కరిచలేదు. స్కౌట్ పిల్లగాడు మెడలో స్కార్ఫ్ ధరించినట్లు దాని మెడలో ఎర్రని నైలాను రిబ్బను, దానికో చిరు గంట. తల అటూ యిటూ రాజసంగా తిప్పుతూ ‘నీకేం భయం లేదు నేనున్నా’ నన్నట్లు నాకార్యదీక్షను ప్రోత్సహిస్తూ.. వస్తూంది.

ఆశ్చర్యం.. వరాలును చూడగానే హైద్రాబాదు పాతబస్తీలో కర్ఫ్యూ

ప్రకటించినట్లు అక్కడ పొంచి ఉన్న పందులన్నీ ‘పరుగో.. పరు గు..’ ఒకదానిమీద ఒకటి పడుకుంటూ లేస్తూ పారిపోసాగాయి.

నేను నిర్భయంగా, తృప్తిగా పని ముగించేసుకొని తిరిగి వచ్చాను. వరాలు తన గూట్లోకి వెళ్ళి పోయింది.

నేను స్నానం చేసి వచ్చాక టిఫిన్ చేస్తుంటే వీరమ్మ తన గారాల పట్టి వరాలు కథను చెప్పసాగింది.

“గాసందుల రెండు మూడు రోజుల సంది ఒక్కటే వాన పడబట్టింది. తుపానో ఏంపాడో..! గింత గెరువియ్యలే. అందరం యింట్లనే ఉన్నం. పనికి పోవుడు సుత బందైంది. ఇంట్లున్నా ఇగం పెట్ట బట్టింది. సెవులకు మఫ్లరు సుట్టుకొని నిండ దుప్పట్లు కప్పుకొని ఒకల మొకం ఒకలం సూసుకుంట పొయ్యి సుట్టు కూకున్నం.. పొయ్యెలుక్కు పొయ్యిమీద మూకుట్ల యేంచుతున్న పల్లికాయలు ఒక్కొక్కటి తీసుకొని బుక్కుకుంట. కనుమసక కావత్తాంది..

ఇంతట్ల పంది మూలుగినబడ్డది. ఆమూలుగింటాంటె పాపం! అదేదో అవత్త

పడ్తాందనిపిచ్చింది. మెల్లంగ లేసి ఇంటెన్కకెల్లి సుసెటాల్లకు ‘యింగ ఈన్తదా.. ఏంది?..’ అన్నట్టున్న ఓ పంది మూలుక్కుంట నన్ను దీనంగ సూడ బట్టింది. నాకు శాన పాపమనిపిచ్చింది. గోనె సంచి నెత్తిమీద కప్పుకొని పోయి నాల్గు రాల్లు దొరింపు సేసి.. రాల్ల మీద పొయ్యి కట్టెలడ్డంగ పెట్టి ఆటిమీదికెల్లి ఓతాటకు కప్పిన.

పంది బియ్యపు బత్తోలె కడుపేసుకొని మెల్లంగ, మెల్లంగ నేవుకుంట పోయి అందుల పన్నది. గప్పుడు నాకు పానం జర్ర నిమ్మలమైంది.

‘రాత్రికి పోయి ఓ మంత్రసానిని తీసుకరా.. ఏందో నీబిడ్డ లెక్క సూసుకో బడ్తివి’ అని లచ్చుంగాడు కారడ్డంగ మాట్లాడుకుంట నామీదికి గయ్యిన లేసిండు.. నాగుంబాము లెక్క. కోడలు సుత మొకమంత మాడ్సుకొని మూతి మూడు వంకర్లు తిప్పింది. నీ రామయ్య తాత కుయ్యనడు.. కయ్యనడు. నామనుమడు సంజీవడే ‘నాయ్నమ్మా నేను సుత సూత్తనే పందిని’ అని ఉబులాడబట్టిండు..

‘పోనీ బిడ్డా.. తెల్లారటాల్లకు అదేపోతది’ అని కొడుకును సముదా యించిన..

నాపానమంత పంది మీదనే కొట్టుకోబట్టింది. కన్ను అంటుకుంటే పాపం. మద్దె నాత్రి ఆవలికి లేసినప్పుడు మెల్లంగ పోయి తాటాకు పక్కకు జర్పిసూసిన. పంది ఈనింది. ఎన్ని పిల్లలో లెక్కబెట్ట రాలె గాని అందుల ఒక్కపంది కూన తెల్లంగుండి మెరవబట్టింది దీపమెలుక్కు. తల్లి పంది ఎలుగు సూసి గుర్రుమన్నది.ఈనితే పందులు దగ్గర్కి రానియ్యయ్.. మీదబడి కర్తై.. ఈననైతె ఈనిందని మన్సు నిమ్మలమైంది.. పోయి పండుకున్న. గప్పుడు సచ్చినట్టు కన్నంటుకున్నది.

పురంగ తెల్లారింది. వాన ఎల్సింది. తూర్పు దిక్కు కొంచెం, కొంచెం బయలైతాంది. సూరుడు పొడ్సెటట్టే ఉన్నడు. ఇంటెన్కకెల్లి సూసె టాల్లకు పంది సడీ సప్పుడు లేదు. ’అయ్యో పాపం...! ఏడికి పోయిందో ఏమోనని పానమంత మిడ్కింది. సంజీవడు నాఎంబడే లేసచ్చి ‘నాయ్నమ్మా... నాయ్నమ్మా... ఏదే పందీ’ అని అడ్గుతాంటే సిన్న పందికూన మూల్గు మాతొక్కుడు బండ కిందికెల్లి ఇనరాబట్టింది. మెల్లంగ వంగి సూసెటాల్లకు మోర్లె పారే నీల్లల్ల మూతి మీదికి

పట్టి మూల్గుతాంది.

కట్టెతోటి మెల్లంగ బైటికి తీసిన. నేను నాత్రి సూసిన తెల్లదే యిది. గజ్జ, గజ్జ వన్కబట్టింది. దేవుడు నాకిచ్చిన పసాదమనుకున్న. నామనుమడు దాన్ని సూసి న్యాలమీద పడ్డ లబ్బరు సెండు లెక్క ఎగురబట్టిండు. దాన్ని పొయ్యికాడికి తీసుకపోయి పొయ్యి ఎలిగిచ్చి కాక (వేడి) పట్టిచ్చిన.

కొంచెం తెలివిల పడ్డంక సిన్నపిలగాండ్లు తాగే పాల సీసల పాలు పోసి పాలపీక పెట్టి పాలు తాగిచ్చిన.. పగటీలి గంజి పోసి నాల్గు మెతుకులేసి ముందు పెట్టిన. గంజి గతికింది..

అప్పటి సంది దానికి అసిద్దమంటే తెల్వది. ఏమైనా ఆలుగడ్డలు, కందగడ్డలు, అరటి పండ్లు, బువ్వ వార్చిన గంజి తాగిచ్చుకుంట సాత్తానం. దానికి నేనూ సంజీవడు కల్సి ‘వరాలు’ అని పేరు పెట్టినం. మంచి టేనింగిత్తానం. మనం సెప్పేదంతా దానికి తెల్తది. యింటికి కావలుంటది. దాని కులపోల్లనెవ్వల్ను సుతా వాకిలి తొక్కనియ్యది. కుక్కలు దీన్ని సూడంగనే పిల్లి పిల్లల్లెక్క తోకలు ముడ్సుకొని పోతై..

మీతాతలెంత గుల్గినా కోడలెంత మొత్తుకున్నా సంజీవడు నేను కల్సి దీన్ని మాపానాల లెక్క సూత్తానం. దీన్ని యింకో పేరు తోటి పిల్వనియ్యం.” అంటూ వీరమ్మ తన గారాలపట్టి వరాలు గూర్చి చెబ్తుంటే అవాక్కయ్యాను. పందులను ఎరుకలోల్లు తప్ప ఎవ్వరు సాదుకొనడం నేనెరుగను. చాలా ఆశ్చర్యమేసింది. పైగా అది యింటికి రక్షణగా ఉండడం ముచ్చటేసింది.

వీరమ్మ యింకా వరాలు పనితనం గూర్చి చెబుతునే ఉంది..

“అది యింట్ల మైల సెయ్యది.. బైటికి దూరంగ పోతది. దాని కోసం నల్లకు వాల్ పెట్టిచ్చిన.. అది మూత్తోటి నల్ల ఇప్పుతది. బందు సేత్తది. కాల్లు కడుక్కొని గల్మల్లేసిన దాని బొంతకు కాల్లు తుడ్సుకొని యింట్లకత్తది..” వరాలు క్రమ శిక్షణ వింటుంటే అది మనింట్లోని మంచంలోనే మలమూత్రాలు విసర్జించే పసి బిడ్డలు, పక్షవాతంతో మంచాన పడ్డ ముదుసలి వారికంటే నయమే అపించింది.

కాని నాకు నచ్చనిది దాని మూతి ఒక్కటే.. పాపం! దేవుడు ప్రసాదించిన పంది మూతి.. దాని తప్పేముంది? అంతా మనం చూసే కళ్ళల్లోనే ఉంది. అదే వీరమ్మ దాన్ని తన స్వంత బిడ్డలా ఎలా చూడగల్గుతోంది.. దానికి బట్టలు తొడిగి అలంకరిస్తుంది. ఒళ్ళో కూర్చో బెట్టుకుంటుంది.. ముద్దాడుతుంది.

“దాని నోరు వాసనెయ్యదా ముత్తవ్వా..” అని అడిగితే..

“మీ రామయ్య తాతకంటే నయమే..’’ అని కొంటెగా సమాధానమిస్తుంది నవ్వుతూ.. నేనూ శృతి కలుపుతాను.

మహా కవి శ్రీశ్రీ గారు ‘కాదేదీ కవితకనర్హం’ అన్నట్లు.. పెంచుకోవాలనే మమకారమే ఉండాలి. మచ్చిక చేసుకొనే నేర్పరి తనమే ఉండాలి గాని ఏజంతువూ కాదనర్హం. సాదు జంతువులనే గాదు కొందరు కౄర మృగాలను సైతం సాదుకొనడం మనకు తెలియంది గాదు. మరికొందరైతే విశ్వాసానికి మారుపేరైన శునకాల్ని సహితం సాదుకోడానికి అసహ్యించుకుంటారు..

***

ఈమధ్య వీరమ్మ వాళ్ళు అదే వాడలో పాత యింటినొకదానిని కొనుక్కొని మరమ్మత్తులు చేసుకున్నారు. యిల్లు చూడడానికి బాగానే ఉంది గాని

యింటివెనకాలే చాలా ఖాళీ స్థలం. రక్షణ తక్కువనిపించింది కాని వరాలుండగా వారికేమి భయం? యింకా ప్రహరీ గోడ మిగిలి పోయి ఉంది. అయినా మంచి రోజులు దాటి పోతున్నాయని ముందుగా సున్నాలు వేయించుకొని గృహ ప్రవేశం చేశారు.

యిల్లంతా చుట్టాలతో కళ, కళ లాడుతుంటే వరాలు మాత్రం తన గూట్లో నుండి బయటికి రాలేదు. చుట్టాల ముందు తను తిరుగుతూ ఉంటే వీరమ్మను నానా మాటలు అంటారేమో నని దాని భయం దానిది.

దానికి యీకొత్త యింట్లో గూడా సకల సదుపాయాలు కల్గించింది వీరమ్మ.

మధ్యాహ్నం భోజనాల తర్వాత చాలా మంది చుట్టాలు సెలవు తీసుకున్నారు. ముఖ్యమైన వాళ్ళం కొందరమే మిగిలి పోయాం.

నేనూ, వీరమ్మ మనుమడు మరో నల్గురు పిల్లలం కలిసి యింటి వెనకాల ఖాళీ స్థలంలో ‘కింగ్’ అనే బంతాట ఆడుకుంటున్నాం. వరాలు గూడా సంజీవని వెనకాలే తిరుగుతూ బంతి తెచ్చివ్వడంలో సహకరిస్తుంది. బంతి చెట్ల పొదల్లో పడేసరికి సంజీవ్ వరాలు కలిసి వెదుకుతున్నారు. యింతలో ‘అమ్మో’ పాము అంటూ సంజీవ్ ఒక్క చెంగున పొదల్లో నుండి బయటికి దూకాడు. వరాలు భయంకరంగా అరుస్తూ పామును వెంబడించింది. వరాహం అంత గట్టిగా అరుస్తుంటే వినడం అదే ప్రథమం.

త్రాచుపాము పడగ విప్పి పలు మార్లు వరాలును కాటేయడానికి ప్రయత్నించింది. వరాలు అతి నేర్పుగా తప్పించుకొంటూ తన అవకాశం కోసం ఎదురి చూడ సాగింది. మెరుపు వేగంతో చటుక్కున పాము తలను కరిచి

పట్టుకొంది వరాలు. పాము గిల, గిలా సుళ్ళు తిరిగి పోతూ తోకతో వరాలును మోద సాగింది. అయినా వరాలు తన నోటి పట్టు విడవలేదు. వీరమ్మ, తాతయ్యలు మేమంతా రాతి బొమ్మలమై పోయాం. సుశీలమ్మ సంజీవ్‍ను గుండెలకు హత్తుకుంది.

దాదాపు ఐదు నిముషాల సేపు పాము గిరికీలు కొడ్తూనే ఉంది. వరాలు నోట్లో నుండి ధారాళంగా రక్తం కారుతునే ఉంది. వీరమ్మ ప్రాణం తల్లడిల్ల సాగింది.

చూస్తుండగానే వరాలు నోరు తెరచి స్పృహ కోల్పోయి పడిపోయింది. పాము చచ్చి వరాలు నోట్లో నుండి జారి నేలపై పడింది.

వీరమ్మ రిక్షాలో వరాలును తీసుకొని పశువుల దవాఖానాకు పరుగులు దీసింది.

అదృష్ట వశాత్తు డాక్టర్ ఉన్నాడు గాబట్టి సరిపోయింది. వెంటనే డాక్టర్ స్పందించి వరాలుకు ఇంజక్షనిచ్చాడు.

“ఏం ఫర్వా లేదు. ప్రాణాపాయం తప్పింది. త్వరగానే కోలుకుంటుంద” ని డాక్టరు అభయమిచ్చినా ఆరాత్రంతా దాన్ని కనిపెట్టుకొనే ఉంటూ భోజనం గూడా చేయలేదు వీరమ్మ. దేవుణ్ణి ప్రార్థించి దాని నుదుట బొట్టు పెట్టింది. దృష్టి తగిలిందేమోనని జీడిగింజ మిరపకాయలతో దృష్టి తీసింది.

ఆమరునాడు వరాలు మామూలుగా కోలుకొని, కాస్తా నీరసంగా ఉన్నప్పటికీ.. దాని నిత్యకృత్యాలలో అది మునిగి పోవడంతో వీరమ్మ తృప్తిగా శ్వాసించింది.

***

వరాలు వీరమ్మ యింట అడుగిడిన వేళా విశేషమో.. ఏమో గాని వీరమ్మ కోడలు సుశీలమ్మ సంజీవ్ తర్వాత చాలాకాలానికి మళ్ళీ కడుపు పండింది.

వీరమ్మ ఆనందానికి అవధులు లేవు. తను శివ సత్తి రూపంలో కోడలు కడుపు నిండా కంటుందని చెప్పిన వాస్తవం కార్యరూపం దాల్చ బోతున్నందుకు ఎంతగానో సంతోషించింది.

“కోడలా.. యింక నువ్వు బీడిల జోలికి పోవద్దు” అంటూ సుశీలమ్మ చేతిలోని బీడీల చేటను తిరిగి తాను స్వాధీనపర్చుకొంది వీరమ్మ. సుశీలమ్మను మంచంపై నుండి కాలు కింద బెట్టకుంట కంటికి రెప్పలా చూసుకో సాగింది.

ఓ శుభ ముహుర్తాన ఆడపిల్లకు జన్మనిచ్చింది సుశీలమ్మ.

“మాయింట్ల సిరులు కురిపించడానికే వచ్చింది మనుమరాలు. సాక్షాత్తు లక్ష్మీ దేవి..” అంటూ వీరమ్మ ఎంతగానో మురిసి పోయింది.

వీరమ్మ తన మనవరాలును వరాలుకు చూపిస్తుంటే అది మూతి చాచి మురిపెంగా చూస్తోంది. యింతలో చటుక్కున వీరమ్మ చేతుల్లోనుండి తన బిడ్డను లాక్కుంది సుశీలమ్మ.

“యింక యీ యింట్లో వరాలు ఉండటానికి వీల్లేదు. దాన్ని ఎరుకలోల్లకు యిచ్చిరా” అంటూ పేచీ పెట్టింది.

వీరమ్మ యీ హఠాత్పరిణామానికి బీర్పోయింది.

“నా వరాలు మన యింట కాలు పెట్టాకనే మనం యీ యిల్లు కొనుక్కోగలిగాం. నీకు గింత దూరానికి మల్ల కాన్పయింది. అసోంటి దాన్ని ఎల్లగొడ్తామనటానికి నీకు నోరెట్లచ్చింది.. నేను అర్కీసొప్పుకోను.. నీకు నీ బిడ్డ

ఎసోంటిదో.. నాకు నా వరాలు అసోంటిది..” అని చాలా ఘాటుగా సమాధాన మిచ్చింది వీరమ్మ.

“ఎట్ల దాన్ని వదిలించుకోవో.. నాతడాఖా ఏమిటో సూపిత్త.. యింట్లకు సంటి పిల్లచ్చింది.. పదిలం కావాలని నీకు గింత సుత దిమాక్ పనిసేత్త లేదా..” అంటూ సుశీలమ్మ కంఠం తారా స్థాయికి లేచింది.

యింతలో యిద్దరు తాతయ్యలు తోడయ్యారు. వీరి అండతో మాటా, మాటా తూటాల్లా పేల సాగాయి. లక్ష్మయ్య తాత తన భార్య సుశీలమ్మకు వత్తాసు పలుకుతుంటే మనుమడు సంజీవ్ వీరమ్మకు సపోర్ట్ చేయ సాగాడు. రామయ్య తాత సంగతి తెలిసిందే.. తటస్థం.. చిన్న పాటి యుద్ధ వాతావరణం ఏర్పడింది యింట్లో..

వీళ్ళ అరుపులు కేకలకు భీతిల్లి పిల్లి కూనలా బిక్కు, బిక్కు మంటూ తన స్థావరంలోనికి వెళ్ళిపోయింది వరాలు.

ఆరోజు రాత్రి ఎవరూ భోజనాల జోలికి వెళ్ళలేదు. అలిగి పడుకున్నారు. వరాలు యింటి వాతావరణం అర్థం చేసుకొని తనకూ ఆకలి లేనట్లుగా సంకేతాలివ్వడం మానేసింది. అయినా వీరమ్మ కాసేపటికి లేచి వరాలుకు రాత్రి భోజనం వడ్డించింది. వరాలు మూతి ముడ్చుకొని యింట్లో వారి నిరాహార దీక్షకు మద్ధతు ప్రకటించింది.

ఆమరునాడు సోమవారం..

రాజేశుని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోడానికై వీరమ్మ యథాప్రకారం స్నానాదు లు ముగించుకొని తయారై జోగెత్తడానికి ప్రక్క వీధిలోకి బయలు దేరింది.

తాతయ్యలిద్దరు తమ, తమ పనుల్లోకి వెళ్ళారు. సంజీవ్ వరాలుకు చిప్పలో గంజి చద్దన్నం బెట్టి బడికి బయల్దేరాడు.

బాలింతరాలైన సుశీలమ్మ నడుంకు సడలిన తువ్వాల కట్టును తిరిగి గట్టిగా బిగించుకొని కాలకృత్యాలు తీర్చుకోడానికై యింటి వెనకాలకొచ్చింది.

చిప్పలో గంజి అన్నం తాగుతున్న వరాలు, సుశీలమ్మను చూడగానే గబుక్కున తన గూట్లోకి వెళ్ళి పోయింది భయంగా..

కొత్త యింట్లో దూరంగా నైరుతి మూలకు తాత్కాలికంగా మరుగు దొడ్డి సదుపాయం ఏర్పాటు చేసింది వీరమ్మ. అందులోకి వెళ్ళ బోతూ ‘యీ వరాలు బయటికి వచ్చి తన బిడ్దకేదైన అపాయం కల్గిస్తుంద’నే అపోహతో వరాలు గూట్లోకి దూరగానే బయటి నుండి తలుపు గొళ్ళెం పెట్టింది సుశీలమ్మ.

యింతలో రెండు బలిసిన పందులు యింట్లోకి దూరాయి. మంచంలో పడుకొని ఉన్న పసి బిడ్డ మలవిసర్జన వాసనతో కైపెక్కి బిడ్డ క్రింది గుడ్డను మూతులతో లాగి వేశాయి. గుడ్డతో సహా కింద పడ్డ బిడ్డ కెవ్వుమని గుక్క పట్టి ఏడ్వసాగింది.

ఈ ప్రమాదాన్ని పసిగట్టిన వరాలు గూట్లో నుండి బయటికి రావడానికి తన శక్తి కొద్దీ ప్రయత్నించింది. చివరికి తలుపు బద్దలు కొట్టుకొని వీరావేశంతో బయటికి వచ్చి యింట్లో దూరిన పందులపై కెగిసింది. వరాలు నుదురు చిట్లిపోయి రక్తం ఓప్రక్క కారుతున్నా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ప్రతిఘటించసాగింది. యిల్లంతా రక్తసిక్తమైంది.. భీకర అరుపులతో పక్కింటి వారంతా పరుగెత్తుకు వచ్చి వాటి పోరాటమాపడం వారితరంగాదని భయం,

భయంతో బయటి కిటికీలలో నుండే నిశ్చేష్టులై చూడసాగారు.

యింతలో సుశీలమ్మ వచ్చి “వరాలూ.. నాబిడ్డను నువ్వే కాపాడాలే..” అంటూ గుండె బాదుకోసాగింది. అది విని వరాలు రెట్టింపు ఉత్సాహంతో తెగించి జూలు విదిల్చుకుంటూ సింహగర్జన చేస్తూ వాటి పైకి దూకి దూరంగా తరిమి సుశీలమ్మను బిడ్డను తీసుకోమన్నట్లగా సైగ చేసింది. సుశీలమ్మ గబుక్కున బిడ్డను తీసుకొని వణికిపోతూ హృదయానికి హత్తుకుంది.

వరాలు పోరాట పటిమకవి తట్టుకోలేక రక్తసిక్తమైన మూతులతో పలాయనం చిత్తగిస్తూ అప్పుడే వీధి గుమ్మంలోకి అడుగు పెట్టిన వీరమ్మను బలంగా ఢీ కొన్నాయి.

బొక్కబోర్లా పడిపోయింది వీరమ్మ. కడుపులో శూలం గుచ్చుకొని వీపు పైకి తేలింది. జోలె లోని ధాన్యం చెల్లాచెదురై పోయింది. మెడలోని శివలింగం నిస్సహాయంగా ఎగిరిపోయి శివుని మందిరంలో పడింది. అరక్షణంలో జరిగి ఊహించని ప్రమాదం వీరమ్మను రక్తపు మడుగులో ముంచెత్తింది.

“అయ్యో అత్తా..!” అంటూ దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తూ సుశీలమ్మ చంటి బిడ్డతో సహా వీరమ్మపై పడిపోయింది. అక్కడున్నవారి హా!, హా! కారాలతో యింటి రోదన మిన్నంటింది.

ఏడ్పు రాగంతో ఎలుగెత్తిన వరాలు అటూ, యిటూ తిరుగుతూ వీరమ్మనే చూస్తూ “మా అమ్మ యింకా లేవడంలేదెందుకా” అని ఆమూగజీవి పడే వేదనను వర్ణించాలని నేనెంతగా ప్రయత్నిస్తున్నా నా కలం కదలడం లేదు. నాకన్నీళ్ళతో కాగితం తడిసి ముద్దైపోయింది.. వరాలు కళ్ళు తన కన్నీళ్ళతో తడిసి ముద్దైనట్లు.

శివునికి ప్రీతిపదమైన ఆరోజు సోమవారం రాత్రి శివసత్తిగా దైవ ధారణ జరగక ముందే వీరమ్మ ప్రాణాలు శివునిలో లీనమై పోయాయి.

***

ఆరోజు వీరమ్మ పెద్ద కర్మ..

ఆమె శివభక్తురాలు.. సమాధి చేశారు.

సమాధినిండా బంతి పూలు. తలాపుకు శూలం హస్త ధారిణితో శక్తి స్వరూపిణి రూపంలోనున్న పెద్ద ఫోటోను పూలమాలలతో అలంకరించారు.

కర్మకాండ కార్యక్రమాలన్నీ దూరంగా కూర్చొని చూస్తూ ఉంది వరాలు. దాని రెండు కళ్ళళ్ళో నుండి ధారాళంగా కన్నీళ్ళు వరదలై ప్రవహిస్తున్నాయి.

వీరమ్మ అంతిమ సంస్కారం నుండి యీ రోజు వరకు పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు వరాలు. పక్కకే సంజీవ్ దాని వీపు పై చెయ్యి వేసి నిమురుతున్నాడు ఓదార్పుగా..

పిండాలు కలుపడానికి లక్ష్మయ్య తాత చెరువు దగ్గరకు చేరాడు. అతని వెనకాలే వెళ్ళిన వరాలు చెరువు గట్టులో మునిగి స్నానమాచరించింది. చెరువులోని కలువ పూలను మూతితో కరుచు కొని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వీరమ్మ సమాధి వైపు నడక సాగించింది. దాని మెడలోని గంట శివుని యింట మ్రోగుతున్నట్లుగా భక్తి భావన ఉప్పొంగ సాగింది.

సమాధి చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి వీరమ్మ పాదాల చెంత పూలనుంచింది. మూతితో పసుపు కుంకుమ సమాధికద్దింది.

ముందు రెండు కాళ్ళను ముందుకు, వెనుక రెండు కాళ్ళను వెనుకకు సాచి

మానవమూర్తి రూపంలో సాష్టాంగ ప్రణమిల్లింది. మెడలోని గంట విదిల్చింది. అది తెగి పోయి గణ, గణ మంటూ వీరమ్మ సమాధిపైనున్న ఫోటో ముందు పడింది.

తన మనసులో ఏమని ప్రార్థిస్తుందో ఏమో..!

రోజటి మాదిరిగానే మళ్ళీ లేచి వస్తుందని ఎదురి చూస్తున్న సంజీవ్.. వరాలు ఎంతకూ లేవకపోయే సరికి దగ్గరికి వెళ్ళి కదిపాడు..

వెల్లకిలా పడిపోయింది..

“వరాలూ..” అంటూ సంజీవ్ గావు కేక వేశాడు.. నిలువెల్లా వణికిపోతూ.

వెనుతిరిగి వీరమ్మ సమాధిని చూడకుండా వెళ్ళాల్సిన వాళ్ళంతా తిరిగి పరుగెత్తుకుంటూ వచ్చారు.

వరాలును తన ఒడిలోకి తీసుకొని “వరాలూ..! వీరమ్మ పోయినా నేను నీకున్నాను..” అంటూ సుశీలమ్మ ఓదార్చ సాగింది.

వరాలు తన రెండు ముందు కాళ్ళను చేతుల్లాగ జోడించి నమస్కరిస్తూ అసువులు బాసింది. అంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. సంజీవ్ రోదనతో స్మశాన వాటిక కన్నీళ్ళ పర్యంతమైంది.

ఆదృశ్యం నాకింకా కళ్ళళ్ళో మెదలుతూనే ఉంది.

వీరమ్మ సమాధితో బాటు వీరమ్మ గారాలపట్టి వరాలు సమాధి గూడా యీనాటికీ పూజలందుకుంటూనే ఉంది.*

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్