
వేసవిలో నీరు లభించకపోవడంతో అడవిలోని జంతువులు అన్ని నీటిని వెదుకుతూ ప్రయాణించసాగాయి. " ఏనుగు తాతా మన ప్రయాణంలో అలసట తెలియకుండా ఏదైనా కథ చెప్పు "అన్నాడు గుర్రం బాబాయి.
జంతువులు అన్ని మర్రి చెట్టుకిందచేరాయి. " సరే ...సిరిపురం అనే గ్రామం కంచి పట్టణానికి ఎనిమిది మైళ్ళదూరంలో ఉంది. తమ గ్రామంలో ప్రాధమిక విద్య ఉన్నప్పటికి పైచదువులకు ఆగ్రామంలోని బాల బాల ,బాలికలు కంచి వెళ్ళేవారు. వేసవి తీవ్రతను తట్టుకునేవిధంగా ఉదయం ఎనిమిది గంటలకు పాఠశాల ప్రారంభమై సాయంత్రం మూడు గంటలకు ముగిసేది.
అదే గ్రామంలో శంకరయ్య అనే వ్యెక్తి తన ఒంటెద్దు బండితో ఉదయం పదిగంటలకు కంచి పట్టణం చేరుకుని ,తనయజమాని అంగడిలోని నిత్యవసర వస్తువులు ఇతర ప్రాంతాలలో చేరవేస్తూ తమగ్రామ ప్రజలు కోరిన నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసి రాత్రికి ఇల్లు చేరేవాడు.
సిరిపురంలోని ప్రజలు కొందరు ఉదయం శంకరయ్య పట్టణానికి బయలుదేరే సమయంలో తమ పిల్లల మధ్యాహ్నం భోజనం శంకరయ్యకు అందజేసి 'అయ్య మీరు వెళ్ళేదారి మాపిల్లల పాఠశాల ఉంది ఈభోజనం వారికి అందించి వెళ్ళండి ' అని బండి లో పలురకాల చేతి సంచులపై విద్యార్ది,విద్యార్ధినీల పేర్లు రాసి ఉంచేవారు.సెలవు దినాల్లో తప్ప మిగిలిన అన్ని రోజులు శంకరయ్య పట్టణంలో చదివే పిల్లలకు భోజనం ఇచ్చి తన అంగడికి వెళ్ళేవాడు. అలా శంకరయ్యకు ఊరిలో మంచి పేరు ,గౌరవం ఉంది.ఓ పర్యాయం సిరిపురంలో పంచాయితీ ఎన్నికలు వచ్చాయి .కొందరి ప్రోత్సహంతో పోటి చేసిన శంకరయ్య ఓడిపోయాడు. తమ ఊరిలో వారు ఓడిపోయినందుకు ఓదార్చుతుంటే బాధ అనిపించిన శంకరయ్య ఓరోజు రాత్రి తన కుటుంబంతో కంచి పట్టణానికి కాపురం ఉండటానికి తరలి వెళ్ళాడు.
ఇప్పుడు చెప్పండి ఈతప్పు ఎవరిది ? " అన్నాడు ఏనుగుతాత. " తాము శంకరయ్యను గెలిపిస్తే పాలనాపరమైన పనుల వత్తిడిలో తమ పిల్లల భోజనం తీసుకువెళ్ళడం , తమకు కావలసిన నిత్యావసర వస్తువులు ఎక్కడ తీసుకు రాకుండా తమ పనులకు ఆటకం కలుగుతుందని శంకరయ్యను ఆఊరి ప్రజలు ఓడించారు " అన్నాడు నక్క.
" సిరిపురంలో సాఫీగా సాగుతున్న అందరి జీవితాలను కష్టాలకు గురిచేసాడు శంకరయ్య. అతను పోటీ చేయకుండా ఉంటే ఆఊరి వారికి ఈ కష్టం వచ్చేదికాదు. శంకరయ్య ఊరువదలి వెళ్ళడంతో ఆఊరి పిల్లల మధ్యాహ్నం భోజనం ఇప్పుడు అందజేసే మనిషి లేకపోవడంతోపాటు, తమకు కావలసిన నిత్యావసరవస్తువు తెచ్చిఇచ్చే మనిషిని కోల్పోయారు సిరిపురం వాసులు " అన్నాడు గుర్రం బాబాయి. " ఎవరైనా జీవితంలో ఎదగాలి అకుంటారు శంకరయ్యకూడా అదేచేసాడు. ఇన్నేళ్ళు ఆగ్రామప్రజలకు తను చేసిన గుర్తు ఉంచుకోకపోవడం శంకరయ్యకు బాధ కలిగించింది .ఓటమి తను అవమానంగా భావించి ఆఊరు వదలి వెళ్ళిపోయాడు "అన్న ఏనుగు తాత ముందుకు కదిలాడు .జంతువులు అన్ని ఏనుగును అనుసరించాయి.