ధరణిపురంలో అనంతుడు, కువలుడు, బ్రహ్మర్షి అనే మిత్రులు ఉండేవారు. ముగ్గురూ దయాగుణం, పరోపకారబుద్ది ఉన్న వారు. వీరిలో బ్రహ్మర్షి ఎక్కువ తెలివైనవాఢు.అతడు మిగతా ఇద్దరికీ "ఈ ప్రపంచంలో మంచివాళ్ళకంటే మోసగాళ్ళే ఎక్కువ. అలాగని మనం మంచితనం విడిచిపెట్టకూడదు. అవతలివాడు చెప్పేవన్నీ నమ్మకూడదు. నమ్మినట్లు నటిస్తూ, మనకు చేతనైన సాయం చేయాలి. అని చెప్పి హెచ్చరిస్తూండేవాడు. ఒకరోజు మిత్రులు బ్రహ్మర్షి ఇంటి అరుగు మీద కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు.అప్పుడొక అపరిచితుడు వచ్చి ,వారికి నమస్కరించాడు. మాసిన దుస్తులతో, రేగిన జుట్టుతో, కాంతిలేని ముఖంతో దీనంగా అమాయకంగా కనపడుతున్న అపరిచితుడిని చూసి, జాలిపడి కూర్చోమన్నారు. అపరిచితుడు వాళ్ళకు తన కథ చెప్పాడు. 'వాడి పేరు పరమాత్మ. వాడిది నలందాపురం. ఇల్లు తగులబడి సర్వం పోగొట్టుకున్నాడు.ఎక్కడా పని దొరకక రెండు రోజులనుండి తిండిలేదు. కనకపురంలో వాడి మిత్రుడున్నాడు. వాడు పరమాత్మకు తప్పక సాయపడతాడు. కనకపురం వెళ్ళడానికి దారి ఖర్చులకూ, భోజనానికీ పరమాత్మకు యాభై వరహాలన్నా కావాలి. ఆ మాత్రం సాయం అడిగాడు.వాడి పరిస్థితికి మిత్రులు ముగ్గురూ జాలిపడ్డారు. బ్రహ్మర్షి ఆ రాత్రికి భోజనం వసతి పరమాత్మకు తన ఇంట్లోనే ఏర్పాటు చేశాడు. మర్నాడుముగ్గురూ కలిసి అరవై వరహాలు వాడికి అందజేశారు. "ఈ డబ్బు నేను అప్పుగాతీసుకుంటున్నాను. నా రోజులు బాగుపడగానే మీ బాకీ తీర్చేస్తాను." అన్నాడు పరమాత్మ. మిత్రులు ముగ్గురూ ఊరిపొలిమేరలదాకా దిగబెట్టారు. అనంతుడు,కువలుడు అదేపనిగా పరమాత్మపైన జాలిపడుతూంటే బ్రహ్మర్షి నవ్వి"పరమాత్మ గురించి ఎక్కువ ఆలోచించకండి.మనం సాయపడటం అయిపోయింది.కాబట్టి వాడి గురించి మరిచిపోండి"అన్నాడు. మిత్రులిద్దరూ బ్రహ్మర్షితో "ఆ పరమాత్మ ఏదో ఒకరోజు వెనక్కి వచ్చి మన డబ్బును ఇచ్చేస్తాడు.మాకు వాడి మీద నమ్మకముంది"అన్నారు. వాళ్ళు చెప్పినట్లుగానే నెలరోజుల తర్వాత పరమాత్మ వచ్చి వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చాడు.తాను తెచ్చిన చిరుకానుకలు కూడా ఇచ్చాడు. "నా మిత్రుడికి అక్కడ చాలా పలుకుబడి ఉంది.నాకు మంచి ఉద్యోగమిప్పించాడు. మీ గురించి చెబితే ఎంతోసంతోషించాడు. మీ వంటి చదువుకున్న వారికి నెలకు ఐదువేలవరహాలు వచ్చే పెద్ద ఉద్యోగాలున్నాయట,వచ్చి చేరకూడదూ!"అన్నాడు పరమాత్మ. మిత్రులు ముగ్గురికీ వ్యవసాయంలో కొంత ఆదాయం వస్తోంది. రోజులు సుఖంగా జరిగిపోతున్నాయి.కానీ కనకపురంలో నెలకు ఐదువేల వరహాల ఆదాయం వస్తుందంటే సంతోషపడ్డారు. ఉద్యోగంలో చేరడానికి ఒప్పుకున్నారు. "మీరు ముగ్గురూ తలో రెండు వేల వరహాలు తీసుకుని నాతో రండి. నా మిత్రుడు నమ్మకస్థుడు.ఆ డబ్బుతో మీకు ఉద్యోగమిప్పిస్తాడు.ఇంతవరకూ ఆ డబ్బు ఇవ్వగలవారు లేక, విషయం అందరికీ తెలియక ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీరు నాకు చేసిన సాయానికి ప్రత్యుపకారంగా ఈ రహస్యం మీకు చెబుతున్నాను.మీలాంటి మంచి వారికి సాయం చేసానన్న తృప్తి నాకు మిగులుతుంది"అన్నాడు. అనంతుడు,కువలుడు తమ డబ్బును తెచ్చి బ్రహ్మర్షికిచ్చారు. అతను ఆడబ్బును తన డబ్బుతో కలిపి లెక్కించి ఒక సంచిలో వేశాడు.ఆరాత్రికి పరమాత్మ అనంతుడి ఇంట్లో భోజనం చేసి నిద్రపోయాడు. మరునాడు ఉదయం ముగ్గురు మిత్రులు పరమాత్మ వెంట బయలుదేరారు. మిట్టమధ్యాహ్నం వేళయింది. వారికి ఆకలిగా, అలసటగా అనిపించింది. ఓ చెట్టు క్రిందకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న తివాచీ పరిచి కూర్చున్నారు. భోజనం చేశారు.ఎండతగ్గాక బయలు దేరుదామనుకున్నారు. విశ్రాంతిగా పడుకున్నారు. బ్రహ్మర్షి తనచేతిలోని డబ్బు సంచి తలకిందపెట్టుకుని పడుకున్నాడు. అలసట వల్ల చల్లగాలికి ముగ్గురికీ నిద్రపట్టింది. అవకాశం కోసం చూస్తున్న పరమాత్మ లేచి కూర్చున్నాడు.మెల్లిగా బ్రహ్మర్షి తలకింది మూటను తీసుకున్నాడు. వేగంగా వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి అనంతుడికి మెలుకువ వచ్చింది.లేచిచూస్తే పరమాత్మ కనిపించలేదు.మిత్రులను లేపాడు. బ్రహ్మర్షి తలకిందనున్న సంచిని తస్కరించి వెళ్ళిపోయాడని గుర్తించారు. "పరమాత్మ మనం నమ్మినట్లు మంచివాడు కాదు.అరవైవరహాలు తిరిగి ఇచ్చి నమ్మకం కల్గించాడు.ఆరువేలవరహాలు దొంగిలించాడు." అంటూ అనంతుడు,కువలుడు వాపోయారు. బ్రహ్మర్షి నవ్వి "మీకు చెబుతూనే ఉన్నాను.ఈ ప్రపంచంలో మంచివాళ్ళకంటే మోసగాళ్ళే ఎక్కువ. అవతలివాడు చెప్పేవన్నీ నమ్మకూడదు. నమ్మినట్లు నటిస్తూ మనకు చేతనైనసాయం చేయాలి. కానీ మన జాగ్రత్తలో మనముండాలి. మన ధనం ఎక్కడికీ పోలేదు. నా నడుముకు లోపల కట్టుకున్నాను. నా చేతిలోని సంచిలో ధనమున్నట్లూ నటిస్తూ వచ్చాను. అవన్నీ పెంకుముక్కలు. ఆ సంచినే వాడు దొంగిలించింది" అని చెప్పాడు. ఎవరి వరహాలు వారికిచ్చాడు బ్రహ్మర్షి. మిత్రులు ముగ్గురూ 'కొత్తవారిని నమ్మకూడదు. జాగ్రత్తగా వ్యవహరించాలి' అనుకుంటూ ఇంటి దారిపట్టారు.