అభినయ్, స్వప్నలకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అభినయ్ వాళ్ళ నాన్న మాధవరావు, స్వప్న వాళ్ళ నాన్న వీర్రాజు మంచి స్నేహితులు. పిల్లల్ని ఎక్కడో దూరంగా పెళ్లి చేసి, యోగక్షేమాలు ఆరా తీస్తూ బ్రతకడం ఎందుకు? ఒకరికొకరు తెలిసినవాళ్ళము. పిల్లలు ఒకరినొకరు ఎరుగున్నవాళ్ళు. వాళ్ళకి ముడి పెట్టేస్తే, మన స్నేహ బంధము, వియ్యంకుల బంధంగా కొనసాగుతుంది అని నిశ్చయించుకుని అభినయ్, స్వప్నల కళ్యాణం జరిపించారు.
ఆ రోజు అభినయ్, స్వప్నల మొదటి రాత్రి. తొలి రాత్రికి గదిని నవ దంపతుల కోసం నూతనంగా తీర్చిదిద్దారు. రంగుల కలలతో వచ్చే ఆ దంపతుల కోసం మంచాన్ని రంగు రంగుల పువ్వులతో అలంకరించారు. గదిలోని టేబుల్ మీద ఆ తియ్యని రాత్రి కోసం, తియ్యని స్వీట్లు, జ్యూస్ ఏర్పాటు చేసారు. బంధువుల్లో ఎవరో ఏసీ అన్ చేసి గదిని చల్లబరిచారు.
సమయం సమీపించే సరికి బంధువులు అందరు బయటకు వచ్చేశారు. అభినయ్, స్వప్నలని ఆడవాళ్లు గుమ్మం దగ్గర ఆటపట్టించారు. ఇద్దరు బిడియంతో బిగుసుకుపోయారు. అభినయ్ దగ్గర సరదా ప్రకారం ఆడవాళ్లు డబ్బులు వసూలు చేసి, ఇద్దరిని లోపలికి పంపారు. ఆ పరిసర ప్రాంతాలని బంధువులు ఖాళీ చేసారు.
ఇద్దరిలోను సిగ్గు. మొదట అభినయ్ మంచం మీద కూర్చొన్నాడు. స్వప్నని రమ్మని కళ్ళతో సైగ చేసాడు. స్వప్న మెల్లగా నడుచుకుంటూ వచ్చి అభినయ్ పక్కన కూర్చొంది. స్వప్నలో ఎన్నో ఆలోచనలు! ఎన్నో భయాలు! అన్నింటికీ మించి ఆ రాత్రి కోసం తను కన్న ఎన్నో కలలు. మెల్లగా తల తిప్పి, కళ్ళు పైకెత్తి అభినయ్ ని చూసింది. అప్పటికే తను తన వైపు చూస్తున్నాడు. స్వప్న సిగ్గు పడింది. మెల్లగా అభినయ్ వెనుక నుండి చెయ్యి వేసి స్వప్నని గుండెల మీదకి లాక్కున్నాడు. స్వప్న గుండె ఝల్లుమంది. “చిన్నప్పటి నుండి నన్ను చూస్తూనే ఉన్నావు కదా! ఇంతకు నేను నీకు ఇష్టమేనా?” అన్నాడు అభినయ్. “స్వప్న మెల్లగా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, కాబట్టే నచ్చావు. తెలియని వాళ్ళు అయితే ఎలాంటివారో అని టెన్షన్ ఉండేది అంది.” అలా ఇద్దరి మధ్య చాలా సేపు ప్రశ్నలు, జవాబులు తిరిగాయి.
ఇప్పుడు వాళ్ళ మధ్య సిగ్గు, బిడియం కొంచెం పక్కకి జరిగాయి. కొత్త భార్యాభర్తల కాకా, పాత మిత్రులుల హాయిగా మాట్లాడుకుంటున్నారు. కాని స్వప్నలో ఏదో మూల జరగబోయే కార్యం గురించి చిన్న భయం, కుతూహలం దాగి ఉండిపోయాయి. చివరగా అభినయ్ అన్నాడు. “స్వప్న, మన మధ్య ఏదో జరగాలి అని ఇక్కడ మనల్ని ఉంచారు.” స్వప్న తలదించుకుంది. “కాని పెళ్లి తంతులో నేను చాలా అలసిపోయాను. మనం దీనిని కొంచెం వాయిదా వేద్దాము.” స్వప్న మొదట కొంచెం మీమాంసలో పడ్డా! అభినయ్ ని నొప్పించడం ఎందుకులే అని వెంటనే, “సరే, మీ ఇష్టం. నేను కూడా అలసిపోయాను అంది.”
ఇద్దరు ఆ మంచానికి చెరో వైపు పడుకున్నారు. పూల అలంకారాలు, స్వీట్లు, పళ్ళు అలంకారాలుగానే ఉన్నాయి. తరవాత కాని అర్ధం కాలేదు స్వప్నకి జరుగుతున్న తప్పు. మొదటి మూడు రాత్రులు అలానే కబుర్లలో ముంచి హయిగా నిద్రపోయేవాడు అభినయ్. నిద్ర పట్టక, ఈ పక్క స్వప్న. కొత్తగా పెళ్లి అయినా జంటకు ఎలాంటి ఆరాటం ఉంటుందో స్వప్నకి తెలియంది కాదు. ఇక్కడ తన పరిస్థితి మాత్రం తారుమరయ్యింది. అసలు అభినయ్ కి నాతో పెళ్లి ఇష్టం లేదా. లేక తనకి ఏదైనా లోపం ఉందా అని ఆలోచించుకుని తనలో తను మధన పడింది.
“ఆఫీస్ లో ఇచ్చిన సెలవులు అయిపోయాయి. వర్క్ అటెండ్ అవ్వాలి. ఈ సారి కొన్ని ఎక్కువ రోజులు లీవ్ తీసుకుని వస్తాను. అప్పుడు స్వప్నని నాతో తీసుకువెళతాను” అని ఇంట్లో స్వప్న తల్లిదండ్రులకి చెప్పాడు అభినయ్. స్వప్న దగ్గర కూడా వీడ్కోలు తీసుకున్నాడు. వెళుతూ తన నుదుట ముద్దు కూడా పెట్టుకున్నాడు. అతను వెళ్ళాక స్వప్నకి ఆలోచనలు మరింత ఎక్కువయ్యాయి. తనతో బాగానే ఉంటున్నాడు. అయినా ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది అని బాధపడుతుంది.
ఈ బాధని మోయలేక తమ ఇంటికి దగ్గరలో ఉండే ప్రాణ స్నేహితురాలు రమ్య ఇంటికి వెళ్ళింది స్వప్న. ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసే చదువుకున్నారు. ఇద్దరు అరమరికలు లేని స్నేహితులు. స్వప్న రమ్య దగ్గర అప్పటి వరకు దాచుకున్న తన బాధ అంత చెప్పుకుంది. రమ్య పరిస్థితిని అర్ధం చేసుకుంది. “నువ్వు బాధపడకు స్వప్న, నాకు తెలిసి అభినయ్ లోనే ఏదో లోపం ఉండి ఉంటుంది.!” అంది రమ్య. స్వప్న అవును అన్నట్లు తల ఊపింది. “ఈ విషయం వీలైనంత తొందరగా మీ పేరెంట్స్ కి చెప్పు. ఇలాంటివి సాగదీసి నువ్వు కుంగిపోవడం అనవసరం” అంది రమ్య. “నాకు చెప్పాలనే ఉంది. కాని అభినయ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఎప్పటి నుండో కలిసి ఉంటున్నాము. మా మూలంగా మంచి కుటుంబాలు విడిపోతాయి అని ఆలోచిస్తున్నాను” అంది స్వప్న.
రమ్య కాసేపు ఆలోచించి, “నువ్వే ఒకసారి అభినయ్ తో మాట్లాడి చూడు.” స్వప్నకి ఆ ఆలోచన నచ్చిన, అభినయ్ ని అడగాలంటే భయం. స్వప్న, రమ్య కాసేపు ఆలోచనలో పడిపోయారు. రమ్య తేరుకుని, స్వప్న జవాబు చెప్పలేదని, “ఏమిటే అతనిని కూడా అడగలేవా? మరి ఏం చేస్తావు? నీలో నువ్వు ఏడుస్తూ కూర్చొంటావా!” స్వప్న మళ్ళి మౌనంగా ఉండిపోయింది. “స్వప్న సమస్య ఉంది అని చూస్తూ కూర్చొంటే అది తీరదు. ఏదోక నిర్ణయం తీసుకో” అంది రమ్య. “నేను కొంచెం ఆలోచించి పరిష్కారం చూస్తాను రమ్య” అంది స్వప్న. రమ్య దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. వస్తూ దారిలో ఆలోచించింది. అభినయ్ కి, తనకి మధ్య ఏమీ జరగలేదు అనే విషయం నాన్నకి చెప్పి, అభినయ్ ని మెల్లగా ఆ విషయం నొప్పించకుండా అడగమని నాన్నకి చెప్పాలి అనుకుంది.
ఆలోచనలోనే ఇల్లు చేరుకుంది. నాన్నని పిలిచి చెబుదాం అనుకుని వాళ్ళ నాన్న వీర్రాజు గదికి వెళ్ళింది. లోపలికి చూస్తూనే ఆశ్చర్యపోయింది. లోపల నాన్నతో కబుర్లు చెబుతూ అభినయ్. అభినయ్ స్వప్నని చూస్తూనే, “హాయ్ స్వప్న. ఫ్రెండ్ ఇంటికి వెళ్లావు అని మావయ్య గారు చెప్పారు.” అవును అన్నట్లుగా తలూపింది స్వప్న. వీర్రాజు స్వప్నని కూర్చోమని, “అభినయ్ ఇప్పుడే చెబుతున్నాడు, మావయ్య పెళ్లి అయ్యాక హనీమూన్ వెళ్ళలేదు కదా. నేను స్వప్న అలా కేరళ వెళ్లి వస్తామని. నీ భార్య, నీ ఇష్టం. మధ్యలో నా పర్మిషన్ ఏమిటి! అని చెబుతున్నాను. నువ్వు వచ్చావు.”
“స్వప్న నీకు ఇష్టమే కదా” అన్నాడు అభినయ్. అవును అన్నట్లు తలూపింది స్వప్న. స్వప్న మనసులో అనుకుంది తొందరపడటం ఎందుకు? హనీమూన్ అంటున్నాడు కదా. అది అయ్యాక అక్కడ విషయం లేకపోతే, విషయం ఇంట్లో చెబుదాం అనుకుంది. అలా స్వప్న, అభినయ్ కేరళ చేరారు.
కేరళలో వారం రోజులు గడిపారు. చూడవలిసినవి అన్ని చూసారు. కాని వారం రోజుల్లో స్వప్న అనుకున్నది మాత్రం జరగలేదు. స్వప్న యాంత్రికంగా అభినయ్ తో తిరుగుతుంది. చివరిగా కేరళలోని ఒక పల్లెటూరిలో ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్లాడు అభినయ్. వెళ్లినప్పటికి రాత్రి సమయమయింది. “ఇది ఎవరిదీ?” అని అడిగింది స్వప్న. “చెప్తా కాని, ఇక్కడే మనం మూడు రోజులు ఉండబోతున్నాము” అన్నాడు అభినయ్. ఇద్దరు యధా ప్రకారం ఒక మంచం పై వేరు వేరుగా పడుకున్నారు.
స్వప్న ఉదయం లేచింది. ఆ ఇంట్లో కావలిసనవి అన్ని అమర్చి ఉన్నాయి. తల స్నానం చేసి కాఫీ పెట్టింది. అభినయ్ అప్పుడే స్నానం చేసాడు. ఇద్దర కాఫీ తాగారు. స్వప్న ఇదే మంచి సమయం అభినయ్ ని విషయం అడుగుదాం అనుకుంది. ఇద్దరు తాగిన కాఫీ గ్లాస్ లు సింక్ లో పెట్టి గది లోపలికి వస్తుంది. అభినయ్ వెనుక నుండి కౌగలించుకున్నాడు. స్వప్న ఉలిక్కిపడి “ఏమిటి?” అంది. అభినయ్ తన మెడ మీద జుట్టుని పక్కకి జరుపుతూ, “మన మధ్య ఎప్పుడో జరగవలిసినది, ఇప్పుడు జరుగుతుంది” అని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. స్వప్న అతనికి ఎదురుగా తిరిగింది. అభినయ్ స్వప్న చెంపలను వేళ్ళతో మెల్లగా తాకుతూ, “అవును ఇప్పుడు ఏం చెయ్యాలో నీకేమైనా తెలుసా! అన్నాడు.” స్వప్న సిగ్గుతో తల దించేసుకుంది. “సర్లే గూగుల్ చేద్దాం” అన్నాడు అభినయ్. చిరు కోపంతో “ఛీ.. పో..” అంది. అభినయ్ నవ్వేస్తూ తన గెడ్డాన్ని పట్టుకుని తల పైకెత్తి తన పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. స్వప్న మనసులో అమృత ధారలు. అభినయ్ స్వప్న నడుము చుట్టూ చెయ్యి వేసి కౌగిలి బిగిస్తుంటే, ఇద్దరిలో నిద్రాణంగా ఉన్న కోరికలు రెక్కలు విప్పి విహరిస్తున్నాయి. రెండు తనువులు పెన వేసుకుంటూ ఒకటిగా కలిసిపోతున్నాయి. స్వప్న ముంగురులు వెనక్కి సవరించి చెవి కింద ముద్దుపెట్టాడు అభినయ్. స్వప్న ముని వేళ్ళ పై పైకి లేచి, అభినయ్ నుదిటిని, చెంపని ముద్దాడింది.
అభినయ్ స్వప్నని అమాంతం రెండు చేతులతో లేపి మంచం దగ్గరకి తీసుకువచ్చాడు. తన టీ షర్ట్ తీసేసాడు. మంచం మీద ఉన్న స్వప్న మీదకి ఒరిగి మెల్లగా తన శరీరాన్ని ముద్దాడుతూ ఆమె మీదకి ఎగబాకాడు. స్వప్న చీరని పై ఎద మీద నుండి తొలగించబోతుండగా స్వప్న ఆపింది. “అభినయ్ ఇన్ని రోజులు లేని తొందర ఈరోజు ఎందుకు పుట్టుకు వచ్చింది నీకు?” అంది. అభినయ్ పక్కకి తప్పుకుని, “మేడం గారు ఈ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు అడుగుతారు అనుకోలేదు.” స్వప్న చిన్నగా నవ్వింది.
“స్వప్న నా దృష్టిలో శృంగారం అంటే మొక్కుబడి కార్యం కాదు, అది సృష్టి కార్యం. ప్రతి జీవికి అవసరం. అదే పుట్టుకకు ఆరంభం. చాలా మంది దీనిని గుంభనంగా, ఏదో బూతు అన్నట్లు దాచేస్తారు. నాకు అలా నచ్చదు. అలాగే శోభనం చేసుకొమ్మనారు అని చేసుకున్నట్లు, కాకుండా తొలి కలయిక స్వేచ్ఛగా, మన ఇద్దరి ఇష్టాల మధ్య జరగాలి అనుకున్నాను. అందుకే ఆగాను. నీ ఓపికకు ధన్యవాదములు. ఇది నా మిత్రుని ఇల్లు. వాడికి అంత వివరించాను. నేను కలలు కన్న ఆ రాత్రి, ఇదే చాలా మేడం గారు.”
స్వప్న ఏదో అడగబోయింది. అభినయ్ ప్రశ్న బయటకు రాకుండా పెదవుల పై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళ కళ్ళు మాత్రమే మాట్లాడుకున్నాయి. శరీరాలు సహకరించుకున్నాయి. శృంగారాన్ని ఆస్వాదిస్తూ, ఇద్దరు స్వర్గాన్ని మించిన లోకాలను చేరారు.
ఆ మూడు రోజులు వాళ్ళు కలలు కన్న ఆ రాత్రులుగానే గడిచిపోయాయి. ఇంటికి చేరిన స్వప్న మొఖంలోని కొత్త కల, రమ్యకు విషయం చెప్పకనే చెప్పింది. అభినయ్ స్వప్నని తనతో తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మొత్తానికి స్వప్న తన స్వప్నాలను చేరింది. అభినయ్ తనకు కావలసినట్లు అభినయించాడు. అంతే కదా జీవితం ఒక స్వప్నం, బ్రతకడం ఒక అభినయం.