అనగనగా ఓ అడవి.ఆ అడవిలో ఒక కుందేలు పిల్లత్రోవ తప్పి తిరుగుతూ తిరుగుతూ సింహ గుహలోకి వెళ్ళింది. ఆ సమయంలో సింహం నిద్రపోతుంది. కుందేలు పిల్ల నిద్రపోతున్న సింహం పైకెక్కి జూలు పట్టుకొని ఆడుకోవడం ప్రారంభించింది. సింహానికి మెళుకువ వచ్చింది. కోపంవచ్చింది కూడా. చిన్నపిల్ల దీనికేంతెలుస్తుంది పాపం. సింహానికి జాలేసింది. ఎలాగైనా వాళ్ళమ్మ దగ్గరకు చేర్చాలనుకొంది. అంతలోనే అటుగా వెళ్తున్న నక్కను పిలిచి "ఓయ్... నక్కా! ఇలారా! ఈ కుందేలు పిల్ల తప్పిపోయి, ఇలా నా గుహలోకి వచ్చింది. దీన్ని తన తల్లి దగ్గరకు చేర్చు అంటూ ఆజ్ఞ జారి చేసింది. చిత్తం మహారాజా! అని ఆలస్యం చేయకుండా కుందేలు పిల్లను తీసుకు బయలుదేరింది. ముందు కుందేలు పిల్ల, వెనుక నక్క నడుస్తున్నాయి. కొంచెం దూరం వెళ్ళేసరికి నక్కకు కుందేలు పిల్లను ఆహారంగా తినేయాలనుకుంది. వెంటనే నాలుగు అంగలలో కుందేలు పిల్లను చేరి, వీపుపై చేయి వేసింది. ఆ క్షణంలోనే... మాట తప్పితే సింహం విధించే శిక్ష గుర్తుకొచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఈ రోజుకి మాంసం మీదికి దృష్టి వెళితే తన బొందిలో ప్రాణం ఉండదని గ్రహించుకుని, మనసుకి సర్దిచెప్పుకుని, కుందేలు పిల్లని వీపుపై ఎక్కించుకుని ముందుకు నడిచింది. అడవి మధ్యకి వెళ్ళేసరికి గాండ్రిస్తూ, పెద్దపులి ఎదురయ్యి కుందేలు పిల్లపై పంజా విసరబోయింది. తెలివిగా నక్క తప్పించింది. పులి మావా! నేను మృగరాజు అప్పగించిన పనిమీద వెళుతున్నాను. నీవు ఈ కుందెలు పిల్లని చంపి తినేస్తే... ఆ నింద నాపైకి వచ్చి నన్ను సింహం చంపేస్తాదని, కుందేలుపిల్లని వదిలిపెడితే... నేను కుందేలు పిల్లని తల్లి దగ్గరకు చేర్చి, నేను సింహానికి కనిపించిన తరువాత నన్ను చంపి తిందువుగాని, అని నక్క బ్రతిమాలింది. పులి బిగ్గరగా నవ్వి తెలివిగా సింహం"దొంగ చేతికి తాళాలు ఇవ్వడం" అంటే ఇదే!సింహం కుందేలు పిల్లని తెలివిగా ఇంటికి చేర్చే ఆలోచన చేసింది అని,కుందేలు పిల్లతో పాటు నక్కను కూడా విడిచిపెట్టింది. నక్క సంతోషంగా కుందేలు పిల్లను తల్లి దగ్గరకు చేర్చి, సింహానికి కనిపించి తన నిజాయితీని చాటుకుంది. నాటినుండి నక్కజిత్తులు మాని, పనులను నిజాయితీతో పూర్తి చెయడమే కాకుండా... మాంసంపై మోజుని పూర్తిగా వదిలిపెట్టి, పూర్తి శాఖాహారిగా మారింది.