అంతటా నీవే - షామీరు జానకీ దేవి

Antataa neeve

38 సంవత్సరాల నుండి చేస్తున్న ఉద్యోగ జీవితం… ఈ రోజుతో ముగిసి పోతుంది…రేపటినుండి విశ్రాంత ఉద్యోగి అనుకుంటేనే బాధగా ఉంది జయశ్రీకి… కాని తప్పదు కదా…

చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి చదువుకుంది… జీవితంలో తనకు ఎప్పుడూ ఒక లక్ష్యం ఉండేది… డాక్టర్ చదవాలని ఎంతో అనుకునేది… చిన్నప్పుడు క్లాస్ లో టీచర్ పిల్లలందరినీ వరుసగా అడిగేవారు…

”నీకు ఏమి చదవాలని ఉంది జయా?”అని అడిగేవారు…

తను ఏమీ ఆలోచించకుండా “డాక్టర్” అని చెప్పేది…

ఆరోజుల్లో ఎంత కాన్ఫిడెన్స్ కదా…మనకు ఇష్టమైన చదువులు చదవటం గురించి మాత్రమే ఆలోచించేవారు.… ఏ చదువుకు మంచి ఉద్యోగం వస్తుంది అంటూ లెక్కలు వేసే వారు కాదు… దానిమీద ఏదో ఉద్యోగాలు సంపాదించాలి, డబ్బు కూడ పెట్టాలి అని ఆలోచనలు మాత్రం ఉండేవి కాదు… విజ్ఞానం, విలువలు, క్రమశిక్షణ ఇవి మాత్రమే నేర్చుకునేవారు… ఇష్టమైనది చదవటం అవసరం ఉన్నవారికి సహాయం చెయ్యటం…

ఇంటర్ తరువాత తన దిశ మారింది… అప్పట్లో ఇలా కోచింగ్ లు లేవు… అందులో అమ్మ కూడా వద్దని గొడవ చేసేది… మనం అనుకునేది ఒకటి డెస్టినేషన్ ఇంకొకటి… అలా డిగ్రీ చదివి బ్యాంకులోకి వచ్చింది… అయినా ఎప్పుడూ బాధ పడలేదు…

ఎంతో క్లిష్టమైన అత్యంత పోటీ ఉన్న బ్యాంకు పరీక్షలు రాసి ఉద్యోగం తెచ్చుకుంది… ఇది కూడా తనకు విజయమే…

ఆరోజు అమ్మకు ఆరోగ్యం బాగా లేదు… హాస్పిటల్ లో ఉంది… గర్భసంచి తీసేసారు… అంతకు ముందే ఆపరేషన్ అయి రెండు రోజులైంది… తన ఇంటర్వూ అయి సెలెక్ట్ అయిన తరువాత పోస్టింగ్ కోసం చూస్తోంది…. ఆ సమయంలోనే అమ్మకు కడుపు నెప్పి రావడం వెంటనే హాస్పిటల్ లో చేర్చటం జరిగింది… అమ్మను డిస్చార్జ్ చేసిన తరువాత తను బ్యాంకులో రిపోర్ట్ చేసింది…

ఎన్నసార్లు ఉద్యోగం వదిలేయాలని అనుకునేది… ఇటు ఇంట్లో, అటు బ్యాంకులో న్యాయం చెయ్యలేకపోతున్నాను అనుకునేది… కాని ఏవో ఆర్థిక సమస్యలు తన ఆలోచన మార్చేసేవి…

“నువ్వు రోజూ కష్టపడుతూ ఉద్యోగం చెయ్యటం మళ్ళీ ఇంట్లో పనిచెయ్యటం నాకిష్టం లేదమ్మా… మీ అమ్మ కూడా నీకు సహాయం చెయ్యలేకపోతోంది” అనేవారు నాన్న…

“ఫర్వాలేదు నాన్నా… ఒక మూడు నెలలైతే అమ్మ కోలుకుంటుంది… అయినా అక్క కూడా చేస్తోంది… మీరు ఏమీ ఆలోచించకండి… ఈ రోజు మనం నిశ్చింతగా ఉన్నామంటే బ్యాంకు వలనే కదా!” అని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేది… గ్రామీణ వాతావరణం, వ్యవసాయం మీద ఆధారపడిన తమ జీవితాలకు ఆ రోజుల్లో బ్యాంకు ఉద్యోగం ఎంతో ఆసరాగా ఉండేది…

అక్క పెళ్ళి, తమ్ముడికి ఉద్యోగం వచ్చిన తరువాత తను పెళ్ళి చేసుకుంది… మురళీధర్ తమ బ్యాంకులోనే ఆఫీసరుగా పనిచేస్తున్నాడు… ఇద్దరూ ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు…

జయశ్రీ ఆఫీసర్ ప్రమోషన్ వద్దనుకుని తీసుకోలేదు… మురళి అంచెలంచెలుగా ఎదుగుతూ ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా, అక్కడికి తాను కూడా, ట్రాన్స్ఫర్ చేయించుకునేది…

వారికి ఒక అమ్మాయి సహస్ర, అబ్బాయి సాకేత్… పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ వద్దనుకుని తాను సిటీలోనే ఉండేది… అక్కడే మంచి సెంటరులో ఫ్లాట్ తీసుకుని అత్త, మామలతో ఉండేది…

తరువాత పిల్లల చదువులు, మధ్యలో అత్తగారు చనిపోవడంతో సిటీలోనే ఉండిపోయింది… మామగారిని చూసుకోవడం, పిల్లల చదువులతో, ప్రమోషన్ గురించి మరి ఇంక, ఆలోచించలేదు…

ఉద్యోగంలో ప్రమోషన్ ఒక్కటే ముఖ్యం కాదు అనుకుని, తనకు ఇష్టమైన సంగీతం నేర్చుకుంది… తమ బ్యాంకులో ఎన్నో ప్రోగ్రామ్స్ లో పాడేది… అలా ఏ కార్యక్రమం జరిగినా ప్రార్ధనా గీతం పాడటానికి, అందరూ జయశ్రీనే పిలిచేవారు…

భగవంతుడు కానుకగా ఇచ్చిన కళను ఇలా సద్వినియోగం చేసుకుంటూ అందులో వచ్చిన గుర్తింపుకు వెలకట్టలేను అనుకుంటూ, తన కింతటి గౌరవం అందించిన బ్యాంకు అంటే దైవంతో సమానం అని అందరికీ చెపుతూవుంటుంది…

25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసినందుకు బ్యాంకువారు ఒక శాలువా కప్పి, కొంత అమౌంటు ఇచ్చారు… దానితో బ్యాంకు ఎంబ్లమ్ తో ఉంగరం చేయించి తన వ్రేలికి పెట్టుకుంది…

“మురళీ మన బ్యాంకు నిన్ను నాకిచ్చింది… ఒక కళాకారిణిగా గుర్తింపు వచ్చింది… పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు… అనుక్షణం నా శరీరంలో భాగంగా ఉండాలని ఇలా ఉంగరం చేయించాను… నువ్వే నా వ్రేలికి పెట్టు…” అంటూ భర్తతో ఆ ఉంగరం వ్రేలికి పెట్టించుకుంది…

“స్వామి భక్తి ఉండాలి… మరీ ఇంతలా కాదు” అంటూ నవ్వాడు…

ఇంజనీరింగ్ పూర్తి చేసిన కూతురికి క్యాంపస్ లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది… తరువాత ఆమె వివాహం ఘనంగా చేసారు… ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు…

కొడుకు ఎమ్ ఎస్ చెయ్యడానికి అమెరికా వెళ్ళాడు… కాన్వకేషన్ కు మామగారిని తీసుకుని ముగ్గురూ వెళ్ళారు…

అక్కడే తన క్లాస్మేట్ అని చూపించి, ఆమెను ప్రేమిస్తున్నానని, ఒక అమెరికన్ అమ్మాయిని చూపించాడు… ముగ్గురూ స్థాణువులై వుండిపోయారు… వెంటనే సమాధానం ఇవ్వలేకపోయారు…

వారాంతంలో అందరూ కలిసి పిట్స్ బర్గ్ వెళ్ళారు… అసలే పాటలంటే ప్రాణం పెట్టే జయశ్రీకి అక్కడ పాడే అవకాశం వచ్చింది…

“అంతయు నీవే హరి పుండరీకాక్ష” కీర్తన పాడుతుంటే ఆమె కళ్ళు వర్షించాయి…

అంతా ఆయన నిర్ణయం అయినప్పుడు, మధ్యలో నేనెంత అనుకున్నది… బయటకు వచ్చిన తరువాత భర్తతో, మామగారితో మాట్లాడి కొడుకుకి తమ అంగీకారం తెలిపింది…

జీవితంలో కొన్ని మనకు అనుకూలంగా జరుగుతాయి… వేరేగా జరిగే మరి కొన్ని సంఘటనలు భగవంతుడి నిర్ణయం అనుకుని సర్దుకు పోవాలి… అలా కొడుకు పెళ్ళి కూడా చేసి ఇండియా వచ్చారు…

మురళి రిటైర్ అయ్యాడు… ఇప్పుడు తన వంతు… గ్రాండుగా పార్టీ ఇవ్వాలని అనుకున్నారు… కానీ పిల్లలు రాలేమని చెప్పారు… వాళ్ళు రాకుండా చేసుకోవడం తమకు ఇష్టం లేదు…

హెడ్ ఆఫీస్ నుండి రిటైర్ అవుతున్న తనకు, అందులో గాయకురాలిగా ఎమ్ డి దగ్గర గుర్తింపు ఉంది…

ఎమ్ డి సమక్షంలో మాట్లాడటం కష్టమే… అయినా కూడగట్టుకుని “జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది… ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో? “ఆ మాటకే కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి…

పక్కనే ఉన్న మురళి తనకు ఆసరాగా ధైర్యం చెప్తున్నట్టుగా, తన చేయి పట్టుకుని చిన్నగా నొక్కాడు…

“మేడమ్ మీ రిటైర్మెంట్ ఉద్యోగానికే… సంగీత సరస్వతి మీరు… మీలోని కళకు విశ్రాంతి ఉండదు… అప్పుడప్పుడూ వస్తూ ఉండండి” అంటూ ప్రోత్సాహపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఎమ్ డి శాలువా కప్పారు…

అప్పటి వరకూ ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉన్న ఆమె ముఖంలో, చిరునవ్వు చిరుదివ్వెలా వెలిగింది… ఇది విరమణ కాదు భగవంతుడిచ్చిన మరో అవకాశం అని మనసులోనే అనుకుంది…

మరిన్ని కథలు

Devuniki Kanukalu
దేవునికి కానుకలు
- సరికొండ శ్రీనివాసరాజు
Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి