అభిసారిక - కందుకూరి రాజకుమారి

abhisarika

నిట్టూరుస్తూ గోడ గడియారాన్ని చూస్తే టైము ఏడు కావస్తోంది. తను ఈపాటికి రావాలే! అసలు తను వచ్చే వేళయిందనే మెలుకువొచ్చి, హడావిడిగా పక్కలోంచీ లేచాను. అర్జంటుగా పాలు కాచాలి. తను రాగానే ముందు 'ఛాయ్' పెట్టియ్యాల్సిందే. తనకి నా చేతి టీ చాలా ఇష్టం. అది పడితేగానీ పని నడవదట. నాకు అలా పొగిడించుకోవడం ఇష్టమే! అందుకే ఇంట్లో ఇంకెవ్వరూ తాగకపోయినా తన కోసం ప్రత్యేకంగా టీ పెడతాను.

పాలు కాచడం అయిపోయింది. తనింకా రాలేదేంటి? సెలవురోజు కదా, లేటుగా లేస్తామని ఆలోచించుండచ్చు. కానీ టైము ఏడున్నర - ఇంత లేటవ్వదు తనకి సాధారణంగా.

ఏమీ తోచక టీవీ పెట్టాను. ''నీ రాక కోసం నిలువెల్ల కనులై...'' అంటూ శ్రావ్యంగా పాడుతోంది ఒక చిన్న పాప. అంత లేత వయసులో ఎంత మాధుర్యం! అసలా పిల్లకి అంత భావం ఎలా పలుకుతుంది? తనకా పదాల అర్థం తెలుసోలేదో! హు! మా చిట్టీ ఉంది, ఎందుకూ? సంగీతం నేర్చుకోవే, చక్కగా టీవీలో పాడొచ్చూ అంటే అస్సలు వినిపించుకోదు. ఎప్పుడు చూసినా ఆటలే! పాప పాట మైమరిపిస్తున్నా, అక్కడ నా పాప పాడట్లేదని బాధ పడుతూ, ప్రోగ్రాం చూస్తున్నాను. ఆ చిన్నారి, ''రావేలా... రావేలా...'' అంటూ ఉంటే, నా కళ్లు నాకు తెలీకుండానే వాకిలి వైపు చూస్తున్నాయి. తనింకా రాలేదు! ఏమయిందో ఏమో.

టెన్షను భరించలేక, టిఫిను ప్రయత్నాలు మొదలుపెట్టాను. తనకి నా చేతి ఉప్మా చాలా ఇష్టం. అసలు మా ఇంట్లో తన తర్వాతేగా ఎవరైనా తినేది. టైము కేసి చూసుకుంటూనే, ఉప్మా చేయడం మొదలుపెట్టాను. పని చేస్తున్నాను కానీ నా దృష్టంతా గుమ్మం వైపే ఉంది. అప్పుడే అడుగుల చప్పుడయింది. మా ఫ్లాట్సులో దగ్గర దగ్గరగా మూడు గుమ్మాలుంటాయి. అందుకే ఆత్రుతగా ఎవరి బెల్లు మోగుతుందా అని ఎదురుచూసాను. మా ఎదురు ఫ్లాటు బెల్లు కొట్టారెవరో! ఆయితే తను కాదన్న మాట! ప్చ్...

ఉప్మా ఉడుకుతోంది. నాకు మండిపోతోంది. ఫోనుంది. నంబరు తెలుసు. లేటవుతుందని ఫోను చేసి చెప్పచ్చు కదా! ఊహుఁ! నేనెన్నిసార్లు చెప్పినా, అసలు లెక్కలేదు తనకి. నేనే సర్దుకుపోతాలే అన్న ధీమా! ఎంతైనా అవసరం నాది కదా - అలా మాత్రం ఎందుకనుకోవాలి? తన అవసరం నాకెంతో, నా అవసరం తనకీ అంతే కదా! అయినా తనదే రాజ్యం - అలా సాగుతోంది మన సమాజంలో.

అంతలో బెల్లు మోగింది. మనసు పులకరించింది. పరుగున వెళ్లి తలుపు తీస్తే, తను కాదు, మా నాన్న. నిరాశగా నిట్టూర్చి, కిచెను వైపు నడిస్తే, ''మీ ఆయనింకా రాలేదామ్మా?'' అన్నారు నాన్న ఎంతో ఆప్యాయంగా.

''లేదు! ఏ కబురూ లేదు, కానీ ఎప్పుడైనా రావచ్చు- ఉప్మా తింటారా?'', మూడాఫ్లో ఉన్నానేమో కొంచెం దురుసుగానే జవాబు చెప్పాను.

''వద్దమ్మా, మీ అమ్మేదో టిఫిను చేస్తోంది -''

అమ్మ, నాన్న మా అపార్టుమెంట్సుకి దగ్గిరలోనే ఉంటారు. రిటైర్మెంటుకి రెండేళ్ల ముందు, రెండు పోర్షన్ల ఇల్లు కట్టుకున్నారు నాన్న. నాన్న రిటైరయ్యేదాకా వాళ్లు క్వార్టర్సులో ఉండేవారు కాబట్టి, మేమా ఇంటి కింద పోర్షన్లో ఉండి, పై పోర్షను అద్దెకిచ్చాం. అప్పుడే దగ్గర్లో ఫ్లాటు బుక్ చేసుకున్నాం. అమ్మ, నాన్న వచ్చే టైముకి మా ఫ్లాటు రెడీ అయిపోవడంతో, మేమక్కడకి షిఫ్ట్ అయిపోయాం. పై పోర్షను అలాగే అద్దెకుంచి, వాళ్లిద్దరూ కింది పోర్షనులో ఉంటున్నారు.

అమ్మకీ నాన్నకీ ఏకైక సంతానం నేను. నా గొప్పలు నేను చెప్పుకోకూడదు కానీ, గారాబంగా పెరిగినా - మంచీ మర్యాద, వంటా వార్పు, వినయం విధేయత - పరంగా సుగుణాల రాశిని. కాస్తో కూస్తో అందగత్తెను కూడా. బాగా చదువుకున్నాను, సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసరు ఉద్యోగం చేస్తున్నాను. మాకు క్వార్టర్సు ఇస్తారు కానీ సీనియారిటీ ప్రకారం చూస్తే నాకు ఇప్పట్లో వచ్చే అవకాశాలు తక్కువ. అయినా సొంత ఫ్లాటు. పక్కనే అమ్మ, నాన్న. ఇక క్వార్టర్సెందుకు?

మా వారు మాకు దూరపు బంధువే! ఏదో పెళ్లిలో నన్ను చూసి, ముచ్చటపడి కోడలిని చేసుకున్నారు మా మామయ్య. కానీ మా పెళ్లయి ఏడాది తిరక్కుండానే గుండెపోటుతో కాలంచేసారు. ఆయన మీద బెంగతో మా అత్తయ్య కూడా ఆయన పోయిన రెండునెల్లకే కన్నుమూసింది. మాకప్పట్నుంచీ అమ్మ, నాన్నే పెద్ద దిక్కు!

నాన్న రోజూ పొద్దున్నే వాకింగుకెళ్లి వచ్చేటప్పుడు కాసేపు మమ్మల్ని పలకరించి, పేపరు చదివి (అమ్మ కోసం వాళ్లు ఈనాడు తెప్పించుకుంటారు, మేము టైమ్సాఫిండియా తెప్పిస్తాం), కాఫీ తాగి ఇంటికి వెడతారు. మూడ్ ఉంటే టిఫిను కూడా చేసి వెడతారు. అప్పుడు అమ్మకి కూడా బాక్సులో పెట్టి పంపించేస్తూంటాను.

నాన్న నా మూడెలా ఉందో ఈజీగా కనిపెట్టేస్తారు - కానీ ఏమీ తెలీనట్టే ఉంటారు. నా వినయం విధేయతా, అంతా బయిటవాళ్ల దగ్గరే! నాకు చిరాకుగా ఉన్నప్పుడు నాన్నని విసుక్కుంటాను. పాపం ఆయనసలు పట్టించుకోరు. ఎప్పటిలాగే పలకరించి, పేపరు చదువుకుని వెళ్లిపోతారు - కానీ అలాంటప్పుడు టిఫిను మాత్రం చేయరు. తర్వాత బాధనిపిస్తుంది నాకు. కానీ మళ్లీ తను లేటొచ్చినప్పుడు నా మూడ్ అలానే ఉంటుంది, నాన్నని విసుక్కుంటాను, ఆ తరువాత బాధపడతాను - ఐ కాన్ట్ హెల్పిట్!

నాన్న మౌనంగా కాఫీ తాగి వెళ్లిపోయారు. తన జాడ మాత్రం లేదు! నేను కొంచెం ఉప్మా ప్లేట్లో వేసుకుని టీవీముందు కూర్చుని తినడం మొదలుపెట్టాను - మళ్లీ గుమ్మం ముందు అడుగుల చప్పుడు! ఊపిరి బిగపట్టి మరీ ఎదురు చూసాను కానీ ఆ అడుగులు మా గుమ్మం దాటుకుని ముందుకు వెళ్లిపోయాయి. నిజానికి తన అడుగుల చప్పుణ్ణి నేను ప్రత్యేకంగా గుర్తుపడతాను - మా అనుబంధం అలాంటిది. కానీ ఎదురుచూపులో మాత్రం మనసంతా గజిబిజి అయిపోయి ఎవరి అడుగుల చప్పుడు విన్నా, తనవైతే బాగుణ్ణని ఆత్రపడుతూంటాను. ఎదురుచూపులో ఎంత బాధ! అదయ్యాక దర్శనభాగ్యమిచ్చే అనుభూతి కూడా స్పెషల్ గానే ఉంటుంది కదా మరి! అంతలో ''అమ్మా!'' అని అరుపులాంటి పిలుపు.

పాపకి లేవగానే నేను కనపడాలి - లేకపోతే ఇల్లదిరిపోయేలా అరుస్తుంది.

''ఇలారా చిట్టితల్లీ - టీవీ దగ్గరున్నాను, టిఫిను చేసాను - ఉప్మా! దామ్మా!'' అన్నాను. ఎంత విసుగ్గా ఉన్నా, దాన్ని మాత్రం బుజ్జగించాల్సిందే - లేకపోతే దారుణంగా పేచీ పెట్టేస్తుంది. ఆ తరువాత దాన్ని ఊరుకోపెట్టాలంటే నా తల ప్రాణం తోకకొస్తుంది.

''నువ్వే రా! నన్నెత్తుకో'' అందది. తప్పుతుందా! నిస్సత్తువగా వెళ్లాను.

''గుడ్ మార్నింగ్ బంగారు! దా'' అంటూ ప్రేమగా మంచంమీంచి లేవదీసాను. దాన్నలాగే ఎత్తుకుని, పక్క మంచం మీద పడుకుని నిద్ర నటిస్తున్న బాబుని తట్టి ''యాక్షన్లు చాలుగానీ, ఇక లేవండి'' అన్నాను. అసలే పొద్దున్నే చిరాకుగా ఉంటే వీడి ఆటలొకటి అని మనసులో తిట్టుకుంటూ. బాబు నవ్వుతూ లేచి నన్ను పట్టుకున్నాడు.

పాపకి నాలుగేళ్ళు - యూకేజీ. బాబుకి గాడిదలా పదేళ్లొచ్చినా నేను చెల్లికేది చేస్తే వాడికీ అదే చేయాలంటాడు. నువ్వు పెద్దవాడివిరా అంటే నాకు చిన్నప్పుడలా చేసావా అని నన్ను దెప్పి పొడుస్తాడు. నాకు చెల్లి అంటేనే ఇష్టమట. వాడంటే లేదట. అన్నీ వాడే అనేసుకుంటాడు. అప్పుడప్పుడు వాడిని సముదాయిస్తూంటాను. మన ఫామిలీ అంతా ఒకటేననీ, పిల్లలిద్దరూ మాకు రెండు కళ్లనీ, చెల్లి చిన్నది కాబట్టి మనమంతా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనీ. అన్నీ అర్థమైనట్టే అనిపిస్తుంది. కొన్నాళ్లు బాగానే ఉంటాడు, కానీ మళ్లీ మామూలే - వాడికి చిన్నపిల్లతో పోటీ ఏమిటో అర్థంకాదు.

''అమ్మకి చిరాగ్గా ఉందమ్మా, ఇద్దరూ బ్రష్ చేసుకుని తొందరగా వస్తే ఉప్మా పెడతాను, కమాన్'' అంటూ పిల్లలని అదిలించాను. బాబు బాత్రూం వైపు పరిగెత్తాడు. పాప మాత్రం, ''నువ్వే బ్రష్ చెయ్యి'', అని ఆర్డరు వేసింది. తప్పుతుందా! నేనూ బాత్రూం వైపు దారి తీసాను - పాపనెత్తుకుని.

అదయ్యేసరికి కాలింగ్ బెల్ మోగింది. కళ్లు అప్రయత్నంగానే గడియారాన్ని చూసాయి. టైము తొమ్మిదిన్నర! ఖచ్చితంగా తనే అయ్యుండాలి. రానీ చెప్తాను - ఇంత లేటా, అదీ కబురూ కాకరకాయ లేకుండా. నేనూరుకోను - ఈరోజు బాగా దెబ్బలాడాల్సిందే! పోనీ కదా అని ఊరుకుంటూంటే, రాను రానూ ఈ నిర్లక్ష్య వైఖరి ఎక్కువైపోతోంది - అనుకుంటూ పాపనెత్తుకునే వెళ్లి తలుపు తీసాను. ప్చ్, వచ్చింది తను కాదు, మా వారు!

''నాన్నా'' అంటూ పాప ఆయన దగ్గరికి వెళ్లిపోయింది ఆనందంగా. ''మీరా?'' అని నిరుత్సాహంగా లోనికి దారి తీసాను నేను. పాపనీ, బ్యాగునీ, కష్టపడి బ్యాలన్సు చేసుకుంటూ నా వెనకే వచ్చారు ఆయన.

''టిఫినేం చేసావ్ అభీ -'' అంటూ, పాపతో సహా సోఫాలోకి కూలబడ్డారు. పాపం ప్రయాణపు అలసట తన మొహంలో బాగా కనబడుతోంది. కానీ నా చిరాకులో నేనున్నాను.

''ఉప్మా చేసాను, ఇదిగో తెస్తున్నాను'' అన్నాను ముభావంగా, నా విసుగుని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ, తనింకా రాలేదేంటాని ఆలోచిస్తూ.

మావారికి కూడా సీను అర్థమయిపోయినట్టుంది, నన్నెక్కువ మాట్లాడించకుండా, పాపకి తినిపిస్తూ తనూ తినేసారు. ఇంతలో బాబు స్నానం కూడా చేసేసి వచ్చి నా మెప్పు కోసం గొప్పగా చూసాడు.

''అరే! మా బంగారు తండ్రి స్నానం కూడా చేసేసాడే!'' అన్నాను నా చిరాకుని కంట్రోల్ చేసుకుంటూ.

బాబుకి కూడా ప్లేట్లో టిఫినిచ్చి వాళ్ల నాన్న దగ్గర కూర్చోపెట్టాను. నేను మా వారికి కాఫీ కలపడానికి కిచెన్లోకి వెడుతూ ఆలోచిస్తున్నాను - తనింకా రాలేదంటే, ఇక ఈ రోజుకు రానట్టే! ఏమైందో ఏమో! కాఫీ కలుపుతున్నాను కానీ నా మనసునిండా తన గురించిన ఆలోచనలే!

ఇంతలో అడుగుల చప్పుడు! నాకు ఎంతో సుపరిచితమైన చప్పుడది. క్రమంగా ఆ అడుగులు దగ్గరపడుతూ వచ్చి, మా గుమ్మం ముందు ఆగాయి. కాలింగ్ బెల్ మోగింది. నా మదిలో వేయి వీణలు మోగాయి. నేను తీసే లోపు మా బాబు పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తీసాడు. నేను ఆత్రుతగా చూస్తున్నాను - సందేహంలేదు, తనే! ఆయినా మనిషిని చూస్తేనే కదా మనసు కుదుటపడేది!

బాబు తలుపు తెరిచాడు -

ఆఁ! వచ్చింది తనే - నా కనుల విందుగా మా గుమ్మంముందు నిండుగా (కొంచెం లావు లెండి) నిలబడి ఉన్నది మరెవరో కాదు - మా పనిమనిషి రంగి!

నా చిరాకు తగ్గిపోయింది. మా బాబు తలుపు తీసినందుకు నాకు చాలా ముద్దొచ్చాడు. పాపకి స్నానం చేయించాలని గుర్తుకొచ్చింది. మా వారిని క్యాంప్ విశేషాలడగాలి. పాపం నాన్నని పొద్దున్న విసుక్కున్నాను - టిఫిను కూడా పెట్టలేదు. మా సెలవు రోజు ఇప్పుడే స్టార్టయింది!

అన్నట్టు నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదూ - నా పేరు అభిసారిక!

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ