కొర్తి - బివిడి ప్రసాద రావు

Korthi
డైనింగ్ టేబుల్..
డిన్నర్ వడ్డన చేస్తోంది యశోధర.
తల్లి గంభీరం పిల్లలు గుర్తించారు.
భార్య రోజు వారీ చలాకీ కానరాక కృష్ణకాంత్ ఎగాదిగా అవుతున్నాడు.
వడ్డన కానిచ్చి.. యశోధర కూర్చుంది భోజనంకి. ముభావంగా తింటోంది.
తాళలేక తేలాడు రవి.. "ఏంటి మమ్మీ.. సీరియస్ గా ఉన్నావ్." అడిగాడు.
"య య.. మమ్మీ." కలగచేసుకుంది వాసంతి.
రవి డిగ్రీ చదువుతున్నాడు. వాసంతి ఇంటర్మీడియట్ చదువుతోంది.
పిల్లల్ని పట్టించుకోక.. తన తిండిని కొనసాగిస్తోంది యశోధర.
ఓ నిట్టూర్పు పిమ్మట.. "ఈ పూట నువ్వు తేడాగా అగుపిస్తున్నావ్." కృష్ణకాంత్ కలగ చేసుకున్నాడు.
యశోధర తలెత్త లేదు.. తిండి కెలుకుతోంది..
ఓ మారు పిల్లల్ని చూసి.. తన ప్లేట్ వైపు చూపు మార్చుకున్నాడు కృష్ణకాంత్. కృష్ణకాంత్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మానేజర్ హోదా ఉద్యోగం చేస్తున్నాడు.
తింటున్నారే కానీ.. ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు.
ముందుగా యశోధర భోజనం ముగించింది. తన ప్లేట్ తో షింక్ వైపు కదిలింది.
తిరిగి వచ్చి.. "మీవయ్యాక.. మీ ముగ్గురూ గదులుకు పోక.. హాలులో ఉండండి." చెప్పింది.
ఆ వెంబడే..
"పిల్లలతో మాట్లాడతాను." అంది. వంట గదిలోకి నడిచింది.
పిల్లలిద్దరూ ముఖాలు చూసుకుంటారు. అంతలోనే పిల్లల్ని చూస్తాడు కృష్టకాంత్.
పది నిముషాల్లోపే..
ఆ ముగ్గురూ అర నిముషాల తేడాల్లో హాలుకు చేరారు. ముగ్గురులోనూ కుతూహలం.. ఆత్రం కలగాపులగమై ఉన్నాయి.
ఒక సోఫాలో పిల్లలు పక్క పక్కగా కూర్చున్నారు.
కృష్ణకాంత్ ఎదురు సోఫాలో కూర్చున్నాడు.
ముగ్గురూ మూగగా ఉన్నారు.
వంట గది.. డైనింగ్ టేబుల్ వద్ద.. పనులు కానిచ్చేసి.. యశోధర హాలు లోకి వచ్చింది. భర్త పక్క సోఫాలో కూర్చుంది.
పిల్లలు తల్లినే చూస్తున్నారు.
"కొర్తి అనే శిక్ష ఒకటి ఉండేది. మీకు తెలుసా." యశోధర గొంతు దృఢంగా ఉంది.
కృష్ణకాంత్ జంకాడు. సర్రున భార్యని చూస్తాడు.
పిల్లలు అయోమయంగా కదిలారు. తల్లిని ఏమరుగా చూస్తారు.
"ఓ ప్రాచీన శిక్ష ఇది. కానీ దీని అమలు నేటికి అవసరం." యశోధర చెప్పింది.
"హే. ఏం మాట్లాడుతున్నావు. అనాగరికమైన.. మృగ్యమైన ఆ శిక్ష ప్రస్తావన ఎందుకు." జోరుగా ప్రశ్నించాడు కృష్ణకాంత్.
ఆ వెంబడే..
"ట్రాన్స్ లోంచి బయటికి రా. మితి మీరకు." భార్యని కసిరాడు.
"లేదు. అట్టి శిక్ష కావాలి.. రావాలి. లేదంటే.. వ్యవస్థ భ్రష్టు పట్టుకుపోతోంది.. మురిగి పోతోంది.." యశోధర తన తీరున తానుంది.
కృష్ణకాంత్ గాభరా పడ్డాడు. భార్యని పట్టి కుదిపాడు.
పిల్లలు తమ తల్లిదండ్రులనే చూస్తున్నారు.
కృష్ణకాంత్ ప్రయత్నం ఫలించింది. యశోధర తల విదిలించుకుంది.
"కుదరవ్వు. ప్లీజ్." కృష్ణకాంత్ అంటున్నాడు.
యశోధర తెరిపవుతోంది..
"ఎందుకు ఇంతగా ఇదయ్యి పోతున్నావ్. ఏం జరిగింది." అడుగుతున్నాడు కృష్ణకాంత్.
ఆ వెంబడే..
"రవీ.. నీళ్లు తీసుకురా." కొడుకుకి చెప్పాడు.
రవి వెళ్లి.. నీళ్ల సీసా తెచ్చాడు.
కొన్ని నీళ్లు తాగేక.. మరింత కుదరవుతోంది యశోధర.
"ఏం జరిగింది. ఇంత అవస్థ ఎందుకు." అర నిముషం తర్వాత అడిగాడు కృష్ణకాంత్. తను భార్య వీపుని నిమురుతున్నాడు.
"సాయంకాలం టివి న్యూస్ నన్ను బాగా కలవరపరిచింది." నెమ్మదిగా చెప్పుతోంది యశోధర.
"ఏదీ.." అడిగాడు కృష్ణకాంత్.
"పురంలో జరిగింది." చెప్పింది యశోధర.
ఆ వెంబడే..
"దారుణం కదూ. పాపం.. ఆ అమ్మాయిని.. ఎంత కిరాతకంగా.. వాళ్లు.. పాడు చేసి.. దారుణంగా చంపేసారు. వీటికి ఫుల్స్టాప్ రాదా." లొడుగుతోంది.
పురంలో.. మధ్యాహ్నం.. క్యాబ్ ఎక్కిన ఒకామెను.. క్యాబ్ డ్రయివర్ తప్పుడు సమాచారంతో దారి మల్లించి.. మధ్యలో తన స్నేహితులిద్దర్ని ఎక్కించుకొని.. ఆ ముగ్గురు ఆమెకి మత్తు పెట్టి.. పాడు చేసారు.. చంపేసారు. సిసి కెమెరాల సాయంతో ఆ ముగ్గురి అచూకీ పోలీసులు కనిపెట్టినట్టు టివిల్లో వార్త వెల్లడై ఉంది.
"ఆ వార్త నీ మీద ఇంతగా ప్రభావం చూపిందా." ఆశ్యర్యమయ్యాడు కృష్ణకాంత్.
ఆ వెంబడే..
"ఈ మారు మరీ ఇంత ఇదా. ఇదేం కొత్తా. ఇలా ఎన్నని జరుగుతుండడం లేదు." అన్నాడు.
"అదే. అదే. తగ్గ శిక్ష లేకనే.. ఇట్టివి మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి." గావుకేకల్లా అంది యశోధర.
పిల్లలిద్దరితో పాటు కృష్ణకాంత్ కూడా హడలిపోయాడు యశోధర తీరుకు.
భార్యని కుదురు పర్చుటకు యాతన పడుతున్నాడు కృష్ణకాంత్.
ఏమైతేనేం.. ఒక పక్క పిల్లలు.. మరో పక్క భర్త అనునయించగలగడంతో యశోధర మెల్లిగా తిరిగి కుదురవుతోంది..
"సంఘటన జరిగిన ప్రతిమారూ హడావిడి.. అలజడి.. అంతే.. ఆ తర్వాత.. అంతా తుష్. అందుకే ఇట్టివి మళ్లీ మళ్లీ పునరావృత్తమవుతున్నాయి." తేరుకున్నాక యశోధర అంటోంది.
ఆ వెంబడే..
"అందుకే సరైన శిక్ష అమలవ్వాలి. దాంతో ఇట్టివి ఆగగలవు." అంది.
ఆ ముగ్గురూ ఏమీ అనలేదు.
"ఛ. నా సొద నాదే కానీ.. మీరు స్పందించలేక పోతున్నారేమిటి." యశోధర విసుక్కుంటుంది.
"లేదు లేదు. నాకూ ఆందోళనగానే ఉంది.." చెప్పగలిగాడు కృష్ణకాంత్.
"య మమ్మీ. ఈ వార్త తెలిసింది మొదలు మేమూ అలజడి చేపట్టాం. కాలేజీలో మేమంతా నినాదాలు చేసాం. ఆమె ఆత్మ శాంతికి ప్రార్థన చేసాం.." చెప్పింది వాసంతి.
"య మమ్మీ. మా కాలేజీ వాళ్లం కూడా." చెప్పాడు రవి.
యశోధర అయోమయంగా కదులుతోంది.
"వర్షం పడ్డప్పుడే గొడుగును పట్టి.. తర్వాత ఏ మూలనో దానిని పడేసినట్టు పోతున్నాయి మన ఆందోళనలు.." నసిగింది యశోధర.
"లేదు లేదు. అలా అనుకో రాదు. జరగవలసినవి జరుగుతున్నాయి. ఘటన జరిగినంత వేగిరంగా చర్యలు అమలు కావడం కుదరదుగా. చర్య.. ప్రతిచర్య.. ఉభయకుశులోపరి మాదిరీ కావు." చెప్పాడు కృష్ణకాంత్.
"నేను కాదనను. కానీ ప్రతిచర్య.. అదే.. శిక్ష.. కఠినంగా ఉండాలి. అట్టి శిక్షలు అమలు అవుతేనే ఈ దారుణాలు తగ్గుతాయి." చెప్పింది యశోధర.
"చర్యలా ప్రతిచర్య క్షణికావేశం మాదిరీ జరక్కూడదు. శిక్ష కంటె పరివర్తన మేలైంది. ఆ దిశగానే అనువైన ప్రయత్నాలు జరుగుతున్నాయి." చెప్పాడు కృష్ణకాంత్.
తల్లిదండ్రుల మాటలు వింటున్న పిల్లలు.. ఇంకా గందరగోళంలోనే ఉన్నారు.
పిల్లల బెంబేలు గుర్తించాడు కృష్ణకాంత్.
"మీరు అందరితో కూడి ఆందోళనలు చేపట్టడం మంచిదే. కానీ.. మీ అంతట మీరు తగు విధంగా మెసులుకోవాలి." పిల్లలతో చెప్పుతున్నాడు కృష్ణకాంత్.
అడ్డై.. "నిజమే. డాడీ మంచి పాయింట్ కదిపారు. నేనూ అదే మీతో చెప్పతలిచాను." అంది యశోధర.. పిల్లల్ని చూస్తూ.
తల్లిని చూస్తున్నారు పిల్లలు.
"రవీ.. నీకు అమ్మ ఉంది.. చెల్లి ఉంది. నువ్వు మగాడివి. మేము ఆడవాళ్లం. కానీ మన మధ్య బంధం బట్టి.. మనం ఒకరికి ఒకరం మెసులుకునే విధం సవ్యంగా ఉంటోంది. ఇదే దృష్టి నీకు పై స్త్రీ మీద కూడా ఉండాలి.
వాసంతీ.. స్త్రీ అనే సరికి బలహీనురాలు అనుకో వద్దు.. అసహాయతే మహా దారుణం. స్త్రీ లైంగిక శరీర భాగాలు కోసరమే మగాడు బరి తెగిస్తున్నాడంటే.. ఆ మగాడు ఎంతటి మూర్ఖుడో గుర్తించు. అట్టి వాడిపై నువ్వు తెగబడాలి.. తెగించాలి. తిరుగుబాటుని తిప్పికొట్టడం అసాధ్యం అనిపించాలి.."
చెప్పుకుపోతున్న భార్యకి అడ్డు పడి..
"యశోధరా.. చెప్పే రీతి సవ్యంగా ఉండాలి. మోటివేషన్ వేరు.. ఏమోషన్ వేరు.. కాస్తా పొందికై చెప్పు." అన్నాడు ఆందోళనగా కృష్ణకాంత్.
ఆ వెంబడే..
"పేరెంటింగ్ అవసరమే. తప్పనిసరి కూడా. కానీ.. దానిని సవ్య మార్గంన నేర్పాలి." చెప్పాడు.
యశోధర ఏదో చెప్పబోతోంది..
"నీ ఆవేదన గుర్తించ తగ్గదే. కానీ సంయమనం కూడా మరవ వద్దు. పిల్లలకు తల్లిదండ్రులుగా మనం చెప్పాలి. తగు జాగ్రత్తలు తెల్పాలి. పరిరక్షణ శిక్ష కంటె మేలైంది. ఎవరి ఇల్లు వారు చక్క దిద్దుకుంటే.. అన్ని ఇళ్లులు బాగుంటాయి.. బాగుపడతాయి." చెప్పాడు కృష్ణకాంత్.
భర్త మాటలు యశోధరకి నచ్చాయి.
"నా ప్రయత్నం అదే." అంది.
"గుడ్. జరిగినప్పుడే కాదు.. ఇలా పిల్లలతో మనం తడవు తడవుగా మాట్లాడడం మంచిది. అవసరం కూడా." చెప్పాడు కృష్ణకాంత్.
భర్తని మొప్పుగా చూస్తోంది యశోధర.
అప్పుడే.. "రవీ.. వాసంతీ.. మా మాటలు మీరు విన్నారు. వీటిని ఆలకించడం కాదు మీరు వీటిని అర్ధం చేసుకోవాలి. మీ వంతు బాధ్యతని మీరు చేపట్టాలి. ఛీ కొట్టించుకోవడం మంచిది కాదు. తల వంపు కంటే తల వంచుకోవడమే మేలు. టేక్కేర్ ప్లీజ్." చెప్పాడు కృష్ణకాంత్.
ఆ వెంబడే.. "మీ గదులకు వెళ్లండి. గుడ్నైట్.." అన్నాడు.
వాసంతి లేచింది.
రవి మాత్రం.. "మమ్మీ.. కొర్తి శిక్ష అంటే ఏంటి." అసక్తి అగుపర్చాడు.
భర్తని చూస్తోంది యశోధర.
కృష్ణకాంత్ చిన్నగా నిట్టూర్చి.. రవితో.. "మొనదేలిన ఓ చెట్టు కర్రని గుదంలో దించి చంపడం." సూటిగా చెప్పాడు.
రవి గబుక్కున కంగారు పడ్డాడు.
***

మరిన్ని కథలు

Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు
Donga chetiki taalaalu
దొంగ చేతికి తాళాలు
- కొల్లాబత్తుల సూర్య కుమార్
Aa raatri
ఆ రాత్రి
- జాహ్నవి ప్రియా
Aparichitudu
అపరిచితుడు
- డి.కె.చదువుల బాబు
Ee tappevaridi ?
ఈ తప్పెవరిది ?
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు