మర్మం - రాము కోలా దెందుకూరు

Marmam

రాత్రిపూట మద్యం మత్తులో భర్త అనే మానవ మృగం ,విచక్షణా రహితంగా, అహంకారముతో, చేయ్యి చేసుకున్న ఆనవాళ్ళను ,తన చెంపలపై ఎక్కడ తల్లి కంటికి కనిపిస్తుందేమో! అనే మానసిక సంఘర్షణను జయించలేక ,తనకు ఇష్టం లేకున్నా ఫేస్ మేకప్ చేసుకుంటుంది వసంత తన జీవితంలో మొదటిసారి. యాబై సంవత్సరాల వయస్సులో, అన్యోన్యంగా జీవితం గడపాల్సిన దాంపత్యంలో , అనుమానం అనే మాయదారి రోగం భర్తకు అంటువ్యాధిలా సంక్రమిస్తే.... నిత్యం వేధించే తన భర్తతో, జీవితం సాఫీగానే సాగుతుందని, నమ్మించే ప్రయత్నంకు శ్రీకారం దిద్దుకుంటుంది వసంత తల్లి. ***** నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ఇరువురు. దూరంగా ఆకాశంలోకి ఎగిరే పక్షులను చూస్తూ... ఇరువురి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎదో అడగాలనే ప్రయత్నంలో తల్లి. పెదవి దాటిరాని మాటలను మింగేస్తుంది.. కూతురు మనస్సును నొప్పించడం ఇష్టం లేక. ఏదో తెలుసుకోవాలనే తపన కూతురు వసంతది. కానీ!అడగాలా! వద్దో ?. అడిగితే అమ్మ సమాధానంగా ఎం చెప్పగలదో. తన మనసు తట్టుకోగలదా?అనే సందేహం కలసివేస్తుంటే. తన తల్లి కష్టం తనతో చెప్పుకోగలదా!?. తేలుసుకుని తను నిశ్చింతగా ఉండగలదా?. తెలుసుకోవడం ఎంత వరకు కరెక్ట్ .అని ఆలోచిస్తుంది వసంత ఇరువురి హృదయాలలో అలజడి ఏదో క్షణం అగ్నిపర్వతంలా విస్పోటనం చెందేందుకు సిద్ధంగా ఉంది. కాలం నిశ్శబ్దంగా కరిగిపోతుంది.ఇరువురినీ చూస్తూ. నిశ్శబ్దాన్ని చేధించేందుకు వసంత తల్లి కూతుర్ని లాలనగా అడుగుతుంది "వసంతా!నీ కాపురంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా..?" తల్లిలా కాదు,నీ స్నేహితురాలిగా అడుగుతున్నా". దాచుకోకుండా చెపుతావని."తల్లి మాట ముగియక ముందే నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వసంత మాట మంచులా మ్రోగింది. "ఎందుకలా అడిగావమ్మా!" ఎందుకు నీకు అనుమానం. మీ అల్లుడుగారు చాలా మంచివారు.అనుమానించకండి. నాకు ఎటువంటి ఇబ్బందీ లేదు." "నాన్నా మీరు నిశ్చింతగా ఉండోచ్చు" చెప్పింది వసంత తన తల్లికి. మనసులో పొంగుతున్న దుఃఖం తాలుకా వైబ్రేషన్ తన కంఠంలోనే నిక్షిప్తం చేసుకుంటే ప్రయత్నంలో. కూతురు కన్నుల్లో కి చూడాలనే ప్రయత్నం చేయలేక పోతుంది వసంత తల్లి. "ఏమీ లేదులే... ఎందుకో! అలా అడగాలని అనిపించింది ..అంతే". అవునూ! నువ్వు ఎప్పుడూ పేస్ మేకప్ చేయవుకదా!. ఈ రోజు ఏంటిది కొత్తగా.! " అనుమానంగానే అడిగేసింది వసంతని. "నీకు అన్నీ అనుమానాలేనా!. రాత్రి యూ ట్యూబ్ లో చూసాను! అందుకే ట్రై చేసా." "అవునూ! నాన్నా నువ్వు ఎలా ఉంటున్నారు". అడిగింది వసంత తల్లిని. "మీ నాన్న గారు శ్రీరామ చంద్రుడు. నామీద ఈగను కూడా వాలనివ్వడు తెలుసా"! జారిపోతున్న పవిట సరిచేసుకుంది వసంత తల్లిగారు. ఎక్కడ తన వీపుపై తన భర్త చేసిన పంటి గాయం కూతురు చూస్తుందో అనే ఆత్మన్యూనతా భావంతో. "ఎప్పుడూ కూతురు యోగక్షేమాలను తల్లి మాత్రమే అడగాలా?.కూతురు అండగాకూడదా."అంది వసంత నవ్వుతూ. తన తల్లి సంతోషంగా ఉంది అనుకునే తృప్తితో. సరే!సరే ఇక వెళదామా..! అంటూ లేచింది వసంత తల్లిగారు. తన కూతురు తనలాగే ఇంటి గుట్టు భద్రంగా దాచేస్తూ గుట్టుగా కాపురం చేసుకుంటుంది అని అర్థం చేసుకుంటూ. "మీ నాన్నగారు వచ్చే టైం అవుతుంది " "వారికీ రాగానే నేను కనిపించాలీ.లేకుంటే హైరానా పడిపోతారు"అంటూ.. "మీ అల్లుడు గారు కూడా వచ్చే టైం అవుతుంది " నరకం చూపించేందుకు సిద్ధపడి వస్తుంటాడు మనసులో అనుకుంటూ , "సరే అమ్మా!మరోసారి కలుద్దాం" అనేసి కదిలింది వసంత. ఇద్దరూ విభిన్న ధ్రువాలుగా మారిపోయారు. ***** "రాత్రి భర్త చెంపలపై కొట్టిన దెబ్బలు కనిపించకుండా ఫేస్ మేకప్ తో సరిచేసాను. అమ్మకు అనుమానం రాకుండా"అనుకుంది వసంత మనసులో. తల్లికి తెలిస్తే బాధపడుతుంది అని. "కానీ !ఎప్పుడూ మేకప్ ఇష్టపడని తను మేకప్ వేసి అమ్మకు దొరికి పోయింది" అనే విషయం గ్రహించనేలేదు వసంత.. గాలికి తొలిగిన చీర సరిచేసుకుంటు వీపుపై తన భర్త రాత్రి పంటితో చేసిన గాయం కనిపించనీయకుండా చీర భుజాలు చుట్టూ చుట్టుకుంది వసంత తల్లిగారు..ముందుకు సాగి పోతుంది. తన కూతురు చూడలేదనుకుంటూ. కానీ, చూసిన తన కూతురు హృదయం ఎంతగా రోదించిందో కాలానికి మాత్రమే తెలుసు. తన బిడ్డ చూడకూడదనీ. తన కష్టం బిడ్డకు తెలియకూడదనీ. ఓ తల్లి మనసు పడితే వేదన ఒకవైపున.. చూసినా! ఆ దెబ్బేంటి అని అడగని సంస్కారం కూతురు వసంత మరోవైపున. ఇదే స్త్రీ మూర్తుల సహనం..ఇదే స్త్రీ ఔన్నత్యం.

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు