ఫిల్టర్ కాఫీ - ఇందు చంద్రన్

Filter coffee

“కళ్ల ముందు విస్తారమైన నీలి సముద్రం ఉంది.

అయినా సరే నా మనసెందుకో ఆకాశం వైపే చూస్తోంది.

ఆ నీటి చుక్క కోసమే కదా !

కాలం నన్ను ముందుకు లాక్కెళ్లిపోతూ ఉంది.

అయినా సరే అప్పుడప్పుడూ ఆగిపోతూ ఉంటాను.

గతించిన ఙాపకాల్లో అతన్ని గుర్తు చేసుకుంటూ......

“అయినా అందరికీ ప్రేమ ,పెళ్లి ఒకే దగ్గర దొరకవెందుకనీ ? కొందరికి పువ్వులు దొరికితే కొందరికి రాళ్లు మిగులుతాయి”. ఈ ఆలోచన వచ్చినప్పుడల్లా అతను గుర్తొస్తాడు. అతను గుర్తొచ్చిన ప్రతిసారి నాకు నేనూ గుర్తొస్తాను. ఎందుకంటే నన్ను నాకు పరిచయం చేసి,నాకంటూ అభిరుచులు,అభిప్రాయాలు , ఆలోచనలున్నాయని గుర్తించేలా చేసాడు కాబట్టి.

అతని గురించి ఆలోచించిన ప్రతిసారి… “ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు కలిసిన వ్యక్తి గుర్తుకు రావడం , కాదు గుర్తు చేసుకోవడం ఏంటో ? పెళ్లైన ఆడది పరాయి మగాడ్ని గుర్తు చేసుకోవడం ఎంత పెద్ద నేరం? పతివ్రతలెవరైనా ఇలా చేస్తారా?” అని సమాజం నన్ను దూషిస్తున్నట్టు అనిపిస్తుంది.

అయినా సరే మనస్సు గతించిన కాలంలోంచి అతన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.

స్టవ్ మీద ఓ వైపు పాలు మరిగి చిక్కబడ్డాయి, మరో వైపు ఫిల్టర్ లో డికాక్షన్ మరిగి సువాసనతో వంటగదిని ఆక్రమించేదింది.

చక్కని ఫిల్టర్ కాఫీతో బాల్కనీలో కూర్చున్నాను.

“మంచి కుటుంబం ఇంకా చేతి నిండా సంపాదన, పైగా కొద్దో గొప్పో ఆస్థులున్నాయి. చూడ్డానికి అబ్బాయి కూడా బావున్నాడు. ఇంతకు మించి దానికేం కావాలని ?” అని నాన్న అమ్మతో అనడం నాకింకా గుర్తుంది.

అదే మాటల్ని నా దగ్గర అమ్మ కాస్త అటు ఇటుగా మార్చి చెప్పింది అంతే.

ఆ మాటలు పూర్తిగా అర్థం చేసుకునే లోపే పెళ్లయిపోయింది. పెళ్లయ్యిందని అక్కడి పరిస్థితులకి అనుగుణంగా మారే లోపే నెలలు గడిచిపోయాయి.పంజరంలో బంధించిన పక్షినైపోయాను.గడియారం లో ముళ్లులా తిరిగిన చోటే మళ్లీ తిరుగుతూ ఉండటం అలవాటుగా మారిపోయిన నాకు ఓ రోజు ఏదో పనిబడితే బయటకెళ్లాను. నా చుట్టూ ఉన్న జనాలంతా ఎక్కడికో పరుగులు పెడుతున్నట్టు అనిపించింది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు లోకల్ ట్రైన్ ఎక్కాను. అదే మొదటిసారి ఒంటరిగా ట్రైన్ ఎక్కడం. అంత జనం ఉంటారని ఊహించనే లేదు.కాసేపటికి కాలు కదపడానికి కూడా వీలులేనంత ఇరుకుగా మారిపోయింది.

ఈ తోపులాటలో ఎదురుగా ఉన్న అతను నా వైపు తూలబోయి నా వెనక ఉన్న కంబీని పట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ ఆగాడు.నా వైపు చూస్తూ ఉన్నాడు.

అతని చేతుల మధ్యలో ఉండటం నాక్కసలు నచ్చలేదు.కొయ్యబారిపోయి, అసహనంగా బయటకి చూస్తూ ఉన్నాను.

“ఈ రోజు నక్షత్రాలు రాలినట్టున్నాయి” అన్నాడు.

ఆ మాట వినగానే చివుక్కున అతని వైపు చూసా...

అతను నా వైపు గా చూస్తూ “నిజంగానే...చూడండి ఆ బిల్డింగ్ దగ్గర , ఇంకా కొన్ని కింద పడున్నాయి కనిపించట్లేదా?” అన్నాడు చేతులు తీసేసి పక్కకి జరిగి నిలబడుతూ.

కిందకి చూస్తే చీకట్లో షాపులు, ఇళ్ల మధ్య అక్కడక్కడా వెలుగుతున్న లైట్లు,పెద్ద బిల్డింగ్స్ లోను చీకటి మధ్యలో వెలుగుతున్న లైట్లు కనిపించాయి. నిజానికి చీకటి మధ్యలో వెలుగుతున్న ఆ లైట్లు నక్షత్రాలాగానే ఉన్నాయి.నాలో ఉన్న బెరుకు తగ్గింది.అతను ఉన్నవైపు చూస్తే ఎప్పుడు వెళ్లిపోయాడో తెలియనే లేదు.

కాఫీ కూడా అయిపోయింది అది కూడా తెలియనే లేదు. అతని గురించి ఆలోచించినా, మాట్లాడినా అంతే చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతుంటాను.

******

“ఈ మధ్య నీకసలు ఒళ్లు తెలియట్లేదు” అంటూ అరుస్తూ స్టవ్ మీద మాడిన కూర గిన్నెని సింక్ లోకి విసిరేసాడు పతి దేవుడు.ఆయనంతే మాటలు తక్కువ అరుపులు ఎక్కువ. పెళ్లైన కొత్తలో భయమేసేది. మా వాళ్లు “నీకిప్పుడు పెళ్లైంది గుర్తుంది కదా ? అతని మనస్తత్వానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. సర్దుకుపోవాలి. నీకు, నాకు అని కాకుండా మనకు అన్నట్టుగా ఆలోచించాలి” అని అమ్మ చెప్పిన మాటలు మళ్లీ ఇంకోసారి గుర్తు చేసుకున్నా.పద్దేనిమిదేళ్లుగా నిస్సారంగా సాగిపోయిన పెళ్లి జీవితం, పెళ్లి కి గుర్తింపుగా ఇద్దరు పిల్లలు. నిజంగా ప్రేమ కి గుర్తింపుగా కదా పిల్లలు పుట్టేది ?

అసలు ప్రేమంటే గుర్తుకొచ్చింది. ఆ రోజు లోకల్ ట్రైన్ లో చుక్కలు రాలిపోయాయి అని కబుర్లు చెప్పినతను మళ్లీ అదే ట్రైన్ లో ఇంకోసారి కనిపించాడు.

ఆ రోజు ట్రైన్ లో జనాలు పలుచగా ఉన్నారు. నవ్వుతూ నా వైపు చూసాడు.

అపరిచితులతో మాట్లాడొద్దని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది కాని చివరికి అపరిచితుడితోనే పెళ్లి అయితే చేసేసారు.

అతను నా వైపు గా వచ్చి నిలబడి “చూసారా...ఈ రోజు ముత్యాలు రాలుతున్నాయి” అన్నాడు.

సన్నటి చినుకులు డోర్ మీద పడి జారిపోతున్నాయి. ఆ చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

“ఇవి ముత్యాలైతే జనాలు ఒక్క చినుకుని కూడా నేలరాలనివ్వరు” అన్నాను మెల్లగా.

“నిజమే అనుకోండి అలా పట్టుకుంటారనే కరిగిపోతున్నాయి” అంటూ నవ్వాడు.అతను అలా నవ్వుతుంటే నా మొహం మీద కూడా నవ్వు విరిసింది.

మాటల్లోనే “మీకు పెళ్లైందా? అన్నాడు.

“అవును అన్నాను ముక్తసరిగా

“ప్రేమ వివాహమా? అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ.

“కాదు పెద్దలు కుదిర్చిన సంబంధం” అన్నాను సూటిగా

“అవును అరేంజ్డ్ మ్యారెజెస్ లో ప్రేమ ఉంటుందా?” అన్నాడు ప్రశ్నార్థకంగా చూస్తూ.

“ఉండొచ్చేమో...అన్నాను” సమాధానం తెలియక.

ఇప్పటికీ సమాధానం తెలియదు. నా విషయం లో అయితే ప్రేమకి బదులు కేవలం సర్దుబాటు అనే చెప్తాను. పెళ్లైన రెండో రోజుకే చెంప మీద వాతలు పడ్డప్పుడు ముక్కోపిస్టి అని సర్దుకోమన్నారు. ఇంకోసారెప్పుడో నుదుటి మీద రెండు కుట్లు పడ్డప్పుడు పిల్లలు పుడితే సర్దుకుంటుందన్నారు. ఒకరికి ఇద్దరు పుట్టారు. ఏం మారలేదు. నేను సర్దుకు పోవడం తప్పితే !

భార్యగా నేను ఆయనకి అవసరం అంతే ! మా వాళ్లకి ఒక మంచి ఇల్లాలిగా సమాజంలో గుర్తింపుని పొందాలంతే ! పిల్లలు పుట్టాక ఆలోచనలన్నీ మారిపోయాయి. పిల్లల ప్రేమ నన్ను మార్చేసింది. ఎంతలా అంటే తప్పులన్నీ ఒప్పులుగా ఒప్పుకుని ముందుకెళ్లి పోయేంతగా.నాకు, నేను అనే నాలోపలున్న స్వార్థ మనిషి చచ్చిపోయింది.పిల్లలు పెరిగే కొద్ది ఆయనలో కొద్ది గా మార్పుని గమనించాను. అది ప్రేమైతే కాదు !

ఇప్పుడైతే ఆడవాళ్లకి గొంతెత్తి మాట్లాడే ధైర్యం ఉంది కాని అప్పట్లో ఎదురు మాట్లాడితే ఆడది తెగించేసిందని నిందించేవాళ్లు.

నాకింకా చలం గారి మాటలు గుర్తున్నాయి.ఆడది భయపడినంత సేపే మగాడి ధైర్యం అని ఆ మాట ఇప్పుడు నిజమే అనిపిస్తుంది.

*****

“భయం,బాధ్యత లేకుండా ఎక్కడివక్కడ వదిలేస్తున్నావు అని పూలకుండి పక్కన నీళ్లలో నానిపోయిన న్యూస్ పేపర్ అందుకుని వరండాలో కూర్చుని నిన్నటి రోజు ని మళ్లీ న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాడు ప్రాణేశుడు.

ఇంటిని చక్కబెట్టి ఇల్లాలిగా సమాజం దగ్గర గుర్తింపు పొందా, మంచి తల్లిగా పిల్లలకి ప్రేమని పంచి పెట్టా. ఇంట్లో అందరికీ తలలో నాలికగా ఉంటూ వచ్చా. భర్త సంపాదనకి తోడుగా నా సంపాదనని అందించా.

అయినప్పటికీ భరించు వాడు భర్త అంటే ఇక్కడ భరించింది నేను కదా ! అనిపిస్తుంది.

భయం, బాధ్యత అంటే గుర్తొచ్చింది. ఆ లోకల్ ట్రైన్ అతన్ని చివరగా ఓ సారి రైల్వేస్టేషన్ బయట చూసా.ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. విచక్షణ మరిచి , తనకే పూర్తి హక్కులున్నాయన్న అహంకారంతో శరీరాన్ని చిద్రం చేసిన అతనితో కలిసి ఉండలేను అలా అని తెంచుకుని తిరిగి ఇంటికి వెళ్లలేననిపించింది. సమాజం నన్నే ప్రత్యేకించి చూస్తున్నట్టనిపించింది చీకట్లో అతనే అని నిర్దారించుకునే లోపే దగ్గరికొచ్చాడు.

దగ్గరికొస్తూనే "ఈ టైమ్ లో మీరేంటిక్కడ ? అన్నాడు.

అతని మాటల్ని పట్టించుకోలేదు.

"లాస్ట్ ట్రైన్ వెళ్లిపోయింది” అన్నాడు నా వైపు చూస్తూ.

వినివిననట్టు గా శూన్యంలోకి చూస్తున్నాను.

“ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నారా?” అన్నాడు మళ్లీ

“అవును...నన్ను నాలో వెతుక్కుంటున్నాను” అన్నాను అక్కడి నుండి వెళ్లిపోతూ.

నన్ను అనుసరిస్తూ చాలా దూరమొచ్చాడు. చీకట్లో నా నీడ పక్కనే అతను నడిచొస్తున్నాడు. ఓ దగ్గర ఆగి “ఫిల్టర్ కాఫీ దొరుకుందా? అన్నాను.

నా వైపు దీర్ఘంగా చూసి నవ్వి “దొరుకుతుంది. కాని సెల్ఫ్ సర్వీస్” అన్నాడు.


“ఓహ్ అంతేనా ? ఇప్పటి వరకు నాకంటూ ఏది ప్రత్యేకించి చేసుకోలేదు. కాఫీ అయినా చేసుకుంటాను” అన్నాను నవ్వుతూ.

కమిలిన పెదాలు మండుతున్నాయి. అతన్ని అనుసరిస్తూ వెళ్లాను. ఈ సారి అతని పక్కనే నడిచాను.

దారి పొడవుగా రోడ్డు కి రెండు వైపు లా చెట్లున్నాయి. ఆ చెట్ల నుండి కొన్ని పువ్వులు రాలి రోడ్డు మీద పడి ఉన్నాయి.

“మీరొస్తారని ముందే తెలుసేమో రోడ్డు మీద పూల పాన్పు పరిచారు అన్నాడు నవ్వుతూ నా వైపు చూస్తూ.

ఆ మాట వినగానే గట్టిగానే నవ్వేసా. ఎడమ దవడ నొప్పిగా అనిపించింది.

దారి మధ్యలో ఇంటి ముందు ఆగి ఇక్కడే ఆ సెల్ఫ్ సర్వీస్ అన్నాడు.

అతని వెనకనే లోపలి కెళ్లా. ఒకే గది చిన్న ఇల్లు. అందులోనే అన్నీ ఉన్నాయి.

గ్యాస్ స్టవ్ ని చూపిస్తూ " మీరు ఫిల్టర్ కాఫీ చేసుకోవచ్చు అన్నాడు వస్తువుల్ని ముందు పెడుతూ.

నిమిషాల్లో చిక్కటి ఫిల్టర్ కాఫీ రెడీ అయ్యింది. కాఫీ గ్లాసుని అందుకుని ఒక సిప్ చేసి

“ఇంతకన్నా బెటర్ ఫిల్టర్ కాఫీ గనక మళ్లీ తాగితే ఖచ్చితంగా మీకు చెప్తాను అన్నాడు ఆస్వాదిస్తూ.

కప్పులో కాఫీ అయిపోయింది. తిరిగి ఇంటికి వెళ్లాలన్న భయం పుట్టుకొచ్చింది. ఇంటికి తిరిగి వెళ్లే ధైర్యం లేదు, ఇక్కడే ఈ రాత్రికి ఉండిపోనా? అని అడిగే చనువు పరిచయం రెండూ లేవు.

తటపటాయిస్తూ దిక్కులు చూస్తూ నిలబడ్డా.

“ఉండాలనుకున్నంత సేపు ఉండొచ్చు అన్నాడు కాఫీ గ్లాసు తీసుకుని వెళ్లిపోతూ.

సమాధానం చెప్పే అవసరం కూడా లేకుండా చెప్పేసి వెళ్లిపోయిన అతని వైపే చూస్తున్నా.

ఎవరో తెలియని అనామకుడు. అతను పిలవగానే వచ్చేయడం ఏంటో ? కాలం చెడిపోయిన రోజులివి, ముక్కు మొహం తెలియని వాడిని నమ్మి రావడం ఏంటో, సురక్షితమా? అని సమాజం సన్నగా నా చెవిలో చెవుతున్నట్టుగా అనిపించింది.

“ఆ మాటకొస్తే నా లో సగం అనుకున్న నా ప్రాణ నాధుడి దగ్గర భద్రంగా ఉండలేననిపించింది,దాన్నేంమంటారో అని ఆలోచిస్తూ ఉన్నాను.

చిక్కటి చీకటి చుక్కల్ని అంటించుకుని వచ్చేసింది. ఒళ్లంతా హూనమై మంటలు పుడుతుంటే ఒత్తుకుంటూ ఉన్నాను.

"భయం లో నుండే ధైర్యం పుడుతుంది. ధైర్యం పుట్టుకొచ్చిన రోజు మీరు పరిగెత్తే అవసరం లేదు అన్నాడు ఎదురుగా కూర్చుంటూ.

అతని కళ్లలోకి చూడలేకపోయా. ఒంటి మీదున్న దెబ్బల్ని దాచుకోడానికి ప్రయత్నించా.

"మన ఉనికిని మనం గుర్తించినప్పుడే జీవితం మొదలవుతుంది అన్నాడు.

అతని మాటలు వింటున్నా తప్ప సమాధానం చెప్పాలనిపించలేదు. చాలా సేపటికి పడుకోడానికి దుప్పటిని పరిచి వెళ్లిపోయాడు. అప్పటికే అలిసిపోవడంతో నిద్రలోకి జారుకున్నాను. అర్థ రాత్రెప్పుడో మెలకువ వచ్చి చూస్తే దూరంగా పడుకున్నాడతను.

ఆ రాత్రి అసలు భయంగా అనిపించనే లేదు, నిశ్చింతగా నిద్రపోయా. అప్పుడు గనుగ సమాజం మా ఇద్దర్ని అలా చూస్తే ఇంకేమన్నా ఉందా? ఎన్ని నిందలు, ఎన్ని దూషణలు వినాల్సి వచ్చేది. సమాజం మేలుకోక ముందే అక్కడి నుండి వచ్చేసా...ధైర్యాన్ని తెచ్చుకుని.

అదే చివరిసారి అతని ప్రశాంతమైన మొహం చూడ్డం…మళ్లీ కనిపించలేదు. కనిపించాలని నేనూ కోరుకోలేదు. ఆ రాత్రి తర్వాత నాకు ధైర్యమొచ్చిందో, ఆయనకి భయం పుట్టుకొచ్చిందో తెలీదు. ఏదో మార్పు కనిపించింది. మెల్లగా నా ఉనికిని వెతుక్కోవడం మొదలు పెట్టా. బలాలు, బలహీనతలు తెలుసుకుని మసలుకున్నా.నా మొహానికి సమాజం తగిలించిన ఫిల్టర్లన్నీ తొలగిపోయాయి. ప్రశాంతమైన జీవితాన్ని ఏర్పరుచుకున్నా.ఆ ప్రశాంతతలోనే అప్పుడప్పుడూ అతనూ గుర్తొస్తాడు !


















మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ