ఒకనాటి సినిమా లెక్కలు - డాయిష్ మహేష్

Okanati cinema lekkalu

ఐమ్యాక్స్‌లో సినిమా చూసి బయటికొచ్చాను. నా సినిమాకు మోక్షమెప్పుడో అనుకుంటూ బండెక్కాను. బెల్లు కొట్టగానే రమణి వచ్చి తలుపు తీసింది. వాష్ రూమ్‌కెళ్ళి రిఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టేబుల్ మీద భోజనం రెడీగా ఉంది. కుర్చీ లాక్కుని కూర్చొని తినసాగాను.

నేనలా కూర్చోగానే రమణి వచ్చి పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చుంది. “రేపెటైనా వెళుతున్నారా?” అని అడిగింది. ఏంటి సంగతి అన్నట్టు చూశాను. “ఏం లేదు రేపు పబ్లిక్ హాలిడే కదా. నాగోల్ లో ఉన్న మా ఫ్రెండ్ వరలక్ష్మి ఫ్యామిలీతో మనింటికి వస్తానంది” అని ఆగింది. “వాళ్లు ఫస్ట్ టైమ్ మనంటికి వస్తున్నారు. ప్లీజ్ నా కోసం వాళ్ళకా డివిడి చూపించకండి. వాళ్ళకు అలాంటివి చూడ్డం ఇంట్రెస్ట్ లేకపోతే ఫీలవుతారు కదా” నేనేమంటానో అన్నట్లుగా చూస్తోంది.
నేనేంతో ఇష్టపడి అదే జీవితమనుకొని తీసిన సినిమాకు థియేటర్లు దొరక్కపోతే ఇదన్న మాట పరిస్థితి. తెల్లారింది. టిఫిన్ కానిచ్చి ల్యాప్ టాప్ ముందు కూర్చొని నా గొడవలో నేనున్నాను. సెల్ ఫోన్ మోగుతుంటే వంటింట్లో నుంచి రమణి పరిగెత్తుకొచ్చింది. ఫోన్ మాట్లాడి కట్ చేసి నా దగ్గరకు వచ్చింది. “ఏమండి.. వాళ్లొస్తున్నారు. నేనెళ్లి వాళ్లను తీసుకొస్తా” అంటూ మెట్ల వైపునకు హడావుడిగా వెళ్లింది.
కాసేపటికి మెట్ల దగ్గర మాటల సందడి. మరికాసేపటికి ఓ జంటతో కలిసి రమణి ఇంట్లోకి వచ్చింది. “హలో సార్ ఐయామ్ రమేశ్” అని అతడు నా దగ్గరకు వచ్చాడు. నా పేరు చెప్పి షేక్ హ్యాండిచ్చాను. మేమిద్దం హాల్లో కూర్చున్నాం. ఆడవాళ్ళిద్దరూ వంటింట్లోకి వెళ్లిపోయారు. “సంజయ్ గారు మీరేం చేస్తుంటారు?” అని అడిగాడు రమేశ్. “ఈ మధ్యనే ఊళ్లో ఉన్న కాస్త పొలం అమ్మి లో బడ్జెట్ లో, కొత్తవాళ్లతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీశాను. రిలీజ్ చేద్దామంటే వరుసగా పెద్ద సినిమాలొస్తున్నాయి. థియేటర్లు దొరికితే రిలీజ్ చేద్దామనుకుంటున్నా. కానీ మూడు నెలలుగా అందర్ని కలుస్తూనే ఉన్నా. ఇదిగో అదిగో అంటున్నారే కానీ ఒక్కరూ ముందుకు రావడంలేదు” అని నీరసంగా సమాధానమిచ్చాను. “ఏంటి సబ్జెక్ట్?” అని ఆసక్తిగా అడిగాడు. “సబ్జెక్ట్ ఎందుకు? ఏకంగా సినిమా చూద్దురు గానీ” అన్నా. “సినిమానా? ఇక్కడా?” అని నోరెళ్లబెట్టాడు. కాస్త ఆగమని చెప్పి డివిడి ప్లేయర్ ఆన్ చేశాను.
రెండు గంటల సేపు సినిమా చూశాడు. మధ్యలో అతడేమీ అడగలేదు.. నేనేమీ చెప్పలేదు. “సంజయ్ గారూ.. పిక్చర్ చాలా బాగా వచ్చిందండి. కాకపోతే మనిద్దరం ఒక తానులో ముక్కలమే” అని నవ్వుతూ అన్నాడు. అర్థం కానట్టుగా చూశాను. “అదేనండి.. నేను కూడా మీలా ఓ సినిమా తీశా. నాదీ మీ పరిస్థితే. నాకు తెలిసిన మరో ఇద్దరు కూడా ఇలాంటి ఇబ్బందుల్లోనే ఉన్నారు. మొన్నటిదాకా శాటిలైట్ రైట్స్ కింద పెట్టుబడి అన్నా వచ్చేది. ఇప్పుడది కూడా లేకుండా పోయింది” అని ముఖం గంభీరంగా పెట్టి అన్నాడు.
కాసేపటికి అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చేశాం.
“గురువుగారూ.. ఇప్పుడేం చేద్దామంటారు?” అని రమేశ్ అడిగాడు. నా బుర్రలో ఏదో వెలిగింది. “మనం నలుగురం ఓ సారి మీట్ అవుదాం. ఎలాగైనా సరే మన సినిమాలు డివిడీలను దాటి థియేటర్ల మొహం చూడాలి. వారం ఆడితే చాలు.. ఆ తర్వాత సంగతి చూసుకుందాం” అని నా ఐడియా చెప్పాను. కాసేపటి తర్వాత “అలాగే గురువుగారు.. వాళ్లను కాంటాక్ట్ చేస్తా.. అందరికి కన్వీనియెంట్ గా ఉండేలా ఓ చోట మీట్ అవుదాం” అని అన్నాడు.
రెండ్రోజుల తర్వాత రమేశ్ నుంచి కాల్ వచ్చింది. ఫ్రైడే మార్నింగ్ పది గంటలకు గ్రీన్ బావార్చి సెంటర్ లో మీట్ అవుదామని చెప్పాడు. మా సినిమావాళ్లకు ఫ్రైడే అంటే ఎంతో గురి. నలుగురం కలుసుకున్నాం. రెండో సారి చాయ్ తాగుతుండగా మా వెనుక టేబుల్ దగ్గర ఉన్న ఓ యువకుడు మా దగ్గరకు వచ్చాడు. బహుశా మా మాటలు విన్నాడో ఏమో మరి. తన పేరు పంకజ్ అని, చిన్న సినిమాలకు బిజినెస్ చేస్తుంటానని పరిచయం చేసుకున్నాడు. చదివింది అహ్మదాబాద్ ఐఐఎంలో అని చెప్పగానే మేమంతా షాక్ తిన్నాం. రేపుదయం ఏడు గంటలకల్లా ఇక్కడకు వస్తే మీ సినిమాలకు బిజినెస్ చూపిస్తానని హామీ ఇచ్చాడు. అలాగే అన్నాం.
మర్నాడు అదే సెంటర్‌లో చాయ్ తాగి పంకజ్ తో పాటు బయలుదేరాం. పంకజ్ మమ్మల్ని నేరుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి దగ్గర్లో ఉన్న ఓ పెద్ద బిల్డింగ్ కు తీసుకెళ్లాడు. గేటు తీసుకొని లోపలకు వెళుతుండగా గ్రానైట్ స్టోన్ మీద కుబేర శర్మ అనే పేరు కనిపించింది. లోపలకెళ్లి కూర్చోగానే బక్కపలచగా ఉన్న ఒక వ్యక్తి పట్టు పంచె కట్టుకొని ఒక చేతిలో హారతి పళ్ళెంతో మా దగ్గరకు వచ్చాడు. పంకజ్ చెప్పిన దాన్ని బట్టి ఆయనే కుబేర శర్మ అనిపించింది. చేతికందిన ప్రతి పని, పెట్టుబడి పెద్దగా అవసరం లేని ప్రతీ వ్యాపారం చేస్తుంటాడు. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకొని ఎంత హీనంగా లెక్కేసుకున్నా ఓ వంద సినిమా హాళ్లు శర్మ కనుసన్నల్లో నడుస్తుంటాయి. పొద్దున సెంటర్‌లో కలిసినప్పుడు పంకజ్ చెప్పిన సంగతులివి.
అందరం లేచి నిలబడ్డాం. హారతి కళ్ళకు అద్దుకున్నాం. ముందు రోజే పంకజ్ ద్వారా మా నాలుగు సినిమాల డివీడీలు ఆయనకు చేరాయి. ఆయన వాటిని చూసే ఉంటాడు. ఆయనకు నమస్కరించాం. ప్రతి నమస్కారం చేసిన శర్మ ఒక్క నిముషం అని చెప్పి పంకజ్ ను పక్కనే ఉన్న చిన్న గదిలోకి తీసుకెళ్లాడు. ఐదు నిముషాల తర్వాత ఇద్దరూ గదిలో నుంచి బయటకు వచ్చారు. పావు గంటలో వ్యవహారం సెటిలైపోయింది. అగ్రిమెంట్లు రెడీగా ఉండడంతో రాత కోతలు పూర్తయ్యాయి. ముఖాలు వెలిగిపోతుండగా మరో సారి నమస్కరించి అక్కడ్నుంచి బయటకొచ్చాం. మర్నాడు పొద్దున పేపర్లో ఫ్రంట్ పేజీలో ఓ పెద్ద ప్రకటన. తెలుగు సినీ చరిత్రలో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం.. రెండు రోజుల్లో ఇదే పేజీలో వివరాలు ప్రత్యక్షం అని కలర్ ఫుల్ గా కనిపించింది. మ్యాటర్ రెండు లైన్లే. తెల్లారి పేపర్లో చూస్తే ఈ రోజు సాయంత్రం శిల్ప కళావేదికలో ఒకే వేదికపై నాలుగు సినిమాల ఆడియో ఫంక్షన్.. ఆ నాలుగు సినిమాలు మేం తీసినవే. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే నవ్వుతూ విష్ చేస్తున్న పంకజ్ కనిపించాడు. ఇన్విటేషన్ ఇచ్చాడు. ఫంక్షన్ కుబేర శర్మా మజాకా అన్నట్టుంది. ఫంక్షన్ చివర్లో నాలుగు సినిమాలను ఒక్కో షోకు ఒకటి చొప్పున ఒకే థియేటర్లో అన్నట్లుగా రెండు రాష్ట్రాల్లో వంద సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిలీజ్ చేస్తామని కుబేర శర్మ ప్రకటించాడు.
నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కాలేజీ కుర్రాళ్లకు ఇదేదో వెరైటీగా అనిపించింది. పైగా నాలుగు సినిమాలు నాలుగు వేర్వేరు సబ్జెక్టులు. ఇంకేముంది థియేటర్ల ముందు క్యూ కట్టారు. మరో సినిమా చూడ్డానికి ముందు కుర్రాళ్లు తినడానికని బయటికెళ్లే పనిలేకుండా తక్కువ రేటుకు వెజిటిబుల్ బిర్యాని, సాంబార్ రైస్, కర్డ్ రైస్ అందించే ఏర్పాట్లను కూడా శర్మ చేయించాడు. మా సినిమాలు రిలీజై వన్ వీక్ అవుతున్నది. ముఖంలో కళ లేకున్నా సినీ వారసత్వంతో నెట్టుకొస్తున్న కుర్ర హీరో వాస్తవ్ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ముందు రోజు శివరాత్రి. శర్మ కంట్రోల్లో ఉన్నవి తప్ప మిగిలిన అన్ని థియేటర్లలో శివరాత్రి మర్నాడు వాస్తవ్ బొమ్మ పడబోతోంది. ఈలోగా కుబేర శర్మ, పంకజ్ ద్వయానికి ఓ ఐడియా వచ్చింది. శివరాత్రికి సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. పాతికేళ్ల క్రితం దాకా శివరాత్రికి ఒక్క టికెట్టుకు నాలుగు సినిమాలు చూపించేవారు. ఇప్పుడు కూడా నాలుగు సినిమాలు చూపిస్తున్నారు కానీ ఏ సినిమాకు ఆ సినిమా టికెట్ కొనుక్కోవాలి. మళ్ళీ పాత పద్ధతిలోకి వెళితేనో.. అప్పటికే లాభాల పంటలో మునిగి తేలుతున్న శర్మకు అదో పెద్ద లెక్క కాదు. ఐడియా అదిరింది. చిన్నా, పెద్దా, ముసలి ముతకా, మహిళలు ఇలా అందరూ ఒక్క టికెట్టు మీద నాలుగు సినిమాలు చూడ్డానికి థియేటర్లకు విరగబడి వచ్చారు. దాంతో అర్థరాత్రి ఒంటిగంటకు ఫ్యాన్స్ కోసం వేయాల్సిన వాస్తవ్ సినిమా బెనిఫిట్ షో ఆగిపోయింది. తెల్లారేసరికి వాస్తవ్ సినిమా విడుదల వాయిదాపడిందని టీవీ చానెళ్లలో స్క్రోలింగ్ వచ్చింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత
కుబేర శర్మకు మాతో ఏదో పని పడిందట. అర్జంటుగా రమ్మని పంకజ్ తో కబురు పంపించాడు. మాపాలిట మహానుభావుడు.. మళ్ళీ ఎలాంటి ప్లాన్ చేశాడో అనుకుంటూ పంకజ్ తో కలిసి కుబేర శర్మను కలవడానికి బయలుదేరాం.

**** సమాప్తం ****

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు