"బాబ్బాబూ ఇక్కడ జరిగినది ఎక్కడా చెప్పకేం. ఈ విషయం మనలోనే సమాధి అయిపోవాలి. నీకు ఏమి కావాలంటే అది ఇస్తాం"
"అలాగే సర్. మీరు కూడా నేను ఇప్పుడు ఇక్కడకి వచ్చినట్టు ఎవరికీ చెప్పకండి. నాకొక వెయ్యి రూపాయలు ఇప్పించండి"
మెకానిక్ రాజూ రామనాధం ఇచ్చిన వెయ్యి రూపాయలు పట్టుకొని పోయేడు.
"హమ్మయ్య" అని రామనాధం గురుమూర్తి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.
అదొక పెద్ద ప్రైవేట్ వ్యాపార సంస్థ. పేరుకి ప్రైవేట్ సంస్థ అయినా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏ పెద్ద బ్యాంకుకు తీసిపోని విధంగా వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి అక్కడ. రోజుకి కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తూ, ఆ సంబంధమైన కాగితాలు డబ్బు బంగారం మాత్రమే కాక ఇతరత్రా విలువైన వస్తువులు విదేశీధనం కూడా నాలుగు సేఫ్ లలో విడివిడిగా భద్రంగా దాచబడుతూంటాయి.
ఆ నాలుగు సేఫ్ లు కలిపి ఒక దళసరి ఇనపగోడలున్న గదిలో భద్రపరచబడి ఉంటాయి. ఆ గదికున్న ఇనపతలుపు, లోపలున్న నాలుగు సేఫ్ ల తలుపులు ఒకే ఒక కన్నం మాత్రమే ఉన్న తలుపుతో బంధించబడి ఉండగా, ఆ ఒకే ఒక కన్నంలో పెట్టే రెండు తాళం చెవులతో ఆ తలుపులు తెరవబడే రక్షణ వ్యవస్థ ఉంది. ఒక తాళం చెవి రామనాధం దగ్గర, మరొక తాళం చెవి గురుమూర్తి దగ్గర ఉంటాయి. తెరిచేటప్పుడు తలుపులకున్న ఒకే ఒక కన్నంలో ముందుగా రామనాధం తాళం చెవి, వేసేటప్పుడు ముందుగా గురునాధం తాళం చెవి ఉపయోగిస్తారు.
సంస్థ నియమం ప్రకారం, రామనాధం గురుమూర్తి మిగతా ఉద్యోగుల కంటే ఒక అరగంట ముందుగా వచ్చి, ఇనపగదికి ఆవల గార్డ్ నౌకరు నిలబడి ఉండగా ఇనపగది తెరిచిన తదుపరి, నౌకరు చేత ఇనపగది లోపల శుభ్రం చేయించి, సంస్థ పనులను బట్టి ఎప్పుడు ఏ సేఫ్ కావలిస్తే అది అప్పుడు తెరుస్తారు.
ఆరోజు శనివారం. ఎప్పటిలాగే ఇనపగది తలుపుకున్న కన్నంలో రామనాధం దగ్గర ఉండే తాళం చెవి పెడితే, అది తెరిచే దారిలో కుడివైపుకు తిరగక మొరాయించి కూర్చుంది. దాంతో, గురునాధం తాళంచెవి ఆ తలుపు కన్నంలో ప్రవేశ పెట్టవలసిన అవసరమే రాలేదు. అయినా, ఆయన ఒకసారి తన దగ్గరున్న తాళంచెవి ఆ తలుపు కన్నంలో ప్రవేశ పెట్టడానికి చేసిన ప్రయత్నం ఆదిలోనే విఫలమైంది.
ఆ విధంగా ఆ రోజు ఇనపగది తెరుచుకోలేదు. ఇద్దరూ కూడపలుక్కొని ఆరోజు ఇనపగది తెరిచే అవసరం లేదని ఇతర ఉద్యోగులతో చెప్తూ, సాధ్యమంత తక్కువ లావాదేవీలతో పనులు కావించి, ఉద్యోగస్తులు అందరూ వెళ్లిపోయిన తరువాత – ఇనపగది తెరిచే ప్రయత్నం మరొకసారి చేసి, అది జరిగే పని కాదు, మెకానిక్ ని పిలవవలసిందే అని నిర్ణయానికి వచ్చేరు.
కంపెనీ పై ఆఫీసు వారికి చెప్పి మాటలు పడే కంటే, గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరూ కలిసి ఊళ్ళోనే ఉన్న తమకు తెలిసిన మెకానిక్ ని సంప్రదించే ప్రయత్నం చేయగా –
ఒక కంపెనీ మెకానిక్ అయిన రాజు"మా కంపెనీకి తెలియకుండా రమ్మంటే, మరునాడు ఆదివారం ఉదయం పది గంటలకు వచ్చి పని చేసిపెడతాను" అని హామీ ఇచ్చేడు.
రామనాధం మెకానిక్ రాజుతో "రేపు వచ్చినప్పుడు మెకానిక్ బట్టలు కాక శుభ్రమైన బట్టలు వేసుకొని వచ్చి మా సంస్థ గేటు దగ్గర ఉండే గార్డుతో 'రామనాధాంగారు రమ్మన్నారు' అని చెప్పు. అప్పుడు నేను బయటకు వచ్చి నిన్ను లోపలి తీసుకొని వెళ్తాను. నేను వచ్చే లోపల మా గార్డు ఏమి అడిగినా కూడా ఏమీ మాట్లాడకు" అని జాగ్రత్తలు చెప్పేరు.
‘రోగి కోరేదే వైద్యుడు పథ్యంగా తినమని చెప్పినట్టు’ గా వారికి కావలసిన సదుపాయమే దొరకడంతో అప్పటికి తాత్కాలికంగా సంతోషించిన వారిద్దరూ, ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని, ‘ఎందుకైనా మంచిది రేపు ఉదయం తొమ్మిదిన్నరకే ఇద్దరమూ ఇక్కడకు చేరుకొని, లోపల కూర్చొని, మెకానిక్ రాజు కోసం ఎదురు చూద్దాము’ అని నిర్ణయించుకొన్నారు.
అంతేకాక ---
‘ఈరోజు జరిగిన విషయం ఎప్పటికీ ఎవరికీ -- ముఖ్యంగా వారి వారి భార్యలకు, ఇతర ఉద్యోగులకు - తెలియకుండా జాగ్రత్తపడాలి’ అనుకొన్నవారిద్దరూ ఆ రోజుకి వారి వారి ఇళ్లకు తిరుగు ముఖం పట్టేరు.
అనుకున్నప్రకారం రామనాధం గురుమూర్తి మరునాడు ఉదయం తొమ్మిదిన్నరకే వారి సంస్థ దగ్గరకు చేరుకొని లోపల మెకానిక్ రాజు కోసం ఎదురుచూస్తున్నారు. కొంతసేపటికి, రామనాధం లేచి తన తాళంచెవి తలుపుకున్న కన్నంలో పెట్టి మరొకసారి కుడిపక్కకు తిప్పి చూస్తే, తిరగక మొరాయించింది.
అసంకల్పితంగా ఎడమపక్కు తిప్పితే, ఆ తాళం చెవి ఎడమపక్కకు తిరిగి తలుపు తాళం పడిన శబ్దం వచ్చింది.
తరువాత, కుడిపక్క తిప్పితే, కుడిపక్క తిరిగి తలుపు తాళం తెరుచుకున్న శబ్దం వచ్చింది. కూడా.
ఆ చర్య చూస్తున్న గురునాధం ఆశ్చర్యంతో వెంటనే లేచి వచ్చి, తనదగ్గర ఉన్న తాళం చెవి ఆ తలుపు కన్నంలో పెట్టి కుడిపక్క తిప్పితే, ఆ గది తాళం తెరుచుకున్న శబ్దం వచ్చి తలుపు ఎప్పటిలానే తెరుచుకుంది.
"బోధపడిందా రామనాధం, మొన్న సాయంత్రం నేను తాళం వేసిన తరువాత నువ్వు తాళం వేయడం మరచిపోయావన్నమాట"
"అలానే అనిపిస్తోంది. అయినా నేను తాళం వేయడం ఎలా మరచిపోయానో అర్ధం కావడం లేదు"
"నేను తాళం వేస్తుండగా నీ మొబైలులో కాలర్ టోన్ వచ్చింది గుర్తులేదూ"
"నువ్వంటూంటే, ఇప్పుడు లీలగా గుర్తుకు వస్తోంది"
"నేను తాళం వేసేను, నువ్వు కూడా తాళం వేసి మొబైలులో మాట్లాడు అని చెప్పేనప్పుడు, గుర్తుందా"
"అవును ఇప్పుడు పూర్తిగా గుర్తొస్తోంది. నేను నీతో 'సరే' అని, మొబైలులో మాట్లాడుతూ తాళం వేయడం మరచిపోయినట్టుంది"
"మరచిపోయినట్టుంది ఏమిటి? అంతే జరిగింది"
"నిజమే, అంతే జరిగింది”
"మన అదృష్టం బాగుంది. నిన్న తాళం వేయకుండా వదిలేసిన పరిస్థితిలో ఏ దొంగైనా దూరి ఉంటే, అంతా ఖాళీ చేసేసేవాడు. మనం ఊచలు లెక్కపెడుతూ కూర్చొనేవాళ్ళం"
“మరిప్పుడు మెకానిక్ వస్తే ఏమి చేద్దాం"
"వాడికేదో సర్ది చెప్పి పంపిద్దాములే. అవసరమైతే వాడికి కొంత డబ్బు ఇచ్చి వాడి నోరు మూయిద్దాం"
"నా వలన పొరపాటు జరిగి నాతో పాటూ నీకు కూడా ఎంత టెన్షన్ తెప్పించేనో తలచుకుంటే నాకు సిగ్గుగా ఉంది గురునాధం"
"అలా బాధపడకు రామనాధం. పొరపాటు మానవసహాజం. ఇప్పుడు మనిద్దరం 'తేలుకుట్టిన దొంగ’ లాగ ఈ విషయం ఎక్కడా ఎవరికీ ఎప్పుడూ తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి సుమా"
"లేకపోతే మన ఉద్యోగాలకే ఎసరు కదా" అన్న రామనాధం మాటతో, ఇద్దరూ జీవం లేని నవ్వు నవ్వుకున్నారు.
*****