నమ్మకం - ANUDHA

Nammakam

పద్మ అక్క. నేను చెన్నై లో కొత్తగా ఆఫీస్ లో చేరినప్పుడు తనకు తానే నా దగ్గరకి వచ్చి పరిచయం చేసుకుంది. ఎంతో పరిచయం ఉన్నట్టు గా, నన్ను కలుపుకుని "ఏరా " అంటూ పలకరిస్తూ, నా సారీ చాలా బావుంది అని మెచ్చుకుంటూ ఎంతో బాగా మాట్లాడింది. కొత్త గా చేరినప్పుడు మనకి ఆ ఆఫీస్ వాతావరణం అంతా చాలా కొత్తగా ఉంటుంది. అంటువంటప్పుడు మనల్ని ఆప్యాయంగా పలకరించే వారు ఉంటే ఎంత బావుంటుంది. పద్మ అక్క నాకు అలా పరిచయం అయ్యి చాలా తక్కువ కాలం లోనే దగ్గరయింది. తనది నాది ఒకటే వర్క్ కాకపోయినా లంచ్ టైం లో కలిసి చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. నిజం చెప్పాలంటే పద్మ అక్క నాతోనే కాదు అందరితో ను అలాగే కలుపుగోలు గా ఉంటుంది. నాకు ఒక్కోసారి అనిపించేది ఈ ఆఫీస్ లో ఉన్న మొత్తం అందరూ పద్మ అక్క కి తెలుసు ఏమో అని! ఎందుకంటే ఎవ్వరు కనపడినా ఆపకుండా మాట్లాడుతూ ఉండేది. నిజంగా పద్మ అక్కలా పరిచయాలు పెంచుకోవడం అందరికీ సాధ్యం కాదు ఏమో! ఓరోజు పద్మ అక్క షిరిడి వెళ్తున్నాం అని చెప్పింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఫ్లైట్, కాబట్టి తాను మధ్యాహ్నం నుండి ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. ఈ ఆఫీస్ లో పనిచేసే చాలా మంది మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే. పద్మ అక్క ఎప్పుడూ, ప్రయాణాల సంగతి చెప్పినా ఫ్లైట్స్ గురించే చెప్పేది. తన భర్త పెద్ద బిజినెస్ మ్యాన్ అని. ఏదో టైం పాస్ కోసం ఇక్కడ తాను జాబ్ లో చేరానని కూడా నాకు చెప్పింది. ఓరోజు పద్మ అక్క తన ఇంట్లో కిట్టీ పార్టీ ఉంది రమ్మని నన్ను పిలిచింది " చాలా బావుంటుంది రా, నువ్వు తప్పక రావాలి. మా కాలనీ వాళ్ళు, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ప్రతీ నెల ఇలా కిట్టీ పార్టీ లు పెట్టుకుంటాం. ఒక్కసారి వచ్చి చూడు రా" అని ఎంతో ఆప్యాయత తో పిలిచింది. కానీ నాకు కుదరక వెళ్ళలేదు. ఎక్కువగా వివిధ ఆలయాలకు, విహార ప్రదేశాలకు వెళ్లి వచ్చే పద్మ అక్క మాకు అక్కడి విశేషాలు, వాళ్ళ కుటుంబం బస చేసిన హోటల్స్ గురించి లంచ్ టైం లో కథలు కథలు గా చెప్పేది. నేను చేరి కొద్ది రోజులు అయినా పద్మ అక్క పరిచయం తో ఎన్నో సంవత్సరాలు అయినట్టుగా అనిపించేది. ఓరోజు పద్మ అక్క ఆఫీస్ కి రాలేదు. తరువాత రోజు ల్యాండ్ ఒకటి కొన్నాను అని దాని రిజిస్ట్రేషన్ కోసం సెలవు పెట్టాను అని పద్మ అక్క చెప్పింది. అంతే కాదు ఆరోజు నాకు డబ్బులు ఎలా జాగ్రత్త చేసుకోవాలో, రూపాయి రూపాయి ఎలా పొదుపు చేయాలో కూడా చెప్పింది. తాను వచ్చే నెల నుండి చిట్ ప్రారంభం చేస్తున్నాను అని, నన్ను చేరమని కూడా చెప్పింది. అంతే కాకుండా నేను ఆఫీస్ కి కొత్త కాబట్టి నాకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చిట్ అమౌంట్ ఇస్తానని కూడా భరోసా ఇచ్చింది. ఆ తరువాత నాతో పాటు నా లంచ్ మేట్స్ అంతా కూడా పద్మ అక్క చిట్ లో చేరాము. అప్పుడప్పుడు పద్మ అక్క మాకు ఎన్నో జీవిత పాఠాలు చెప్పేది. అత్తగారితో ఎలా ఉండాలో, భర్త తో ఎలా ఉండాలో, ఆడపడుచుల తో ఎలా ఉండాలో కూడా చెప్పేది. నాకు పద్మ అక్క కి ఇన్ని విషయాలు ఎలా తెలుసు అని ఆశ్చర్యం వేసేది. ఓరోజు పద్మ అక్క తనకి అర్జెంటు గా 50000/- రూపాయలు కావాలి అని అడిగింది. అంత మొత్తం అంటే మాదగ్గర ఎవరి దగ్గర లేవు. పాపం పద్మ అక్క కి ఏ అవసరం వచ్చిందో అని మేమే ఎక్కువ టెన్షన్ పడ్డాము. మా అందరిదగ్గర సేవింగ్ అకౌంట్ లో ఎంత ఉందొ చూసి పద్మ అక్క కి ఇవ్వాలి అనుకున్నాము. కానీ ఇంతలోనే విషయం తెలిసి మా మేనేజర్ తన క్రెడిట్ కార్డు నుండి పద్మ అక్క కి అమౌంట్ ఇచ్చారు. పద్మ అక్క ఆ వారం లోనే ఆయనకి తిరిగి అమౌంట్ ఇచ్చేసింది. రోజు రోజు కు మా లంచ్ మేట్స్ అందరికి పద్మ అక్క తో స్నేహం పెరుగుతూ ఉంది. ఓరోజు మా లంచ్ మేట్ కావేరి తన మరిది పెళ్లి ఉంది అని చెప్పగానే, పద్మ అక్క తరువాత రోజు కావేరి అడగకుండానే తన బంగారు గొలుసు తెచ్చి ఇచ్చింది. ఈరోజుల్లో ఇంట్లో వాళ్ళ గురించే సరిగా ఎవరూ పట్టించుకోవట్లేదు, అలాంటిది ఆఫీస్ కొలీగ్ ఇంట్లో పెళ్లి అంటే తన గొలుసు ఇచ్చిన పద్మ అక్క వ్యక్తిత్వానికి మా కళ్ళలో నీళ్లు వచ్చాయి. పద్మ అక్క చిట్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తూ ఉండి పద్మ అక్క. రోజులు అలా సరదాగా సరదాగా మాకు గడిచిపోతూ ఉన్నాయి. పద్మ అక్క చిట్స్ ఒకదానితర్వాత ఒకటి కొత్త కొత్త గ్రూప్ లు స్టార్ట్ చేస్తూ, ఆఫీస్ మొత్తం లో చాలా మంది ని జాయిన్ చేసుకుంది. ఓరోజు పద్మ అక్క ఆఫీస్ కి వచ్చింది కానీ, లంచ్ రూమ్ కి రాలేదు. మా లంచ్ అయిపోయాక పద్మ అక్క దగ్గరకి వెళ్లేసరికి అక్కడ, మా ఆఫీస్ బాయ్ కళ్యాణ్ పద్మ అక్క తో ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నాడు. మమ్మల్ని చూసి పద్మ అక్క కళ్యాణ్ ని రేపు మాట్లాడడం వెళ్ళు అని చెప్పింది. మేము కూడా ఇంక విషయం ఏమిటి అని అడగలేదు. మాకు చెప్పేది ఐతే పద్మ అక్క చెప్తుంది కదా అని ఊరుకున్నాము. తరువాత వారం లో ఓరోజు మళ్ళీ మా ఆఫీస్ బాయ్ కళ్యాణ్ పద్మ అక్కతో మాట్లాడుతూ కనపడ్డాడు. కానీ ఈసారి కొంచం సీరియస్ గా మాట్లాడుతున్నాడు. లంచ్ టైమ్ లో మేము అడగకుండానే పద్మ అక్క చెప్పింది చిట్ అమౌంట్ అడ్జెస్ట్ చేయడానికి కొంచం లేట్ అయ్యింది అని సీరియస్ అవుతున్నాడు కళ్యాణ్ అని చెప్పింది. అయ్యో ఎప్పుడూ సమయానికి ఇచ్చేసే పద్మ అక్క ఒక్కసారి చిట్ అమౌంట్ లేట్ చేస్తే ఇంత ఇష్యూ చేయాలా? అని మేము అనుకున్నాము. ఎవరి దగ్గర ఐనా ఉంటే అడ్జెస్ట్ చేయమని పద్మ అక్క అడగడం తో మా కొలీగ్ సరళ తరువాత రోజు 50000/- తెచ్చి పద్మ అక్క కి ఇచ్చింది. రోజులు గడుస్తున్నాయి ఓరోజు ఆఫీస్ బాయ్ కళ్యాణ్ నా దగ్గరకి వచ్చి పద్మ మేడం నా చిట్ అమౌంట్ ఇవ్వడం లేదు అని చెప్పాడు. వెంటనే నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు అలా చెప్తున్నావ్! పద్మ మేడం మూడు నెలల క్రితమే సరళ మేడం దగ్గర అమౌంట్ తీసుకున్నారు నీకు ఇవ్వడానికి నాకు తెలుసు , అన్నాను. అవునా మేడం కానీ నాకు ఇవ్వలేదు అన్నాడు. నేను ఏమైనా పొరబాటు పడ్డాను ఏమో అని వెంటనే మా కొలీగ్ సరళ కు ఫోన్ చేసాను. సరళ అవును మూడు నెలలు క్రితం పద్మ అక్క కళ్యాణ్ కి ఇస్తానని తీసుకుంది. కానీ నాకు కూడా ఆ అమౌంట్ తిరిగి ఇవ్వలేదు అని చెప్పింది. అవునా అన్నాను ఏం మాట్లాడాలో తెలియక. గత రెండు నెలల క్రితం నాకు ఇవ్వాల్సిన చిట్ అమౌంట్ పద్మ అక్క నాకు ఇవ్వలేదు. "నీకు ఇప్పుడు అవసరం లేకపోతే నా దగ్గర ఉంచేయ్, ప్రతీ నెల నీకు వడ్డీ ఇస్తాను అని చెప్పింది " పద్మ అక్క. సరేలే అవసరం అయినపుడు తీసుకోవచ్చు వడ్డీ వస్తుంది కదా అని నేను అనుకున్నాను. నా అమౌంట్ తన దగ్గరే ఉంచేసాను. సరళ పద్మ అక్క ని తనకు ఇవ్వాల్సిన 50000/- గురించి అడిగితే ఓసారి తరువాత నెలలో ఇస్తానని చెప్పింది. మళ్ళీ తరువాత నెలలో సరళ మా హస్బెండ్ ఆ డబ్బులు వడ్డీ కి తెచ్చారు. వాళ్ళకి ఇచ్చేయాలి అక్కా అంటే, పద్మ అక్క అది నా ప్రాబ్లెమ్ కాదురా, నా దగ్గర ఇప్పుడు లేవు. ఉన్నప్పుడు ఇస్తాను అని చెప్పింది. అదేంటి పద్మ అక్క ఇలా మాట్లాడుతుంది అనుకున్నాం మేము. ఓరోజు మా పక్క సెక్షన్ లో కుమారి అనే మేడం పద్మ అక్క దగ్గరకి వచ్చి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. అది చూసి సరళ నా దగ్గరకి వచ్చి చెప్పింది "బహుశా ఆమెవి కూడా చిట్ అమౌంట్ అనుకుంటా " అని. ఏమైంది అని తర్వాత నేనే కుమారి గారిని అడిగాను. పద్మ చిట్ అమౌంట్ ఇవ్వడం లేదు. మా హస్బెండ్ మీ ఇంటికి వస్తాను అని అంటున్నారు అని అంటే రమ్మని చెప్పండి టీ పోసి పంపిస్తా అని వెటకారంగా చెప్తుంది పద్మ అని కుమారి గారు నాతో చెప్పారు. పద్మ అక్క ఎందుకు ఇలా చెప్తుంది అని అనుకున్నాను. తరువాత రోజు పద్మ అక్క తన ప్రొవిడెంట్ ఫండ్ పై లోన్ తీసుకుంది. తాను లంచ్ టైమ్ లో లంచ్ రూమ్ కి రావడం కూడా తగ్గించింది. మరో రెండు రోజుల తర్వాత పద్మ అక్క ఆఫీస్ కి రావడం మానేసింది. ఆ విషయం తెలిసి ఏమైంది అని నేనే ఫోన్ చేసాను పద్మ అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అక్కడి నుండి మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంది. పద్మ అక్క ఆఫీస్ మానేసింది అని తెలిసినపుడు నాకు డబ్బులు ఇవ్వాలి కదా ఎలా కాంటాక్ట్ చెయ్యాలి అని అనుకున్నాను. మా కోలీగ్స్ ఎవరి దగ్గర అయిన పద్మ అక్క భర్త ఫోన్ నెంబర్ ఉంది ఏమో అని అడిగితే ఎవరు లేదు అన్నారు కానీ అప్పుడే తెలిసిన విషయం ఏమిటి అంటే పద్మ అక్క నాకు, కళ్యాణ్ కి, కుమారి గారికి, సరళ కు మాత్రమే కాదు ఆఫీస్ లో తన దగ్గర చిట్ వేసిన అందరికి డబ్బులు ఇవ్వవాల్సి ఉంది అని ఎవరికీ ఇవ్వలేదు అని. ఇంత కాలం అందరిదగ్గర నమ్మకం సంపాదించు కుని ఒక్కసారిగా అందరిని మోసం చేసింది అని మాకు అప్పుడే అర్ధం అయ్యింది. ఆఫీస్ మొత్తం చూస్తే సుమారు గా 25 లక్షల రూపాయలు వరకు ఇవ్వాల్సి ఉంది అని తేలింది. ఆమె ఇంటికి వెళ్తే ఎప్పుడూ ఖాళీ చేశారు అని ఇంటి ఓనర్స్ చెప్పారు. అంతే కాదు కాలనీ లో కూడా చాలా మంది కి ఇలానే అమౌంట్ ఇవ్వాల్సి ఉంది అని ఇంటి ఓనర్స్ అన్నారు. మంచి తనం ముసుగులో, నమ్మంచి ఇలా మోసం చేసిన పద్మ అక్క లాంటి వాళ్ళ గురించి రోజు వింటూ ఉన్నా, పేపర్స్ లో చదువుతూ ఉన్నా మళ్ళీ మళ్ళీ మనం మోసపోతూనే ఉంటాం అని తలుచుకున్నప్పుడు నా మీద నాకే జాలి వేసింది. ఎన్నో అవసరాల కోసం చిన్న చిన్న అమౌంట్ లు చిట్ రూపం లో దాచుకుంటే తియ్యని మాటలతో, వడ్డీ ల ఆశల తో నమ్మించి మోసం చేసే వాళ్ళు గురించి తలుచుకుంటే మనుషులు అంటేనే భయం వేస్తూ ఉంది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు