అనగనగా సుందర వనం అనే అడవి. ఆ అడవికి రాజు 'కేసరి' అనే సింహం. కేసరి పాలనలో జంతువులు, పక్షులు సంతోషంగా జీవిస్తున్నాయి. అయితే తుంటరి వాయసం అనే కాకి చిలిపి చేష్టల వల్ల సుందర వనంలో ప్రశాంతతకు భంగం వాటిల్లుతూ వస్తుంది. ఆకతాయి వాయసం ఎప్పుడూ చెడ్డగా ప్రవర్తిస్తూ, అల్లరితో కూడిన పనులను చేస్తూ, కర్ణ కఠోరమైన అరుపులతో ఇతర జంతువులకు విసిగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తూ ఆనందించేది. తన చేష్టల వల్ల ఇబ్బంది పడే జంతువులనూ, పక్షులనూ ఆ తుంటరి వాయసం చెట్టు కొమ్మల చాటు నుంచి ఆ దృశ్యాలను తిలకిస్తూ కిసుక్కున నవ్వుకుంటూ... ఆనందించేది. తోటి పక్షుల గూళ్ళనూ, గుడ్లనూ పాడు చేయడం, వాటి పిల్లలను నిర్దాక్షిణ్యంగా గాయపరిచి చంపటం, వాటి ఆహారపదార్థాలను దౌర్జన్యంగా ఎత్తుకు పోవడం, జంతువుల పిల్లలను గాయపరచడం, నిద్రిస్తున్న జంతువులపై రెట్టలు వేయడం వంటి చెడ్డపనులను చేస్తూ విసిగిస్తుండేది. ఇలా... ఆ తుంటరి వాయసం తన ఆనందం కోసం ప్రతీ ఒక్క జంతువునీ ఎదో ఒకలా బాధపెట్టేది. దాని అల్లరి చేష్టలకు రాజైన కేసరి సైతం ఇబ్బంది పడక తప్పలేదు. అయినా కేసరి సహృదయంతో సహించింది. తుంటరి వాయసం నివాసముంటున్న చెట్టు మీద ఏ పక్షీ ఉండటానికి ఇష్టపడేది కాదు. ఒకసారి జంతువులన్నీ కేసరి వద్దకు వెళ్ళి, తుంటరి వాయసం చేస్తున్న అల్లరి పనులు శృతిమించి పోయాయనీ, తామిక భరించలేమని, తుంటరి వాయసంని చంపేయడయో లేక ఈ అడవి నుంచి బహిష్కరించడమో చేసి, తమను కాపాడమని వేడుకున్నాయి. ఈ అడవి నుండి తుంటరి వాయసంని బహిష్కరించి పంపివేసినా మరొక అడవిలోకి వెళ్ళి కూడా అక్కడి జంతువులను ఇలానే ఇబ్బందులకు గురిచేస్తుంది. కాబట్టి ఈ తుంటరి వాయసం ఆగడాలను ఎలాగైనా ఈ అడవిలోనే అరికట్టించి, మంచి మార్పుని రప్పించాలని కేసరి యోచన చేసి, వెంటనే మంత్రి అయిన వ్యాఘ్రేశ్వరుడనే పెద్దపులితో సమావేశమై, తుంటరి వాయసం సమస్య పరిష్కారం కోసం చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి, ఆ నిర్ణయం ప్రకారంగా 'కీరవాణి' అనే చిలుకను, 'వనప్రియ' అనే కోకిలను పిలిచి, తుంటరి వాయసం నివాసముంటున్న చెట్టు మీద నివాసాలను ఏర్పరచుకుని, తుంటరి వాయసంతో స్నేహం చేయమని ఆదేశించింది. కేసరి ఆదేశానుసారం కీరవాణి, వనప్రియలు తుంటరి వాయసం ఉన్న చెట్టుపైన నివాసం ఏర్పరచుకున్నాయి. కీరవాణి తన నివాసాన్నే కాకుండా, చుట్టూ ఉన్న పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, అందరినీ మర్యాదగా పలకరించడం, వనప్రియ తన మధురమైన గాత్రంతో అడవి జంతువులన్నిటినీ అలరించడం చేస్తున్నాయి. పరిశుభ్రంగా ఉంటున్న కీరవాణి నివాసం దగ్గర తుంటరి వాయసం చెత్తా, చెదారాలను తీసుకువెళ్ళి అక్కడ వేసి, నానారకాలుగా పాడుచేసేది. అయినా కీరవాణి ఓర్పు చూపించి, ఆ ప్రదేశాన్ని వెంటనే శుభ్రపరిచేది. వనప్రియ మధురంగా పాడుతుంటే ఆ పాటను పాడుచేయాలని కావ్... కావ్... కావ్...కావ్... అంటూ భరించుకోలేనంతగా చెవులలోని కర్ణభేరికి చిల్లుపడేటట్లు అరిచేది. అయినా వనప్రియ ఏ మాత్రం కోపం చూపడకుండా ఓర్పుతో ఉండేది. ఇలా... కొన్ని రోజులు గడిచాయి. అడవి జంతువులన్నీ కీరవాణి, వనప్రియల పట్ల ప్రేమానురాగాలు కురిపిస్తూ..., తుంటరి వాయసాన్ని ఛీదరించుకుంటూ, ఈసడించుకుంటూ అసహ్యంగా చూసేవి. అడవి జంతువులన్నీ తనను, తన ప్రవర్తననూ ఇలా అసహ్యించుకోవడం, కీరవాణి,వనప్రియల పట్ల ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ప్రదర్శించడం వంటివి తుంటరి వాయసానికి మనసులో బాధ కలిగించాయి. తన చుట్టూ ఉన్న పక్షులు, జంతువులు అన్నీ మంచిగా ఉంటూ..., అందరి మన్ననలు పొందుతుంటే, తాను మాత్రం ఇలా ఉండడం భావ్యం కాదని, తాను కూడా అడవి జంతువులన్నింటి మన్నలను పొందుతున్న కీరవాణి, వనప్రియ ల వలే తన ప్రవర్తనను మార్చుకోవాలని, వాటితో స్నేహం చేసి, అన్ని జంతువుల ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పొందాలని తుంటరి వాయసం నిర్ణయానికి వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటికి దగ్గరై స్నేహం ఏర్పరచుకుంది. తాము కోరుకునే శుభ తరుణం ఇంత త్వరగా వచ్చినందుకు కీరవాణి, వనప్రియలు మనసులో సంతోషపడ్డాయి. కీరవాణి, వనప్రియలతో తుంటరి వాయసంకి స్నేహం ఏర్పడిన కొద్ది రోజులకే తన అల్లరి పనులన్నీ మానేసి, ఇతరులకు ఇబ్బంది లేని విధంగా కీరవాణిలా పరిశుభ్రతను పాటించడం, తోటి అడవి జంతువులతో మర్యాదగా ఉండడం అలవర్చుకుంది. వనప్రియలా మధురమైన గొంతుతో పాడలేక పోయినా, అవసరం మేరకే వీలైనంత మెల్లిగా అరవడం నేర్చుకుంది. తోటి పక్షులతోనూ, జంతువులతోనూ స్నేహంగా నడుచుకోవడం ప్రారంభించింది. తుంటరి వాయసంగా తాను గతంలో చేసిన అల్లరి పనుల వైపు దృష్టిని మరల్చకుండా కేవలం మంచి పనుల పైనే దృష్టి పెట్టడం గమనించిన అడవి జంతువులన్నీ సంతోషించాయి. కొద్ది రోజులకే తుంటరి వాయసం *మంచి వాయసం* అయింది. తుంటరి వాయసం ప్రవర్తనలో శాస్వతమైన మార్పుని సాధించిన కేసరిని, వ్యాఘ్రేశ్వరుడిని, కీరవాణి, వనప్రియలను అడవి జంతువులన్నీ హృదయపూర్వకంగా అభినందనందించాయి. *నీతి*:- *మంచి వారితో స్నేహం మంచిని చేకూర్చును.*