"మై దునియా బులాదూంగా తేరి చాహత్ మే.." మంద్ర స్వరంలో సిస్టమ్ లో పాట వినిపిస్తోంది. ఆహ్వానపత్రిక నమూనాలు పరిశీలిస్తోంది చైత్ర. "భలే భలే మగాడివోయ్ బంగారు నాసామివోయ్" మొబైల్ లో నుంచి ఎల్ ఆర్ ఈశ్వరి పిలిచింది. "వస్తున్నా సారూ" అంటూ ఫోన్ ఆన్ చేసింది. "ఏమిటి వేళ కాని వేళ ఈ ఫోన్..." భర్తని పలకరించింది చైత్ర. "అమ్మాయి గారు ఏం చేస్తున్నారో కనుక్కుందామని... " అన్నాడు చైత్ర భర్త సాకేత్. "అబ్బో... ఇన్విటేషన్ మోడల్స్ పరిశీలిస్తున్నాను. చిన్న చిన్న మార్పులు చేస్తున్నాను. చెప్పండి... ఎంతో బిజీగా ఉండే మా శ్రీవారికి ఏం గుర్తొచ్చింది?" "చిన్న సమస్య వచ్చింది చైత్రా ..." "ఏమైంది" "నాలుగు రోజుల్లో విశాఖపట్నంలో జరగబోయే మన కంపెనీ బ్రాంచి ప్రారంభోత్సవానికి, స్పాన్సర్లు అయిన ఫారిన్ డెలిగేట్ల కోసం అరుకు టూర్ ప్లాన్ చేసాం కదా, నిన్ననే ఈవెంట్ మేనేజర్ దశరధ్ వెళ్ళిపోయాడు. రేపు నా సెక్రటరీ అరుణ్ వెళ్లాల్సి ఉంది" "అవును, అది ముందే అనుకున్నాం కదా, అరుణ్, అతని భార్య వింధ్య వెళ్తామన్నారు కదా" "ఊఁ. అనుకోకుండా నిన్న రాత్రి అరుణ్ వాళ్ల అమ్మగారిని హాస్పిటల్ లో చేర్చాల్సివచ్చింది. అరుణ్ ఇప్పుడు అక్కడే, తల్లి దగ్గరే ఉన్నాడు. బహుశా మన కార్యక్రమానికి కూడా రాలేక పోవచ్చు." "అరెరే... ఇప్పుడెలా? ఏ హాస్పిటల్? నేను వెళ్లి చూసి వస్తాను" అంది చైత్ర. "నేను వెళ్లి చూసి వచ్చాను. మన కార్యక్రమం గురించి అరుణ్ ఆందోళన పడుతూ ఉంటే నేను చూసుకుంటాను, ఈ విషయం మర్చిపోయి, వాళ్ల అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోమన్నాను. టెస్టులు చేస్తున్నారు. డాక్టర్ కి చెప్పి వచ్చాను." "మరి రేపటి విషయం?" "అదే ఆలోచిస్తున్నాను..." "ఒక పని చెయ్యనా... నేను అరుకు వెళ్తాను.. మీరు తర్వాత రావచ్చు." అంది చైత్ర. "మంచి ఐడియా. ఉదయం నుంచి ఏమి తోచలేదనుకో... థాంక్యూ చైత్రా.. ఎవరిని పంపాలో, ఎవరికి ఈ బాధ్యత అప్పగించాలో తెలియక తెగ టెన్షన్ పడుతున్నాను" రిలీఫ్ గా ఫీల్ అవుతూ చెప్పాడు సాకేత్. "సరే ఎప్పుడు బయలుదేరాలి? "అడిగింది చైత్ర. "రేపు ఉదయం ఫ్లైట్ కి నీకు టికెట్ బుక్ చేస్తాను. పిల్లల్ని తీసుకుని నేను ఒకరోజు ముందు వస్తాను" "సరే. ఈలోగా ఇన్విటేషన్లు పూర్తిచేసి, అందరికి మెయిల్ చేసేస్తాను." "సరే బై డార్లింగ్" "బై" చెప్పేసి ఫోన్ పెట్టేసి పనిలో మునిగింది చైత్ర. ******************************************* “దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 12728 హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ ఫారం పై బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది, యాత్రిగాన్ కృపయా….” ఏసీ 2 టైర్ బోగి ముందు నిలబడి చార్టులో పేర్లు చూసాడు చైతన్య. తనతో పాటు ప్రయాణించేది కుమార్... నిరాశగా పెదవి విరుస్తూ, మిగతా పేర్లు కూడా చూసి, కంపార్ట్మెంట్ లో అడుగుపెట్టాడు. పెట్టెలో తనతో పాటు ఉన్న కుమార్ ఓసారి తలెత్తి చూసి, మళ్ళీ మొబైల్ లో మునిగిపోయాడు. చైతన్యకి నాలుగేళ్ళ కిందటి విశాఖపట్నం ప్రయాణం గుర్తుకువచ్చింది. చైత్ర, అదే చైతన్య అనే పేరున్న అమ్మాయి హడావిడిగా తన పెట్టెలోకి ఎక్కింది. తమ సూట్కేసులు, పేర్లు, అభిరుచులు అన్ని కలిసాయి. జర్నలిస్ట్ అయిన తన కలం పేరు చైత్ర కావడం యాదృచ్చికం. ప్రయాణం సరదాగా జరిగింది. ఆఖరుగా ఫోన్ నెంబర్ కూడా తీసుకోకుండా, కనీసం షేక్ హాండ్ ఇచ్చుకోకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇప్పుడు అవి అన్నీ గుర్తుకొచ్చాయి. నిజానికి అప్పటి నుండి విశాఖపట్నం ప్రయాణించే ప్రతిసారి తాను విమానం ఎక్కడం మానేశాడు. అదే ట్రైన్, అదే భోగి రిజర్వేషన్ చేయిస్తున్నాడు. కరోనా వలన రెండేళ్లు ఎక్కడికి వెళ్లనే లేదు. వెళ్లిన ప్రతిసారి మళ్ళీ చైత్ర కనిపిస్తుందేమో అని ఆశగా చూస్తాడు. ఎక్కువసేపు రైలు ఆగే అవకాశం ఉన్నచోట, అన్ని బోగీలు తిరిగి చూస్తాడు. ప్రతి ప్రయాణంలోనూ ఆమెని తలచుకుంటాడు. ఈసారి కూడా నిరాశే మిగిలింది... నిట్టూరుస్తూ తనతో తెచ్చుకున్న పుస్తకం తెరిచాడు. కళ్ళు అక్షరాలను చూస్తున్నా, విషయం బుర్రలోకి ఎక్కడం లేదు. *********************** చైత్ర విశాఖపట్నం విమానాశ్రయంలో దిగేసరికి , ఈవెంట్ మేనేజర్ దశరధ్ సిద్ధంగా ఉన్నాడు. బొకే ఇచ్చి ఆహ్వానించి, ‘చైత్ర స్వయంగా ఏర్పాట్లు చూసుకోడానికి రావడం ఆనందంగా ఉందని’ చెప్పాడు. చైత్ర అన్యమనస్కంగా ఊఁ కొట్టి, కారులో కూర్చుంది. చైత్ర ఏమి మాట్లాడకపోవడంతో మౌనంగా డ్రైవర్ పక్కన కూర్చుని, కార్ పోనివ్వమన్నాడు దశరధ్. చైత్ర కళ్ళు మూసుకుంది. నాలుగేళ్ళ కిందటి విశాఖపట్నం ప్రయాణం జ్ఞాపకం వచ్చింది. నిన్న సాకేత్ అరుకు వెళ్లాలని చెప్పినపుడే ‘తనకి ఇవాళ ఫ్లైట్ కాదు, నిన్న సాయంత్రం గోదావరి ట్రైన్ కే రిజర్వేషన్ చేయించమని చెప్పాలి’ అనుకుంది. కానీ ఏదో బిడియం ఆవహించింది. ఆ ప్రయాణంలో యాదృచ్చికంగా చైతన్యను కలిసింది. అతని కలంపేరు చైత్ర కావడం, తమ అభిరుచులు, ఆసక్తులు ఒకటి కావడం అన్నీ కళ్ళ ముందు కనిపించాయి. మళ్ళీ మరోసారి కలిస్తేనే ఫోన్ నెంబర్ ఇచ్చి పుచ్చుకుని, పరిచయం పెంచుకోవాలని అనుకుని, విడిపోయారిద్దరూ... ******* "మేడం, చేరుకున్నాం" దశరధ్ పిలుపుతో కళ్ళు విప్పింది చైత్ర. హిల్ వ్యూ హోటల్ ముందు కారు ఆగి ఉంది. డ్రైవర్ బాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. దశరధ్ ని అనుసరించింది చైత్ర. రూమ్ చూపించి, " మేడం మీరు కాఫీ తాగి కాసేపు రిలాక్స్ అవండి. ఈలోగా మా సెక్రటరీ వచ్చి మిమ్మల్ని సైట్ కి తీసుకువెళ్తుంది. నేను ఇప్పుడే వెళ్తున్నాను." అని చెప్పి దశరధ్ వెళ్లిపోయాడు. కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుని, ఆలోచనలు అన్నీ తరిమేసి, తమ ప్రాజెక్టు పని గురించి ఆలోచించింది. అరుణ్ వచ్చి ఉంటే ఏమేమి చేసి ఉండేవాడో, అన్నీ ప్రణాళికా బద్దంగా రాసి పెట్టుకున్నాడు. ఆ పుస్తకం ఇప్పుడు తనకు ఉపయోగపడింది. ఒకసారి అన్ని చూసుకుంది. రూమ్ బోయ్ కాఫీ తీసుకు వచ్చాడు. కాఫీ తాగేలోపు, దశరధ్ సెక్రెటరీ కీర్తన వచ్చింది. చక్కని కలుపుగోలు అమ్మాయి. చైత్రని ఈవెంట్ జరిగే స్థలానికి తీసుకువెళ్ళింది. ఏర్పాట్లన్నీ వివరించింది. అరుణ్ రాసిన ప్రకారం అన్ని అమరుస్తూ ఉన్నారు. కొన్ని మార్పులను సూచించింది. "రేపు సాయంత్రానికి అన్ని పూర్తి అయిపోతాయి మేడం. ఎల్లుండి ఉదయం నుంచి మన కార్లు నాలుగు వైజాగ్ విమానాశ్రయంలో వేచి ఉంటాయి. అతిధులు ఎవరు ఏ ఫ్లైట్ లో వచ్చేది మనకు ముందుగానే చెప్పడం వలన ఆహ్వానం ఏర్పాటు చేసాం. ఇక్కడ, ట్రీ హౌస్ లలో వారికి విడిది ఏర్పాటుచేసాం. విహార స్థలాలు చూపించడానికి, విందు భోజనాలకు, ప్రత్యేకించి అరకులో మాత్రమే లభించే వంటకాలు, మరికొన్ని గ్రామీణ వంటలతో భోజనం, స్థానికంగా లభించే వివిధ రుచుల కాఫీలు, ఇతర పానీయాలు, చిరుతిళ్ళు (స్నాక్స్) కూడా ప్రాంతీయంగా లభించే వాటినే, మన షెఫ్ లతో, ఇక్కడి వారి పర్యవేక్షణలో వండిస్తున్నాం. రాత్రి కాంప్ ఫైర్, స్థానిక థింసా నృత్యాలు ఏర్పాటుచేసాం" అంటూ గుక్క తిప్పుకోకుండా వల్లెవేశాడు దశరధ్. చిరునవ్వుతో తల పంకించింది చైత్ర. "ఎల్లుండి మన కంపెనీ విశాఖపట్నం బ్రాంచి ప్రారంభోత్సవం ఇక్కడి నుంచే ఆన్లైన్ లో జరుగుతుంది. ఆహ్వానితులందరిని వేదిక మీదకు తీసుకురావడానికి స్థానిక గిరిజన యువతులను నియమించింది కీర్తన. అందరూ వారి సంప్రదాయ వస్త్రధారణతో హాజరవుతారు. ఆ ఏర్పాట్లు, శిక్షణ, కీర్తన స్వయంగా చేస్తోంది" అంటూ మెనూ, ప్రోగ్రాం వివరాలు అందించాడు దశరధ్. తనకు మనసులో మెదులుతున్న ఆలోచనలు కీర్తనకు కూడా రావడం కించిత్ సంతోషాన్ని కలిగించింది. అన్నీ పరిశీలించింది. మధ్యాహ్నం సైట్ లోనే భోజనం పూర్తిచేసింది. సాయంత్రం రూంకి వెళ్లి భర్తకి మెయిల్ చేసింది. జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకేమైనా సలహాలిస్తాడేమో అడిగి, మెయిల్ పూర్తిచేసి, లాప్ టాప్ మూసి లేచింది. అలసటగా అనిపించి, రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసి అరగంటలో కాఫీ పంపమని చెప్పింది. స్నానం పూర్తిచేసి, లేత నీలం ఆర్గండి వాయిల్ చీర కట్టుకుని తయారయ్యే సరికి కాఫీ వచ్చినట్లు బాయ్ తలుపు తట్టాడు. కీర్తనకు ఫోన్ చేసి, కాఫీకి రమ్మని ఆహ్వానించింది. పసుపు రంగు చుడిదార్ లో వచ్చింది కీర్తన. "అరె భలే ఉన్నావే... ఫ్రెష్ గా గులాబీలా".. అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. కాస్త సిగ్గుపడి "థాంక్యూ మేడం" అంటూ, కాఫీని కప్పులలో నింపి చైత్ర ముందు పెట్టింది. "నువ్వు కూడా తీసుకో" అంటూ, "కీర్తనా... ఈ మధ్య ప్రయాణాలలో నాకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి" అని చెప్పడం ఆపి, "ఇదేంటి, పరిచయం లేని ఆవిడ కాఫీకి పిలిచి, ఏవో కథలు చెప్తోంది అనుకుంటున్నావా?" అంది చైత్ర. "అబ్బే అదేం లేదు మేడం చెప్పండి. ఈ రోజు ఇక్కడ వాతావరణం బావుంది. పైగా నాకు కంపెనీకి మీరు వచ్చారు. ఈ రెండు రోజులు పని అయిపోయాక గదికే పరిమితమై పోయాను. నిజానికి నేనే మిమ్మల్ని టీ కి ఆహ్వానిద్దామని అనుకున్నాను. మీ నంబర్ నా దగ్గర లేదు. అందుకే పిలవలేకపోయాను. చెప్పండి మేడం, ప్రయాణ విశేషాలు, వింత అనుభవాలు" అంది కీర్తన. " మేడం అనకు, చైత్ర అను చాలు... " "సరే చైత్ర" "నాకు ఈ మధ్య ప్రతి ప్రయాణంలో నా కుటుంబంలో పరిచయం ఉన్న పేరున్న వ్యక్తులే కలుస్తున్నారు.. " "అవునా" సంభాషణ ఎటు వెళ్ళేదో కానీ, "కీర్తనా" అని పిలుస్తూ, దశరధ్ గొంతు బయట వినిపించింది. "ప్లీజ్ లోపలికి రండి దశరధ్" ఆహ్వానించింది చైత్ర. దశరధ్ కి కూడా కప్ లో పోసి కాఫీ అందించింది కీర్తన. "సారీ మేడం, కీర్తనతో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకి వద్దామనుకున్నాను. కానీ ఇద్దరూ ఒకే చోట దొరికారు" అన్నాడు దశరధ్ కప్పు అందుకుంటూ… "కీర్తనా, ఆహ్వానించే అమ్మాయిలకు చీరలు తీసుకోవాలి అనుకున్నాం కదా, రేపు వెళదామా" అడిగాడు దశరధ్. "సరే సర్" మరి కాసేపు మాట్లాడి, చెక్కులపై చైత్ర సంతకాలు తీసుకుని, డిన్నర్ లో కలుద్దామని చెప్పి, దశరధ్ వెళ్ళిపోయాడు. కీర్తన కూడా బయలుదేరింది. ********* మర్నాడు ఉదయం దశరధ్, కీర్తన వైజాగ్ వెళ్లారు. ఆహ్వానితులను తీసుకువచ్చే అమ్మాయిలకు, వారి సంప్రదాయానికి తగిన చీరలు కొనడం కోసం. మధ్యాహ్నాని కల్లా వచ్చేస్తామని చెప్పి వెళ్లారు. చైత్ర సైట్ కు వెళ్ళింది. అతిథులకు కేటాయించిన ట్రీ హౌస్ లలో సౌకర్యాలు మరోసారి పరిశీలించింది. కరెంటు పోతే జనరేటర్, తాగునీరు, ఏసీ, సౌఖ్యం గా ఉండే పడకలు, చిన్న ఫ్రిజ్, మరుగు గది, ఇలా ఓ రెండు రోజులు ఉండడానికి కావలసిన సదుపాయాలన్ని చేయబడ్డాయి. వచ్చేది విదేశీయులు, ప్రవాస భారతీయులు. అందుకే ఈ ఏర్పాట్లు. డ్రైవర్ స్థానికంగా దొరికే కుంకుడు పూవుల తేనె తీసుకు వస్తానని వెళ్ళేడు. సైట్ నుంచి హోటల్ అట్టే దూరం లేకపోవడంతో నడుచుకుంటూ బయలుదేరింది చైత్ర. పది నిమిషాల్లో హోటల్ కు చేరి, స్నానం చేసి, లంచ్ కు డైనింగ్ హాల్ కు వచ్చింది. సరైన స్థలం కోసం కళ్ళు వెదుకుతూ, ఒకచోట ఆగిపోయాయి. నిజమా కలా అనుకుంటూ పరికించి చూసింది. అటునుంచి ఓ వ్యక్తి చేయి ఎత్తి "హాయ్" చెప్పాడు. "చైతన్యా" నమ్మలేనట్టు పిలుస్తూ అటు వెళ్ళింది. "ఎస్ మిసెస్ చైతన్యా సాకేత్... నేనే... " పలకరించాడు చైతన్య. "వాటే సర్ప్రైజ్ మీరేంటి ఇక్కడ... ఇలా..." ఆశ్చర్యపోతూ అడిగింది చైత్ర. "నేను ఒక న్యూస్ కవరేజ్ కోసం ఇలా వచ్చాను. రెండు రోజులై ఇక్కడే ఉన్నాను. ఇక్కడే అంటే కొండల్లో తిరుగుతున్నాను." అన్నాడు చైతన్య. "థాంక్ గాడ్... మళ్ళీ మనం కలుస్తామనుకోలేదు..." చైత్ర సంబరంగా అంది. "సరే మనం భోజనం చేస్తూ మాట్లాడుకుందాం" అన్నాడు చైతన్య… "ఇంకేం భోజనం... ఆనందంతో మనసు నిండిపోయింది" గొణుక్కుంది చైత్ర. "ఊఁ చెప్పండి చైత్ర.. ఎలా ఉన్నారు? మీరు మళ్ళీ వైజాగ్ వచ్చారా?" అడిగాడు చైతన్య. "లేదు, ఆ రోజు తర్వాత మళ్ళీ ఇదే రావడం. నిన్న ఉదయం ఫ్లైట్ కి వచ్చాను" చెప్పింది చైత్ర. "హ హ.. " నవ్వాడు చైతన్య... “మొన్న నేను గోదావరిలో బయలుదేరాను... చెప్పాడు చైతన్య. "అరెరే నేను కూడా ఆ ట్రైన్ కే బయలుదేరుదా మనుకున్నా... కానీ కొన్ని పనులు వలన నిన్న ఉదయం ఫ్లైట్ కి బయలు దేరాను" చెప్పింది చైత్ర. "ఇంకేమిటి విశేషాలు?" ప్రశ్నించింది చైత్ర. "పెళ్లి చేసుకున్నారా?" "పెళ్లి అయింది చైత్ర గారు... మనం కలిసి నాలుగేళ్లు అవుతోంది కదా... విడిపోయే ముందు మనం అనుకున్న మాట మీకు జ్ఞాపకం ఉందా...?" భోజనం పూర్తిచేసి, రిసెప్షన్ దగ్గరున్న సోఫాలో కూర్చున్నారు ఇద్దరూ… "ఎందుకు లేదు? మళ్ళీ మనం కలిస్తేనే ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకోవడం, మన పరిచయం పెరగడం అనుకున్నాం" చైత్ర హాండ్ బాగ్ తెరవడం, చైతన్య తన కాంప్ బాగ్ తెరవడం ఒకేసారి జరిగాయి. ఇద్దరూ ఫక్కున నవ్వారు. "ట్విన్ ఫ్లేమ్స్". పుస్తకం ఒకటి బయటకు తియ్యబోతూ ఆగి అడిగాడు చైతన్య. "మీరేమిటి తీస్తున్నారు?" చైత్ర నవ్వి, “మీరు తీస్తున్నదే” అంది. ఇద్దరూ పాకెట్ సైజ్ నోట్ బుక్ తీశారు. ఒక చిన్న అనుమానం తలెత్తింది ఇద్దరిలో... "మీకు నా నెంబర్ తెలుసు కదా.." అన్నాడు చైతన్య. "ఊఁ. ఇండియా టుడే వ్యాసాలలో వ్యాసకర్త పేరుతో పాటు నెంబర్ కూడా వేస్తారని, మీరు చైత్ర పేరు చూపించినపుడే తెలిసింది. తర్వాత కొన్ని నెలలు వరుసగా ఇండియా టుడే తెప్పించాను. ఒక నెలలో మీ వ్యాసం వచ్చింది. ఫోన్ నెంబర్ రాసి పెట్టుకున్నాను. అది సరే మీకు నా నెంబర్ ఎలా దొరికింది?" ఆసక్తిగా అడిగింది చైత్ర. "నేను జర్నలిస్టునండి.. విషయ సేకరణ నా పని. మీ భర్త పేరు, పనిచేసే కంపెనీ పేరు మీరు చెప్పేరు... మీ నెంబర్ తెలుసుకోవడం కష్టమా... నేను హైదరాబాద్ తిరిగి వెళ్ళేసరికే మీ నెంబర్ దొరికేసింది. ఫోన్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఒప్పందం గుర్తొచ్చి ఆగిపోయాను" చెప్పాడు చైతన్య. "మీకు ఒక విషయం తెలుసా చైత్రా! ఇప్పటికి నాలుగైదుసార్లు వైజాగ్ వచ్చాను. వచ్చిన ప్రతీసారి, అదే రైలు, అదే బోగి... మీరు కనిపిస్తారనే ఆశతో... కానీ నిరాశగానే ప్రయాణం ముగిసేది. ఈసారి బయలుదేరేటపుడు ‘ఇదే ఆఖరు, చైత్ర కనబడక పోతే మరి జన్మలో ఈ రైలు ఎక్కను’ అని ప్రతిజ్ఞ చేసి మరీ రైలు ఎక్కేను. ఊహు... మీరు లేరు... ఎంత దిగులుగా అనిపించిందో" చెప్పాడు చైతన్య. ఫ్లైట్ దిగగానే తన మనసులో కలిగిన భావాలు కూడా చెప్పింది చైత్ర. మాటల్లో ఇద్దరికి సమయం తెలియలేదు. మూడయ్యింది. కీర్తన ఫోన్ చేసింది. ‘చీరల బేల్ రాలేదు కాబట్టి ఆలస్యం అయిందని, మిగిలిన జ్ఞాపికలు కొనేసామని, బయలుదేరుతున్నా’మని చెప్పింది. ‘సరే’ అని ఫోన్ పెట్టేసి, "సైట్ సీయింగ్ కి వెళదామా " అంది. "సరే పదండి, మీ సెక్రెటరీ వచ్చేవరకు మ్యూజియం చూసి వద్దాం" అన్నాడు చైతన్య. "నా సెక్రటరీ కాదు, ఈవెంట్ ఆర్గనైజర్ దశరధ్ గారి సెక్రెటరీ.." అంది చైత్ర. హాండ్ బాగ్ లో నుండి ఇన్విటేషన్ తీసి ఇచ్చింది. "ఓ నైస్" అన్నాడు తెరచి చూసి… కాసేపు బయట తిరిగి వచ్చారు. లోకంలో కబుర్లన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అరుకు స్పెషల్ కాఫీ తాగారు. ఏవేవో బొమ్మలు కొన్నారు. "మేడం, మేము హోటల్ దగ్గరకు వచ్చేసాం" కీర్తన ఫోన్ చేసింది.. ఇద్దరూ హోటల్ కి చేరుకున్నారు. అప్పటికే దశరధ్, కీర్తన రూమ్ లకు వెళ్లిపోయారు. చైతన్యను తన రూంకి ఆహ్వానించాలా వద్దా అని డైలమా లో పడింది చైత్ర. సందిగ్దానికి తెర వేస్తూ, "మనం డిన్నర్ లో కలుద్దాం.. " అని చెప్పేసి, చకచకా బయలుదేరాడు చైతన్య. చైత్ర తన రూమ్ కేసి వెళ్ళిపోయింది. కీర్తనకు, దశరధ్ కు ఫోన్ చేసి, తన రూం కి రమ్మని చెప్పింది. వాళ్లిద్దరూ వచ్చాక, ఆరోజు జరిగిన కార్యక్రమాలు, చేయవలసిన పనులు సరి చూసుకున్నారు. సైట్ లో పనిచేస్తున్న అబ్బాయిలను పిలిచి, తగిన సూచనలు ఇచ్చారు. దశరధ్, కీర్తనలను డిన్నర్ కు ఆహ్వానించింది చైత్ర. ********* డిన్నర్ సమయానికి డైనింగ్ హాల్ కి చేరుకుంది చైత్ర. మరో 5 నిమిషాల్లో దశరధ్ వచ్చాడు. చైతన్య కోసం ఎదురుచూస్తోంది చైత్ర. ఇంతలో కీర్తన నుంచి ఫోన్... ‘ఆలస్యానికి మన్నించమని కోరుతూ, 5 నిమిషాల్లో వస్తున్నట్లు’ చెప్పింది. ద్వారం వైపు చూస్తోంది చైత్ర. చైతన్య వస్తున్నాడు. రాగానే, "మై ఫ్రెండ్ చైతన్య" అని దశరధ్ కి, "మా ఈవెంట్ ఆర్గనైజర్ దశరధ్" అని ఇద్దరికి పరిచయం చేసింది. ఇద్దరూ షేక్ హాండ్ ఇచ్చుకున్నారు. కీర్తన కూడా వచ్చింది. "మై ఫ్రెండ్ చైతన్య" అని కీర్తనకు పరిచయం చేసింది చైత్ర. కీర్తన తెల్లబోయింది. ఇంతలో చైతన్య... "చైత్ర గారూ... నా భార్య కీర్తన" అని నవ్వుతూ చైత్రకు కీర్తనను పరిచయం చేశాడు. ఇప్పుడు తెల్లబోవడం చైత్ర వంతు అయ్యింది. "చైతన్యా ఇది అన్యాయం, కీర్తన మీ భార్య అని మీరు ముందే ఎందుకు చెప్పలేదు" అంది చైత్ర. "కూల్ చైత్రా... అంతే కాదు, దశరధ్ నా క్లోజ్ ఫ్రెండ్" అన్నాడు చైతన్య. "ఓ మై గాడ్.. మరి ఏమి తెలియనట్లు అలా పలకరించుకున్నారు" ఉక్రోషంగా అంది చైత్ర. "అబ్బే... మీకు, కీర్తనకు చిన్న సర్ ప్రైజ్ ఇద్దామని. కీర్తనా, ఈవిడ అసలు పేరు చైతన్య. మేమిద్దరం ఇంతకు ముందు ఒకసారి ప్రయాణంలో కలిశాం. ఇద్దరి పేర్లు ఒకటే అని అనుకున్నాం అప్పుడు. కానీ ఆ తర్వాత మా పరిచయం కొనసాగలేదు. చైత్ర గారూ, దశరధ్ నాకు చాలా కాలంగా స్నేహితుడు. అతని ద్వారానే కీర్తన నాకు పరిచయమయ్యింది. ఆ తర్వాత మేం వివాహం చేసుకున్నాం. అరుకులో ఈవెంట్ అంటే ఎవరిదో అనుకున్నాను. నేను కీర్తన బాధ్యతల విషయంలో ఎప్పుడూ ప్రశ్నించను. ఇక్కడికి వాళ్ళని కలవడానికే వచ్చాను. వాళ్లిద్దరూ వైజాగ్ వెళ్లారని తెలిసి, డైనింగ్ హాల్ కి వస్తే మీరు కనిపించారు... చాలా ఆశ్చర్యం అనిపించింది. మీ ఇన్విటేషన్ చూస్తే, మావాళ్ళు చేస్తున్న ఈవెంట్ మీదే అని అర్ధమయ్యింది. ఇప్పుడు మీకు surprise ఇద్దామని ఈ కాసేపు తెలియనట్లు ఊరుకున్నాను. అసౌకర్యం కలిగితే మన్నించండి చైత్ర గారూ.." అన్నాడు చైతన్య... చైత్ర నవ్వేసింది. "గడుసువారే... మీకేనా సర్ప్రైజ్ చేయడం వచ్చు.. నాకు రాదా?" అంది చైత్ర. అందరూ చైత్ర వైపు ప్రశ్నర్ధకంగా చూసారు… "కీర్తనా, మీ వారు చైత్ర పేరుతో రచనలు చేస్తారని తెలుసా" అడిగింది... జరుగుతున్నదంతా వినోదంగా చూస్తున్న కీర్తన, "ఈయనని దశరధ్ గారు పరిచయం చేసినప్పుడే, చైతన్య గారు తన వృత్తి వ్యవహారాలు చెప్పేరు" అంది. " భలే ఉంది.. సరే.. రండి భోజనం చేద్దాం..." అంటూ ఉపక్రమించింది చైత్ర. "ఇంతకీ ఇలా ఇద్దరి జీవితాల్లో ఒకే పోలిక ఉంటే ఏమంటారు? " అడిగాడు దశరధ్. "ట్విన్ ఫ్లేమ్స్" అన్నారు చైత్ర, చైతన్య ఒక్కసారే... అందరూ నవ్వుకున్నారు. కబుర్లతో భోజనాలు పూర్తిచేసి, ఎవరి గదులకు వాళ్ళు చేరారు. ****** ఉదయం నుండి అతిధుల రాక మొదలైంది. వచ్చే కార్లు వస్తున్నాయి. వెళ్లే కార్లు వెళ్తున్నాయి. సాకేత్, పిల్లలు ఫ్లైట్ దిగినట్లు ఫోన్ వచ్చింది. దశరధ్, కీర్తన, చైత్రలతో పాటు, చైతన్య కూడా ఎదురుచూస్తున్నాడు వారి రాక కోసం... హోటల్ గేట్ దగ్గర కార్ ఆగింది. గచ్ఛకాయ రంగు సూట్ లో సాకేత్, బాబాసూట్ లో కొడుకు, ఎర్రని మెరిసే గౌన్ లో కూతురు కార్ లో నుంచి దిగారు. దశరధ్ సాకేత్ కు పూలబొకే అందించాడు. చైతన్య తనను పరిచయం చేసుకుని షేక్ హాండ్ ఇచ్చాడు. అందరూ లాంజ్ లోకి వచ్చారు. "సాకేత్... నాలుగేళ్ళ క్రితం నాకు గోదావరిలో పరిచయమైన చైతన్య ఈయనే" అంటూ చెప్పింది చైత్ర. "ఓహ్... జర్నలిస్ట్ చైత్ర కదూ.." నవ్వేసాడు సాకేత్... "ఈవెంట్ ఆర్గనైజర్ దశరధ్ మీకు తెలుసుగా... ఆమె దశరధ్ సెక్రెటరీ, ఇంకా చైతన్య భార్య అయిన కీర్తన..." చెప్పింది చైత్ర... "భలే ఉందే" అన్నాడు సాకేత్… "ఇదిగో మా అబ్బాయి సంగీత్, మా అమ్మాయి *కీర్తన"* పరిచయం చేసింది చైత్ర... *ట్విన్ ఫ్లేమ్స్* అన్నారు అందరూ ఒకేసారి... *****