చలిచీమలు కాదు - జి.ఆర్.భాస్కర బాబు

Chalicheemalu kaadu

కిరణ్, కిరణ్మయి ప్రయాణ సన్నాహాల్లో హడావిడిగా ఉన్నారు . ‌బైట తలుపు చప్పుడు అయింది. ఎవరా అని అని తలుపు తీసేసరికి శర్మిష్ట . ఆమె కిరణ్మయిని పట్టుకుని ఏడవసాగింది. “ఏమయింది శర్మిష్టా, ఎందుకు ఏడుస్తున్నావు”అడిగింది కిరణ్ కిరణ్మయి. “అక్కా, వాడు మళ్ళీ వచ్చాడక్కా.. నన్ను నానా యాగీ చేస్తున్నాడు, చూడు ఎలా కొట్టాడో”వెక్కి వెక్కి ఏడుస్తూనే చెప్పింది శర్మిష్ఠ. కిరణ్ వంక చూసింది కిరణ్మయి.అతను తల అడ్డంగా ఊపాడు.ఆసైగ అర్ధం అయింది కిరణ్మయి కి.కాని ఆమె మనసు ఒప్పుకోలేదు శర్మిష్ఠ ను ఆ పరిస్థితిలో వదిలి వెళ్లటానికి. కిరణ్ ఆఫీసు టూర్ మీద ముంబాయి వెళుతున్నాడు. అతను ఆ కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ కాబట్టి భార్యను కూడా తనతో పాటు తీసుకువెళ్ళవచ్చు.ఎప్పటి నుండో అడుగుతోంది కిరణ్మయి ముంబాయి తీసుకెళ్ళమని. నిజాంపేటలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఫ్లాట్ లో ఉంటున్నారు కిరణ్మయి దంపతులు.కిరణ్ ఆఫీసుకి వెళ్లి రావడానికి వీలుగా ఉంటుందని అక్కడ ఉంటున్నారు. శర్మిష్ఠ వాళ్ళ ఇంటికి రెండిళ్ళ అవతలే ఉంటుంది.ఆమె భర్త దినేష్ కూడా మంచి ఉద్యోగమే చేస్తున్నాడు.ఉద్యోగం సంగతేమోకాని అతనికి లేని చెడు అలవాటంటూ లేదు.పని శ్రద్ధగా చేస్తాడు కాబట్టి అతని కంపెనీ వాళ్ళు పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. శనివారం, ఆదివారం శెలవులు కావటంతో ఇంకా అతని ఆగడాలకు అంతే ఉండదు. ఫ్లయిట్ లో వెళ్ళటానికి టిక్కెట్లు బుక్ చేశాడు కిరణ్. ఇంకా మూడు గంటల సమయం ఉంది వాళ్ళు ఫ్లయిట్ ఎక్కటానికి.కిరణ్ అసహనం గా చూడటం గమనించింది కిరణ్మయి. “ఒక్క పదినిమిషాలు వెళ్ళి వద్దామండీ.వాడు మళ్ళీ ఏమయినా చేస్తే శర్మిష్ఠ ఇబ్బందులపాలవుతుంది”, అంది కిరణ్మయి. మెల్లగా అన్నాడు కిరణ్ “ప్రతిసారీ వాళ్ళ సొంత విషయాల్లో మనం ఎందుకు జోక్యం చేసుకోవటం?ఇలా మనమీద వాలిపోతే ఎలా?” ఆ మాటలు శర్మిష్ట విననే వింది. “అక్కా నేను రావటం మీకు ఇబ్బందిగా ఉంటే సారీ అక్కా”అంది “అబ్బెబ్బే.. అదేం లేదమ్మా, ప్రయాణం హడావిడిలో ఉన్నాం.అంతకుమించి మరేం లేదు.కిరణ్ ఒక్క సారి వెళ్ళిరా, విషయం ఏమిటో తెలుస్తుంది”అన్నాడు. ఇద్దరూ కలిసి శర్మిష్ట ఇంటికి బయలుదేరారు. “అక్కా, నాకు భయం వేస్తోంది”అంది శర్మిష్ట. “అంతే భయపడితే ఎలా,పది అసలు చూద్దాం ఏం అవుతుందో”అంది కిరణ్మయి. ఇల్లు చేరుకునేసరికి దినేష్ బాగా తాగేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. కిరణ్మయి ని చూడగానే మరీ రెచ్చిపోయి అరవసాగాడు “ఈ బుధ్ధితక్కువది నిన్ను తీసుకొని వచ్చిందా? ఏంచేస్తావు నువ్వు ?పోయి నీ మొగుడితో ఉండు మా విషయాల్లో కల్పించుకునేందుకు చూడమాకు” “ఏయ్ ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతూందా, నువ్వు ఇట్లాగే గొడవ చేస్తే పోలీసు ని పిలుస్తాను జాగ్రత్త. వాళ్ళయితేనేగాని మక్కెలిరగతీసి తిన్నగా చైరు.పిచ్చివేషాలువేస్తే మర్యాదగా ఉండదు”అంది కిరణ్మయి. “ఏంటే వాగుతున్నావ్,అసలిది మాటకుముందు నీదగ్గరకు ఎందుకొస్తోంది,ఏవే,దీనింటికి ఎందుకెళ్ళావ్ నిన్ను ఏం చేసినా పాపం లేదు”మీద మీదకు రాసాగాడు. “దగ్గరకు వచ్చావంటే ఊరుకోను”అంటూ గట్టిగా అరిచింది కిరణ్మయి. మెల్లగా ఇంటిబైట జనాలు పోగవుతున్నారు.కొంతమంది వినోదంగా చూస్తున్నారు. “నీ……ఏంచేస్తావే..”అంటూ మీదకు రాబోయి మత్తు బాగా ఎక్కిందేమో కింద పడిపోయాడు దినేష్. ఫోన్ రింగ్ అవుతూంది.. కిరణ్ ఫోన్ చేస్తున్నాడు.ఫ్లయిట్ టైం అవుతూంది.కిరణ్మయికిఏం చేయాలో పాలుపోవడం లేదు. ఫోన్ తీసి “హలో కిరణ్,వీడు ఇక్కడ బాగా గొడవ చేస్తున్నాడు.ఏంచేయాలో తోచటం లేదు”అంది కిరణ్మియి. “నేను నిన్ను వెళ్ళవద్దని చెపుతూనే ఉన్నాను కదా.వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకుంటారు, నీవు ఏదొకటి చెప్పి వచ్చేసెయ్”కిరణ్ చెప్పాడు. “సరే…నేను మానేజ్ చేస్తానులే”కిరణ్మయి అంటూండగానే ఆ గేటెడ్ కమ్యూనిటీ సెక్రటరీ ఆనందరావు తన దగ్గరకు వస్తూ కనిపించాడు. “ఏంటి మేడం ఏంటి విషయం, మళ్ళీ ఇతను గొడవ మొదలు పెట్టాడా? ఆదివారం వస్తే చాలు ఇతను బిగ్గెస్ట్ న్యూసెన్స్ గా తయారయ్యాడు.”అన్నాడతను. “అవును సర్, మేం ఏర్ పోర్ట్ కు బయలుదేరాలి,మీరు కాస్త శర్మిష్ట ను కనిపెట్టి ఉండగలరా, మళ్ళీ మేం బుధవారం ఉదయం కల్లా వచ్చేస్తాం.తనను ఇలా వదిలి వెళ్లటానికి మనసొప్పడం లేదు.కానీ ప్రయాణం కూడా వాయిదా వేయలేం”అంది కిరణ్మయి. “సరే మీరు వెళ్లి రండి.ఇక్కడ విషయం నేను చూసుకుంటాను.కాని మీరు శర్మిష్ట గారికి చెప్పి వెళ్ళండి.మళ్ళీ ఆమె నామీద కారాలు మిరియాలు నూరుతుంది.”ఆన్నాడు ఆనందరావు. “శర్మిష్టా నేను బయలు దేరాలి, ఆనందరావు గారు నీకు ప్రొటెక్షన్ ఇస్తారు.మళ్ళీ నేను బుధవారం ఉదయం కల్లా ఇక్కడ ఉంటాను”అని బయలుదేరబోయింది కిరణ్మయి. “అక్కా”అంటూ ఆమెను చుట్టేసుకుని బిగ్గరగా ఏడవసాగింది శర్మిష్ట. “మరీ అంత బేలగా ఉండకూడదు శర్మిష్టా”అంది అనునయంగా “నేను లేకపోయినా ఇక్కడ ఉన్న అందరూ నీకు సపోర్ట్ గానే ఉంటారు.కావాలంటే మా ఫ్లాట్ తాళం నీకు ఇచ్చి వెళ్తాను, పనిమనిషిని నీకు తోడుగా ఉంచి వెళతాను.” “సరే అక్కా.. ఏదయితే అది అవుతుంది, మీరు వెళ్లి రండి”అంది శర్మిష్ట “మళ్ళీ అతను లేస్తే అల్లరి ఎక్కువ అవుతుంది” వడి వడి గా ఇంటికి వెళ్ళింది కిరణ్మయి.ఆ సరికే కిరణ్ సిద్ధంగా కూర్చుని ఉన్నాడు. “ఐనాయా తమరి పంచాయతీలు, మనకెందుకు చెప్పు ఈ గోల? మనకున్న తలనెప్పులు చాలవా? ముందు మనం సంగతి ఆలోచించు మనకెవరు సలహాలిస్తారు? మనకి ఇంకా పిల్లలు పుట్టలేదని నలుగురూ నానా రకాలుగా అనుకుంటున్నారు.సమాధానం చెప్పలేక చస్తున్నాను.ముఖ్యంగా మా అమ్మ నాన్న “అన్నాడు కిరణ్. ముఖం తెల్లగా పాలిపోయింది కిరణ్మయికి. ఏంమాట్లాడాలో అర్ధం కాలేదు.అసలు ఆ విషయాన్ని అతను ఇప్పుడు ప్రస్తావించటం ఎందుకు? అదేమాట అతనితో అంది.తోకతొక్కిన తాచులా లేచాడు కిరణ్. “ఎందుకు అంత ఉడుక్కుంటున్నావు?నేనన్నదాంట్లో తప్పు ఏముంది? పెళ్ళయి నాలుగేళ్లవుతూంది పిల్లలు పుట్టలేదని ఎంత ఫీల్ అవుతున్నానో నీకేం తెలుసు? అంతా మన ఖర్మ” కిరణ్మయి మ్రాన్పడి చూస్తూ ఉండిపోయింది.ఆ విషయంలో లోపం ఎవరిదో అతనికి తెలియకకాదు.కాని తను ఎప్పుడూ ఆమెనే తప్పులోకి నెడతాడు. కిరణ్మయి ఎవరికీ చెప్పుకోలేని బాధను అనుభవిస్తూంటుంది ఆవిషయంలో.అయినా అతని ముందు ఎప్పుడూ బైటపడలేదు. లోలోపల “లోపం నీలో ఉంచుకుని నన్నంటావేమిటి?”అని నిలదీయాలని ఉంటుందామెకు.”నా ప్రాప్తం ఇంతే”అనుకుని నిబ్బరంగా ఉంటుందామె “ఇప్పుడు అదంతా ఎందుకులే కిరణ్, ఫ్లయిట్ టైం అవుతోంది, క్యాబ్ బుక్ చేయాలి కదా”అంది కిరణ్మయి. కిరణ్ గొణుక్కుంటూనే క్యాబ్ బుక్ చేశాడు. ముంబాయి లో కూడా ముభావంగానే ఉన్నాడు కిరణ్. ముంబాయి లో కిరణ్మయి స్నేహితురాలు అపర్ణ ఉంటూంది.హోటల్ లో చెక్ ఇన్ అయిన తర్వాత సోమవారం ఆమెను కలవాలని ప్లాన్ చేసుకున్నారు. అపర్ణ కూడా వర్క్ చేస్తుంది కాని ఆమె ఇంటి వద్దనుండి పని చేస్తుంది. సోమవారం హోటల్ నుండి అపర్ణకు ఫోన్ చేసింది ఎక్కడ కలుద్దాం అని. “నేనే మీరున్న చోటుకి నేనే వస్తాను.మీరు వెతుక్కుని వస్తే టైం వేస్ట్ అవుతుంది”అని చెప్పింది అపర్ణ. “సరే నేను నీ కోసం ఎదురు చూస్తున్ంటాను.లొకేషన్ పంపుతాను చూడు.హోటల్ రూం లో నేనొక్కదాన్నే ఉంటాను.మావారు ఆఫీసుకు వెళ్తారు కదా.నీవు త్వరగా వస్తే లంచ్ ఇక్కడే చేసేద్దాం”అంది కిరణ్మయి. రెండు గంటల్లో అపర్ణ కిరణ్మయి హోటల్ రూం కి వచ్చేసింది.ఆప్యాయంగా ఆహ్వానించిది కిరణ్మయి.ఎక్కడెక్కడి కబుర్లు దొర్లిపోతున్నాయి వారి మధ్య. అపర్ణ ముఖంలో ఆనందం, చిరునవ్వు కొట్టొచ్చినట్టు కనబడుతున్న ఆత్మ విశ్వాసం …సంభ్రమం గా చూస్తోంది కిరణ్మయి. “ఏంటలా చూస్తున్నావు”అడిగింది అపర్ణ. “నువ్వు చాలా మారిపోయావు, నువ్వు నువ్వే నా అనిపిస్తోంది,ఏమిటీ మాయ!”అంది కిరణ్మయి “అవునా అంతలా మారిపోయానా నేను?”అంది అపర్ణ “ఇదంతా మా వారి ప్రోత్సాహం, సహకారమే” “యూ ఆర్ వెరీ లక్కీ”అంది కిరణ్మయి తన పరిస్థితి ఊహించుకుంటూ. “నాదేముందిలేగాని నీ విషయాలు చెప్పు.మన ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తుంటారా?నీవేమైనా పనిచేస్తున్నావా? ఎన్ని సంవత్సరాలు అవుతోంది మనం కలుసుకుని? కనీసం ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి కూడా కుదర్లేదు.అవన్నీ వదిలెయ్యి.. కనీసం ఇప్పటికయినా కలవగలిగాం, నాకైతే చాలా సంతోషం గా ఉంది ఈ రోజు.”ఉరికే జలపాతంలా మాట్లాడుతూంది అపర్ణ. కిరణ్మయికి ఆమెతో తన మనసు లోని మాటలన్నీ చెప్పుకోవాలని అనిపించింది. కష్టం సుఖం చెప్పుకోగలిగింది స్నేహితులతోనే కదా.అరమరికలు లేని స్నేహం ఎంత గొప్పదో!! దీర్ఘంగా నిట్టూర్చింది అపర్ణ.”నేనొక మాట చెపుతాను విను.నీవు వెంటనే ఓ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయి. జీతం కోసం కాదు, నీకు ముందు కావలసింది నీమీద నీకు నమ్మకం.ఆ నమ్మకం ఆర్ధిక స్వాతంత్ర్యం తోనే మొదలవుతుందని నా అభిప్రాయం.” “నీ సలహాను పాటించటానికి ప్రయత్నం చేస్తాను అపర్ణా”అంది కిరణ్మయి. “మనం చలిచీమలం కాదు కదా ,మన శక్తి ఏమిటో చూపితే లోకమే దాసోహం అంటుంది.చిన్నప్పుడు చదువుకున్న పద్యం ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి’గుర్తుంది కదా.సమస్యలనే సర్పాన్ని మన శక్తి యుక్తులతో ఎదుర్కొని విజయం సాధిద్దాం”చెప్పింది అపర్ణ. అపర్ణ తో గడిపిన ఆ సమయమంతా ఎంతో ఉత్తేజాన్ని పొందినట్లు అనిపించింది ఆమెకి. ఆ సాయంత్రం వరకు అపర్ణ కిరణ్మయి తోనే గడిపింది. మీటింగులు ముగించుకుని కిరణ్ హోటల్ రూం కి వచ్చేసరికి రాత్రి అయింది.అతను ఇంకా అంటీ ముట్టనట్టే ఉన్నాడు. రెండు మూడు సార్లు అతన్ని “ఏంటి అలా ఉన్నావు”అని అడిగింది కిరణ్మయి. “అబ్బే ఏంలేదు.. ఆఫీసు టెన్షన్ అంతే”అన్నాడు కిరణ్. “అంతేనా ఇంకా మొన్న జరిగిన విషయం ఇంకా గుర్తుపెట్టుకున్నావా?” “పద అలా ఇండియా గేట్ దాకా వెళ్లివద్దాం”అంటూ బయలు దేరదీశాడు. మాటల్లో అపర్ణ వచ్చి వెళ్లిన విషయం వచ్చింది. “ఏముంటుంది మీ ఫ్రెండ్”అడిగాడు కిరణ్. “అంతా మాములే.. చాలా సంవత్సరాలయిందిగా కలుసుకుని,ఏవో కాలక్షేపం కబుర్లు అంతే”అంది.తన మనసు లోని మాటను అతనికి చెప్పకూడనుకుంది కిరణ్మయి. మరుసటిరోజు మధ్యాహ్నానికి కిరణ్ పని అయిపోవటంతో,బయలు దేరి హైదరాబాద్ వచ్చేశారు వాళ్ళు. కిరణ్మయికి అపర్ణ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఆమె మీద ఆ మాటల ప్రభావం బాగానే ఉంది. ఈలోగా శర్మిష్టను కూడా కలిసింది. ఆరోజు గొడవ తరువాత దినేష్ ఇంట్లోనుండి వెళ్ళిపోయాడని, శర్మిష్టతో కలిసి ఉండటం తనకు ఇష్టం లేదని చెప్పాడని తెలిసింది తను చెప్పిన మాటలు విన్న కిరణ్మయి కి తన అభిప్రాయం మరింత బలపడింది. **********. ********** “కిరణ్,నాకు ఇక్కడ ఐడిఏ లో ఓ షెడ్ ఎలాట్ అయింది. రేపు నా ఇండస్ట్రీ ఓపెనింగ్,నీవు నాతో ఉండాలి.”చెప్తున్న కిరణ్మయి వంక విస్మయంగా చూశాడు కిరణ్. “ఇదేమిటి మెరుపు లేని పిడుగు లాగా, నాతో ఒక మాట కూడా అనలేదు”అన్నాడు “జస్ట్ ఫర్ సర్ప్రైజ్”అంది కిరణ్మయి.. “స్టాఫ్ అందరినీ తీసుకున్నావా”,”నా సాయం ఏమైదౌనా కావాలంటే చెప్పు”అన్నాడు కిరణ్. “అంతా సెట్ అయింది కిరణ్,మన శర్మిష్టే మానేజర్ ఇంకా ఓ పది మందిని తీసుకున్నాను.అందరూ మన కాలనీ చుట్టుపక్కలే ఉంటారు.అందరూ మగవాళ్ళ దాష్టీకాన్ని తట్టుకోలేక పోయిన వాళ్ళే.చాలా మంది పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా సంసారాన్ని లాగుతూన్ప వాళ్ళే”చెప్పింది కిరణ్మయి,”ఇంకో విషయం…నేను ఒక ఆడపిల్లని దత్తత తీసుకుందామనుకుంటున్నాను.నీకు ఓకేనే కదా.అప్పుడు నిన్ను ‘నాన్నా’ అని నన్ను ‘అమ్మా’ అని పిలిచే వాళ్ళు ఉంటారు” రెప్ప వేయకుండా ఆమెనే చూస్తున్నాడు కిరణ్. ఆమె కళ్ళల్లో ఓ అనిర్వచనీయమైన మెరుపు. ఆమె గొంతులో అచంచలమైన విశ్వాసం. ఆమె కదలికలో అద్వితీయమైన నిండుతనం. అద్భుతమైన మహిళా శక్తికి అభివందనం అనుకున్నాడు కిరణ్.

మరిన్ని కథలు

Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు