అచ్చి వచ్చిన మూర్ఖులు - డి.కె.చదువుల బాబు

Atchi vachhina moorkhulul

చంద్రగిరిని పాలించే చంద్రవర్మకు రవివర్మ ఒక్కడే సంతానం.రవివర్మ వేటకు వెళ్లి లేడిని తరుముతుండగా కాలి చెప్పు జారి ఒక కప్పకు తగిలింది. అతడది పట్టించుకోకుం డా తన చెప్పు తీసుకుని మళ్లీ తొడుక్కున్నాడు. అంతలో లేడి పొదల చాటుకు పారిపోయింది. అక్కడ ఓ చెట్టు కింద కళ్ళు మూసుకుని కూర్చున్న మనిషి కనిపిస్తే లేడి ఎటు వెళ్లిందని అడిగాడు రవివర్మ. ఆయన ఉలకలేదు. పలకలేదు. ఎన్నిసార్లు అడిగినా పలుకని మునిని చూసి రవివర్మకు కోపం వచ్చి "నేను ఈ దేశపు రా కుమారుడను. నాతోనే ఇంత పొగరుగా ఉంటే సామాన్యులతో నీవు ఇంకెలా ఉంటున్నావో? సన్యాసికి అహంకారం కూడదంటారు. నీవంటి వాడిని న్యాయస్థానంలో నిలబెట్టి నేరస్తుడిలా విచారించాలి" అంటూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడసాగాడు. కొంతసేపటికి ముని కళ్ళు తెరిచి "నాయనా! నేను నా గురువు వద్ద కొత్తగా పరకాయప్రవేశ విద్య నేర్చుకున్నాను. దాని పరీక్షించడానికి నేనిక్కడ కూర్చుని నా ఆత్మను శరీరం నుంచి వేరుచేసి కాస్త దూరములో ఉన్న చనిపోయిన కప్ప శరీరంలో ప్రవేశపెట్టాను. మృతప్రాయమైన నా శరీరాన్ని మాటలతోనూ, నా ఆత్మ ఉన్న కప్ప శరీరాన్ని నీ చెప్పుతోను కొట్టి, తిట్టి అవమానించావు. అయినా నాకు నీ మీద కోపం లేదు. రాజులకు పరకాయ ప్రవేశ విద్య వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నీకు ఇష్టమైతే నేను ఆ విద్యను నీకు నేర్పగలను" అన్నాడు. రవివర్మ మునికి నమస్కరించి ఆ విద్య నేర్పమన్నాడు. ముని అతడికి మంత్రోపదేశం చేశాడు. రవివర్మ ఆ మంత్రాన్ని పఠించాడు. వెంటనే అతడి శరీరంలో ఏదో మార్పు ప్రారంభమైంది. అప్పుడు ముని నవ్వి "రాకుమారుడననే అహంకారంతో నా శరీరాన్ని, ఆత్మను బాధపెట్టావు. ఇప్పుడు నీ ఆత్మ నీ నుండి బయటపడి అక్కడున్న కప్ప శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ శరీరం నుండి బయటకు వచ్చే మంత్రం నీకు నేను చెప్పలేదు. ఇకమీదట నీది కప్ప బ్రతుకు. మండూక రాజ్యాన్ని ఏలుకో" అన్నాడు. రవివర్మ ముని పాదాల మీద పడి తన తప్పు ఖాయమన్నాడు. కాసేపటికి ముని శాంతించి "అహంకారికి శిక్ష తప్పదు. కాబట్టి నీవు కొంతకాలం కప్ప జీవితం అనుభవించక తప్పదు. ఎవరిదైనా చెప్పు తగిలినప్పుడు నీ ఆత్మకు కప్ప శరీరం నుండి విముక్తి లభిస్తుంది. ఈ లోగా నీ శరీరం పాడవకుండా ఆకు పసరులు పూసి పెట్టైలో ఉంచి ఈ మామిడి చెట్టు కింద పాతి పెడతాను. ఎవరైనా వచ్చి నీ శరీరాన్ని బయటకు తీస్తే నీవు మామూలు రూపంలో బయటపడగలవు" అన్నాడు. కొద్దిసేపటికి రవివర్మ శరీరం నేల కూలింది. కాస్త దూరం లోని కప్ప కళేభరం జీవం నింపుకొని గంతులు వేయసాగింది. ముని రాకుమారుడి శరీరాన్ని చెప్పిన విధంగా పెట్టెలోపెట్టి మామిడి చెట్టు కింద పాతిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కప్ప రూపంలోని రవివర్మ శాపవిముక్తి కోసం ఆ ప్రాంతంలోనే ఉండి ఎదురు చూస్తున్నాడు. పగలా దారిలో వెళ్లేవాళ్లు జాగ్రత్తగా నడుస్తూ కప్పను తొక్కేవారు కాదు. అది గమనించిన రవివర్మకు తనంత అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడో అర్థమయింది. ఎంత చిన్న జంతువునైనా నిర్లక్ష్యం చేయరాదని అతడికి గుణపాఠం అయింది. రాత్రిపూట ఆ దారిలో ఎవరూ వెళ్లేవారు కాదు. ఎందుకంటే ఆ మామిడి చెట్టు మీద కొంటె పిశాచం వచ్చి చేరింది. అది ఆ దారిని వెళ్లేవాళ్ళను రకరకాల చేష్టలతో భయపెట్టేది. తనకు చెప్పు ఎవరు తగిలిస్తారు? తగిలించినా నేల లోపల ఉన్న తన శరీరాన్ని ఎవరు బయటకు తీస్తారు? ఈ జన్మకు తనకు విముక్తి లభిస్తుందా?" అన్న విచారంతో రవివర్మ భారంగా కాలం గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా ఆ అడవికి సమీప గ్రామంలో మంత్రమ్మవ్వ అనే ముసలావిడ ఉండేది. తల్లిదండ్రులు లేని రాముడు, భీముడు అనే మనుమలను ఆమె చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసింది. ఆ మనుమలిద్దరూ అమాయకులు. అంతా వాళ్ళను మూర్ఖులనే వారు. ఒకసారి పొరుగూరిలో ఏదో ఉత్సవం జరుగుతోంది. మనుమలు ఇద్దరూ చూడ్డానికి వెళ్తామని సరదా పడితే అవ్వ ముందు రోజు రాత్రి రొట్టెలు చేసి ఉంచింది. మర్నాడు సూర్యోదయానికి ముందే వాళ్ళు ప్రయాణమయ్యారు. పొరుగూరిలో కుక్కలు ఎక్కువ అని వాటిని భయపెట్టడానికి గునపం తీసుకున్నాడు భీముడు. అవ్వ వాళ్లకు చెప్పులు ఇచ్చి "దారిలో తేళ్లు, పురుగులు ఉంటాయి కాబట్టి వీటిని మీరు వాడాలి" అని చెప్పింది. దారిలో తినడానికి రొట్టెలిద్దామని చూస్తే వాటిని సగానికి పైగా ఎలుకలు తినేశాయి. ఎలుకలు తిన్న రొట్టెలను పడేసి అవ్వ మళ్లీ రొట్టెలు చేస్తానంది. వాళ్ళు వినకుండా "ఒకరోజు ఆకలికి చస్తామా! ఏంటి? అవతల మాకు ఆలస్యం. నీకు శ్రమ" అంటూ బయలుదేరి పోయారు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక శుభ్రంగా ఉన్న బాటను చూస్తూ అవ్వేమో తేళ్లు, పురుగులు ఉంటాయని చెప్పులు కూడా ఇచ్చింది. ఇంత శుభ్రమైన దారిలో పురుగులు ఏముంటాయి? అంటే మనం అడవి దారిలో వెళ్లాలన్నమాట" అని అనుకున్నారు. ఆ ప్రకారం అడవిలో కొంత దూరం వెళ్ళాక ఎంతకీ తేళ్లు కనపడక వాళ్ళకు చిరాకేసి ఆ విషయం మాట్లాడుకుంటూ రవివర్మ ఉండే ప్రాంతానికి చేరువయ్యారు. అక్కడ ఉన్న పిశాచి ఇంకా తెల్లవారకపోవడంతో బాటసారులను ఆటపట్టించడం కోసం ఎదురుచూస్తోంది. అది అదృశ్య రూపంలో ఆ మూర్ఖులకు ఎదురుగా వెళ్ళింది. రాముడు, భీముడు ఇంకా తేలు గురించే మాట్లాడుకుంటూ "ఇంకా కనిపించదేమిరా? చెప్పు దెబ్బలు కొట్టాలని ఆత్రంగా ఉంది" అని రాముడన్నాడు. " చెప్పు దెబ్బలకు లొంగకపోతే దాన్ని నజ్జునజ్జు చేయడానికి నా దగ్గర గునపం ఉందిగా" అని భీముడు అన్నాడు. పిశాచి వాళ్ళ మాటలు విని వాళ్ళు ఎవరో మహావీరులని,తన సంగతి తెలిసి అంతం చేయడానికి వచ్చారని అనుకుని అక్కడి నుంచి పారిపోయింది. ఇది ఎరుగని రాముడు, భీముడు నిరంభ్యంతరంగా ముందుకు సాగారు. కొంతసేపటికి రాముడి కాలు అక్కడున్న ఒక రాతికి తగిలి నొప్పి పుట్టింది. అప్పటికే వెలుతురు కూడా రావడం వల్ల వాడు కోపంగా "చీకట్లో అయితే సరే, వెలుగులో కూడా కాళ్ళను రక్షించలేని ఈ చెప్పులు ఎందుకు?" అంటూ వాటిని దూరంగా విసిరేశాడు. అవి సరిగ్గా కప్ప రూపంలో ఉన్న రవివర్మ మీద పడ్డాయి. వెంటనే అతని ఆత్మ కప్ప శరీరాన్ని వదిలిపెట్టి అక్కడున్న మామిడి చెట్టు పైకి చేరుకుంది. ఈలోగా భీముడు మామిడి చెట్టును చూసి "ఒరేయ్! ఈ చెట్టుకు చాలా కాయలు ఉన్నాయి. దారిలో తినడానికి పనికొస్తాయి.కానీ అన్నీ పైనే కూర్చున్నాయి. కింద ఒక్కటీలేదు" అన్నాడు. రాముడు ఆలోచించి "చెట్టు భూమిలో నుంచి వస్తుంది. కాయలు కూడా భూమిలో నుంచే వస్తాయని నా అనుమానం. చెట్టుకింద తవ్వి చూద్దాం! కాయలు దొరుకుతాయేమో?" అన్నాడు భీముడు. తవ్వగా కొంతసేపటికి పెట్టె దొరికింది. ఇద్దరూ కష్టపడి దాన్ని బయటకు తీసి తెరిచారు. అందులో రవివర్మ శరీరాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అంతలో ఆత్మ ప్రవేశించడంతో రవివర్మ సజీవుడై లేచి కూర్చున్నాడు. వాళ్ళ వివరాలడిగి తెలుసుకున్నాడు. రాముడు, భీముడు పరుమ మూర్ఖులైనా వాళ్ళ మూర్ఖత్వమే తనకు శాప విమోచనం కలిగించిందన్న కృతజ్ఞతతో వారిని తీసుకొని రాజ్యానికి తిరిగి వెళ్లి జరిగిందంతా తండ్రికి చెప్పాడు. తన కుమారుడు అడవిలో మృగాలకు ఆహారమై ఉంటాడనుకుని మంచం పట్టిన చంద్రవర్మ ఎంతో సంతోషించి "యువరాజా! ఈ రాముడు, భీముడు నీకు అచ్చివచ్చిన మూర్ఖులు. వీళ్లను నిరంతరం నీ దగ్గర ఉంచుకో" అన్నాడు. రవివర్మ తిరిగి రావడం మంత్రి సుమేధుడికి కంటగింపయింది. మంచం పట్టిన చంద్రవర్మ నేడో రేపో మరణిస్తే వారసుడులేని రాజ్యానికి తానే రాజు కావచ్చునని మంత్రి ఆశపడ్డాడు. ఆ ఆశ అడియాశ కావడంతో రవివర్మను చంపడానికి వేరే ఉపాయాలను అన్వేషించ సాగాడు మంత్రి. ఒక రాత్రి రవివర్మ రాముడికి, భీముడికి తన ఉద్యానవనములో వింతలు చూపిస్తున్నాడు. అక్కడ బావి ఒకటుంటే రాముడందులోకి తొంగి చూస్తే నీటిలో చంద్రుడి ప్రతిబింబం కనబడింది." అయ్యో! చంద్రుడు బావిలో పడ్డాడు" అంటూ ఆకాశము వైపుకి చూశాడు వాడు. అప్పుడే చంద్రుడు మబ్బులు చాటుకు వెళ్లాడు. భీముడు బావిలోనికి చూసి "అయ్యో! చంద్రుడు బావిలో కూడా కనబడడం లేదు. మునిగిపోయినట్టు ఉన్నాడు" అని బాధపడ్డాడు. రవివర్మ వాళ్ళ మూర్ఖత్వానికి నవ్వుకున్నాడు. రాముడు, భీముడు చంద్రున్ని నూతిలోంచి బయటకు తీసే సరంజామా తెస్తామని రవివర్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగు తీశారు. అప్పుడు ఒంటరిగా ఉన్న రవివర్మను మంత్రి మనిషి ఒకడు చాటు దెబ్బతీసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కిబావిలో పారేసి వెళ్లిపోయాడు. అయితే బావిలోని చంద్రుడిని రక్షించాలని వచ్చిన రాముడు, భీముడుల కారణంగా రవివర్మ ప్రాణాలు దక్కాయి. కాస్త ఆలస్యమయి ఉంటే అతని ప్రాణాలు గాలిలో కలిసి ఉండేవి. ఒక ప్రయత్నం విఫలం కాగానే సుమేధుడు వెంకన్ననే హంతకున్ని తన ఇంటికి పిలిచి కడుపునిండా రొట్టెలు పెట్టి బాగా ధనాశ చూపి రహస్యంగా రాజభవనానికి చేర్చాడు. ఎలకలన్న అనే మారుపేరున్న ఈ వెంకన్న హత్య చేస్తే పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేరంటారు. వాడిప్పుడు రవివర్మను చంపడానికి వచ్చాడు. రాత్రి కాగానే ముఖానికి నల్ల ముసుగు ధరించి యువరాజు శయన మందిరంలో ఓ మూలగా నక్కి ఉన్నాడు. రాత్రివేళ రవివర్మ మూర్ఖులిద్దరితోనూ కలిసివచ్చి తాను పడుకొని వాళ్లను కూడా తమ తమ గదుల్లో పడుకోమని చెప్పాడు‌. వాళ్లు తమకి ఇంకా నిద్ర రావడం లేదని, అక్కడే నేలమీద కూర్చుని కబుర్లు మొదలుపెట్టారు. అంతలో ఓ మూల కలుగులో దూరుతున్న ఎలుక కనపడడంతో రాముడు "ఒరేయ్! భీముడూ ఎలుకన్న ముఖం అంత నల్లగా ఉందేమిటిరా?" అన్నాడు. నల్లని ముసుగులో ఉన్న వెంకన్న ఈ మాట విని తననే అనుకుని ఉలిక్కిపడ్డాడు. భీముడు కూడా ఎలుకను చూసి మంత్రమ్మ రొట్టెలం తిన్నది ఈఎలుకనే కదా! బయటకు లాగి నాలుగు పుచ్చుకోవాలి" బయలుదేరే ముందు జరిగిన విశేషం గుర్తుంచుకుని అన్నాడు. మంత్రి ఇంట్లో రొట్టెలుతిన్న వెంకన్న తన గురించే మర్మగర్భంగా మాట్లాడుకుంటున్నారని, వాళ్లకు తన ఉనికి తెలిసిపోయిందని భయపడి వెంకన్న వణికిపోసాగాడు. రాముడు, భీముడు ఎలుకను పట్టడం కోసం కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు నటించ సాగారు. అదే అదననుకుని వెంకన్న అక్కడి నుంచి పారిపోతుంటే భటులు పట్టుకుని దొంగ అనుకుని కారాగారంలో వేశారు. ‌ మూడో ప్రయత్నం గా మంత్రి సుమేధుడు రాజనర్తకిని ప్రలోభ పెట్టి విషమిచ్చి పంపాడు.ఆమె రాత్రిపూట యువరాజును నృత్యంతో అలరిస్తూ పాలలో విషం కలిపి ఇవ్వబోగా రాముడు, భీముడు వారించి "ఎప్పుడు పాలు తాగిన ముందు కాసిన్ని పాలు పిల్లికి ఇవ్వాలి"అని మా అవ్వ చెప్పింది అన్నారు. రవివర్మ ఆ మాటలకు విలువ ఇచ్చి పిల్లికి పాలు పోయ గానే అది తాగి చనిపోయింది.రాజనర్తకి వణికిపోతూ మంత్రి కుతంత్రాన్ని చెప్పేసింది. ఈ లోగా కారాగారంలోని వెంకన్న కూడా మంత్రి కుతంత్రం గురించి చెప్పడంతో సుమేధుడి కుట్ర బయటపడింది.వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత రవివర్మ రాజయ్యాడు. అతనికి రాముడు, భీముడు అంతరంగిక స్నేహితులై రాజభోగాలను అనుభవించ సాగారు. మంత్రమ్మవ్వ కూడా రాజు,మనుమళ్ళ పిలుపు అందుకుని వచ్చి వారితో ఉంటూ, వారి అమాయకత్వమే వారికి శ్రీరామరక్ష అయినందుకు ఎంతో సంతోషించింది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు