మీరైతే ఏం చేస్తారు? - nayuni krishna murthy

meeraite em chestaru

"నువ్వు ఎన్నన్నా చెప్పు. తొమ్మిది లక్షలా చిల్లర వదిలి పెట్నాడంటే వాడంత మూర్ఖపు ముండాకొడుకు ఇంకొకడుండడు. ఈ జన్మకు వాడు బాగుపడ్డు."

కండక్టరు వెనుక సీట్లో కూర్చుని పరధ్యానంగా కిటికీలోంచి బయట చీకట్లోకి చూస్తున్న నన్ను ఆ మాటలు ఆకర్షించాయి. కండక్టరు పక్కన కూర్చున్న నడివయసు మనిషి ఆ మాటలు అన్నది.

"అట్లాగాదురా! ఎవరికన్నా సరే అన్ని లక్షలు కళ్ళెదురుగా కనిపిస్తే గుండెలు నిలవల్ల గదా! వాడు భయపడి పోయుంటాడు. కాళ్ళూ చేతులు అదిరి, డిపోలో ఎత్తకపోయి ఇచ్చేసి ఉంటాడు." కండక్టరు, పక్కనున్న వ్యక్తికి సమాధానమిచ్చాడు.

"భయం దేనికిరా సన్నాసి నాయలా! వాడేమన్నా దొంగతనం చేస్తా ఉన్నాడా ఏమి? ఎవుడో వదిలిపెట్టి పోయ్ నాడు. కళ్ళెదురుగా లక్ష్మీదేవి నిలబడి నన్నెత్తికపోరా నన్నెత్తికపోరా అంటా ఉండాది. అంతే! గప్ చిప్ గా ఎత్తికిపోవల్ల. చేతగాని నాయాలు డిపోలో ఇచ్చేసి వచ్చినాడు. అదే నేనయింటేనా..."

తొమ్మిది లక్షల చిల్లరా అనేమాటలు డబ్బుకు సంబంధించినవని నాకు అర్ధమయింది. పూర్వాపరాలు తెలుసుకోవాలనే ఉత్సాహం సహజంగా పుట్టుకొచ్చి, కండక్టరు భుజంమీద చెయ్యి వేస్తూ, 'దేన్ని గురించి?'

ఇద్దరూ చప్పున వెనక్కి తిరిగి, "ఏం లేదులే సార్! ఏదో మా డిపార్ట్ మెంట్ సంగతి." అన్నారు.

మళ్ళీ ప్రశ్న వేసే అవకాశం నాకివ్వలేదు. టాపిక్ కూడా మారిపోయింది. రాజకీయాల్లో దూరిపోయారు. గత్యంతరం లేక నేనూ కిటికీ అవతల చూస్తుండిపోయాను.

వ్యక్తిగతమైన ఆలోచనల్తో కాలం గడిచిపోయింది. రాత్రి పదకొండు గంటలకు బస్సు మా ఊళ్ళో ఆగింది. ఆ బస్సుకు నైట్ హాల్ట్ కూడా మా ఊరే! మదనపల్లె నుండి వచ్చే లాస్ట్ బస్సు అది.

స్టాండులో బస్సు దిగి మా వీదివైపు వెళ్ళబోతుంటే కండక్టర్, "సార్" అని పిలిచాడు. నేను ఆగాను. అతను గబగబా నాలుగడుగులు నావైపువేసి, "ఇందాకా బస్సులో మాటాడతా ఉన్నింది, ఈ ఊరోడే మునసామి అనే కండక్టరు గురించి సార్. వాడీ దినం విజయవాడ బస్సులో డ్యూటీ దిగినాడు సార్. దిగినప్పుడు బస్సులో ఎవరో సూట్ కేస్ మరిచిపోయినారంట. వీడు తీసి చూస్తే అన్నీ నూర్రూపాయల కట్లేనంట సార్. తొమ్మిది లక్షలు పైన ఉందంట. వాడికి కాళ్ళూ చేతులూ అదిరిపోయుంటుంది. పాపం డిపోలో ఎత్తుకుపోయి ఇచ్చేసినాడంట. దీన్ని గురించే బస్సులో మాట్లాడతా ఉన్నింది. మీరడిగితే బస్సులో అవన్నీ ఎందుకు మాట్లాడల్ల అని అప్పుడు చెప్పాలా అంతే సార్!" అంటూ డ్రైవర్ తో కలిసి బ్రాందీషాపు, భోజన హోటల్ మధ్య దిశగా వెళ్ళిపోయారు.

కండక్టర్ మునస్వామి నాకు తెలుసు. పలమనేరు డిపొలో పని చేస్తాడు. అతడు ఉండేది కూడా నేను ఉంటున్న ఇంటికి పక్కనే. మా లోగిలిలో మొత్తం అయిదిళ్ళు ఉన్నాయి. ఎడంవైపు ఇల్లు మునస్వామిది. కుడివైపు ఉండేది మురళీధర్ ఆయన టీచర్ ఉద్యోగం చేస్తూ, ఒక దినపత్రికకు కరస్పాండెండ్ గా పని చేస్తున్నాడు. ఎదురుగా ఉన్న రెండిళ్లలో ఒక దాంట్లో టీకొట్టు బాబు ఉంటాడు. ఇంకో దాంట్లో ఉండేది సంజయ్. ప్రైవేట్ ఆఫీసులో చిన్న ఉద్యోగి అతను.

మునస్వామి ఎటువంటి పరిస్థితుల్లో అంత డబ్బును డిపోలో ఇచ్చి ఉంటాడో ఆలోచిస్తూ ఇంటికెళ్ళాను. మా ఆవిడ మేలుకొనే ఉంది.

నన్ను చూడగానే చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి పైకిలేచి, కట్టుకోవడానికి నాకు లుంగీ అందిస్తూ, "ఆరు గంటల్లోపలే వస్తామన్నార. ఇంత లేటయిందేం?" అంది.

సమాదానం చెప్పకుండా లుంగీ కట్టుకొని పాంటును, షర్టును పక్కన పడేస్తూ బాత్ రూంలోకి నడిచాను.

ముఖం కడుక్కుని ఇవతలకి వచ్చే సరికి టవల్ అందిస్తూ మా ఆవిడ అంది: "మీరు కథలూ అవీ రాస్తారు కదా! ఇప్పుడు మీకు నేను సమస్యతో కూడుకొన్న ఒక సంఘటన చెబుతాను. మీరయితే ఏంచేస్తారో చెప్పాలి."

"చెప్పు..." అంటూ అన్నం గిన్నె ముందు కూర్చున్నాను.

వడ్డిస్తూ ఆమె, "మీరు ఒక బస్సు కండక్టరుగా ఉద్యోగం చేస్తున్నారనుకోండి..." కథలాగా చెప్పసాగింది.

రెండో వాక్యం మొదలు పెట్టనివ్వలేదు నేను. "ఆ కండక్టరుకు పాసింజర్లందరూ దిగిపోయిన తర్వాత కొన్ని లక్షల రూపాయలుండే సూట్ కేస్ దొరికితే ఏంచేస్తాడు అనేదేగా నీ సమస్య!"

ఆశ్చర్యపోవడం మా ఆవిడ వంతయింది. "ఈ సంగతి మీకూ తెలుసా? మదనపల్లెలో కూడా అనుకొంటున్నారా?"

"లేదు వస్తుండగా బస్సులో కండక్టరు ఎవరికో చెబుతుండగా విన్నాను."

"సరే! అంతా మీకు తెలుసు కాబట్టి చెప్పండి. మీరే ఆ కండక్టరు అయి ఉంటే ఏంచేసి ఉండేవారు?"

ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి బదులు నేనే ఒక ప్రశ్న వేశాను. "ఆ కండక్టరు భార్యగా నీ భర్త ఎలా ప్రవర్తించాలని అనుకొంటావు?"

మా ఇద్దరి మాటల్ని భంగపరుస్తూ పక్కింట్లో పెద్దగా అరుచుకోవడం వినిపించింది.

మునుస్వామి కాపుర ముంటున్న వాటానే అది.

అతని భార్య కాబోలు గట్టిగా అరుస్తోంది. "ఈ ముదనష్టపు కొంపలో నే నింకో దినం కూడా ఉండను. తెల్లారి నిద్దర లేస్తానే మా పుట్టింటికి ఎళ్ళిపోతాను."

అది స్వగతమో, ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్న మాటో అర్ధం కావడం లేదు.

మళ్లీ ఆవిడ అంది: "నా మొగానికి బొట్టు చైను తప్ప, ఒంటిపేట గొలుసుక్కూడా గతిలేదు. రెండు బంగారు గాజులు కొనుక్కుందామంటే నెలనెలా జీతాల్లో మిగలబెడతానంటాడు నా మొగుడు. ఒకటో తేదీ వచ్చే ఆ జీతం సంగతి చెప్పల్నా? రంగీ రంగీ నీ భోగ మెంతసేపే అంటే, తెల్లారి చల్లిన పేన్నీళ్ళు ఎండిపోయే దాకా అందంట..."

ఆ మాటలన్నీ స్వగతం లాగానే ఉన్నాయి. వింటూనే నేను భోజనం ముగించాను.

స్వగతం పూర్తికాలేదు. "నేమన్నా బాంకులు కొల్లగొట్టి తెమ్మంటా ఉండానా? దోపిడీలు, దొంగతనాలు చెయ్యమంటా ఉండానా? అరే ఎవురో పారేసుకున్నారే ఆ సూట్కేసు. ఇందులో ఇంత డబ్బు ఉండాది కదా! ఎవుడి తాతసొమ్మేం పోతా ఉంది. ఒక యాభై వేలు ఇల్లు కట్టుకునేదానికో ఇంకో యాభైవేలు కట్టుకున్నదాని మెళ్ళో ఏమైనా చేయించి పడేద్దామని ఎత్తుకొని రావచ్చు కదా! నేనేమన్నా అంతా తెచ్చేయమంటా ఉండానా?"

మునస్వామి చెవుల్లో దూది అయినా పెట్టుకొని ఉండాలి. లేకుంటే ఆమె మాటలు వినిపించనంతటి గాడంగా నిద్రన్నా పోతూ ఉండాలి.

కాస్సేపటికి సద్దుమణిగింది.

నేను మా ఆవిణ్ణి అడిగాను. "నీకూ బంగారు గొలుసు లేదు కదా?" అని. సమాధానంగా ఆవిడ నవ్వింది.

***

తెల్లారి ఆరుగంటలకు కరెక్టుగా మెలకువ వస్తుంది నాకు.

ఆ సరికి ఇంట్లో పాలు తెచ్చివ్వరు. అందుకని నేరుగా బస్టాండుకు వెళ్ళి బాబు కొట్లో టీ తాగి, పేపరు చదివి కాస్సేపు కూర్చొని రావడం అలవాటు.

యథాప్రకారం బస్టాండుకు వెళ్ళి బాబు అంగడి ముందు నిలబడగానే, వాడు అలవాటు ప్రకారం వేడి నీళ్ళు ఒక గ్లాసు ఇచ్చాడు.

ఆ నీళ్లు నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మెయ్యగానే వాడు టీ అందిస్తూ - "సార్! ఈ కాలంలో ఇంకా ఇంత ఎర్రోళ్ళు ఉన్నారా సార్!" అన్నాడు.

"ఎవరి గురించి నువ్వు అంటున్నది?" అడిగాను.

"ఆయనే సార్ మునస్వామి..."

"మునసామా? ఏంజేశాడు?"

"అయితే నిన్న జరిగిన కతంతా మీకు తెల్దా సార్! నిన్న బస్సులో మన మునస్వామికి ఒక సూట్ కేసు దొరికింది సార్... దాంట్లో తొమ్మది లక్షలా ముఫ్ఫై ఏడువేల ఆర్నూట ఇరవై రూపాయలు ఉన్నాయి సార్... అంతా దిగేసినారు. చూసేవోళ్ళు ఎవరూ లేరు. నైసుగా ఎత్తుకోని వచ్చేయ్యకుండా డిపోలో పొయ్యి ఇచ్చేసి వచ్చెసినాడు సార్ గొర్రి నాయాలు. బుద్దుందా సార్..."

టీ తాగడం పూర్తి చేసి గ్లాసు అక్కడ పెడుతూ, "నువ్వయితే ఏంచేసి ఉండేవాడివి?" అన్నాను.

"నేనా సార్?" వాడు ఆలోచించుకోవడానికి వ్యవధి తీసుకోలేదు. "డ్రైవర్ని పిలిచి నాలుగు లక్షలిస్తాను. ఎక్కడా అనవద్దు. ఈ డబ్బులు ఎక్కడైనా దాచేద్దాము. ఒక రెండేళ్ళు పోయినంక మెల్లగా తీసి ఖర్చు పెడదాం. మల్ల ఉద్యోగాలు వదిలేద్దాం అని ప్లాను ఏసుండేవాన్ని సార్..."

"అది అన్యాయం కాదా... దొరికిన వస్తువుల్ని, డబ్బును, ఉద్యోగస్థులు అధికారులకు అప్పచెప్పాలి గదా..."

"మీరు చాలా మంచోల్లు సార్... మీకేం తెలీదు. ఇప్పుడు ఆడ చానామంది చూసేసినారు కాబట్టి, తొమ్మిది లక్షలు దొరికింది అని ఆళ్ళు అంటా ఉండారు గానీ ఆఫీసులో ఎవరూ లేకుండా ఉన్నింటే అసలు ఈ సంగతి బయటికే వచ్చిండదు సార్. మన మునస్వామికి లక్షో, రెండు లక్షలో ఇచ్చేసి అంతా గప్పుచిప్పుగా మింగేసి ఉండేవాళ్ళు.

మొన్న సోమల దగ్గర ఎవుడికో నిధి దొరికిందని అందరూ అన్లేదా సార్? అదేమయింది? పోలీసులు స్వాధీనం చేసుకుని, దొరికిన మూడు కుండల్లోనూ 22 గ్రాముల బంగారం మాత్రమే ఉందని చెప్పలా? అంతా అంతే సార్..." చాలా ఆవేశంగా చెప్పాడు బాబు.

ఈ లోపల న్యూస్ పేపరు పట్టుకొని పక్కింటి టీచర్ మురళి వచ్చాడు.

"ఏం సార్ ఇవ్వాళ న్యూస్ ఏమిటి?" అడిగాను. మురళి మాట్లాడకుండా మునస్వామి న్యూస్ చూపెట్టాడు. 'కండెక్టర్ నిజాయితీ' అని పెద్ద అక్షరాల శీర్షికతో దొరికిన డబ్బు గురించి రాసి, మునస్వామి నిజాయితీని అందరూ మెచ్చుకొంటున్నట్టు వివరంగా ఉంది.

న్యూస్ చదివి మురళి వంక చూశాను ప్రశ్నార్ధకంగా.

"మీరయితే ఏం చేస్తారు?" అడిగాను.

మురళి వెంటనే సమాధానం ఇవ్వలేదు. ఒక నిమిషం తర్వాత. "నేను కూడా మునస్వామి చేసిన పనే చేస్తాను సార్!" అన్నాడు.

"మరి ఆ విషయం చెప్పడానికి ఒక నిమిషం టైం ఎందుకు తీసుకొన్నారు?"

"ఇవ్వడం మంచిదా, ఇవ్వకపోవడం మంచిదా అనేది అంత సులభమైన ప్రశ్న కాదు."

"నిజాయితీగా ఆలోచిస్తున్నప్పుడు ఇవ్వాలా? వద్దా? అన్న ప్రశ్నలు అసలు పుట్టవుకదా!"

మురళి నవ్వాడు. "నేను ఆలోచించిన తీరు వేరు సార్! ఇన్ని లక్షల రూపాయల్ని వదిలి పెట్టడానికి వాటి యజమాని పిచ్చివాడన్నా కావాలి, లేక అవి దొంగనోట్లన్నా కావాలి. పొరబాటున అవి దొంగనోట్లు అయితే వాటిని మార్చేటప్పుడు పట్టుబడక తప్పదు. అది భవిష్యత్తులో జూదం ఆడినట్టు లెక్క. దానికన్నా డిపార్టుమెంట్ కు హాండోవర్ చేస్తే కనీసం మంచివాడనే పేరైనా వస్తుంది."

"అంటే అవి దొంగనోట్లని భయపడ్డం వల్ల ఇచ్చేయ్యడమే కానీ నిజాయితీగా కాదన్నమాట."

"ఈ కాలంలో ఇంకా నిజాయితీకి విలువ ఎక్కడుంది సార్?"

"ఒక ఉపాధ్యాయుడిగా, ఒక పత్రిక న్యూస్ రిపోర్టర్ గా మీరలా అనకూడదు."

"వాస్తవాలు వినడానికి ఇబ్బందిగానే ఉంటాయి సార్! నిజాయితీ లేదని నేననడం లేదు. దానికి తగిన గుర్తింపు లేదని మాత్రమే అంటున్నాను. అంతెందుకు మన మునస్వామి నిజాయితీతో డబ్బు వాపసుఇచ్చాడు. అది నిజంగా నిజాయితేనని ఎందరు ఒప్పుకొంటారు? చేతకానితనమని, భయమని రకరకాల పేర్లు పెడతారు."

నేను ఆలోచనలో పడ్డాను.

మురళి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్యలో ఏదో ప్రశ్నవేసి, "ఏమంటారు?" అని అడిగినప్పుడు ఈ లోకంలోకి వచ్చాను.

ప్రశ్నేమిటో వినకపోవడం వల్ల, "క్షమించండి వినలేదు. మీరు అన్నదేమిటి?" అన్నాను.

"మీరు వినిపించుకోలేదేమో మళ్లీ చెబుతాను. ఈ ఊళ్ళోనే మొన్న జరిగిన సంగతి. మన హాస్పిటల్ లో ఓ బెడ్ మీద ఒక రోగిష్టి యువతి పడుకొని ఉంది సార్. అర్ధరాత్రిపూట ఈ ఊరివాడే ఒకడు వెళ్ళి ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి రమ్మని పిలిచాడు. ఆమె లేచి గొడవ చేసింది. వాడు పారిపోయాడు. కొంతమంది ఈ సంగతి నాకు చెప్పి పేపరుకు న్యూస్ రాయమన్నారు. ఎవరో దోవన పోయేవాడు ఆ పని చేసి ఉంటే నేను రాసి ఉండేవాణ్ణి కాదేమో కానీ, ఒక బాధ్యత కల్గిన, నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఆ పని చెయ్యడంతో వెంటనే న్యూస్ రాశాను. కాని అది పేపర్లో రాలేదు. ఆ వార్త రానివ్వకుండా పెద్ద మనుషులు అడ్డుపడ్డారు. నేను నిజాయితీగా ఉండి ఏం ప్రయోజనం సార్..."

కాస్సేపాగి మళ్లీ అన్నాడు: "ఈ ఊళ్లో కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా సార్? నేను లంచంగా డబ్బు తీసుకొని న్యూస్ రాయడానికి భయపడ్డానని, చేతకానివాణ్ణని రకరకాలుగా అనుకొన్నారు."

సమస్యను విశ్లేషించబోయే లోపల సంజయ్ వచ్చాడు. దాంతో ఒక్క మునస్వామి తప్ప మా వాటాలో ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరినట్టయింది. నేను సంజయ్ ని కూడా పాత ప్రశ్న అడిగాను... "నువ్వయితే ఏంచేస్తావు?"

సంజయ్ చదువుకున్నవాడు. నిరుద్యోగి, భవిష్యత్తు గురించి కలలు కనేవాడు.

నేనడిగిన ప్రశ్నకు తడుముకోకుండా, "నేనయితే అంత డబ్బును వాపసు ఇవ్వను సార్" అన్నాడు.

"ఎందుకు ఇవ్వవు?"

"అంత డబ్బు నా జీవితకాలంలో నేను సంపాదించడం సాధ్యం కాకపోవచ్చు. సులభంగా - అదీ ఏ దొంగతనమూ, దోపిడీ చెయ్యకుండా ఆయాచితంగా లభిస్తోంది. కాబట్టి వదులుకునేంత మూర్ఖుణ్ణి కాను."

"ఆ డబ్బు నీది కాదు గదా..."

"నాది కాకపోయినా ఈ డబ్బు నాది అనే వాడెవడూ అక్కడ లేడు కదా!"

"అన్ని లక్షలతో ఏం చేస్తావ్?"

"మా ఇంట్లో లక్షో, రెండు లక్షలో ఇచ్చేసి, ఏ బాంబేకో ఢిల్లీకో వెళ్ళిపోయి సుఖంగా గడిపేస్తాను."

ఇంకో టీ తాగి బస్టాండు నుండి ఇంటికి వచ్చేశాను.

స్నానం చేస్తుండగా మా ఆవిడ చెప్పింది. 'మునస్వామి భార్య పెట్టే బేడా సర్దుకొని వెళ్ళిపోయిం'దని.

మేమిద్దరం పక్కింటికి వెళ్ళి మునస్వామిని టిఫిన్ కు మా ఇంటికి రమ్మని పిలిచాము.

అతని పక్కన కూర్చుని తినడం నాకు గర్వంగా అనిపించింది.

"నిజాయితీగా బతకడంలో ఎంత ఆనందముందో మీ ఆవిడకు తెలిసేటట్టు చెప్పలేకపోయారా?" ఉండబట్టలేక అన్నాను.

"దాని తాతగారి ఆస్తి ఏదో డిపోలో దానం చేసినట్టు తెగ బాధ పడిపోయింది సార్... దానికెవరు చెప్తారు? ఇంకొకళ్ళ డబ్బు మనకెందుకు సార్... మీరే చెప్పండి." అమాయకంగా అన్నాడు మునస్వామి.

నాకు పొరబోయింది. కళ్ళలో నీళ్లొచ్చాయి.

అవి ఆనంద భాష్పాలే అయి ఉండాలి.

లోకంలో ధర్మం, నీతి పూర్తిగా చచ్చిపోలేదని అనుకోవడం కోసం నేను మునస్వామిని ఒక ప్రశ్న వెయ్యలేదు.

నేను వెయ్యని ప్రశ్న : మీకు తొమ్మిది లక్షలకు బదులు ఒక రూపాయి బస్సులో దొరికితే ఏం చేస్తారు?

*****

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు