వర్ణ యవనిక - జి.ఆర్.భాస్కర బాబు

Varna yavanika

అంజలి, హేమంత్ లో వివాహం జరగటానికి ముహూర్తం ఖరారు చేశారు.వచ్చే మాఘమాసం లో పెళ్ళి జరిపించాలని నిర్ణయించారు. వరుడు హేమంత్ ఓ ఎమ్మెన్సీ కంపెనీ లో టీం లీడ్ గా పని చేస్తున్నాడు.జీతం కంటే కూడా అతనికి వారసత్వం గా రానున్న ఆస్తులు బాగానే ఉన్నాయి.అవి అన్నీ బేరీజు వేసుకుని అంజలికి ఆ సంబంధం ఖాయం చేశారు పెద్దలు. అంజలి ఓ సాదాసీదా అమ్మాయి అయినా ఆమె ఆలోచనా దృక్పథం చాలా బాగుంటుంది.ఆమె చదివిన సైకాలజీ, ఫైనాన్స్ సబ్జెక్టులు ఆమె ఆలోచనా విధానానికి పదును పెట్టాయి.చాలా కమిట్మెంట్ ఉన్న ఎంప్లాయ్ గా పేరు తెచ్చుకుంది. ఆమె పెళ్లి విషయంగా ఆమె మనసు లో పరిపరి విధాలుగా ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ”ఏమయినా తొందర పడుతున్నానా, అన్నివిధాలా అనుకూలమైన సంబంధం అని అందరూ అంటున్నారు.ఎలాగయినా అతనితో ఓ సారి మాట్లాడితే బాగుండును . మనసు విప్పి మాట్లాడుకోవడం అవసరం”అనుకుంది. కాగలకార్యం గంధర్వులు తీర్చినట్లు అంజలి ఆఫీసులో ఉండగా హేమంత్ ఫోన్ చేశాడు,ఆరోజు సాయంత్రం మినర్వా లో కలుద్దామని.సరేనని ఇంటికి ఫోను చేసి చెప్పింది కాస్త ఆలస్యంగా వస్తానని. ‘ప్రీ వెడ్డింగ్ షూట్లు’ జరిగే ఈ రోజుల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సాధారణమైన విషయం అనుకున్నారు ఇంట్లో వాళ్ళు. సాయంత్రం ఆరయింది అంజలి ఆఫీసులో పని ముగించి మినర్వా చేరుకుంది.ఆ సరికి హేమంత్ రాలేదు.ఫోన్ చేశాడు.తనకు ఇంకా అరగంట పడుతుందని, ఆలస్యం అవుతోంది కనుక తనకు ఇబ్బందిగా ఉంటే తరువాత మళ్ళీ కలుద్దామని చెప్పాడు.అంజలి ఒక్క క్షణం ఆలోచించి,”పర్వాలేదు మీరు కావాలని ఆలస్యం చేయటం లేదు కదా,నేను ఇక్కడే వుంటాను.మీరు వీలయినంత త్వరగా రండి”అంది. కాలక్షేపానికి రోడ్డు మీద ఉన్న షాపుల్లో ఏవయినా ఉపయోగపడేవి ఉన్నాయేమో చూస్తూంది.ఆ సందట్లోపడి ఫోను మోగింది కూడా గమనించలేదు. వాచ్ వంక చూస్తూనే కంగారుగా ఫోన్ చెక్ చేసింది.హేమంత్ దగ్గరనుండే.రెండు మిస్డ్ కాల్స్. వెంటనే మళ్ళీ ఫోన్ చేసింది. “హలో..మీరు ఎక్కడ ఉన్నారు? నేను మీ కోసం ట్రై చేస్తున్నాను, మీ ఫోన్ రింగ్ అవుతూంది, మీరు లిఫ్ట్ చేయలేదు, ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు?”అడిగాడు హేమంత్. “సారీ.. సారీ, నేను రెండు నిమిషాల్లో అక్కడ ఉంటాను” అని వడివడిగా అక్కడికి వెళ్ళింది. “వెరీ సారీ అండి…మీరు రావటం ఆలస్యం అవుతుందంటే అలా రోడ్డు మీదకు వెళ్ళాను.”అంది అంజలి. “నో ప్రాబ్లం.నేనుకూడా లేటుగానేవచ్చాను కదా.నాకోసం ఇక్కడే వేచి ఉంటే నేను చాలా సంతోషపడేవాడ్ని లెండి. మరేం లేదు మనకోసం ఒకళ్ళు వేచి చూస్తున్నారంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది.చెప్పండి ఏం తీసుకుంటుంటారు?” అడిగాడు హేమంత్. “కాఫీ”అనబోయి “మీ ఇష్టం”అంది అంజలి, మళ్ళీ ఏదంటే ఏమవుతుందో అనుకుంటూ. “నాకు ఈ టైం లో గ్రీన్ టీ తాగడం అలవాటు, ఎందుకో తెలుసా? గ్రీన్ టీ తాగడం వల్ల స్లిమ్ అండ్ పవర్ఫుల్ గా ఉంటారట”అన్నాడు హేమంత్. అంజలికి టీ అంటేనే ఇష్టం లేదు, ఇంకా గ్రీన్ టీ అంటే అసలే నచ్చదు. “నాకు కాఫీ అంటే ఇష్టం”అందామనుకుంది అంజలి కానీ మళ్ళీ ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ “మీ ఇష్టం”అంది. హేమంత్ రెండు గ్రీన్ టీ ఆర్డర్ చేశాడు,”బాబూ ఒక టీ చక్కెర వేయకుండా తీసుకొనిరా”. ఒక్క పది సెకండ్ల పాజ్ తరవాత “యాక్టువల్లీ నేను ప్రీ డయాబెటిక్.కాస్త జాగ్రత్తగా ఉండాలి.”అన్నాడు. తాగలేక తాగలేక ఆ గ్రీన్ టీ తాగడం పూర్తి చేసింది అంజలి,అతని మాటలు ఆలోచిస్తూ. “మీరు ఎప్పటినుండి ఈ ఉద్యోగం చేస్తున్నారు”అడిగాడు హేమంత్. “నా డిగ్రీ అయిపోయాక కాంపస్ సెలక్షన్ లో వచ్చింది ఈ ఉద్యోగం.నాకు బాగా నచ్చిన ఫైనాన్స్ సైడ్ కావటంతో మళ్ళీ ఉద్యోగం మారాలన్న ఆలోచన కూడా లేదు” అంది అంజలి. “కంపెనీ మారితే ఇంకా ఎక్కువ జీతం,పెర్క్సు వస్తాయి కదా” అన్నాడు హేమంత్ “కాస్త ఎథికల్ గా ఉండాలి కదా”అంది అంజలి “జీతం ఎక్కువ అని ఉద్యోగాలు మారుకుంటూ పోతే ఎలా” “ఈ రోజుల్లో అవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? నాలుగు డబ్బులు ఎక్కువ వచ్చి కెరీర్ బాగుంటుందనుకుంటే జంప్ అయిపోతున్నారు.అఫ్కోర్స్ నేను ఈ విధంగా చేయబట్టే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను”అన్నాడు హేమంత్. “నాకు మీ అంత టాలెంట్ లేదు లెండి”అంది అంజలి. వద్దనుకున్నా కాస్త విరుపు ద్యోతకమయింది. సంపత్ చురుగ్గా చూశాడామెవంక,”సర్లేండి,ఈ విషయంలో మీ అభిప్రాయం మీరు చెప్పారు ,ఇంతకూ మీ భవిష్యత్తు ప్రణాళికలు చెప్పారు కాదు”అన్నాడు. “నాకు పెద్దగా ప్రణాళికలంటూ ఏమీ లేవండీ.నేను చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాన్ని చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఎక్కువగా కుటుంబం అభివృద్ధికి పని చేయడమే నాకు ఇష్టం.”అంది అంజలి. “అంటే మీరు హౌస్ వైఫ్ గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారా?మరి ఇంత చదువు చదివి ఉపయోగం ఏమిటి? మీరు గోల్ లెస్ గా వెళ్ళి పోతున్నారు”అన్నాడు హేమంత్. “అంటే నేనెలా ఉండాలని మీ అభిప్రాయం”సూటిగానే అడిగింది అంజలి. “మీరు చాలా ఫ్రాంక్ గా అడిగారు కనుక చెపుతున్నాను, ఇంకా రెండు మూడు సంవత్సరాల తరువాత విదేశాల్లో స్థిరపడటం నా లక్ష్యం.ఇక్కడ ఎంత పనిచేసినా గొర్రె తోక బెత్తెడు లాగా ఎదుగూబొదుగూ ఉండదు.”అన్నాడు హేమంత్. “మరి నాకు ఇష్టం లేక పోతే?”ప్రశ్నించింది అంజలి “అందుకేగా ఇవాళ మిమ్మల్ని కలిసింది.మీకు ఇవన్నీ చెప్పి మిమ్మల్ని కన్వెన్స్ చేయాలనే వచ్చాను.మీరు ఒప్పుకుంటారనే అనుకుంటాను”అన్నాడు హేమంత్. “మరి ఇక్కడ మనం కుటుంబాల సంగతి? వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా” అడిగింది అంజలి. “వాళ్ళదేముంది నెల నెలా వాళ్ళకు చెప్పిన ఎమౌంట్ పంపితే సరిపోతుంది.నేను మా వాళ్ళతో ఇవన్నీ ఎప్పుడో చెప్పాను.వాళ్ళు సరే అని కూడా చెప్పారు.”అన్నాడు హేమంత్. “మరి మా అమ్మ నాన్న?”అడిగింది అంజలి, “వాళ్ళ సంగతి కూడా నేను చూడాలిగా” “పెళ్ళయిన తర్వాత మీ వాళ్ళు ఏమంటారు?అలా అని వాళ్ళను తక్కువ చేయటం లేదు.అంతా మనం బాగుండాలనే కోరుకుంటారు కదా, వాళ్ళకు మీ జీతం తో సంబంధం ఉండదు కదా”అన్నాడు హేమంత్. అతని నైజం మెల్ల మెల్లగా అర్ధం అవసాగింది అంజలికి. అతను ఎంత ‘సెల్ఫ్ సెంటర్డో’అర్ధం అయింది. స్టేజి మీద నాటకం మొదలెట్టడానికి ముందు రంగుల తెర కడతారు ప్రేక్షకులకు ఆకర్షణీయంగా కనిపించేందుకు. తరువాతే అసలు నాటకం మొదలవుతుంది. అంజలికి కళ్ళముందు తెర ఏదో తొలుగుతున్న భావన. ఇంట్లో ఈ పెళ్లి ఆపుచేయించటానికి ఏం మాట్లాడాలో ఆలోచిస్తూంది ఆమె.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు