మనవళ్ల దగ్గరకు వచ్చేసరికి, పాతకాలం నాటి నుంచి వింటున్నాం - ‘అసలు కంటే వడ్డీ ముద్దు’ - అని. కానీ, ప్రస్తుత కాలమాన పరిస్థితులలో - వడ్డీ నిజంగా ముద్దేనా - అని మీకేమో కానీ, నాకు పెద్ద సందేహం రావడమే కాదు – ‘ముద్దు కాదు’ - అని స్థిర నిర్ణయానికి రావలసి వస్తోంది.
' కృష్ణా రామా ' అనుకుంటూ కూర్చొని టీవిలో వచ్చే ఆధ్యాత్మిక ప్రసంగాలు వినవలసిన వయసులో, చంటి పిల్లలను ఐదేళ్లు దాటని మనవళ్లను సాకడం అంటే సామాన్య విషయం కాదని మీరు కూడా నాతో ఏకీభవిస్తారు అని నాకు నమ్మకం.
ఆ పిల్లలకు కాలు చేయి ఒక చోట నిలవదు. మాకేమో కూర్చుంటే లేవలేని బ్రతుకులు. మనవళ్ళని సాకడం స్వంత పిల్లలను పెంచడంకంటే చాలా కష్టతరమే కాక ప్రమాదం కూడా. జాగ్రత్తగా చూసుకోకపోతే, వారికో మాకో కాలూ చేయి విరగడం ఖాయం. అంతేకాక, ఆ మనవళ్ళు ఏ ప్రమాదంలో ఇరుక్కుంటారో అని కళ్ళలో ఒత్తులు వేసుకొని చూడవలసినదే.
మన పిల్లలను పెంచేటప్పుడు అది మన బాధ్యత. కానీ, మనవళ్లను పెంచేటప్పుడు మన పిల్లల బాధ్యత కూడా మన నెత్తి మీద ఉన్నట్టే. అంటే, నా దృష్టిలో ‘కత్తిమీద సాము, మన నెత్తిమీద వేలాడుతున్న కత్తి’ లాంటి సామెతలు గుర్తుకు వస్తూంటాయి.
ఇదంతా ఎందుకు చెప్తున్నాడురా ఈ ముసలోడు అనుకుంటున్నారా. ఇదంతా ముందుగా నా భార్యతో నేను వెళ్లబోసుకున్న వేదన. తరువాత, నాలాగా ఆలోచించే వారు మీలో ఉంటే, ఆ వేదన మీతో కూడా పంచుకుంటూన్నట్టే భావించండి.
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు, అసలు కథలోకి రావోయి అని గోల చేస్తున్నారా. ఇగో వచ్చేస్తున్నా.
మా అబ్బాయి కోడలు ఒకరినొకరు సంప్రదించుకొని - అంటే మమ్మల్ని సంప్రదించకుండా -- ఆలస్యంగా పిల్లలు కనాలని నిర్ణయించుకున్నారట. మళ్ళా ఈ 'అట' ఏమిటంటారా. మన మగవారు ఇంట్లో ఉన్నా అన్ని సంగతులు మనకు తెలియవు. ఏ సంగతైనా సరైన ప్రసార మాధ్యమం - అంటే సహధర్మచారిణి - ద్వారానే మనకు తెలియాలి.
అప్పటికి మా అబ్బాయికి పెళ్ళై రెండేళ్లయింది. వాడి కడుపున ఒక కాయైనా కాయడం లేదేమిటా అని ఒక రాత్రి (అదే, ఒక రోజండీ) నా భార్యను అడిగేను.
"మీ సుపుత్రుడు కోడలుపిల్ల మాట్లాడుకొని ఆలస్యంగా పిల్లలు కనాలని గట్టిగా నిర్ణయించుకున్నారట"
"నీకెలా తెలుసు"
"మీకు పండు తినడం ముఖ్యమా, లేక ఆ పండు ఏ చెట్టునుంచి వచ్చిందో ముఖ్యమా"
"అంటే"
"అయ్యోరామా, మీకు నేను చెప్పిన సమాచారం ముఖ్యమా, అది నాకు ఎలా తెలిసిందో ముఖ్యమా"
"ఎందుకలా నిర్ణయించుకున్నారు, మనతో సంప్రదించవచ్చుగా"
"అడ్డాల నాడు పిల్లలు కానీ, గడ్డాల నాడు కాదు అని మీకు తెలియదా"
"వీళ్ళు పెళ్లి ఆలస్యంగా చేసుకొని పిల్లలను ఆలస్యంగా కంటే ఆ పిల్లలను పెంచడం కష్టం కదా. అంతేకాక, వీరికి వయసు ముదిరి పదవీ విరమణ చేసేసరికి, ఆ పిల్లల కాలేజీ చదువులు మాట దేముడెరుగు హైస్కూల్ చదువులు కూడా అవుతాయో లేదో"
"అది వారి సమస్య. కానీ, మనకు ముందు ఉంది ముసళ్ల పండగ"
"మనకేమైంది ఇప్పుడు"
"ఇప్పుడు ఏమవలేదు, భవిష్యత్తు గురించి నా బెంగ. ముందు ముందు మీకే తెలుస్తుంది లెండి"
"నాన్నా, మేమిద్దరం సినిమాకు వెళ్తున్నాము, పిల్లలు జాగ్రత్త" అని నాతో చేప్పిన నా సుపుత్రుడు వాడి పిల్లలతో "ఇగో పిల్లలూ, తాతయ్యను మామ్మను అల్లరి పెట్టకుండా బుద్ధిగా ఉంటే, నేను వచ్చి మీకు ఐస్ క్రీమ్ ఇస్తాను" అని, కోడలుపిఐఎల్లతో కలిసి సినిమాకు వెళ్లిపోయిన రోజున ;
"అత్తయ్యా, ఇవాళ మీ అబ్బాయి ఆఫీసులో ఫామిలీ డిన్నర్ ఉందట, వెళ్తున్నాము, పిల్లలు జాగ్రత్త" అని నాభార్యతో చెప్పి, నా కోడలు అబ్బాయి వెళ్లిన రోజున ;
నాన్నా, రేపు ఆదివారం మా కొలీగ్స్ ఫామిలీ మీట్ ఉంది, ఉదయం 8 అయితే వెళ్లి రాత్రి 10 సరికి వచ్చేస్తాం, పిల్లలు జాగ్రత్త అని చెప్పి వారు వెళ్లిన రోజున ---
-------నా భార్య అలా ఎందుకందో ఇప్పుడు నాకు అర్ధమవుతూంది.
ఈ బాధ అనుభవించాలే కానీ ఎవరికీ - ఆఖరికి కడుపున కన్న పిల్లలతో - కూడా చెప్పుకోలేని పంచుకోలేని వ్యధ. ఎప్పుడెప్పుడు మనవళ్ల తల్లితండ్రి వచ్చి ఈ బరువు తగ్గిస్తారా అని ఎదురుచూపులే.
-------ఇప్పుడు చెప్పండి మన స్వంత మనవళ్ళు - అదే వడ్డీ - ముద్దుగా అనిపిస్తారా? *****