పూర్వం దండకారణ్యంలో ఓ చిట్టెలుక వుండేది. అది రోజూఉదయం కలుగులో నుంచి బయటకు వచ్చి అడవిలో లభించే కందమూలాలను తిని సాయంత్రం అయ్యేసరికి కలుగులోకి వెళ్లి దాక్కునేది.
మళ్లీ ఉదయం బయటకు వచ్చి అడవి అంతా తిరిగి పుష్టికర ఆహారం తిని వెళ్లేది.
ఓ రోజు తన పిల్లలను పిలిచి ‘‘ పిల్లలూ.. ఇంటి నుండి బయటకు రావద్దు.. రోజులు బాగాలేవు.. శత్రువుల బారీ నుండి జాగ్రత్తగా వుండాలి. సాయంత్రం నేను వచ్చే వరకు ఎవరూ వున్న చోటు నుండి కదలకండి..’8 అని హితవు పలికి అడవిలోకి వెళ్లింది.
అదే సమయంలో ఓ పెద్ద పాము కలుగులోకి దూరింది. ఎలుక పిల్లలు భయంతో వణికిపోయాయి. గట్టిగా కిచకిచ అని అరిచాయి.
పిల్లలు అరుపులు విని ఎలుక అడవిలోంచి పరుగెత్తుకొచ్చింది. అప్పటికే పెద్ద పాము కలుగును ఆక్రమించింది. ఎలుక తన పిల్లలను తలుచుకుంటూ కుమిలిపోసాగింది. అల్లంత దూరంలో మనిషి చప్పుడు విని అపదలో వున్న తనపిల్లలను రక్షించాలని వేడుకుంది.
ఎలుక ఆందోళనను గమనించిన మనిషి కలుగు వద్దకు వచ్చి పామును కట్టెతో లాగి బయటకు తీశాడు. అప్పటికే భయంతో ఊపిరి ఆడక తల్లడిల్లిన పిల్లలు బతికి వుండటం చూసి ఊపిరి పీల్చుకుంది ఎలుక.
పామును బయటకు తీసిన మనిషి దాన్ని చంపి చర్మం తీసి సంచిలో వేసుకుపోయాడు. తనకు కూడా ఏమైనా ప్రాణహాని కలిగిస్తాడేమో నని ఎలుక గజగజ వణికిపోయింది.
తన కారణంగా ప్రాణాలు కోల్పోయి అనాథలుగా మారిన పాము పిల్లలను తనే చూసుకుంది ఎలుక.
పామును చంపిన మనిషి ఇంటిని కనుక్కుని వెళ్లింది ఎలుక. ఇంటి నిండా వున్న జంతు చర్మాలు చూసి అవాక్కయింది. మనిషి క్రూర బుద్ధిని గ్రహించింది. ఆ తర్వాత అడవికి వెళ్లింది. మనిషి కన్నా నయమైనపాము పిల్లలతో స్నేహం చేస్తూ మనిషి బారీ నుంచి కాపాడు కుంది ఎలుక.