అదొక ప్రభుత్వ ఉన్నత పాఠశాల.
ఆరోజు పాఠశాల వార్షికోత్సవం. సాయంత్రం ఆరు గంటలకు సభ ఆరంభమయ్యింది. ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి రమణయ్య గారు హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణమంతా ప్రేక్షకులతో నిండిపోయింది. తమ బిడ్డలు బహుమతులు అందుకోబోయే దృశ్యాలను కళ్ళారా చూడాలని తహ, తహలాడుతున్నారు.
వేదికపై కూర్చొన్న పెద్దల ఉపన్యాసాల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. అందులో చివరి కార్యక్రమం అందరినీ మరింతగా ఆకట్టుకుంది. అది భారతదేశ గణితశాస్త్ర మహా మేధావి అయిన రామానుజం గారి ఏకపాత్రాభినయం. ఆ పాత్రను తొమ్మిదవ తరగతి విద్యార్థి విజయకుమార్ అభినయించాడు. సభ కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది.
ఇక బహుమతుల కార్యక్రమం.. అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకటించారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఉపేంద్ర బహుమతుల వివరాలు ప్రకటిస్తారని చెబుతూ.. ముఖ్య అతిథి శ్రీ రమణయ్యగారి చేతుల మీదుగా పిల్లలకు బహుమతులు అందజేయాలని విజ్ఞప్తి చేసారు. సభలో హర్షం వెల్లివిరిసింది.
ఉపేంద్ర గొంతు సవరించుకుని.. “ముందుగా తరగతిగదుల అలంకరణ విభాగంలో తొమ్మిదవ తరగతికి ప్రధమ బహుమతి. తరగతి నాయకుడు విజయకుమార్” అనగానే విద్యార్థుల కేరింతలు, చప్పట్లు మిన్నంటాయి.
స్వయం పరిపాలనా దినోత్సవం నాడు గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించిన విజయ కుమార్ కు ప్రధమ బహుమతి. వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రకళా పోటీలలో.. నేటి ఏకపాత్రాభినయానికి గాను విజయకుమార్ ప్రధమ బహుమతి రావడం సభ సాంతం అభినందనల ఝల్లు కురిపించింది.
“ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవం నాడు పవిత్ర రామాయణ గ్రంథం మీద మన ఊరి ఆర్యసమాజం సంస్థ నిర్వహించింది. అందులో గెలుపొందిన వారి వివరాలతో బాటు నగదు బహుమతులు గూడా పంపారు. వారికి మన పాఠశాల తరఫున ధన్యవాదములు తెలుపుతున్నాము” అంటూ మరో ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు ఉపేంద్ర. సభ ఉత్సుకతతో ఎదురి చూడసాగింది.
“ప్రథమ బహుమతి విజయకుమార్ ” అని ప్రకటించగానే రమణయ్య గారు లేచి విజయకుమార్ కు ఎదురుగా వెళ్లి తన హృదయానికి హత్తుకున్నాడు. ఆదృశ్యం చూసి సభ యావత్తు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో మరో మారు జేజేలు పలికింది.
“బాబూ విజయకుమార్.. నీ శక్తిసామర్థ్యాలు సామాన్యమైనవి కావు. రామాయణం మీద పట్టు సాధించడం చాలా గొప్ప విషయం. నువ్వు ఎలా కృషి చేస్తున్నావో సభకు తెలియజేయి” అంటూ మైకు ముందుకు తీసుకు వెళ్ళాడు రమణయ్య. ఉపేంద్ర విజయకుమార్ కు అనుకూలంగా మైకును సరి చేసాడు.
విజయకుమార్ ఏమాత్రమూ తొణకకుండా సభను వినయంగా సంభోదించి..
“నేను మన ప్రభుత్వ పాఠశాలలో చదవడం మహాభాగ్యం. ఉపాధ్యాయులందరూ చక్కగా పాఠాలు చెబుతున్నారు. వారికి ముందుగా నా వందనాలు” అంటూ శిరస్సు వంచి నమస్కరించాడు.
“తరగతి గదిలోని విజ్ఞానం మాత్రమే సరిపోదు. గ్రంథాలయానికి వెళ్లి చదువుకోవాలని మా తాతగారు హితవు చెప్పే వారు. తాతయ్య నా మార్గదర్శి. నేను ప్రతి రోజూ వెళ్లి తాతగారు సూచించిన పుస్తకాలను చదివి ముఖ్య విషయాలను రాసుకునే వాణ్ణి. రాత్రి పడుకునే ముందు తాతగారు నాతో సంపూర్ణ రామాయణం చదివించేవారు. నా సందేహాలను నివృతి చేసే వారు. అలా నేను రామాయణగాధను కొంచెం అనగాహన చేసుకున్నాను. దీనికంతటికీ కారణం.. నాతల్లిదండ్రులు” అని కాసేపు సభవంక చూశాడు విజయకుమార్. సభలో నిశ్శబ్దత ఆవహించింది. కారణమేమై ఉంటుందా అని కుతూహలంగా సభ చెవులు నిక్కించింది. విజయకుమార్ తిరిగి చెప్పసాగాడు.
“ఒకరోజు మాతాతయ్యను అనాథాశ్రమంలో చేర్పించాలని అమ్మా, నాన్న మాట్లాడుకుంటున్నారు. నేను వెంటనే కలుగ జేసుకుని నానమ్మ మాత్రమే లేదు. కాని మనమంతా ఉన్నాం కదా.. తాతయ్య అనాధ ఏలా అవుతాడు?. అంటూ ప్రశ్నించాను. అన్నం తినకుండా మారాం చేసాను. తాతయ్య నాకు హోంవర్క్ చేయిస్తున్నాడు. పాఠాలు, నీతి కథలు చెబుతున్నాడు. తాతయ్యను నా నుండి దూరం చెయ్యొద్దని ఏడ్చాను. చివరికి నా తల్లిదండ్రులు బాగా ఆలోచించి నిజమేనని.. సరియైన నిర్ణయం తీసుకున్నారు. అలా మాతాతయ్య మార్గదర్శకంలో నేను నడిచే అవకాశం కలిగింది. తాతయ్యకు, చిత్రలేఖనం, సంగీతం కూడా వచ్చు” అంటూ కళ్ళు పెద్దవిగా చేసుకుని తన తాతయ్య ప్రతిభను హావభావాలతో అనునయించాడు.
“తాతయ్య మూలాన నాకు గ్రంథాలయం గొప్పతనం తెలిసింది. మన పాఠశాలలో కూడా గ్రంథాలయం అవసరం. నాకు వచ్చిన నగదు బహుమతిని గ్రంథాలయం కోసం విరాళంగా ఇస్తున్నాను” అంటూ ప్రకటించాడు విజయకుమార్.
సభలో కరతాళధ్వనులు మిన్నంటాయి.
ప్రధానోపాధ్యాయులు పరుగు, పరుగున వచ్చి విజయకుమార్ ను అభినందించాడు. విజయకుమార్ అందజేసిన నగదు బహుమతిని రమణయ్యగారి చేతుల మీదుగా తీసుకుంటూ.. “అధ్యాపకబృందం తరఫున ఒక రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించాడు. గ్రామ పెద్దలు, వ్యాపారస్తులు పోటీ పడి వేదికనెక్కి విరాళాలు ప్రకటించారు.
ఒక చిన్న పిల్లవాని ప్రతిభ ద్వారా విరబూసిన ఫలితాన్ని చూసి.. తన వంతు సహాయ సహకారాలుంటాయని ప్రకటించాడు రమణయ్య. *