పెరుగు దిద్దిన కాపురం - జి.ఆర్.భాస్కర బాబు

Perugu diddina kapuram

చిన్మయి రాఘవ కొత్తగా పెళ్లయిన జంట. చూడముచ్చటైన జంట అని అందరూ అనుకున్నారు. ఇద్దరూ విద్యాధికులే.మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి కంటే ముందే రాఘవ ఓ గేటెడ్ కమ్యూనిటీ లో అపార్ట్మెంట్ కొన్నాడు. కొత్త జంట కావటంతో ఆఫీసులో కూడా పని విషయంలో కాస్త రిలాక్స్డ్ గానే ఉంచారు.వాళ్ళ సంసారం ఆనందకరంగానే మొదలయింది. “ఓ నాలుగు రోజుల పాటు హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నాం”అని ఫోన్ చేశాడు రాఘవ తండ్రి. “రండి నాన్నా దీనికి నన్ను అడగాలా”చెప్పాడు రాఘవ. రాఘవ తల్లి తండ్రి వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళిపోయారు. నాలుగు రోజుల తర్వాత ఓ శుభోదయాన చిన్మయి ఆఫీసు సీట్లో కూర్చున్న వెంటనే సెల్ ఫోన్ మోగింది. “ఆ.. అమ్మా చెప్పు.”చిన్మయి “ఏం లేదమ్మా, మొన్న మీ అత్త మామ వచ్చి వెళ్ళార్ట కదా. అది అడుగుదామని ఫోన్ చేశాను.” “ఏముందమ్మా ,మా అత్తగారి చెల్లెలి కొడుకు ఇల్లు కొనుక్కుని గృహ ప్రవేశం పెట్టుకున్నాడు.ఆ ఫంక్షన్ కు వచ్చారు.అది చూసుకుని వెళ్ళి పోయారు.”చెప్పింది చిన్మయి. “మిమ్మల్ని పిలవలేదా మరి?” “మేం కూడా వెళ్ళామమ్మా”కాస్త చిరాగ్గా అంది చిన్మయి. “ఏం లేదమ్మా నేను మీ నాన్నగారు మీ దగ్గరకు వచ్చి ఓ నాలుగు రోజుల పాటు ఉందామనుకుంటున్నాం” అందామె. “సర్లే అమ్మా కాసేపటి తర్వాత ఫోన్ చేస్తాను.ఇంకా పని మొదలు పెట్టలేదు.”అంటూ ఫోన్ కట్ చేసింది చిన్మయి. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తరువాత రాఘవతో విషయం చెప్పింది. “దాందేముంది డాలి,రమ్మను మనకు మూడు బెడ్ రూం లు ఉన్నాయి కదా.ఏం సమస్య లేదు.”అన్నాడు రాఘవ. సమస్య బెడ్ రూం దాటి బెడ్ మీదికి వస్తుందని అప్పుడు అనుకోలేదు రాఘవ. ఆదివారం ఉదయం చిన్మయి అమ్మ నాన్న వస్తున్నట్లు ఫోన్ చేశారు. ‌సాధారణంగా ఆదివారం శెలవు కావడంతో కాస్త లేటుగా లేస్తాడు రాఘవ.కాని అత్తా మామ వస్తున్న రైలు ఉదయం ఆరు గంటలకే వస్తూండటంతో అతను ఐదు గంటలకే లేచి కారు తీసుకుని స్టేషన్ కి వెళ్ళాడు.ఆరు గంటలకు రావాల్సిన బండి గంట లేటుగా ఏడు గంటలకు వచ్చింది.ఆలోగా ఆరేడు సార్లు అతని మామగారు, చిన్మయి ఫోన్ చేస్తూనే ఉన్నారు.మొత్తానికి ట్రైన్ రావటం వాళ్ళను ఇంటికి తీసుకువెళ్ళటం అయినాయి. ఆమధ్య కాలంలో అంత త్వరగా లేచే అలవాటు లేకపోవటంతో అతని నిద్ర వస్తోంది.చిన్మయి వాళ్ళకు టిఫిన్ చేయటానికి చూస్తూంటే, వాళ్ళ అమ్మగారు “అక్కడేదో రాఘవేంద్ర హోటల్ ఉందట కదా.అక్కడ టిఫిన్ చాలా బాగుంటుందటకదా,అక్కడ్నుండి తెప్పించెయ్ ఈ పూటకి”అంది. తప్పేది లేక రాఘవ అక్కడ నుండి టిఫిన్ తీసుకుని వచ్చాడు. టిఫిన్ చేస్తున్నంతసేపు చిన్మయి వాళ్ళ అమ్మగారు ఆవిడ పుట్టింటి సంగతులు చెపుతూనే ఉంది.అక్కడ ఇల్లు ఎంత పెద్దదో ,వాళ్ళ చుట్టాలు అందరూ ఎంత మందో, వాళ్ళ స్టేటస్ ఎంత పెద్దదో, వాళ్ళకున్న ఆస్తులు ఎలా కరిగిపోయాయో నాన్ స్టాప్ గా చెపుతూనే ఉంది. చిన్మయి కి అలవాటే కనుక పెద్దగా పట్టించుకో లేదు. అతని మామగారు మాత్రం “అంతేగా అంతేగా”టైపు లో తలాడిస్తూ ఉండి పోయాడు.టిఫెన్లు చేసే ప్రహసనం అలా ముగిసింది. ఆదివారమే కాబట్టి లంచ్ కి బైటకు వెళ్దాం అని చెప్పాడు రాఘవ. “ఎందుకండీ అల్లుడు గారూ,మా అమ్మాయి నేను కలిసి క్షణాల్లో వంట చేసేస్తాం”అంది అత్తగారు”అబ్బాయి కి ఏమి ఇష్టమో చెప్పమ్మా” “వచ్చేవారం నీవు వండుదుగాన్లే ప్రయాణం చేసి వచ్చారు కదా కాస్త రెస్ట్ తీసుకోండి.”అంది చిన్మయి. “ఓకే.. టేబుల్ బుక్ అయింది,పరంపరా లో”చెప్పాడు రాఘవ “ఒకటిన్నర కల్లా అక్కడ ఉండాలి”. హోటల్ లో బఫే బుక్ చేశాడు రాఘవ. అక్కడికి చేరుకునే సరికి ఒంటి గంట అయింది.టేబుల్ సూపర్వైజర్ ఇంకో పది నిమిషాలు వేచిఉండాలని చెప్పాడు. ఆ హోటల్ అత్తగారికి మామగారికి బాగా నచ్చింది.సింహద్వారానికి అటూఇటూ నిలబెట్టిన బొమ్మలు బాగా నచ్చాయి. “బైట బానే ఉందే అమ్మాయ్,వంటలెలా తగలడతాయో” అందామె. “తినబోతో రుచెందుకే అమ్మా” అంది చిన్మయి. “బాగుండకపోతే అల్లుడు ఎందుకు తీసుకొస్తాడు” అన్నారు మామగారు. తిన్నంత సేపూ తను చేసే వంటలగురించి చెపుతూనే ఉంది అత్తగారు. పక్క టేబుల్ వాళ్ళు వీళ్ళవంక విచిత్రంగా చూస్తూంటే చిన్మయి “ఊరుకోవే అమ్మా ఇంటికెళ్ళి మనం కబుర్లు చెప్పుకుందాం, ముందు తిను”అంది. “నన్ను మాట్లాడనియవేమిటే..మీ నాన్నగారు చూడు,నేనేమన్నా నవ్వుతూ తలూపుతారు అన్నిటికీ”అంది అత్తగారు. పెళ్లి అయిన తరువాత అత్తగారు మామగారు వీళ్ళ ఇంటికి వచ్చిందిలేదు,ఇదే మొదటిసారి.ఆవిడ వాగ్ధాటి గురించి పెళ్ళయిన తర్వాత చుట్టాలు వారు కొంతమంది మాట్లాడుతూ ఉంటే విన్నదేకాని ప్రత్యక్షంగా చూసింది లేదు.”అమ్మో ఆవిడా పెద్ద కంచు బాబోయ్” అంటూంటే విని నవ్వుకున్నాడు రాఘవ.కాని ఇప్పుడు అతను ప్రత్యక్షంగా చూస్తుంటే అర్ధం అవసాగింది.చిన్మయి తల్లిని ఏమీ అనకపోయినా చూపుల్లో చిరాకు అతని కన్ను దాటి పోలేదు. మొత్తానికి భోజనాలు అయ్యాక ఇంటికి బయలు దేరారు. దారిపొడవునా వాళ్ళ అక్క కొడుకు సోమయాజులు ఎంత గొప్పవాడో, చెల్లెలి కూతురు ఎంతమంది చుట్టాలు పిల్లల్ని ‘అమేరికా’ తీసుకుని వెళ్ళిందో కధలు కధలు గా చెపుతూనే ఉంది.అతని మామగారు మాత్రం ఆమె వంక చిద్విలాసంగా చూస్తున్నారు. ఇంటికి వచ్చాక రాఘవ కాస్త కునుకు తీద్దామనుకున్నాడు కానీ వాళ్ళ బెడ్ రూమ్ లోకి అత్తగారు దూరిపోయింది. చిన్మయితో కబుర్లు చెబుతూ కూర్చుంది.మామగారు వాళ్ళకు కేటాయించిన గదిలో నిద్రకు ఉపక్రమించారు. రాఘవ రెండు మూడు సార్లు అటూ ఇటూ తిరిగాడుగానీ ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు.రాఘవ చిన్మయి వంక చూశాడు.ఆమె కూడా అమ్మ మ్యానియా లో మునిగిపోయింది.ఇక చేసేది ఏమీ లేక ఆఫీసు పని కోసం కేటాయించిన గదిలో ఉన్న దివాను మీద నడుంవాల్చాడు. సాయంత్రం వరకు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. రాత్రికి షరా మామూలే లాగా అత్తగారి ప్రభంజనానికి మిగిలిన ముగ్గురు గడ్డిపోచల్లాగా అల్లాడి పోయారు. రాఘవ సోమవారం కోసం ఎప్పుడూ అంతలా ఎదురు చూడలేదు.ఉదయాన్నే లేచి తయారై ఓ గంట ముందుగానే ఇంట్లోనుండి బయట పడ్డాడు.ఆఫీసుకి వెళ్ళటం లో అంత హాయిని అతనెప్పుడూ అనుభవిచలేదు. రెండు రోజులు గడిచాయి.చిన్మయి సాధారణంగా ఆఫీసు కు శెలవు పెట్టదు.వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారని మూడు రోజులు శెలవు తీసుకుంది. దాంతో రాఘవ ఒక్కడే ఆఫీసు కు వెళుతున్నాడు. ఆఫీసు కి వెళ్ళేటప్పుడు చిన్మయి చేసే చిలిపి అల్లరి గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు.ఇంకా ఎన్ని రోజులో అనుకుంటూ నిట్టూర్పులతోనే బయటకు నడిచాడు. ******** “శనివారం మేం బయలుదేరతాం అల్లుడు గారూ”చెప్పారు మామగారు. చెవుల్లో అమృతం పోసినట్టు ఫీలయ్యాడు రాఘవ. మాటవరసకు మాత్రం”అప్పుడేనా మామయ్యగారూ, ఇంకా నాలుగు రోజుల పాటు ఉండవచ్చు కదా”అన్నాడు. “లేదు అల్లుడు గారూ, మళ్ళీ వచ్చేనెల మా మరదలి చెల్లెలి కొడుకు పెళ్లి ఉంది.దానికి తప్పకుండా రావాలి.”అన్నారు మామగారు. “సర్లేండి మీ ఇష్టం,”అంటూనే లోలోపల మాత్రం ఆనందపడ్డాడు రాఘవ. *********** మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అత్తగారిని, మామగారిని రైల్వే స్టేషన్ కి తీసుకుని వెళ్ళాడు రాఘవ. శనివారం శెలవు కావడంతో చిన్మయి కూడా స్టేషన్ కి వచ్చింది.వెనక సీట్ లో కూర్చుని చిన్మయి, అత్తగారు మాట్లాడుకుంటున్నారు.మళ్ళీ ఎప్పటికి కలుస్తామో అన్నట్లు కబుర్లు చెప్పుకుంటున్నారు.స్టేషన్లో ప్లాట్ఫారం మీద కూడా చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు.చూసేవాళ్ళకెలాఉందో కాని రాఘవ కు మాత్రం వారి ప్రవర్తన కాస్త అతిగా అనిపించింది.మామగారు పెద్దగా మాట్లాడని మనిషి కావటంతో రాఘవకు ఏం తోచటం లేదు. ‘నెత్తిన పాలు పోసినట్టు’ట్రైన్ వస్తున్నట్లు ఎనౌన్స్ చేసారు. సెండాఫ్ ఇస్తూ కళ్ళనీళ్ళపర్యంతం అయింది చిన్మయి. “వచ్చే పదిహేను రోజుల్లో వస్తాం కదమ్మా, ఎందుకు అంత బాధపడతావు?”అంది అత్తగారు. “అమ్మో “అనుకున్నాడు రాఘవ. ట్రైన్ కనుమరుగయ్యే వరకు కళ్ళలో నీళ్ళతో చెయ్యి ఊపుతూనే ఉంది చిన్మయి. ఆరోజు ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఆమె చాలా మూడీగా ఉంది.రాఘవ ఏమడిగినా “ఆ” “ఊ”లతోనే గడిచింది. మరుసటిరోజు ఉదయాన్నే “ఈ రోజు ఎటైనా వెళ్దామా” అని అడిగాడు రాఘవ. “ఇప్పుడు ఎందుకు?మా అమ్మా నాన్నా ఉన్నప్పుడయితే బాగుండేది, అయినా వాళ్ళంటే మీకు ఎప్పుడూ చిన్నచూపే”మూతి మూడు వంకర్లు తిప్పుతూ అంది చిన్మయి. “అదేమిటి అలా అనేశావు…నేనేం తక్కువ చేసి మాట్లాడాను మీ వాళ్ళతో?”అడిగాడు రాఘవ. అంతలో చిన్మయి ఫోన్ రింగ్ అయింది.”ఆ..అమ్మా చెప్పు ప్రయాణం బాగా జరిగిందా? ఎన్ని గంటలకు ఇంటికి చేరుకున్నారు?”అడిగింది చిన్మయి. స్పీకర్ ఆన్ లో ఉందేమో ఆ సంభాషణ అంతా వినిపిస్తోంది. “ఇప్పుడే వచ్చామమ్మా,అలా బ్రష్ చేసుకుని కాఫీ తాగుతూ నీకు ఫోన్ చేస్తున్నాను.” “ వారంరోజులు అక్కడ లేవుకదా ఏంటి విశేషాలు?” “ఇక్కడేముంటాయమ్మా, నిన్ను చూస్తేనే నాకు బాధేసింది” ఇంకా ఏదో చెప్తూంది అత్తగారు, చిన్మయి టక్కున స్పీకర్ ఆఫ్ చేసి బైటకు వెళ్ళి మాట్లాడసాగింది. రాఘవ మనసు చివుక్కుమంది.తమ మధ్య దాపరికం లేదనుకునేవాడు.అందుకే ప్రతి విషయం ఆమెతో చెప్పేవాడు.చిన్మయి కూడా ఓపెన్ గా ఉండటాన్ని చాలా మెచ్చుకునేది. చిన్మయి ఓ పావుగంట తర్వాత లోపలికి వచ్చింది. “ఏంటోయ్ అయిపోయాయా మీ కబుర్లు, నేనడిగింది ఇంకా నీవు చెప్పనే లేదు. ఎక్కడికైనా బైటకు వెళ్దామా?” అని అడిగాడు. “మీ ఇష్టం”అనేసి లోపలి గదిలోకి వెళ్ళిపోయింది చిన్మయి. “ఏమయింది అంత మూడీగా ఉన్నావు.ఎనీ ప్రాబ్లం?” అడిగాడు రాఘవ. “ఏం లేదు.ఎందుకో పొద్దున్నించి చాలా తలనొప్పి గా ఉంది.రాత్రి కూడా సరిగా నిద్ర పట్టలేదు”అంది చిన్మయి. “సర్లే ఇవాళ రెస్ట్ తీసుకుందాం.మళ్ళీ రేపటి నుంచి ఆఫీసు ఇల్లు సరిపోతుంది”అన్నాడు రాఘవ. ********** ఆ వారం రోజుల్లో రాఘవ ఓ విషయం గమనించాడు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఓ ఆరేడు సార్లు చిన్మయి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తూంది.మొదట్లో క్లుప్తంగా ముగించినా రాను రాను ఆ కాల్ వ్యవధి పెరిగింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత చిన్మయి కొంతసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయేది.కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడ సాగాయి.అడిగితే ‘ఏం లేదు’ అనేది. ************* ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఓరోజు ఉన్నట్టుండి “మిమ్మల్ని ఓ విషయం అడగాలి” అంది చిన్మయి, “మనం ఇద్దరం సంపాదించి ఏం చేయాలి, మీరు ఒక్కరే ఉద్యోగం చేస్తే చాలదా?” “ఇదేం ఆలోచన ఉద్యోగం మానేసి ఏం చేద్దామని” అన్నాడు రాఘవ “రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళకు అన్ని వసతులు సమకూర్చటానికి మనం ఫైనాన్సియల్ గా సౌండ్ పొజిషన్లో ఉండాలిగా” “ఏమో నండీ మా అమ్మ కూడా మొన్న వచ్చినప్పుడు చాలా బాధ పడింది,నేను బొత్తిగా పాడయిపోయానని.ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావే అని ఒకటే బాధ పడింది”అంది చిన్మయి. రాఘవకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.అంత చదువుకుని కూడా ఇంత అమాయకంగా ఆలోచిస్తుంటే ఏమనాలో తోచలేదు. “సరేలే ఉద్యోగం మానేయడం సంగతి పక్కన పెట్టు.. మీవాళ్ళది ఎవరిదో పెళ్ళి ఉంది అన్నారుగా,మరి మీ అమ్మా నాన్నా ఎప్పుడు వస్తున్నారు?”అడిగాడు రాఘవ. “అమ్మ పొద్దున్నే ఫోన్ చేసింది.నేనే చెపటం మరచి పోయాను.వాళ్ళు ఎల్లుండి ఆదివారం ఉదయం కల్లా ఇక్కడ ఉంటారు.”అంది చిన్మయి. రాఘవ ఆలోచనలో పడ్డాడు. “ఓ పావుగంట అలా నడిచి వస్తాను”అని ఇంట్లోనుండి బయట పడ్డాడు.అలా నడుచుకుంటూ పార్క్ లోకి వెళ్లాడు.అక్కడ ఓ బెంచి మీద కూర్చున్నాడు.ముందు ఇద్దరు ఆలుమగలు మాట్లాడుకుంటున్నారు. “ఏంటోయ్ రెండు రోజులనుండి చూస్తున్నా.. పెరుగు తోడుకోవటంలేదు ఎందుకంటావు?” “మనం ఊరికినే కదిలిస్తూ ఉంటే ఎలాగండీ?మీరూ కదిలించి ,నేనూ కదిలించి ఎలా? పెరుగు తోడుకోవాలంటే కనీసం నాలుగైదు గంటలు కదపకుండా ఉండాలి కదా” వాళ్ళు యథాలాపంగా మాట్లాడిన మాటల్లొ రాఘవకు ఏదో దారి దొరికినట్లయింది. ************ ఆదివారం రానేవచ్చింది.రాఘవ రైల్వే స్టేషన్ కి వెళ్ళి అత్త మామల్ని తీసుకొని వచ్చాడు. కాఫీ టిఫిన్ లు యధావిధిగా రాఘవేంద్ర నుండి తీసుకుని వచ్చాడు. అత్తగారు కూతురితోపాటు బెడ్ రూం లో దూరింది. మామగారు రెస్ట్ తీసుకుంటున్నారు. రాఘవ వంటగదిలో పెరుగు గిన్నె తెచ్చి తోడేసిన పాలను త్రిప్పుతూ కూర్చున్నాడు.బైటకు వచ్చిన చిన్మయి అదిచూసి “అదేంటి ఆ పాలను అలా తిప్పేస్తున్నారు?” అంది. “ఏం లేదులే…ఇట్లా తిప్పితే పెరుగు బాగా గట్టిగా తోడుకు ఉంటుందని మా కొలీగ్ ఒకతను చెప్పాడు”అన్నాడు రాఘవ. “ఇంతకీ రేపు శెలవు పెట్టారు కదా.అమ్మా వాళ్ళను మా చుట్టాలింటికి తీసుకువెళ్ళాలి” “నేనెందుకు చెప్పు క్యాబ్ బుక్ చేస్తాను.వెళ్ళాలంటే నీవు వెళ్ళిరా.అయినా వాళ్ళు మనల్ని పిలవలేదు కదా” “మా అమ్మతో మరీ మరీ చెప్పారట వాళ్ళు నన్ను తీసుకురమ్మని, నాతో పాటు మీరూను” “అలా బాగుండదులే వెళ్ళాలంటే నీవు వెళ్ళు” మాట్లాడుతున్నంతసేపూ రాఘవ పాలను కలూపుతూనే ఉన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన అత్తగారు “అయ్యో అదేంటి అల్లుడు గారూ పాలను అలా తిప్పేస్తున్నారు,అలా చేస్తే పెరుగు తోడుకోదండీ”అంది. “కాదులేవే అమ్మా ఇలా చేస్తే పెరుగు బాగా గట్టిగా తోడుకుంటుందట”అంది చిన్మయి. “నీ మొహం,పాలు కదులుతూనే ఉంటే పెరుగు తయారవదమ్మా.పాలు తోడేసి ఒక చోట కదలకుండా ఉంచాలి, అప్పుడే మంచి పెరుగు తయారవుతుంది” అందామె. “అవునా అత్తగారూ నాకు ఈ విషయం తెలియదు.” అన్నాడు రాఘవ. మధ్యాహ్నం అంట్లు తోమటానికి వచ్చిన చుక్కమ్మ ఇదంతా చోద్యం చూస్తోంది. “అయితే పెద్దమ్మ గోరూ,మీరు మాటిమాటికీ ఈళ్ళ సొంసారం లో కలిపించుకుంటావుంటే ఈళ్ళ పాలు పెరుగెప్పుడవుతాయండీ”అంది చుక్కమ్మ. “అదేమిటే అంతమాటనేశావూ”గయ్యన లేచింది అత్తగారు. “తప్పుగా అనుకోవద్దండి అమ్మగోరూ,ఈ బాబుగారింటో ఇల్లు కొనుక్కున్నప్పట్నుండి పని సేత్తావుండానండి,ఆ సొతంత్రంతో సెపుతావుండానండి.మొన్న మీరొచ్ఛి ఎల్లి నొప్పట్నుండి ఆయమ్మ తిండే తినటంలేదండే.ఆ కళ్ళు సూడండి ఎట్టా గుంటలడిపోయ్ నాయో.మరి మీరేం చెప్పారో ఆయమ్మకేం అరదమయినాదో.ఎప్పుడూ ఏదో ఆలోసిస్తూ ఉంటాది.ఇట్టాసెప్పచ్చో లేదో నాకు తలవదండే మనం పెద్దోళ్ళం ఆళ్ళ సంసారాల్లోకి తొంగి సూడకూడదండే. ఆళ్ళంతటాళ్ళే ఏదయినా అడిగితేనే చెప్పాలంతే .అమ్మా ఎక్కువగా మాట్టాడాననిపిత్తే సెమించండమ్మాదండాలండే” అని గుక్క తిప్పుకోకుండా అనేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ముఖం కందగడ్డలా చేసుకుని అత్తగారు మామగారి దగ్గరకు వెళ్లింది. ఆసాంతం విన్న చిన్మయి అంతర్మధనంలో పడింది. “చుక్కమ్మ చెప్పింది నిజమే కదా.అమ్మ చెబుతూంటే పిచ్చిమొద్దులా అన్నీ తలకెక్కించుకున్నానేమిటి? ఉద్యోగం మానేసి ఏంచేయాలి? రాఘవ ఆవిషయాన్ని ఎంత లైట్ గా తీసుకున్నాడు.అతిప్రేమతో అమ్మ చెపితే కూడా నేనెందుకు రియలిస్టిక్ గా ఆలోచించలేక పోయాను అమ్మ ప్రేమ గొప్పదే,కానీ నా కాపురం గురించి నేనే ఆలోచించుకోవాలి కదా.రాఘవ ఎంత సహనంతో ఉన్నాడు.”ఆమె మనసు క్రమంగా తేలిక అవసాగింది. మరుసటిరోజు ఉదయం వాళ్ళ అమ్మగారు “ఇంకా తెమలలేదేమిటే? అవతలి టైం అయిపోతూంది”అని హడావిడి పడసాగింది. “మేం రావటానికి కుదరదమ్మా, రాఘవ ఆఫీసు మానటానికి లేదు.అదీకాక వాళ్ళు మమ్మల్ని పిలవలేదు.మీరు లగేజ్ తీసుకుని అట్నుంచి అంటే మన ఊరికి వెళతానన్నావుగా.ఇంటికి చేరిన తరువాత ఫోను చేయమ్మా.నీవు నాన్న ఓ సారి హాల్లో కూర్చోండి, బొట్టు పెడతాను” అంది చిన్మయి. రాఘవ, చిన్మయి వాళ్ళ ఇద్దరికీ బట్టలు పెట్టి కాళ్ళకు నమస్కారం చేశారు. రాఘవ మనసులో చుక్కమ్మ కు థాంక్స్ చెప్పుకున్నాడు తన ప్లాన్ చక్కగా అమలు చేసినందుకు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు