ఓ బ్రేకింగ్ న్యూస్ - బివిడి ప్రసాద రావు

ఓ breaking news
రోహిణి తన కుడి చెవి ఇయర్‌బడ్ ని సరిచేసుకుంది. తన ముందు ఉన్న స్టాండ్ మైక్రోఫోన్‌ వైపుకు కొద్దిగా వంగింది.
స్టూడియోలోని ఏసి చల్లదనం పల్చగా ఉంది.
నిశ్శబ్దం మాత్రం మెండుగా ఉంది.
అంతలోనే.. సిగ్నల్ లైట్ ఎరుపు నుండి ఆకుపచ్చగా మారింది. దాంతో ప్రత్యక్ష ప్రసారం మొదలయ్యింది.
రోహిణి స్థిరంగా.. "అందరికీ శుభ సాయంత్రం. 'హిత స్వరాలు' కార్యక్రమంకి స్వాగతం. నేను రోహిణి." చెప్పింది.
పిమ్మట.. రోహిణి చిన్నగా కదిలి.. "నేటి అంశం.. 'అత్యాచారం మరియు దాని ప్రభావం.' దీని గురించి మాట్లాడుటకు ముగ్గురు ప్రముఖులు ఇక్కడకి వచ్చి ఉన్నారు." చెప్పి ఆగింది.
కెమెరా రోహిణి వైపు నుండి వెనుక్కు జరిగింది.
టివి తెర మీద రోహిణితో పాటు.. మరో ముగ్గురు కనిపిస్తున్నారు.
కెమెరా ముందుకు కదిలింది. రోహిణికి పక్కగా కూర్చున్న ముగ్గురులో ఒక మహిళ వైపు ఆగింది.
రోహిణి వాయిస్ వినిపిస్తోంది.
"ఈమె.. గురువింద. యోగా శిక్షకురాలు."
కెమెరా తిరిగింది. గురువింద పక్కన ఉన్న ఒక మహిళ వద్ద ఆగింది.
"ఈమె.. అదితి. వైద్యురాలు."
కెమెరా తిరిగింది. అదితి పక్కన ఉన్న ఒక మహిళ వద్ద ఆగింది.
"ఈమె.. ప్రియతమ. గృహిణి."
కెమెరా వెనుక్కు జరిగింది. టివి తెర మీద ఇప్పుడు అక్కడి నలుగురూ కనిపిస్తుంటారు.
"ఈ సమయంన ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ నమస్కారాలు.. ధన్యవాదాలు. తెల్పబడిన నేటి అంశం ప్రకారం.. అత్యాచారంకి గురైన ఆడదాని స్థితి, గతిల మీద మీ మీ స్పందనలతో పాటు మీ మీ సముచిత సలహాలను కూడా మా ప్రేక్షకులకు అందించండి. ముందుగా గురువిందగారితో మొదలెడదాం." రోహిణి మాట్లాడింది.
గురివింద.. అత్యాచారంకి గురైన ఆడదాని మానసిక భావోద్వేగాలను తెల్పింది. వాటిని యోగా పరంగా ఎలా మాఫీ చేసుకోవచ్చో వివరించింది.
తర్వాత.. రోహిణి చెప్పగా.. అదితి.. అత్యాచారంకి గురైన ఆడదాని శారీరక అవస్థారుగ్మతలను తెల్పింది. వాటిని చికిత్సా పరంగా ఎలా రూఢీ పర్చుకోవచ్చో వివరించింది.
ఆ తర్వాత.. రోహిణి చెప్పగా.. ప్రియతమ.. అత్యాచారంకి గురైన ఆడదాని స్థితిగతులను తెల్పింది. వాటిని కుటుంబ పరంగా ఎలా సర్దుకు పర్చుకోవచ్చో వివరించింది.
ఆ తర్వాత.. ప్రేక్షకుల ఫోన్ కాల్స్ కు పిలుపు ప్రకటించింది రోహిణి.
ఫోన్ కాల్స్ మొదలయ్యాయి.
ఆ ముగ్గురులో.. ప్రేక్షకులు కోరుకున్న వక్తలు.. ఆ వారీగా ప్రేక్షకుల ప్రశ్నలకు వారు సమాధానాలిస్తున్నారు.
ఆ తోవన.. "రోహిణిగారూ.. ప్రియతమగారికి.. నాదో ప్రశ్న." ఆ ఫోన్ కాల్ నుండి వచ్చిన స్వరం స్టూడియోలో ప్రతిధ్వనించింది.
ప్రియతమ వైపు కెమెరా తిరిగింది.
"అత్యాచారంకి గురైన ఆడదాని గురించి వివిధ కోణాల్లో అక్కడి వారు మాట్లాడేరు. అలానే మా వైపు నుండి అలాంటి ప్రశ్నలే వస్తున్నాయి. కానీ ఆ అత్యాచారంకి బాధ్యస్థుడు ఐన వాడి గురించి ఊసే లేదు." అటు గొంతు స్థిరంగా ఉంది.
రోహిణి కలగ చేసుకుంటుంది. "ఈ నాటి అంశమే అట్టిది.. అందుకే.." చెప్పుతోంది.
అడ్డై.. అటు గొంతు.. "ఇట్టి అంశం అవసరమా.. ముఖ్యమా.. దేనికీ ప్రయత్నం.. ఎందుకు ఈ చొప్పదంటు అంశం." అడిగింది.
స్టూడియోలో.. రోహిణి ఏదో చెప్పబోతుండగా..
"ప్రియతమగారూ.. ఇది అంశం కాదు అనేసి దాటేయకండి. మీకు నా సూటి ప్రశ్న.. అత్యాచారంకి బాధ్యస్ధుడు ఐన వాడిని ఏం చేయాలి." అటు నుండి ప్రశ్న దూసుకు వచ్చేసింది.
స్టూడియోలో కామ్ అవరించింది.
రోహిణే తేరుకుంటూ.. "ఈ అంశం గురించి మరో కార్యక్రమం చేపడతాం. అప్పుడు.." చెప్పుతోంది. అడ్డై.. "లేదు. దాటించేయకండి. నా ప్రశ్నకి ప్రియతమ గారి నుండి సమాధానం కావాలి." అటు గొంతు అరిచింది.
ప్రియతమ అప్పటికే గింజుకుంటుంది.
"మీ పేరు.." అడగ్గలిగింది.
రోహిణి కలగచేసుకుంటూ.. "ముందే తెల్పాం. అటు పేర్లు గోప్యం మేడమ్. ఇంత వరకు అలానే ప్రశ్నలు స్వీకరింపబడుతున్నాయిగా." ప్రియతమకి చెప్పుతోంది.
అప్పుడే.. గురువింద.. "రోహిణిగారూ.. నేటి అంశంకి సంబంధం కాక పోయినా.. అటు ప్రశ్న.. ముఖ్యమైనదే.. సంబంధితమే. సో.. మీరు ప్రియతమగారి సమాధానం కోరవచ్చు." చెప్పింది.
రోహిణి.. ప్రియతమనే చూస్తోంది.
మిగతా ఇద్దరూ తననే చూస్తుండడం గమనించిన ప్రియతమ.. "చెప్పేదేముంటుంది. అత్యాచారంకి బాధ్యస్థుడు ఐన వాడిని గట్టిగా శిక్షించాలి." చెప్పింది.
"గట్టిగా అంటే.." అటు ఫోన్ కాల్ నుండి ప్రశ్న.
ఇటు ప్రియతమ తడబాటు తెలుస్తోంది.
రోహిణి కలగచేసుకుంటూ.. "వారికి ప్రొసీజర్స్ ప్రకారం శిక్ష ఉంటుంది." చెప్పింది.
"రోహిణిగారూ.. ప్రియతమగారిని మాట్లాడనివ్వండి." అటు ఫోన్ కాల్ చేసిన ఆమె అంది.
గురివింద.. "రోహిణిగారు చెప్పి ఉన్నారుగా. ఈ అంశం మీద తర్వాత చర్చ ఉంటుందని." అంది అప్పుడే.
అటు కాలర్ కి చిరాకయ్యింది.
"మేడమ్.. ఇంత వరకు.. అమ్మాయిలకు ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్పించాలని దంచేసారు మీరు. అదితిగారు.. అమ్మాయిలు శారీరక పుష్టిని విస్మరించకూడదని ఊదరగొట్టారు. ఎందుకండీ.. చేయి కాలేక ఈ ఆకులు అందించడాలు. తన ప్రమేయం లేకుండా అత్యాచారంకి గురైన ఆడది వైపే చూపులన్నీ నిలుస్తున్నాయి. తనే ఈసడింపులకు.. చీదరింపులకు గురవుతోంది. కానీ.. దానికి కారణమైన బాధ్యస్ధుడుకు ఎగాదిగా శాపనార్థాలు.. కాలయాపనం అరకొర దండనలు. ఏమిటీ.. ఎందుకీ తారతమ్యాలు.."
అటు కాలర్ కు అడ్డై.. "మేడమ్.. మీరు నేటి అంశంని మీరుతున్నారు." అంది రోహిణి కాసింత అసహనంగానే.
"లేదు రోహిణిగారూ.. మీరే ప్రియతమగారిని మాట్లాడనీయకున్నారు. ఆవిడ మాట్లాడితే నేను ఇంత ప్రొలాంగ్ చేసేది ఉండేది కాదు." చెప్పింది అటు కాలర్ కాస్తా గట్టిగానే.
"ప్రియతమగారిని నేనేమీ ఆపడం లేదు." చెప్పింది రోహిణి. తను అప్పటికే ప్రియతమని చూస్తోంది.
"ప్రియతమగారు మాట్లాడాలి. 'అత్యాచారంకి బాధ్యస్థుడు ఐన వాడిని గట్టిగా శిక్షించాలి' అని ఆవిడ చెప్పారు. నేను అడిగాను.. 'గట్టిగా అంటే..' అని. దానికి ఆవిడ జవాబు కావాలి." అడుగుతోంది అటు కాలర్.
స్టూడియోలోని వారంతా తననే చూస్తున్నట్టు ప్రియతమ గుర్తించింది. సర్దుకుంటోంది.
అంతలోనే.. "నేను చెప్పానా." అడుగుతోంది అటు కాలర్.
ఆ వెంబడే..
"నా సమాధానం.. మీరు.. మీ ఇంటికి వస్తే.. తెలుస్తోంది." ఆ కాలర్ తన కాల్ కట్ చేసేసింది.
స్టూడియోలో మరిన్ని లైట్లు వెలిగాయి.
ఆ లైవ్ ప్రొగ్రామ్ అర్ధాంతరంగా ఆగిపోయింది.
ప్రియతమ గందిక పడుతోంది.. "ఆ కాలర్.. ఆ కాలర్.. నా కోడలు.. శ్రీప్రియ.. ఆ గొంతు తనదే.. ఏం చేసిందో.." గడబిడిగా అంటోంది. తన ఇంటికి బయలుదేరేస్తోంది తన కారులో.
అక్కడి వక్తలు తేరుకుంటూ.. ప్రియతమ వెంట కదిలారు తమ తమ వాహనాలతో.
స్టూడియో వారు తమ వ్యాన్ తో వెంబడించారు రోహిణితో సహా.
ప్రియతమ ఇంటికి అంతా చేరారు.
తాళ్లతో కాళ్లు, చేతులు కట్టబడి.. తన మర్మావయవం చోట రక్తసిక్తమై.. మంచం మీద అడ్డదిడ్డంగా కదలాడుతున్న కొడుకును..
రక్తం అంటిన కత్తెతో అక్కడే నేలపై చతికిలు పడి ఉన్న కోడలు శ్రీప్రియను..
చూసిన ప్రియతమ.. గావుకేక పెట్టి.. నేలకు ఒరిగిపోయింది.
ప్రియతమతో కలిసి వచ్చిన వాళ్లు చేష్టలుడిగి నిల్చిపోయారు.
పిమ్మట.. రోహిణి చొరవతో.. శ్రీప్రియ తెలిపింది..
'తన స్నేహితురాలుపై అత్యాచారంకి తన భర్తే బాధ్యస్థుడు' అని.
వెంబడే.. టివీల్లో.. ఇది 'ఓ బ్రేకింగ్ న్యూస్' ఐంది..
***

మరిన్ని కథలు

chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ
Perugu diddina kapuram
పెరుగు దిద్దిన కాపురం
- జి.ఆర్.భాస్కర బాబు
Margadarshakudu
మార్గదర్శకుడు
- చెన్నూరిసుదర్శన్
Manishi kannaa nayam
మనిషికన్నా నయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Vaddee muddu kaadu
వడ్డీ ముద్దు కాదు
- మద్దూరి నరసింహమూర్తి
Varna yavanika
వర్ణ యవనిక
- జి.ఆర్.భాస్కర బాబు