మొదటి సారి విమానం ఎక్కుతున్నావు, మనకేటి తెలీదు , నువ్వు జాగర్త, నిన్నే లచ్చి అద్ద మవుతుందా, అలాగే మావ , నువ్వు పిల్లలు అత్త కాడే ఉండండి... మా అక్కోళ్ళు ఎపుడైనా వచ్చి పిల్లలని పంపమన్న నువ్వు కూడా పో మావ... ఆల్లు పిల్లలు మనసు విరిచేత్తరు లేని పోనియ్యి చెప్పి అత్త మీద... అప్పుడు మనం రామేశరం పోయినా, సనీసరం వదలదు అన్నట్టు నేను దేశం కానీ దేశం పోయి సంపాదించిది ఆళ్లకే చాలదు అక్కడి పిల్లలు ఉంటే... అందుకే నువ్వు పిల్లలు ని విడిగా పంపమాకు... నీకే మావ బుర్రలో ఎట్టు కో... అలాగేనే నువ్వు మన ఏజెంట్ చెప్పినట్టు విను... నువ్వు ఆడికి పోయాక మా అన్నోళ్లు వచ్చి నిన్ను తీసుకుపోతారు పని కాడికి... ఆల్లు రాటం ఆలస్యం అయినా కంగారు పడొద్దు అని చెప్పమన్నాడు మా పెద్దోడు... అలాగే , పెద్దమావనాతోకూడాఅలాగేచెప్పినాడు... మీ వదిని కూడా బానే మాటాడింది నాతో.. అక్కడికి ఏళ్ళాక అన్నీ నేర్పు తానంది, అదే ఆళ్ల భాస నాకు నేర్పుతానంది, అది నేర్చుకోకపోతే ఆల్లు పనిలోకి రానీయరంట... ఇగో లచ్చి నువ్వు ఏయి మనసులో ఎట్టుకోకు, మా వదిని , మా పెద్దోడు ఎలా చెప్తే అలా నడుచుకో అవసరం మంది, తప్పదు ... నువ్వు పిల్లలు కోసం కూడా ఏమి బెంగెట్టుకోకు, నేను మా యమ్మ కళ్ళలో ఎట్టుకునిసూసుకుంటాము... ఎందుకో మావ చిన్నోడు బెంగ ఎట్టుకుంటాడేమో అని భయమేత్తుంది... ఆడు నేను ఆనక పోతే ఏడుత్త కూకుంటాడు ఎపుడు..అదే గేపకం వత్తె దుఃఖం ఆగుతుల్లేదు... అసలు నా కర్మం బాగోక , నేనేటి దేసం గాని దే సం పనికి పోవడమేటి, నోరు ఎరగని బిడ్డల్ని, నీరసం చేసిన నిన్ను వదిలేసి ఏడకో పోవడమేటి మావ, నా వల్ల అవుతా లేదు, ఏడుపు తన్నుకు వచ్చేతుంది మావ... ఎపుడు నువ్వు లేకుండా ఊరు పొలిమేర కూడా దాటనేదు నేను ఇయ్యాల ఏకంగా విమానం ఎక్కి, ఏడు సముద్రాలూ దాటే తున్నాను.. ఒకేలా అక్కడ వాతావరణం నాకు పడక నాకేమైనా పాణం బాగోక , నేను పోతే కనుక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోనని మాటియ్యి మావ.. నా పిల్లలు ని గాలికి వదిలేయనని మాటియ్యి...మావ.... నువ్వు నోరుముయ్యి లచ్చి ముందు... నా ఎన్ను పూస ఇరిసి దేవుడు నన్ను మూల కూకో బెట్టి, చక్రాల కుర్చీ లో ఉండక పొతే , మనకి ఇంత కట్టం వచ్చేది కాదు... నువ్వు ఎపుడైనా పనికి పోతానంటే వద్దనే ఓడిని , ఇయ్యాల నిన్ను ఏకంగా దేశం గాని దేశం పనికి పో నానికి, ఒప్పుకున్నది నిన్ను నీ పిల్లలని నేను పోషించలేక కాదు, నువ్వు పనికి పోనీయ క పోతే చ త్తా నని బెదిరించినందుకు... నేను అవిటోడిని, నువ్వు పోతే నా బిడ్డలు అనాధ లు అవుతారని ఒప్పుకున్నా... నువ్వు మళ్ళీ ఇలాంటి మాటలు ఆడా వంటే , నిన్ను ఏడకి పంపను, పద ఇంటికి పోదాం... బతక లేకపోతె తలా కొంత , విసం తాగి చద్దాం... అద్దమైందా.... పద పోదాం ఇంటికి... లేదు లే మావ, ఇంకెప్పుడు అలా అన్ను... నువ్వు మళ్ళీ మాములు మనిషి అవ్వాలంటే, ఆపరేషన్ చేయించాలి, డబ్బులు కావాలి, ఎంత రెండేళ్లు , ఇలా యెల్లి అలా వచ్చేత్త... నీ ఆపరేషన్ అయిపోయి నువ్వు మాములు అయిపోతే నన్ను మారాణి లా చూసుకుందువు గానీ.... ఏజెంట్ గారు మా ఆవిడ కి ఏమి తెలవదు.. మీరే కొంత అన్నీ దగ్గరుండి చూడండి... మా అన్నోళ్ల కి అప్పగించేవరకు మీరు అన్నల చూడండి. భలే వాడివే ఇది నా ఉద్యోగం.. మీ లచ్చిని మీ అన్నకి అప్పగించాక నీకు ఫోన్ చేసి మాట్లాడిస్తా.. కంగారు పడకు... టైం అయింది.. మేము బయలుదేరతాము..వత్తాను మావ,...లచ్చి విమానం ఎక్కాక బయపడకు... మన కట్టాలు గుత్తు తెచ్చుకో, అన్నీ చిన్న చిన్న కట్టాలే అనిపిత్తాయి. దేవుణ్ణి తలుచుకో... మన పిల్లలు ని తలచుకో.. ఏం భయమేయదు.... జాగత్త లచ్చి... అలాగే మావ.. నువ్వు మందులు అన్నీ టైం కి ఏసుకో... నేను వచ్చేసరికి నువ్వు పూత్తిగా కోలుకోవాలి.... మావ... పిల్లలు జాగత్త.. విమానం ఎగిరింది... లచ్చి ఎగిరింది రెక్కలు కట్టుకుని , ఆ రెక్కల కట్టం తో తమ బతుకులు బాగుచేసుకోవాలని..... ఈ కధ పూర్తిగా నా కల్పితం... ఎవరిని ఉద్దేశించినది కాదు, ఏ కధ కి కాపీ కాబడినది కాదు.......