శేషాచలం అడవుల్లో నీరు లభించకపోవడంతో అడవి జంతువులన్ని నీటిని వెదుకుతూ ఎగువకు ప్రయాణం చేయసాగాయి. మధ్యాహ్నసమయంలో ఎండ వేడికి తట్టుకోలేక మర్రిచెట్టుకింద విశ్రాంతికొరకు ఆగాయి.
" ఏనుగు తాతా మాఅందరిలో పెద్దవాడవు మాకు కాలక్షేపానికి ఏదైనా కథచెప్పు "అన్నాడు గుర్రం బాబాయి. " సరే మీకు పనికి పరిక్ష అనేకథ చెపుతాను.
సిరిపురంలోని రాఘవయ్యకు పలు వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాల పని వత్తిడిలో తన ఊరికి దూరంగా ఉన్న మామిడి తోట సంరక్షణ చూడటానికి సమయం ఉండటం లేదు. ఇదేవిషయాన్ని పొరుగుఊరు అమరావతి రైతు తనమిత్రుడైన జగన్నాధం వద్ద ప్రస్తావించగా "ఆదివారం నీవద్దకు ఇద్దరు యువకులులు వస్తారు వారి యిరువురిని పరిక్షించి నీకు నచ్చిన వారికి మామిడి తోటను పరిరక్షించే బాధ్యత అప్పగించు "అన్నాడు.
ఆదివారం మామిడి తోటకు వచ్చిన యువకులు తమపేర్లు రంగనాధం, సోమయ్య లుగా చెప్పారు. "నాయనలారా నేను అత్యవసరంగా పొరుగు ఊరు వెళుతున్నాను ఇక్కడ ఉన్న ఇంటిలో మీకు ఆహరం వండి పెట్టడాని వంటమనిషి ఉంది నేను తిరిగి వచ్చేవరకు ఇక్కడే భోజనం చేసి ఉండండి "అని రాఘవయ్య వెళ్ళాడు.
భోజనానంతరం సోమయ్య అక్కడ ఉన్న మంచం పైన నిద్రపోయాడు. రంగనాధం గడ్డపలుగు ,పార తీసుకుని మామిడి మొక్కల పాదులు అన్నింటిని సరిచేసి మొక్కలకు బావిలోని నీరువెళ్ళేలా పంపు సెట్టు ఆన్ చేసి మామిడి మొక్కలకు నీరు పెట్టి,పసువులకు మేతవేసి పాలుపిండి వంటచేసే అవ్వకు ఇచ్చాడు. మరునాడు ఉదయపు ఆహారం తిన్న అనంతరం బావి పరిసరాలలో ఖాళీగా ఉన్న నేలను గడ్డపారతో పెళ్ళగించ సాగాడు.
ఇంతలో రాఘవయ్య వస్తునే రంగనాధం చేస్తున్న పనినిచూసి మామిడి తోట అంతా తిరిగివచ్చి " రంగనాధం నేను నీకు పనిఇస్తానని చెప్పలేదుగా ఇదంతా ఎందుకు చేస్తున్నావు హయిగా సోమయ్య లాగా తిని
నిద్రపోకుండా " అన్నాడు. " అయ్య మొక్కవిలువ తెలిసినవాడిని పైగా మీఇంట ఆహరం తింటు పనిచేయకుండా ఉండలేకపోయాను.మనిషికి చెట్లవలన ప్రాణవాయువు అందడమేకాకుండా ఫలసాయం అందుతుంది. ఇంకా లక్క,జిగురు,ఔషదీయాలు,కుంకుళ్ళు వంటి ఎన్నోరకాలు మనం పొందవచ్చు.బావి పరిసరాలలో చాలా ఖాళీ స్ధలంఉంది అక్కడ కూరగాయలు ,ఆకు కూరలు పండించగలిగితే మన అవసరాలకుపోగా మిగిలినవి అమ్మితే మంచి ఆదాయం ఉటుంది "అన్నాడు.
" భళా నాకు కావలసింది చెట్లవిలువ తెలిసిన నీలాంటివాడే ఇక ఈతోట బాధ్యతనీదే " అన్నాడు రాఘవయ్య. కథ విన్నారుగా వళ్ళు దాచుకుని పనిదొంగగా బ్రతికేవారికి సోమయ్య లాగా ఉండిపొతారు.శ్రమలో స్వర్ణం ఉందని గ్రహించినవారు రంగనాధంలాగా ఆదరింబడతారు ,మనజీవితంలో ఎన్నడు పనికి దొంగలా మారకూడదు సాధ్యమైనంతవరకు చేస్తున్న పనిలో నూతన ప్రక్రీయలను కనుగొనాలి " అన్నాడు ఏనుగు తాత.
" నేనుకూడా నూతనంగా ఒకటి కనిపెట్టానే "అన్నాడు కోతిబావ." అదేమిటి "అన్నాడు నక్కమామ." డాంలేట్ "అన్నాడు కోతిబావ ."అర్ధంకాలేదు వివరంగా చెప్పు " అన్నాడు కుందేలు. "ఇందులో చెప్పడానికి ఏముంది ఉల్లిపాయతో కలిపి వేస్తే అది ఆంమ్లేట్ ఉల్లిపాయలేకుండా వేస్తే అది డాంమ్లేట్ "అన్నాడు కోతిబావ. కోతిబావ మాటలకు నీవ్వుకున్న జంతువులు నీటిని వెదకుతూ ముందుకు కదిలాయి.