నీతోనే నేనుంటా - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Neethone nenunta

శోభనం గదిని అందంగా అలంకరించారు. పక్కపై మల్లెపూలు చల్లారు. ఘుమ ఘుమ లాడే ఉదొత్తులు వెలిగించారు. నవ వధూవరులకు మధుపర్కాలు కట్టించి చక్కగా ముస్తాబు చేసారు. “ముహూర్తం సమయం కావస్తోంది అమ్మాయిని, అబ్బాయిని తీసుకురండి" అన్నారు పంతులుగారు. పేరంటాళ్ళు అమ్మాయిని, కుటుంబ పెద్దలు అబ్బాయిని తీసుకువచ్చారు. పూజాది కార్యక్రమం పూర్తి అయ్యింది. “ఓయ్ ప్రమీ అబ్బాయిగారిని ఏడిపించకు. పట్టు విడుపులుండాలి” అని బుగ్గ గిల్లి ప్రమీలకి పాల గ్లాసు ఇచ్చి గదిలోకి పంపించారు ఆడంగులు. “బాబూ ప్రవీణ్ మా అమ్మాయి భయస్తురాలు. అభంశుభం తెలియదు. జాగ్రత్తగా చూసుకో. లోపలికి వెళ్ళాక గడియ పెట్టుకో ” అని చెప్పి ప్రవీణ్ ని గదిలోకి పంపించారు. మత్తెక్కించే మల్లెపూల పరిమళం గదినిండా వ్యాపించింది. అగరవత్తుల పొగ ప్రమీల శరీరాన్ని తాకి తన్మయత్వంలో ముంచింది. అడుగులో అడుగు వేసుకుంటూ ప్రవీణ్ దగ్గరికి వెళ్ళింది. పెద్దవారు చెప్పినట్లు పాల గ్లాసు అతనికి అందించింది. సిగ్గుతో తల దించుకుని నిలబడింది ప్రమీల. ప్రమీల బుగ్గలపైకి కన్నీటి చుక్కలు జారడం గమనించాడు ప్రవీణ్. పాల గ్లాసును పక్కన టేబుల్ మీద ఉంచి తన రెండు చేతులను ప్రమీల భుజాలపై వేసి "ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? చెప్పు" అని అడిగాడు ప్రవీణ్. “అదేమీ కాదు” “మరెందుకు ఏడుస్తున్నావు?” వెక్కి వెక్కి ఏడుస్తున్న ప్రమీలను మంచంమీద కూర్చోబెట్టి తను ప్రక్కన కూర్చుని కన్నీళ్లు తుడుస్తూ... "ఇది తొలి రాత్రి కావచ్చు. మనం ఆనందంగా ఉంటే ప్రతీ రాత్రీ వసంత రాత్రే. నీకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను. నీ మనసులో ఉన్న దిగులుకు కారణం చెప్తావా?" అని బుగ్గలు నిమురుతూ అడిగాడు ప్రవీణ్. కళ్లనుంచి ధారాపాతంగా వస్తున్న నీటిని తుడుచుకుంటూ దుఃఖాన్ని అదిమిపట్టి చెప్పడం ప్రారంభించింది ప్రమీల. "నాకు ఊహ తెలిసేసరికే అమ్మా, అయ్యా ఏదో తెలియని జబ్బు సోకి చనిపోయారు. అప్పటి నుంచి అమ్మా నాన్న అన్నీ తానే అయ్యాడు మా అన్నయ్య. ఇరుగు పొరుగు ఇళ్ళ దగ్గర నన్ను ఉంచి బట్టీలో పనికి వెళ్లేవాడు. సాయంత్రం వచ్చి అన్నం వండి కథలు చెప్తూ తినిపించేవాడు. నేను మారాం చేసినా బుజ్జగించాడే తప్ప ఎప్పుడూ కోపగించుకోలేదు. వీపు మీద కూర్చో బెట్టి ఊరంతా తిప్పే వాడు. వర్షపు జల్లుల్లో ఆడించేవాడు. కష్టపడి నన్ను చదివించాడు. తాను తినకపోయినా గోరుముద్దలు నాకు తినిపించాడు. కొండంత అండగా నిలిచాడు. నాకోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. నాకోసం అహర్నిశలు కష్టపడిన అన్నయ్యను వదిలి మీతో ఎలా రాగలను. నా మనసు అంగీకరించడం లేదు. అన్నయ్యకు ఎవరు వండి పెడతారు. వాడిని ఎవరు చూసుకుంటారు. ఇదే నా సమస్య” అని ఏడుస్తూ చెప్పింది. “ఓస్ ఇంతే కదా! దాని కోసం ఇంతలా ఏడవాలా. నాకు పట్నంలో పెద్ద ఇల్లు ఉంది. నాకు బోలెడు జీతం. మీ అన్నయ్యను మనతోనే తీసుకువెళ్దాం. ఏ లోటూ లేకుండా చూసుకుందాం. మీ అన్నయ్యకు పెళ్లి కూడా చేద్దాం” అన్నాడు ప్రవీణ్. మంచి భర్త దొరికి నందుకు మనసులోనే పొంగిపోతూ ప్రవీణ్ గుండెలపై వాలిపోయింది ప్రమీల.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు