ప్రేమ ఫలం - పి. రాజేంద్రప్రసాద్

Prema falam

ఇరవై మూడు ఏ బస్సు జనాన్ని మోసుకుంటూ భారంగా కదులుతున్నది. కండక్టరు వెనుక నుంచి మొదలు పెట్టి టిక్కెట్లు ఇచ్చుకుంటూ ముందుకు వెళుతున్నాడు. లేడీస్ సీట్లకు కొంచెం ముందున్న సుకుమార్ ను చూసీ చూడనట్టు జనాల మధ్య నుండి ముందుకు తోసుకొని వెళ్ళిపోయాడు. జేబులోంచి బయటకు తీసి పెట్టుకున్న రూట్ పాసును ఉసూరుమంటూ మళ్ళీ లోపల పెట్టుకున్నాడు సుకుమార్. రెండు వరసలు దాటి కూర్చున్న ఎర్ర చుడీదార్ అమ్మాయి వంక ముప్ఫై రెండు పళ్ళూ బయటకు పెట్టి నవ్వుతూ ఆమోదపూర్వకంగా తలాడించి మరింత ముందుకు సాగాడు కండక్టర్. ఆ అమ్మాయి కూడా తన రూట్ పాసును బాగ్ లోపలికి తోసింది. మరో రెండు వరసలు టిక్కెట్లు ఇచ్చిన తరువాత కండక్టర్ కొట్టిన మూడు టింగ్ టింగ్ ల సిగ్నల్ విన్న డ్రైవర్ బస్సును స్పీడుగా ముందుకు ఉరికించాడు. సుకుమార్ గుండె కలుక్కుమంది. ఎర్ర చుడీదార్ అమ్మాయిని చూస్తూ భారంగా నిట్టూర్చాడు. ఆ వేడి బస్సంతా నిండిపోయింది. అసలే వేసవి కాలపు సాయంకాలం ఉక్కతో చికాకు పడుతున్న జనం సుకుమార్ కేసి కోపంగా చూశారు. ఇది పట్టించుకోని సుకుమార్, చుడీదార్ అమ్మాయి వెనక్కు తిరుగుతుందేమోనని ఆశగా చూశాడు. ఆ అమ్మాయి కిటికీలోంచి తల బయటకు పెట్టిన త్రీ రోజెస్ అడ్వర్టైజ్మెంట్ తాలూకు హోర్డింగు కేసి చూస్తూ ఉండిపోయింది. సుకుమార్ చెవులు చిల్లులు పడేలా కండక్టర్ విజిల్ ఊది" మార్కేట్!.." అంటూ అరిచాడు. ఉలిక్కిపడిన సుకుమార్, నెక్స్ట్ స్టాప్ తనదే కావడంతో కండక్టరును తిట్టుకుంటూ ముందు డోరు లోంచి దిగడానికోసం ఆ అమ్మాయి వైపు కదిలాడు. కండక్టరాసురుడి చెయ్యి అతని ఛాతీని బలంగా వెనక్కి తోసింది. కోపంగా పళ్లు కొరుకుతున్న సుకుమార్ ని చిద్విలాసంగా చూస్తూ తర్జనిని వెనక డోరు వైపు చూపించాడు కండక్టరాసురుడు. కారాలూ మిరియాలూ నూరుతూ వెనకఉన్న జనాన్ని తోసుకుని దిగడానికి సిద్ధమయ్యాడు సుకుమార్. అష్టావధానంలో అసందర్భ ప్రసంగంలాగా ఇప్పుడు కిసుక్కున నవ్వింది ఎర్ర చుడీదార్. పాపం సుకుమార్ అది గమనించకుండా స్పీడుగా జనాన్ని తోసుకుంటూ వెనక్కి వెళ్లి ఒక కాలు ఫుట్ బోర్డు నుండి కింద పెట్టగానే కండక్టరు తాలూకు రెండు టింగ్ టింగ్ లకు బస్సు ముందుకు దూకడమూ, సుకుమార్ తృటిలో కింద పడకుండా బ్యాలన్స్ చేసుకుని బస్సు వైపు చూస్తూ ఇంకో సారి పళ్లు పటపట కొరుక్కోబోయి ఆగిపోవడమూ జరిగింది. ఆ కొరకడంలో పళ్లు గనక ఊడితే ఈ రోజుల్లో డెంటిస్టులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు మరి! *** నెల రోజులుగా చూస్తున్నాడు ఆ అమ్మాయిని. రోజుకోరకం వయ్యారాలొలికే ఫాషనబుల్ డ్రస్సులలో, సుకుమార్ ఎక్కిన రెండో స్టాపులో ఎక్కుతున్నది ఆ అమ్మాయి. తొలిరోజే ఆ అమ్మాయి ప్రేమలో బొక్క బోర్లా పడ్డాడు సుకుమార్. పాపం అతడు చూస్తుండగా ఆ అమ్మాయి మాత్రం ఇతడివైపు కన్నెత్తి కూడా చూడలేదు. రూట్ పాస్ తీసుకున్న కారణంగా సుకుమార్ ఆ అమ్మాయి కంటే ముందు గానే దిగిపోవాల్సి వస్తోంది. భీమవరం బుల్లోడు సుకుమార్ కి డిగ్రీ పూర్తయిన కొద్దిరోజులకే బ్యాంకులో ఉద్యోగం వచ్చేసింది. వెంటనే వచ్చి పట్నంలోని బ్యాంకులో చేరిపోయాడు. ఒక్కడే కొడుకు కావటమూ, పైగా ఆస్తీ పాస్తీ బాగానే ఉండటంతో తొందరగా పెళ్లి చేసేసుకోమని అతన్ని తెగ పోరుతున్నారు తల్లిదండ్రులు. సుకుమార్ కేమో ప్రేమించి పెళ్ళిచేసుకుంటే బాగుంటుందని మనసులో ఏదో ఒక మూలన ఆశగా ఉంది. దానికి తగ్గట్టే ఈ మధ్య ఈ అమ్మాయి కనిపించి అతని మనసులో కలకలం రేపుతోంది. పరధ్యానంగా నడుస్తున్న సుకుమార్ కాలికి ఫటేలుమని ఒక రాయి తగిలి ప్రాణం జిలార్చుకుని పోయింది. "అమ్మా!" అనుకుంటూ కాలు పట్టుకొని కింద రోడ్డుమీద కూలబడిపోయేలోపున తను ఉండే రెండు రూముల అద్దె ఇంటికి చేరుకున్నానని గ్రహించాడు సుకుమార్. ఉసూరుమంటూ కుంటుకుంటూ లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చుని నీరసంగా వెనక్కి వాలాడు. *** మరుసటి రోజు నిద్ర లేవగానే నేనున్నానంటూ కాలినెప్పి పలకరించింది. "నో ప్రాబ్లమ్! చిన్నదెబ్బే కదా! ఆ అమ్మాయి మనం వెళ్ళేటప్పుడు కనిపించడం లేదు. ఓన్లీ బ్యాంకు నుండి ఇంటికి వచ్చేటప్పుడే కనిపిస్తోంది. మనం బ్యాంకులో పనిచేస్తున్న ఎలిజిబుల్ బ్యాచిలర్ అని ఆ పిల్లకి తెలిసే అవకాశం లేదు. ఈ రోజెలాగైనా ఆ అమ్మాయి బస్సులోంచి దిగేదాకా వెయిట్ చేసి ఆమె ఇల్లు కనిపెట్టి పరిచయం పెంచుకోవాలి. ఆ పైన మన ప్రేమ విషయం చెప్పి ఆమెను ఒప్పించగలిగితే... ఓహ్.. ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉంది!" సుకుమార్ ఊహల్లో తేలిపోతూ తొందరతొందరగా తయారయ్యి బ్యాంకుకి బయల్దేరాడు. సాయంకాలం సుకుమార్ నూ, ఆ అమ్మాయినీ ఎక్కించుకున్న బస్సు ఎప్పటిలాగే భారంగా తన ప్రయాణం ప్రారంభించింది. కండక్టరాసురుడు యధా ప్రకారం జనాల మధ్యనుండి తోసుకుంటూ టిక్కెట్లు ఇచ్చుకుంటూ సుకుమార్ వైపు నిర్లక్ష్యంగా చూసి ముందుకు వెళ్లిపోయాడు. నిన్న తన ఛాతీ మీద పడిన ఆ అసురుడి చెయ్యి గుర్తొచ్చిన సుకుమార్ విసురుగా అతడి జబ్బ పుచ్చుకొని ఆపాడు. "ఎందుకాపావ్? నీది రూట్ పాసే కదా!" చికాగ్గా అన్నాడు కండక్టరాసురుడు. "హ్హ హ్హ హ!" భీకరంగా నవ్వాడు సుకుమార్. అసురుడు ఝడుసుకున్నాడు. సుకుమార్ విజృంభించిపోయాడు. "ఈ బస్సు చివరి దాకా టిక్కెట్టివ్వు!" అన్నాడు విలాసంగా డబ్బులు తీసి చేత్తో పట్టుకుని. "నేను చేస్తున్నది అదే కదా!" చిరాగ్గా అన్నాడు అసురుడు. ఈ రోజు నీలం రంగు చుడీదార్లో ఉన్న నిన్నటి ఎర్ర చుడీదార్ అమ్మాయి కిసుక్కున నవ్వింది. సుకుమార్ కి చాలా అవమానం వేసింది. "నాకు చివరి స్టాపు దాకా టిక్కెట్టివ్వు!" అరిచిన్నట్టన్నాడు. "ఎందుకు అరుస్తావు? ఇదుగో తీసుకో!" అంటూ టిక్కట్టిచ్చి డబ్బులు తీసుకున్నాడు అసురుడు. టిక్కెట్లు ఇవ్వడం అప్పటికే పూర్తవ్వడంతో " టింగ్, టింగ్, టింగ్" మంటూ బెల్లు కొట్టాడు. ఒక్క ఉదుటున బస్సు ముందుకు దూకింది. సుకుమార్ ముందుకు తూలి పడబోయాడు. నీలం చుడీదార్ మళ్ళీ కిసుక్కున నవ్వింది. సుకుమార్ కళ్ల ముందు ఈస్ట్ మన్ కలర్, 70 ఎం ఎం., డాల్బీ డిజిటల్ సౌండు తో నీలం చుడీదార్ తో తను పాడబోయే డ్యూయట్టు కనిపించింది. ఇంతలో ఎవడిదో బూటుకాలు సుకుమార్ తాలూకూ దెబ్బ తగిలిన కాలును కసిగా తొక్కింది. "కెవ్వు.." మన్నాడు సుకుమార్. "సారీ!" అన్నాడు బూటుకాలు వాడు. నీలం చుడీదార్ ముచ్చటగా మూడోసారి కిసుక్కుమంది. గుర్రుమనాలో, ఆనందంతో నవ్వాలో తెలియక తికమక పడిపోయాడు సుకుమార్. "మార్కేట్...!" కండక్టరాసురుడి భయంకరగర్జన వినిపించింది. తడబడి, తొట్రుబడి వెనక్కి నెక్స్ట్ స్టాప్ లో దిగడానికి నడవబోయాడు. చేతిలోని టిక్కెట్టు అనబడే వివేకం హెచ్చరించింది. నాలిక్కొరుక్కున్నాడు సుకుమార్. రక్తం బయటకొచ్చి మంటపుట్టినా బాధను పళ్ల బిగువున ఓర్చుకున్నాడు. నీలం చుడీదార్ కంటబడితే మరోసారి నవ్వుతుంది మరి. "అయినా ఈ రకంగానైనా నా వైపు చూసింది కదా!" ఆనందంగా అనుకున్నాడు సుకుమార్. మూడు స్టాపులు స్పీడుగా వెళ్లిపోయాయి. నెక్స్ట్ స్టాప్ లో దిగడానికి నీలం చుడీదార్ లేచి నిలబడింది. సుకుమార్ హడావుడిగా వెనక్కి వెళ్లి నిన్నటి ఫీటు మరోసారి చేసి బస్సు దిగాడు. *** నీలం రంగు చుడీదార్ సుకుమారి వయ్యారంగా వెళుతోంది. పదడుగుల దూరంలో సుకుమార్ ధీమాగా వెంబడిస్తున్నాడు. చుడీదార్ సందు తిరిగింది. సుకుమార్ ఐదడుగుల దూరం తగ్గించాడు. కొంచెం దూరం వెళ్ళాడు. చుడీదార్ వెనక్కి తిరిగి నవ్వింది. సుకుమార్ విజృంభించాడు. ధా..గ్గిరికి వెళ్లిపోయాడు. చుడీదార్ కళ్ళెగరేసింది. సుకుమార్ మెలికలు తిరిగిపోయాడు. "ఏం కావాలి?" సమ్మోహనంగా నవ్వింది చుడీదార్. సుకుమార్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. "మీరే!..." ఆనందంతో అతని గొంతు కీచుమంది. ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలో తెలియలేదు. చుడీదార్ ఒక ఇంటి ముందు ఆగింది. మళ్ళీ సమ్మోహనంగా నవ్వింది. "లోపలికి రండి. ఇదే మా ఇల్లు." తాళం తీస్తూ ఆహ్వానించింది. సుకుమార్ కి మతిపోయి కళ్ళు మిరుమిట్లు గొల్పాయి. "నిజంగానా! మీ అమ్మా, నాన్నా ఇంట్లో లేరా?" సందేహంగా అడిగాడు. "వాళ్ళెందుకూ?" ఆశ్చర్యంగా అడిగింది చుడీదార్. "మన విషయం మాట్లాడదామని..." వాక్యం ఎలా పూర్తి చెయ్యాలో అతనికి అర్థం కాలేదు. "ఏం మాట్లాడతారు?" అతనేం చెప్తున్నాడో ఆమెకి అర్ధం కాలేదు. "అదే! అన్ని విషయాలూ మీ అమ్మా, నాన్నా, మా అమ్మా, నాన్నా మాట్లాడుకోవాలి కదా అనీ...." అతడు నీళ్ళు నమిలాడు. "ఏంటి మాట్లాడేది? ఇంతకీ మీరు ఒక సారి ఉంటారా..నైట్ మొత్తమా?" లోపలికి ఒక అడుగేస్తూ విసుగ్గా అడిగింది భామ. సుకుమార్ కళ్ల ముందు వెయ్యి బాంబులు పేలాయి. భూమి రెండుగా విచ్చుకు పోయి తను అందులో కూరుకుపోతున్నట్టు తోచింది. ఏదో తెలియని వెర్రి అరుపు అతని గొంతులోంచి బయటకొచ్చింది. ఒక్క క్షణం...ఒకే క్షణం...ఆ ఇంటినుండి అరకిలోమీటరు దూరంలో దాదాపు గంటకి ఏభై కిలోమీటర్ల వేగంతో వెనక్కి పరిగెడుతున్నాడు సుకుమార్ అని స్టైల్ గా పేరు మార్చుకున్న ఎస్. ఉత్తరకుమార్!

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ