భావాతీతం - DODDIPATLA KALYAN KISHORE

Bhavaateetam

మ్రోగబోతున్న అలారం మొదటి బీప్ కే ఆపేసాను. తెలివొచ్చీ రానట్టుంది చాలా సేపట్నుంచి. కళ్ళు నెమ్మదిగా నులుపుకుని గదిలోంచి బయటకొచ్చేసరికే ఇల్లంతా అగరొత్తుల వాసన ఆవరించి ఉంది. నాన్న అప్పటికే లేచి ఎర్రటి పొత్తు పంచె కట్టుకుని దేవుడి గదిలో నిలబడి ఏవో చదువుతున్నారు. అమ్మ పెరట్లో ఉన్నట్టుంది.

తలకి ఉన్న మఫ్లర్ నీ, వేసుకున్న స్వెట్టర్ నీ విప్పి బాత్రూంలో దూరాను. ట్యాప్ విప్పిన ఉత్తర క్షణం, దక్షిణామూర్తి కనపడ్డాడు. దెబ్బకి చేతులు గడ్డకట్టుకుపోయాయి. ఐదవుతోంది ఇప్పుడే ఇంత చల్లగా ఉన్నాయి, అమ్మ వాళ్ళు లేచి ప్రసాదాలు కూడా చేసేస్తున్నారంటే..వాళ్ళసలు స్నానలవీ ఎలా చేసారో ఏంటో అనుకుంటూ నూతి దగ్గరికి వెళ్ళీ రెండు చేదల నీళ్ళు దిమ్మరించేసుకుని తువ్వాలు చుట్టుకుని పరిగెడుతుంటే...

అమ్మ చూసి గతుక్కుమంది. "నువ్వెప్పుడు లేచావురా! ఇంకో రెండు గంటల టైముందిగా నీకు. క్రికెట్ మ్యాచేవైనా ఉందా" అంటుంటే సమాధానం చెప్పకుండా గదిలోకి పరిగెట్టి, ఇస్త్రీ బట్టల్లోంచి ఒక జత తీసి వేసుకుని చెప్పులేసుకుని బయటికి వెళుతూ అప్పుడు చెప్పాను అమ్మకి..."గుడికి వెళ్ళొస్తా..." అని.

అప్పటి వరకూ దేవుడి గదిలో నాన్న చదువుతున్న మంత్రాలు కొంచెం సేపు ఆగి మళ్ళీ మొదలయ్యాయి.

మార్గశిర మాసంలో సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించి తిరిగి మకర రాశిలోకి మారేదాకా ఈ ధనుర్మాసం చేస్తారని అమ్మ చెప్పింది! మొదట గోదాదేవి శ్రీకృష్ణుడిని పొందడానికి ఎప్పుడో వెయ్యేళ్ళ క్రితం ఈ వ్రతం చేసిందిట!

ధనుర్మాసం మొదలైన.. రెండోరోజు ఇవాళ. ధనుర్గంట పెట్టిన రోజు అమ్మతో సాయం రమ్మంటే వెళ్ళాను. చాలా రోజులయ్యింది గుడికి వెళ్ళి. స్నానం చెయ్యను అంటే తన్నినంత పనిచేసి బాత్రూంలో తోసేస్తే నీళ్ళు చిలకరించుకుని, అమ్మతో వెళ్ళిపోయాను. అక్కడిదాకా వెళ్ళాక ఎందుకో భయం వేసింది! బయట మండపం దగ్గర కావాలనే అమ్మ దగ్గర్నుంచీ తప్పించుకుని గుడి వెనకాలున్న రాతి మండపం మీద కూర్చుందామని వెళ్ళాను. అక్కడ ఖాళీ లేదు.

పదిమంది ఆడవాళ్ళు మండపం నిండా కూర్చుని పూల దండలు కడుతున్నారు. చామంతి, సంపెంగ, లిల్లీ అన్నీ గుత్తులుగా కడుతున్నారు కొందరు. వాటిని మళ్ళీ తులసి, మరువంతో కలిపి దండలుగా కడుతోంది ఇంకొక అమ్మాయి.

దారాలతో పూలు అల్లుతున్న తన వేళ్ళు నన్నెందుకో ఆకర్షించాయి. వాటిని భరత నాట్య ముద్రల్లో కటక ముఖ, సోల పద్మ... అంటారని అప్పటికింకా తెలీదు. తెలిసింది ఒకటే... తను కేవలం వేళ్ళతోనే నాట్యం చేస్తోందని. అలా ఎంత సేపున్నానో తెలీదు.

"బాబూ పూల బుట్ట ఇటందుకుంటావా" అన్న పిలుపుకి మళ్ళీ సోయలోకి వచ్చాను. ఒకావిడ నన్నే చూస్తూ పూల బుట్ట అటు వైపుంది అన్నట్టు సైగ చేస్తుంటే వెళ్ళి తీసుకుని వచ్చాను.

గుండ్రం గా కూర్చున్న వాళ్ళందరి మధ్యలో బుట్టని ఒంపి అమ్మాయి ఉన్న వైపు చూసాను. తను లేదు. దూరంగా మండపం చివర నుంచీ అమ్మ వస్తూ కనబడింది. అమ్మాయి కోసం చుట్టూ వెతికాను. ఐపు లేదు!

ఎవరు తను నా కంటే చిన్నదా పెద్దదా! ఎప్పుడూ చూసిన గుర్తులేదే! మొహం చూడ్డానికి కూడా అవ్వలేదే! ఆరోజంతా వే ఆలోచనలు.

అందుకే మర్నాడు ఒక్కణ్ణే బయల్దేరాను. నేరుగా ప్రదక్షిణ చేసుకుంటూ గుడి వెనక మండపం దగ్గరికి వెళ్ళిపోయాను. నిన్నట్లానే కూర్చుని ఉన్నారంతా. నిన్న నన్ను పిలిచినావిడ చూసి గుర్తుపట్టినట్టు నవ్వింది. నేనూ ఇబ్బందిగానే నవ్వాను.

అక్కడక్కడే కొంత సేపు తచ్చట్లాడి..అడక్కుండానే పువ్వుల బుట్టలన్నీ వాళ్ళకి దగ్గరిగా జరిపి వచ్చాను. తను కనబపడలేదు. అర్చకులు పాశురాలు చదువుతున్నారు. వెనకాలే వీళ్ళంతా శ్రద్ధగా తిరిగి అంటున్నారు. వినడానికి శృతిబద్ధంగా అనిపించింది.

"పయత్తుయిడ పరమన పాడి నెయ్యుణ్డోం పాలుణ్డోం, నాట్కాలె నీరాడి...." అని గురువుగారు మళ్ళీ చదివి, ఇది రెండవరోజు పాశురం అని ఏదో అర్థం వివరిస్తున్నారు.

తను కోవెల్లోకి వెళ్ళి ఉంటుందేమో చూద్దామని వెళ్ళాను. లోపల జనం పెద్దగా లేరు. లోపలికి వెళ్ళగానే పువ్వుల సువాసనలకి, పచ్చ కర్పూరం కలిపిచ్చిన తీర్థానికి స్వర్ణ కవచ శోభితుడై, పూలంగి సేవలో ఆండాళ్ సహితుడై కనిపించిన భావ నారాయణ స్వామి భావాతీతుడై కనిపించాడు. నా కళ్ళల్లోంచి అసంకల్పితంగా నీళ్ళొచ్చాయి. అది చలి వల్లనో, చ్చ కర్పురం ఘాటు వల్లనో తెలియలేదు. బయకొస్తుంటే భోగమండీలో మఠం వేసుకుని ప్రసాదం పంచుతున్న గోపాలం తాతయ్యగారు పిలిచి "ప్రసాదం తీసుకోరా.." అని మిరియప్పొంగలి చేతిలో పెట్టేదాకా వేరే లోకంలో ఉన్నట్టనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది నేనసలు లోపలికి ఎందుకు వెళ్ళానో. తను ఇక్కడా లేదు!

ఆలోచన ఇంకా ముగియకుండానే...నిలువెత్తు పూల రాశి ఎదురొచ్చింది. ముఖం పూర్తిగా కనపడట్లేదు..అవే వేళ్ళు!

పూల దండలు గర్భ గుడిలోకి తీసుకెళుతోంది.

పచ్చ కర్పూరం తీర్థం తాగిన దగ్గర్నుంచీ మెదడు చలాకీగా ఉందేమో..టక్కున తన దగ్గరికి వెళ్ళి "నన్ను హెల్ప్ చెయ్యమంటారా" అన్నాను. పూల దండలు కొంచెం కిందకి దించి ఎవరూ? అన్నట్టు కనుబొమలు పైకెగరేస్తూ చూసింది. కాటుక లేని అమ్మాయిల కళ్ళు నాకెందుకో నచ్చవు. తను పెట్టుకోలేదా.. నాకే తెలియట్లేదా.. కాటుక లేకపోయినా తన కళ్ళల్లో అంతరాలయ దీపాలు ప్రతిబింబిస్తుండడం వల్లనేమో ఎక్కువ సేపు చూడలేకపోయాను! బరువు మోస్తున్నట్టు మూతి బిగబట్టి ఉంచినా..వద్దన్నట్టు తల అడ్డంగా తిప్పుతూ అంతరాలయంలోకి వెళ్ళిపోయింది.

తర్వాత రోజు దాదాపు నాది, తనది అదే దినచర్య.. అవేళ ప్రసాదం దొన్నె తీసుకుని కొంచెం తీసుకోండి అని ఇవ్వబోతేమళ్ళీ అదే ఎక్స్ప్రెషన్. వద్దని! ఎందుకో.. అతి చనువు తీసుకుంటున్నానా..!

తర్వాత రెండు మూడు రోజులు తను కనబడలేదు.. నిజానికి తను పూర్తిగా ఎప్పుడు కనబడిందనసలు. ఇంట్లో ఆడపిల్లు, బయట స్కూల్లో, కాలేజీలో అమ్మయిలు, నా బెంచి పక్కనే కూర్చునే, సత్యలక్ష్మి, శ్రీవాణి, ప్రసన్న, మేరీ ప్రియా ..వీళ్ళెవర్నీ చూసినా ఎప్పుడూ భావం లేదు..ఇప్పుడున్నది భావమో ఆ భావ నారాయణుడికే తెలియాలి!

నేను క్రమం తప్పట్లేదు.. ఇంట్లో నేను ఎప్పుడు ఎన్ని వేషాలేసినా పట్టించుకున్నది లేదు కాబట్టీ, ఇప్పుడూ ఇంకో వేషం అని చూసీ చూడనట్టున్నారు!

"శ్రవణం, మననం వల్ల మనోమాలిన్యాల దోషాలు దూరమై భగవత్ జ్ఞానం అనే కవచంతో భగవంతుడు తప్ప ఇతరమైన కోరికలపై సృహలేని స్థిత ప్రజ్ఞత స్థితికి చేరినది గోపిక. అలాంటి గోపిక లేచి తమకు మార్గదర్శనం చేయమని ప్రార్ధిస్తుంది గోదాదేవి రోజు..." తొమ్మిదో రోజనుకుంటా, గుళ్ళో గురువుగారు పాశురం అర్థం వివరిస్తున్నారు!

ధ్వజ స్థంభం ముందు దీపపు కాంతిలో తన కళ్ళు మెరుస్తూ కనబడ్డాయి. నెమ్మదిగా అప్పుడు చూసా తన ముఖాన్ని. దీప శిఖలోని అరుణ కాంతి తన ముఖమ్మీద పడి సింధూవర్ణంలోకి మారిపోతోంది. అటు వైపే నడుస్తున్నాను. తను నావైపు చూడకపోతే బాగుణ్ణనిపిస్తోంది. వెలుతుర్లో కళ్ళెత్తి చూస్తే తన కళ్ళల్లోకి చూడడం నా వల్ల కాదేమో అనిపిస్తోంది.

తను చూసేసింది! నవ్వినట్టు చూసాను!

తనది అదే ...అభావం!

సారి నాచేతిలోని ప్రసాదం నేనే తినేసాను!

"నాగనాయ్ నిన్ర నందగోపనుదైయ కోయల్ కాపానే! కోడిత్తోన్రుం తోరణ వాసన్ కాపానే!...." అనే 16 రోజు పాశురం వినబడుతోంది.. ముఖ మండపంలో కూర్చుని తను పాడుతూ నన్నే చూస్తోందిప్పుడు. కొంచెం తడబడ్డట్టుగా అనిపించింది. పాడటం ఐపోయింది.

ఇవాళ అర్థం కూడా తనే పుస్తకంలో చూసి చదువుతోంది!

"ఇంద్ర నీల మణివర్ణ శ్యాముడైన గోవిందుడు నిన్ననే "పరై" యను డప్పు వాయిద్యమును ఇచ్చెదనని, మాట ఇచ్చాడు, మేమంతా స్వామికి మేలుకొలుపు పాడగా వచ్చాము, నీ నోటితో వద్దని చెప్పకు, మమ్మల్ని మా పని చేసుకోనివ్వు, అని కావలి వానిని వేడుకొనుచున్నారు.." ఆపింది.

ఐతే..! నేను తనని డిస్టర్బ్ చేస్తున్నానని అనుకుంటోందా. తనే కదా నన్ను డిస్టర్బ్ చేసినది. నేనేం తప్పుగా ప్రవర్తిచలేదే...మరొక్క మాటైనా అనలేదు కదా! పదిహేను రోజులనుంచీ కలుస్తున్నా కనీసం తన పేరు కూడా కనుక్కోలేదే ఎందుకలా అని ఉంటుందీ. అసలు తన ఉద్దేశ్యం అదేనా నేనే పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నానా..!

పూలంగి సేవకి బుట్టలన్నీ సర్దడం, సౌండ్ సిస్టం సర్దడంలో ఇబ్బంది పడుతున్నారనీ, మధ్యలో శనివారాలు రద్దీలో వలంటరీగా క్యూ లైన్లలో భక్తుల్ని సర్దడమనీ, ప్రసాదాల వితరణనీ..రోజుకొకటి చొప్పున అదనంగావేవో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను.

తను ఎదురొస్తే చూడ్డమే గానీ..తనకోసమై వెతకడం లేదిప్పుడు!

ఇరవై నాలుగో రోజనుకుంటా.. రాబోయే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు, ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏడాదికోసారి మాత్రమే తెరిచే కోనేటి వైపుండే త్త ద్వారం రిపేర్లు చేసి అలంకరణ చేస్తున్నారు నిన్నటి నుంచీ.

ఇవాళ కొంత మంది పిల్లలు ఆడవాళ్ళు, అక్కడ రంగుల పెయింట్లతో ముగ్గులు పెడుతున్నారు. ఎలాగూ వస్తున్నాం కదా అని రోజూ 108 ప్రదక్షిణలు చేసేస్తున్నా రోజూ. బుర్రలో వేరే ధ్యాసలేవీ ఉండట్లేదు. పదకొండో ప్రదక్షిణ అవుతోంది.

ఉత్తర ద్వారం వైపు అలజడిగా అనిపించింది. రెండు అంగల్లో గట్టు దూకి అటు పరిగెట్టాను. భారీ ద్వార బంధానికి ఆధారంగా ఉన్న రాతి పలకలు కదిలి తలుపు ఒక పక్కకి ఒరిగిపోతోంది. కింద మనుషులు ఉండిపోయారు. అలా అని అది పూర్తిగా పడలేదు. తలుపు బొందులు జారి ఇంకో పక్కనున్న రాతి చపటా మీదకి ఒరిగిపోయింది. అందరూ హా హా కారాలు చేస్తున్నారు. గుళ్ళో ఇతర భక్తులు పెద్దగా లేరు. ఇద్దరు పనివాళ్ళు అప్పుడే అటు పరిగెత్తి వస్తున్నారు. వస్తూనే భుజం కాసి పైకెత్తడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు ఏది చెయ్యడానికీ తోచలేదు.

రాతి చపటా..పదిహేనడుగుల భారీ తలుపులు, హాహాకారాలు చేస్తున్న జనం ఇదే కళ్ళముందు కనిపిస్తోంది! ఇంకొద్ది సేపు ఉంటే తలుపు బరువుకి రాళ్ళు జారి పూర్తిగా ఒరిగి కింద ఉన్నవాళ్ళు నలిగిపోయే అవకాశం ఉంది. రాతి పలకల్ని ఆపాలంటే ఇంకా బరువైనదేదైనా కావాలి.

పని వాళ్ళిద్దర్నీ రమ్మన్నాను..రథాన్ని లాగడానికి వాడే తాడు తెచ్చి ఒరిగిపోయిన తలుపుకి కట్టాం! తాడు రెండో వైపుని ద్వార బంధం పైనున్న కొక్కెం లోంచి లాగి రెండో తలుపు గడియకి ముడిపెట్టి ముగ్గురం కలిసి దాన్ని బలంగా నెట్టడంతో ఒరిగిన తలుపు నెమ్మదిగా పైకి లేవడం ప్రారంభించింది గానీ..రాతి పలకలు ఇంకా జారిపోతున్నాయి. పని వాళ్ళిద్దర్నీ తాడు లాగి ట్టి ఉంచమని. నేను ఒరిగిన తలుపు మీదే దిగి రాతి పలకల్ని రెండు చేతులతో ఆపడానికి ప్రయత్నించాను. అనుకున్నట్టు తలుపు ఈసారి తేలిగ్గా లేచింది.

ఈలోపు అక్కడికి చేరుకున్న మిగతా భక్తులూ తలో చెయ్యీ వేసారు..కింద ఇరుక్కున్న వారంతా ఒక్కొక్కరూ బయటికి వచ్చేసారు. చిన్న చిన్న దెబ్బలతో బయట పడ్డారేమో అనిపించింది. అంతా సర్దుమణిగింది.

మైకులో 24 రోజు పాశురం మొదలయ్యింది.."అన్రివ్వులగ మళందాయ్! ఆడిపోట్గ చ్చెనంద్గు త్తెన్నిలజ్జెశెత్తాయ్! రిఱల్పోట్రి పొనచ్చెగడ ముదైత్తాయ్!..." తనే చదువుతోందని అర్థమయ్యింది.

గొంతులో గతంలోని శ్రావ్యత లేదు..మార్ధవం వినిపిస్తోంది. గురువుగారు వ్యాఖ్యానం మొదలు పెట్టారు. "............దేవేంద్రుడు రాళ్ళ వర్షమును కురిపించగా..గోవర్ధన గిరినెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళం జరుగు గాక! నిన్ను పూజించుటకే ఇక్కడికి వచ్చాము క్రిష్ణా... నీ కృప మా యందు ఉంచి నీ కరుణను కురిపించు అని గోపికలు వేడుకుంటున్నారని గురువుగారు తమ వ్యాఖ్యానం ముగించడం మాత్రం తెలుస్తోంది...తర్వాత నాకు స్పృహ లేదు!

హాస్పిటల్లో చేరితే కాలర్ బోన్లో చిన్న ఎయిర్ బ్రేక్ ఉందని ప్యాచ్ వేసారు. ఇంకో రోజు రెస్ట్ తీసుకుని మళ్ళీ మూడో రోజు గుడికి వెళ్ళాను.

108 ప్రదక్షిణలు చేసే ఓపిక లేదనిపించి మూడింటితో ముగించాను. కనిపించిన వారంతా ఎలా ఉందని కుశల ప్రశ్నలేసారు. నా మాత్రం కళ్ళు తన కోసం వెతుకుతున్నాయి!

తను కనపడింది.

ఆనాటి పాశురం కూడా మొదలయ్యింది..

"కూడారై వెల్లుం శీర్ గోవింద ఉందన్నై ప్పడిప్పట్టై కొణ్డుయాం పెఱుత్తెమ్మనం..." చదువుతోంది తను!

పూర్తవ్వగానే భావం వివరిస్తున్నారు "నిన్ను ఆశ్రయించని వారిని కూడా వారి మనసుల్ని మార్చి నీకు దాసులైనట్లు చేసుకొనగల ధీరుడా.. గోవిందుడా! నిన్ను మ్రొక్కి నీ అనుగ్రహానికి పాత్రులను చెయ్యి స్వామీ! లోకం హర్షించేలా నీ అనుగ్రహ వీక్షణాలు కావాలి! వీక్షణ తేజో మయ కిరణాల్లో మా ఒళ్ళు ధగద్ధగాయమానంగా వెలుగొందాలి.. వెలుగే స్వర్ణమయ ఆభరణాలుగా ప్రతిబింబించాలి! అటు మీదట క్షీరాన్నము మునిగిపోయేటట్లు నేతిని వేసి దొన్నెల్లో పొంగిపొరలి మోచేతుల దాకా కారిపోయేలా ఉన్న 'కూడారై' అనబడే క్షీరాన్నం నీతో కలిసి ఆరగించాలని మా కోరిక. అలా ఐతే 26 రోజులుగా కాటుక, అలంకారాలు, నేతి ప్రసాదాలు మాని మేం చేసిన వ్రతం సఫలమైనట్టే...అని గోదాదేవి అంటుందనీ, ఇది 27 రోజు ముగించి మిగతా మూడు రోజులూ తన స్నేహితురాళ్ళతో ఉల్లాసంగా ఆటపాటలతో గడుపుతుందనీ, అందుకే 'కూడారై' వినియోగంతో దీక్షను ముగించిన గోదాదేవిని 'కూడారై వల్లీ' అని సంభోదిస్తారనీ...గురువు గారు వ్యాఖ్యానం ముగించారు.

ప్రసాదం తెచ్చుకోవడానికి కదులుతుండగా ఎదురుగా తనే.. చేతిలో ప్రసాదంతో నిలబడింది.

"తీసుకోండి మీకే" అని నా చెయ్యి లాక్కుని నా చేతిలో పెట్టేసింది.

తను నాతో మాట్లాడిన మొదటి మాట అదే. నేను అప్పటికీ ధైర్యంగా తన పేరు అడిగేద్దామని గొంతు సవరించుకుంటుండగా...తనే చెప్పింది!

"నా పేరు కుముద వల్లీ..." అని తన చిటికెన వేలికంటిన నేతి బొట్టుని నోట్లో పెట్టుకుని ముసిగా నవ్వుతూ వెనక్కి తిరిగి పరిగెడుతోంది...!

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు