పనిపిల్ల (క్రైమ్ కథ) - చెన్నూరి సుదర్శన్

Panipilla

హల్లో.. సార్ పోలీస్ స్టేషనా?”

“ఎస్.. ఎవరు మీరు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?” అంటూ ఎస్సై ఏకాంబరం పోలీసు ధోరణిలో ఆరాతీశాడు.

“సార్ నా పేరు సదానందం. కాశిబుగ్గ నుండి మాట్లాడుతున్నాను.. ఎస్సై గారేనా!”

“అవును.. ఏం సంగతి?” సదానందం గొంతులో భయాందోళన పసిగట్టి నింపాదిగా అడిగాడు ఏకాంబరం.

“సార్.. నేను మల్లంపల్లి నుండి మా ఇంటికి కాశిబుగ్గకు వస్తుంటే దారిలో చెట్ల పొదల్లో ఒక శవం కనబడింది. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు సార్. కాశిబుగ్గ పొలిమేరకు వచ్చి ఫోన్ చేస్తున్నా..” వణక్కుంటూ చెప్పాడు సదానందం.

“అక్కడే ఉండు. నేను జీపులో బయలుదేరుతున్నా. అవునూ.. అది అడవి దారి కదా!. అయినా.. బండ్ల బాట ఉందనుకుంటా”

“ఉంది సార్.. జీపు పోతుంది. నేను ఆ దారి లోనే ఉంటా.. ” అంటూ ఫోన్ సర్దుకొని జేబులో పెట్టుకున్నాడు సదానందం. దారి పక్కనే చిన్న బండరాయి ఉంటే దానిపై కూర్చున్నాడు. అతని మనసు భయంతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ‘ఎవరిదో అమ్మాయి శవంలా కనబడింది. గోనెసంచిలో కుక్కి ఉండడం.. ముఖం సరిగ్గా కనబడ్డం లేదు. మల్లంపల్లి అమ్మాయి కావచ్చు..’ దూరంగా వస్తున్న పోలీసు జీబును చూసి సదానందం ఆలోచనలు ఆగిపోయాయి. లేచి నిలబడ్డాడు. జీబు మరింత చేరువ కావడం చెయ్యి ఊపాడు సదానందం. జీబు వచ్చి పక్కనే ఆగగానే..

“నమస్తే సర్.. నేను సదానందం”

“జీబెక్కు” అంటూ ఎస్సై ఏకాంబరం ఎడం చేత్తో సంజ్ఞ చేసాడు.

“ఎప్పుడు చూసావు శవాన్ని” ఆరా తీశాడు ఏకాంబరం.

“సార్.. నిన్న సాయంత్రం ఇదే దారి గుండా మల్లంపల్లికి వెళ్తుంటే కనబడ లేదు. బహుశః రాత్రి తెచ్చి పడేసారేమో!.. ఇప్పుడు తిరిగి వస్తుంటే కనబడింది” జీబులో ఉన్న మరో ఇద్దరి ముఖాల వంక చూస్తూ బెదురు, బెదురుగా అన్నాడు సదానందం.

జీబులో మరొక కానిస్టేబుల్.. ఒక పోలీసు ఫోటోగ్రాఫర్ ఉన్నట్టు నిర్థారించుకున్నాక అతని మనసు కాస్త నెమ్మది పడింది.

“ఇక్కడికి ఎంత దూరం?” అంటూ ప్రశ్నించాడు కానిస్టేబుల్.

“దాదాపు రెండు కిలోమీటర్లు ఉండవచ్చు సార్”

ఆ మాట విన్న ఏకాంబరం జీపు డ్రైవర్ కు ఇంకాస్త వేగం పెంచమన్నట్టుగా ఇషారా చేసాడు. ‘తోవ బాగా లేదు కదా సార్’ అన్నట్టు ముఖం పెట్టాడు డ్రైవర్. మరో ఐదు నిముషాలలో..

“సార్.. ఇక్కడే ఆపండి.. ఆపండి” ఉద్వేగంతో అరిచాడు సదానందం.

జీబు ఆగగానే.. సదానందం దుమికి పొదల్లోకి దారి తీశాడు. అతని వెనుకాలే పోలీసు బృందం.. ఫోటో గ్రాఫర్ తన మెడలోని కెమెరా తీసి సర్దుకున్నాడు.

శవం తాలూకు వాసన ఏమీ రావడం లేదు.. కాని గండు చీమలు సంచి పైన పారుతూ కనిపించాయి. కానిస్టేబుల్ తన లాఠీతో సంచిని అటూ, ఇటూ దొర్లించాడు. శవం పూర్తిగా బయట పడింది. ఫోటో గ్రాఫర్ తన పనిలో నిమగ్నమయ్యాడు.

దాదాపు పది సంవత్సరాల అమ్మాయి శవమది. కాళ్ళూ, చేతులు శరీరం నుండి వేరు చేయబడి ఉన్నాయి. శవంపై కాలిన బొబ్బలు చితికినట్టు కనిపిస్తున్నాయి. ముఖాన్ని చూడగానే ఏకాంబరం ముఖకవళికలు మారాయి. నుదురు భ్రుకుటి పడింది. లిప్తకాలం ఆలోచించి నిర్థారణకు వచ్చాడు. ‘నిజమే.. ఇది తప్పిపోయిన అమ్మాయి ప్రమీల శవం’ అని మనసులో అనుకుంటూండగా.. టూవీలర్ శబ్దంతో వెను తిరిగి చూసాడు. తాను బయలుదేరుతూ.. గ్రామ సర్పంచికి ఫోన్ చేసిన ఫలితమది. సర్పంచ్ వడి, వడిగా వచ్చి శవాన్ని చూడగానే కంగు తిన్నాడు.

“సార్ ఈ అమ్మాయి ప్రమీల.. నర్సయ్య పెద్ద కూతురు” అనగానే తన నిర్థారణకు బలం చేకూరిందని.. ఇక జరగాల్సిన పంచనామా, పోస్ట్ మార్టం పనులపై దృష్టి సారించాడు ఏకాంబరం. తదుపరి జరగాల్సిన పనులకు కానిస్టేబుల్ ను పురమాయించాడు.

***

ఆ మరునాడు స్టేషన్ లోకి అడుగు పెట్టిన ఏకాంబరానికి తన టేబుల్ మీద ప్రమీల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కనబడ్డాయి. అత్యాచారం జరిగినట్టు సమాచారమేమీ లేదు. ఒంటిమీద కాలిన గాయాలు.. పదునైన కత్తితో అమ్మాయి కాళ్ళూ, చేతులు నరికినట్టుగా నిర్థారించారు. లిప్తకాలం కళ్ళు మూసుకొని కేసును ఎలా పరిశోధన చేయాలా అని ప్రణాళికలు రచించుకున్నాడు. వెంటనే లేచి టోపీ సర్దుకుంటూ స్టేషన్ బయటకు వచ్చి టూవీలర్ పై నర్సయ్య ఇంటికి దారితీశాడు.

ఎస్సైని చూడాగానే నర్సయ్య భార్య నర్సమ్మ .. వారి చిన్న కూతురు ఏడ్పులు పెడబొబ్బలు మిన్నంటాయి. పరుగెత్తుకుంటూ వచ్చి ఏకాంబరం కాళ్ళ మీద పడిపోయింది నరసమ్మ.

నర్సయ్య ఒక కుర్చీ తెచ్చి వాకిట్లో వాల్చి ఏకాంబరాన్ని కూర్చోమంటూ దీనంగా ముఖం పెట్టి రెండు చేతులు జోడించాడు. రాత్రంతా ఏడ్చీ, ఏడ్చీ నీళ్ళు ఇంకి పోయిన అతని కళ్ళు ఎరుపెక్కి ఉబ్బి పోయి ఉన్నాయి. ఇంటి వాతావరణం ఏకాంబరం మనసును కలిచి వేసింది. పోలీసు ఎస్సై వచ్చాడన్న వార్త వాడలో వాట్సాప్ అయ్యింది. జనం పరుగు, పరుగున వచ్చి నర్సయ్య వాకిట్లో గుమిగూడారు.

“ప్రమీల తప్పిపోయిందని.. మీరే తీసుకొని వచ్చి ఉంటారని ఉపేంద్ర రిపోర్ట్ ఇస్తే నేను మొన్న వచ్చి అడిగాను గుర్తుందా?” అంటూ నర్సయ్య, నర్సమ్మల వంక ప్రశ్నార్థకంగా చూసాడు ఏకాంబరం. “మాకేమీ తెలియదన్నారు. మరి ఇప్పుడు ప్రమీల శవం మీ ఉరి పొలిమేరలో దొరకడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరిమీదనైనా అనుమానం ఉందా?”

“సార్.. మాకు ఉపేంద్ర మీదనే అనుమానంగా ఉంది. ఎట్ల తీసుకు పోయిన బిడ్డను అట్ల మాకు అప్పగించాల్సిన బాధ్యత ఉపేంద్రకు లేదా? మీదికెల్లి మేమే.. తీసుకచ్చుకున్నమని దొంగ రిపోర్టిత్తడా” అంటూ నర్సమ్మ తన కూతురు మీద ఉన్న మమకారంతో కాస్త కఠినంగానే సమాధానమిచ్చింది.

ఏకాంబరం మనస్సు గతుక్కుమంది. ‘ఉపేంద్ర తన చేతులు తడిపి ప్రమీల గూర్చి ఆరా తీయుమని చెప్పింది వీరి కేమైనా తెలిసిందా!” అని వ్యాకులపడ్డాడు. నిజమే.. డబ్బుతో తడిచిన చేతులు తడబడుతూనే ఉంటాయి. అయినా మనిషిలోని మంచితనం ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితుల ప్రభావంతో హృదయాన్ని తట్టి లేపుతూనే ఉంటుంది. ఏకాంబరం ఆలోచనలో పడ్డాడు. నర్సయ్య కుటుంబ దీన పరిస్థితి అతణ్ణి అతలాకుతలం చేస్తోంది.

“సార్.. మా పెద్దమ్మాయి ప్రమీల చదువుకుంటానని మారాం చేసేది. పిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేని పరిస్థితి మాది. ఇక చదివించడం మా వల్ల ఏమవుతుంది? ప్రమీలను ఎవరి ఇంట్లో అయినా పనికి కుదర్చాలని అనుకున్నాం. అదే సమయంలో ఉపేంద్ర దంపతులు ఒకరోజు మాఇంటికి వచ్చారు. ప్రమీలను తీసుకు వెళ్తామని.. ఇంట్లో పనిచేస్తూనే చదువుకుంటుందని భరోసా కలిగించారు. పై చదువులు కూడా చదివిస్తామన్నారు. ఇదే వాడలో ఉంటున్నారు కదా.. అని సంతోషంగా ఒప్పుకున్నాం. కొద్ది రోజులకే పట్నంలో వారిరువురికీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ప్రమీలను తీసుకొని వెళ్ళిపోయారు. మాకు వరంగల్ అని చెప్పారు.. ప్రతీ నెల ప్రమీలను తీసుకు వచ్చి చూపిస్తామన్నారు. దగ్గరే కదా!.. అప్పుడప్పుడు చూసి రావచ్చనుకున్నాం. కాని హైదరాబాదు వెళ్లారట. వారి ఇంటి ప్రక్క వాళ్ళు చెప్పారు.. మాకు ఎందుకలా అబద్ధం చెప్పారో తెలియదు.. నెలలు గడుస్తున్నా ప్రమీలను తీసుకు వచ్చి చూపిందీ లేదు. అప్పోసప్పో చేసుకుని వెళ్లి చూసొద్దామంటే.. వారి పత్తా తెలియదు.

పైపెచ్చు మేమే మా అమ్మాయిని తెచ్చుకున్నామని తప్పుడు కేసు బనాయించి మిమ్మల్ని మా ఇంటి మీదకు ఉసిగొలిపారు. అందులోని నిజానిజాలు మీకే తెలియాలి. ఏడాది గడవక ముందే ఇలా మా అమ్మాయి శవాన్ని బహుమతిగా పంపారు” అని భోరుమన్నాడు నర్సయ్య.. కళ్ళు జలపాతాలయ్యాయి.

“నర్సయ్యా.. నాకిప్పుడు పూర్తిగా అర్థమయ్యింది. నేను ప్రమీలను చంపిన వారిని పట్టుకుని శిక్ష పడేలా చూస్తాను” అంటూ లేచి పోలీసు స్టేషన్ కు బయలుదేరాడు ఏకాంబరం.

***

ఏకాంబరానికి మనసులో మనసు లేదు. ఆలోచనలు అతన్ని ముసురుకొని అతలాకుతలం చేస్తున్నాయి. ఉపేంద్ర మహా కేటుగాడు. తన చేతికి మట్టి అంటకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మనుషులను ఎలా బోల్తా కొట్టించాలో అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతని ఉచ్చులో పడాల్సింది కాదు. ప్రమీల తప్పిపోయిన కేసును గూడా నమోదు చేయకపోవడం తన చేతులు తడుపిన ఫలితమే.. ఉపేంద్రను ఎలా ఉచ్చులో పడేయాలా!.. అని ఆలోచిస్తూ.. ఆలోచిస్తూ.. స్టేషన్ చేరుకున్నాడు. నేరుగా తన గదిలోకి వెళ్లి సీట్లో కూర్చున్నాడు.

తన లాకర్ నుండి డైరీ తీసి ఉపేంద్ర సెల్ ఫోన్ నంబర్ వెతికి ఫొన్ చేసాడు.. జవాబు రాలేదు. కాసేపటికి మళ్ళీ ప్రయత్నించినా.. ఉపేంద్ర ఫోన్ ఎత్తక పోవడం.. లిప్తకాలం ఆలోచించి వాట్సాప్ లో మెసేజ్ పంపాడు. అది చదివితే రాక మానడని.. ఒకవేళ రాకుంటే.. తదుపరి చర్యల ప్రణాళికలు సిద్ధం చేసుకొని భోజన సమయమయ్యిందని ఇంటికి దారి తీసాడు ఏకాంబరం.

***

మరునాడు ఉదయం ఏకాంబరం స్టేషన్ కని బయలుదేరుతుంటే సెల్ ఫోన్ మోగింది.. విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కనీసం మెసేజ్ పెట్టకుండా ఉపేంద్ర రావడం.. సెల్ ఫోన్ చెక్ చేసుకున్నాడు. ఉపేంద్ర మెసేజ్ చూసినట్టు కనబడింది. ఇక తన ప్రణాళిక అమలు పర్చాలని కాసేపు ఆ పనిలో మునిగాడు. పది నిముషాల తరువాత స్టేషన్ కు బయలుదేరాడు.

స్టేషన్ ముందున్న కాపలాదారుకు సూచనలిచ్చి తన గదికి దారి తీసాడు ఏకాంబరం. ఏకాంబారాన్ని చూడగానే చటుక్కున రెండు చేతులూ జోడించాడు ఉపేంద్ర. ఈ నక్క వినయాలకేమీ తక్కువ లేదని మనసులో గొణుక్కుంటూ.. ఏర్పడకుండా లోనికి రమ్మని.. కూర్చోమన్నట్టు కుర్చీ చూపించాడు ఏకాంబరం.

“సార్.. అలా మెయిల్ పెట్టారేమిటి? ప్రమీల దొరికిందా!. చాలా సంతోషం సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను” అంటూ మరో మారు చేతులు జోడించి నమస్కరించాడు ఉపేంద్ర.

నటనలోనూ సిద్ధహస్తుడే.. అని మనసులోకి రాగానే ఏకాంబరం పెదవులు విచ్చుకున్నాయి. అనుమానమేమీ రాకుండా..“ప్రమీల దొరికిందంటే.. దొరికింది. కాని శవ రూపంలో.. కాళ్ళూ చేతులూ ముక్కలు కింద నరికారు. ఎందుకు చంపారో తెలియదు. కాని ఎవరు చంపారో తెలిసింది.. కొన్ని ఆధారాలు తెలిసాయి. అందుకే నిన్ను పిలిచాను” అంటూ సొరుగులో నుండి కలం తీసి టేబుల్ పై టక, టక కొట్టసాగాడు.

ఉపేంద్ర గుండె ఝల్లుమంది.

‘అదొక ప్రత్యేకమైన కలం. ఆరోజు ప్రమీలను తప్పిపోయిందని కంప్లైంట్ రాసిమ్మన్నప్పుడు తన వద్ద కలం లేదు. ఏకాంబరమే దాన్ని ఇచ్చాడు. అది జపాన్ లో తయారైన కలమని అందులో చాలా ప్రత్యేకతలున్నాయని చూపించాడు. తనిచ్చిన డబ్బు మోహంలో పడి తిరిగి తీసుకోవడం మర్చిపోయాడు. నేనూ కావాలనే ఇవ్వలేదు. కాని నేడు అదే తనను పట్టిస్తోంది..’ అని మనసులోకి రాగానే ఒంట్లో వణకు పుట్టింది. అయినా ‘కుక్కకు బొక్క ఆశ’ అన్నట్టు ఏకాంబరాన్ని మచ్చిక చేసుకొని మరింత పడవేస్తే.. కేసు లేకుండా చేసుకోవచ్చు అని నిశ్చయానికి వచ్చాడు ఉపేంద్ర.

ఉపేంద్ర ముఖ కవళికలు గమనిస్తున్న ఏకాబరం తన ఉచ్చులో పడబోతున్నాడని.. అతని నోటనే నిజం చెప్పించాలని.. “ఉపేంద్రా.. నువ్వు చాలా తెలివిగల వాడివి.. ఈ కలాన్ని చూడగానే అంతా అర్థమయ్యిందను కుంటాను.. రహస్యం మన మధ్యలోనే ఉంటుంది కాని నాకు నిజం తెలియాలి. ప్రమీల విషయంలో పకడ్బందీగా ప్రణాళిక రచించావు. కాని అంత చిన్న పిల్లను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది?” అంటూ డబ్బు దండిగా ముట్ట చెబితే కేసు లేకుండా చేస్తాననే ధోరణిలో మరో వల విసిరాడు ఏకాంబరం.

“సార్.. మనలో మాట. నిజం చెబుతాను” అంటూ గొంతు సర్దుకున్నాడు ఉపేంద్ర.

“నా శ్రీమతి, నేను ఉద్యోగాలతో సతమతమయ్యే వాళ్ళం. క్షణం తీరిక ఉండేది కాదు. ఒక పని పిల్లను పెట్టుకోవాలని నా శ్రీమతి పోరు పెడితే .. నరసయ్య వాళ్ళ ఆర్ధిక పరిస్థితి పసిగట్టి.. వారి పెద్ద కూతురు ప్రమీలను.. మా ఇంట్లో పనిచేస్తుందని.. బడికి గూడా పంపుతామని మభ్యపెట్టి తెచ్చుకున్నాం. అక్కడే ఉంటే తరచూ నర్సమ్మ వాళ్ళు వచ్చి వేధిస్తారని.. నా శ్రీమతి ఉపాయంతో హైదరాబాదు వెళ్లాం.

ప్రమీలను బడిలో అడ్మిట్ చేయలేదు. ఆమె ఖర్చుల నిమిత్తం మరో ఇంట్లో కూడా పనికి కుదిర్చాం. ఒక రోజు మా ఇంట్లో పనికి రావడం ఆలస్యమయ్యిందని నా శ్రీమతి సల. సలా మసిలే నీళ్ళను ప్రమీల ఒంటి మీద కుమ్మరించింది. ప్రమీల పెడబొబ్బలు పెట్టింది. హాస్పిటల్ కు తీసుకు వెళ్ళితే.. వాళ్ళు పోలీసులకు రిపోర్ట్ ఇస్తారేమోనని భయం. చిన్న పిల్లలను పని మనిషిగా పెట్టుకుంటే నేరం కదా! అని ప్రమీలను ఇల్లు కదలనియ్య లేదు” అంటుంటే గొంతు పొర మారింది. టేబుల్ పై ఉన్న బాటిల్ ఆమోదించాడు ఏకాంబరం. రెండు గుటకలు నీళ్ళు తాగి తిరిగి చెప్పసాగాడు ఉపేంద్ర.

“సార్ ప్రమీల రోదనలు భరించలేక ఒక పథకం వేసాను. ప్రమీల తప్పిపోయిందని నర్సయ్య వాళ్ళే తెచ్చుకొని ఉంటారని మీకు కంప్లైంట్ చేసాను. దాంతో నా మీద అనుమానం రాదని నాలుగు రోజులు వేచి చూసాను. ఇక

ప్రమీలకు గాయాల నుండి శాశ్వత విముక్తి కలిగించాలని హత్య చేసాను. కాళ్ళు, చేతులు ముక్కలు చేసి సంచిలో కూరి నర్సయ్య ఇంటికి దగ్గరలో ఉండాలని కాశిబుగ్గ అడవిలో పడవేసాను. అనాలోచితంగా ఏదో పొరబాటు జరిగింది సార్. ఏ కేసూ లేకుండా చేయండి. మీ శ్రమకు ప్రతిఫలం తెచ్చాను” అంటూ లోదుస్తుల నుండి రెండు లక్షల రూపాయలు తీసాడు”

ఠక్కున బెల్లు నొక్కాడు ఏకాంబరం. భళ్ళున తలుపు తెరుచుకుంది.. ఉపేంద్ర చేతులను గట్టిగా పట్టేసుకున్నారు ఏ.సి.బి. వాళ్ళు. వారి వెనుకాలే పత్రికా విలేకర్లు. అనుకోని సంఘటనకు కళ్ళు తేలేసాడు ఉపేంద్ర.

“చూడు ఉపేంద్రా.. నువ్వు ఆరోజు నాకు డబ్బు ఆశ చూపినప్పుడే అర్థమయ్యింది. నీ నిజస్వరూపం కూపీ లాగాలనే.. ఈ పథకం వేసాను. నువ్వు చెప్పిందంతా బయట అందరూ వినేలా చేయడమే గాకుండా రికార్డు కూడా చేసాను అలా ఒక మైనర్ అమ్మాయిని పని పిల్లగా పెట్టుకోవడం నేరం.. దాన్ని కప్పి పుచ్చుకోడానికి మరో మహా నేరం చేసావు. లంచం ఇవ్వడము మూడవ నేరం” అంటూ కన్నెర్ర చేసాడు ఏకాంబరం.*

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు