గణపవరంలో ఉండే గరుడయ్య గొప్ప ధనవంతుడు. కాకపోతే అతడొక పిసినారి. పిలిచి బిచ్చం పెట్టడు. ధర్మం, సహాయం అనేవి అతనికి నచ్చని పదాలు. అందుకే గరుడయ్యని తిట్టేవారే కాని మంచిగా ఒక్క మాట అతని గురించి చెప్పేవాళ్లు లేరు .
అతడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. వాళ్ళు స్వతహాగా మంచివాళ్ళే కానీ గరుడయ్య వల్ల వాళ్ళు కూడా ఎవరికీ సాయం చెయ్యలేక పోయేవాళ్లు . కోరినంత సంపద ఉన్నప్పటికీ కడుపు నిండా నచ్చిన తిండి తినలేకపోతున్నామని, అవసరంలో ఉన్నవారికి ఏ విధంగానూ సాయపడలేక పోతున్నామని లోలోపల బాధపడేవాళ్లు.
అలా ఉండగా ఒక రాత్రి గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు గరుడయ్య . అతడి మరణానికి విచారించారు భార్య, కొడుకు. గరుడయ్య మరణ వార్త తెలియగానే అతడి బంధుమిత్రులంతా ఆఖరి చూపు చూడడానికి వచ్చారు . వచ్చిన వాళ్లలో ఒక్కరు కూడా ‘అయ్యో’ అని బాధపడలేదు. “ బ్రతికినప్పుడు ఎవరికీ సాయపడలేదు. అలాంటివాడు బ్రతికున్నా భూమికి భారం తప్ప ప్రయోజనం లేదు . అతడున్నా పోయినా పెద్ద తేడా లేదు” అని చెవులు కొరుక్కున్నారు . వాళ్ళ మాటలన్నీ గరుడయ్య భార్యా కొడుకులకు చేరనే చేరాయి. భర్త గురించి తెలిసిందే కనుక అనడంలో న్యాయం ఉందని అనుకుంది గరుడయ్య భార్య.
గరుడయ్యకి పెద్ద కర్మ ఇంట్లోనే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిపించింది అతడి భార్య. పిండం పెట్టి కాకుల కోసం ఎదురు చూసారు వాళ్లంతా . ఒక్క కాకీ వాళ్ళ ఇంటి వైపు రాలేదు.
ఆ సమయంలో త్రోవలో నడిచి వెళుతున్న బడి పంతులు గరుడయ్య ఇంటి వైపు చూసాడు. అందరూ ఒక్కచోటే నిలబడడానికి కారణం అడిగాడు. గరుడయ్య కొడుకు కాకుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పాడు.
దానికాయన ‘మీ ఇంటికి కాకులు రాకపోవచ్చు. ఆ వీధి చివరన కరుణయ్య ఇల్లు ఉంది. ఆ ఇంటి మిద్దె మీద పెట్టండి. తప్పక కాకులు వస్తాయి” అని సలహా చెప్పి వెళ్ళిపోయాడు .
బడి పంతులు చెప్పినట్టే చేసారు గరుడయ్య కొడుకు, బంధువులు. అక్కడ పెట్టగానే కాకులు గుంపుగా వచ్చాయి. వాళ్ళు పెట్టిన పదార్ధాలన్నీ ఖాళీ చేసి వెళ్లిపోయాయి. సంతోషంతో ఇంటికి వచ్చి తల్లికి చెప్పాడు గరుడయ్య కొడుకు.
మరుసటి రోజు ఆ మార్గంలో వెళ్లిపోతున్న బడి పంతులుని చూసిన గరుడయ్య భార్య ఆయనకి నమస్కరించి “నిన్న మీరు చేసిన సాయం మరువలేము. మీరు చెప్పినట్టే కరుణయ్య ఇంటి దగ్గర పిండం పెట్టినప్పుడే కాకులు వచ్చాయని మా అబ్బాయి చెప్పాడు. ఇక్కడకు రాని కాకులు అక్కడికెలా వచ్చాయి? అంతా వింతగా ఉంది” అంది విచారంగా.
“వింత విచిత్రమేమీ కాదమ్మా. కరుణయ్య భూతదయ ఉన్నవాడు. ఇంటి దగ్గర రోజూ పక్షుల కోసం తిండి గింజలు, అన్నం పెడతాడు. వాటి దాహం తీరడానికి గిన్నెలో నీళ్ళు ఉంచుతాడు. అందుకే పక్షులు అలవాటు ప్రకారం అక్కడకి వెళుతుంటాయి. కాకులు కూడా అలాగే వెళ్లాయి. మీరు పెట్టిన పిండం తిన్నాయి . మీ వారి సంగతి మీకు తెలియంది కాదు. అందుకే అవి మీ ఇంటికి రాలేదేమో. ఇకనుంచి మీరైనా భూతదయ , సహాయ గుణం చూపండి. పదిమందికీ సాయపడుతూ పుణ్యం సంపాదించుకోండి. ఎంతో సంపాదించినా ఏమీ అనుభవించలేకపోయాడు. తనతో మోసుకుపోలేదన్న సత్యం గ్రహించండి” అన్నారు బడి పంతులు.
ఏదో ఆలోచన కలిగినట్టు అక్కడనుండి వెనుదిరిగింది గరుడయ్య భార్య .
ఆ రాత్రి కొడుకుని పిలిచి తన మనసులో అనుకుంటున్న విషయం వివరంగా చెప్పింది గరుడయ్య భార్య. ఆమె కొడుకు అందుకు సరేనన్నాడు .
మరునాడే గ్రామపెద్దలని పిలిపించి తమకి ఉన్న ఆస్తిని రెండు భాగాలు చేయించింది గరుడయ్య భార్య. ఒక భాగాన్ని కొడుకుని అనుభవించమని చెప్పింది. మిగిలిన వాటాతో దానధర్మాలు , పుణ్యకార్యాలు మొదలుపెట్టింది.
చుట్టు ప్రక్కల ఉన్న ఊళ్లలో చాలా చోట్ల అన్న సత్రాలు, అనాధ శరణాలయాలు కట్టించింది. నీటి అవసరం ఉన్న ఊళ్లలో నేల బావులు తవ్వించింది. పక్షుల ఆవాసం కోసం వందల కొలది చెట్లు నాటించింది. చాలా దేవాలయాల్లో పూజలు , పుణ్యకార్యాలు నిరంతరాయంగా జరగడం కోసం శాశ్వత నిధి ఏర్పాటు చేసింది గరుడయ్య భార్య.
“బ్రతికినప్పుడు నాలుగు మంచి మాటలు వినగలగడమే పుణ్యం. శాపనార్ధాలు, తిట్లు వినడమే పాపం. ధనం ఉండీ ఎవరికీ ఉపయోగపడకుండా , అనుభవించకుండా దాచేసే బదులు పదిమందికీ సాయపడే పనులు చేయడంలో ఎంతో ఆనందం ఉంది” అని పది మందితో అనేది గరుడయ్య భార్య.
గరుడయ్య భార్య తీసుకున్న నిర్ణయంతో ఎందరికో సాయం లభించింది. ఏ నోట విన్నా ఆమె మీద ప్రశంసలే వినిపించేవి. గరుడయ్య భార్య చూపిన బాటలో మరికొందరు ధనవంతులు నడవడం మొదలుపెట్టారు.
---*-----