వేణు ఒక మామూలు కుర్రాడే.. అందరిలాగే జీవితం మీద ఎన్నో ఆశలు కోరికలు ఉన్నవాడు. చిన్నప్పుడే తల్లి చనిపోతే తనని తండ్రి కళ్లలో పెట్టుకుని పెంచాడు, కానీ వేణు మాత్రం తండ్రి ప్రేమకన్నా తన కోరికలకే ఎక్కువ విలువనిచ్చేవాడు.. తండ్రి రమణయ్య కి వేణు అంటే పంచ ప్రాణాలు..!! ఒకడే కొడుకు అని వేణు ని ఎప్పడు బాధపెట్టలేదు. ఎంత కష్టపడి అయిన అతని భవిష్యత్తును తీర్చిదిద్దాలని తాపత్రయపడేవాడు. తనకి ఉన్నదాంట్లో ఎపుడు వేణు కి లోటు చేయలేదు. తల్లి లేకపోవడం వలనో లేక తండ్రి గారాబం వల్లో వేణు కి ఒకరకమైన గర్వం. తను అనుకున్నది జరగాలన్న పంతం పెరిగింది. ఎంత కష్టమైనా సరే వేణు ని కాన్వెంట్ లోనే చదివించాడు రమణయ్య, వేణుకి ఉన్న స్నేహితులు అందరు బాగా ఉన్న వాళ్ళ పిల్లలు. వాళ్ళని చూసి వాళ్ళలా ఉండాలి, అలాంటి బట్టలే వేసుకోవాలి, అలాంటి bikes లో తిరగాలి అనే ఆలోచనలు వచ్చేవి వేణు కి. ఒక రోజున వేణు తండ్రి దగ్గరకి వచ్చి వేణు: “నాన్న కొత్త మోడల్ ఫోను ఒకటి వచ్చింది కొనివ్వు” అని అడిగాడు రమణయ్య: “అలాగే బాబు” అన్నాడు. అలా కొడుకు కోరినది ఇచ్చేవాడు. తనే పుట్టినరోజు వచ్చినప్పుడల్లా “నీకేం కావాలో చెప్పు” అని అడిగి మరీ కొడుకు ఇష్టాలు తెలుసుకుని ఎంత కష్టమైనా సరే తీర్చేవాడు..!! వేణు కి middle క్లాస్ బతుకు అంటే నచ్చేది కాదు. తన స్నేహితులని చూసాక అది ఇంకా బలపడింది. ప్రతీదానికి స్నేహితులతో, చుట్టుపక్కల వాళ్లతో పోల్చి చూసేవాడు వేణు. వేణు. “వాళ్లు చూడు నాన్న కార్ కొన్నారు. మనం ఇంకా స్కూటర్ మీదే తిరుగుతున్నాం” అని వేరే వాళ్లతో పోల్చి అన్నాడు. తండ్రి చేసే ఉద్యోగం అంటే గౌరవం ఉండేది కాదు. ఆ విషయం తెలిసినా సరే రమణయ్య ఎప్పుడు బాధపడలేదు. ఒకసారి వేణు తండ్రి తో వేణు: ఎన్నాళ్లు నాన్న ఎదుగు బొదుగు లేని వెధవ ఉద్యోగం, మానేసి మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కదా. అని అన్నాడు, అలా అన్నా కూడా, రమణయ్య మెతక మనిషి కాబట్టి కొడుక్కి చిన్నగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. రమణయ్య: “ నేను పెద్దగా చదువుకోలేదు కదా బాబు అయినా కూడా ఈ ఉద్యోగం సంపాదించాను ఇది నిలబెట్టుకోవాలిగా” అని మెల్లగా అన్నాడు. కానీ వేణు అది పట్టించుకోలేదు, ఒకరోజు, వేణు కి పై చదువులు చదవాలన్న కోరిక, దానికి సంబందించిన ఒక కోర్స్ తాలూకు బ్రోచర్ తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. వేణు: “నాన్న నేను ఈ కోర్స్ చేస్తాను ఇది తప్ప వేరే ఏమీ చదవాలనుకోవడం లేదు.. ఎలాగైనా సరే నన్ను ఈ కోర్స్ లో చేర్చు” అని ఖరాఖండిగా చెప్పాడు వేణు. రమణయ్య: “కొంచం costly కోర్స్ లా ఉంది కదా అంత భరించగలమా” వేణు: “ అప్పు చెయ్యి, బ్యాంకు లోన్ అయినా పెట్టు. నా చదువు కోసం ఆ మాత్రం చేయలేవా ?” అని ప్రశ్నించాడు. దానికి రమణయ్య చిన్నగా నవ్వుకుని, అలాగే అని చెప్పి, కొడుకు కోరుకున్న చదువుకి అయ్యే మొత్తం డబ్బుని సర్దిపెట్టాడు. తమ ఊరికి దూరం అయినా పై చదువు కోసం వేణుని ముంబై పంపించడానికి సిద్ధపడ్డాడు రమణయ్య. అలాగే పంపించాడు కూడా. వేణు చురుకు కావడంతో చాలా చక్కగా చదువు కొనసాగించాడు. అలా తను వేరే ఊరిలో ఉన్న సమయం లో కొడుకు పై ప్రేమతో వేణుకి తండ్రి ఉత్తరాలు వ్రాసేవాడు..!! పాతకాలం పద్ధతి అయిన ఉత్తరాలు మనసును కి దగ్గరగా ఉంటాయని అతను అనుకునేవాడు. కానీ ఆ ఉత్తరాలు చదవకుండా విసిరి పారేసేవాడు వేణు. నామోషి మరి..!! ఒకసారి ఇంటికి వచ్చిన వేణు తండ్రికి ఉత్తరాల గురించి చెప్పాలనుకుని రమణయ్యతో, వేణు: ఈ వెధవ ఉత్తరాలేంటి నాన్న ఈ రోజుల్లో?? ఈ ఇంటర్నెట్ కాలం లో ఉత్తరాలకు విలువ ఎక్కడిది?? ఎందుకు కాగితాలు పెన్నులంటూ waste చేస్తావు?? నీ ఉత్తరాల కోసం ఇక్కడ ఎవరు ఎదురు చూడడం లేదు” అని తండ్రిని తిట్టాడు, వేణు అలా మాట్లాడటంతో పాపం గుండెల్లో పొడిచినట్లనిపించింది రమణయ్య కి, కానీ తనకి తానే సర్ది చెప్పుకుని, రమణయ్య : “పోన్లే ఫోన్ అయినా చేసి మాట్లాడచ్చులే” అన్నాడు. కానీ వేణు అదేమీ వినలేదు. నాలుగేళ్లలో తన తండ్రితో మాట్లాడింది తక్కువే. ఫోన్ చేయడం తక్కువ ఇక సెలవలకి ఇంటికి వెళ్లి రావడం సంగతి సరేసరి. వేణు లేని లోటు రమణయ్య కి బాధ కలిగించేది కానీ వేణు కి తండ్రి ఉన్నాడు తన కోసమే బ్రతికున్నాడు అని గుర్తు కూడా లేదు. కొడుకు మాట్లాడే ఒక మాట అయినా ఎంతో విలువైనది రమణయ్య కి. తండ్రికి దూరంగా ఉన్న ఆ దూరం తననీ ఏ మాత్రం బాధపెట్టేది కాదు. అలా కాలం గడిచిపోతూఉంది. కొడుకు నుండి దూరంగా ఉన్న రమణయ్య బెంగతో రోజు రోజు కుంగి పోతున్నాడు, కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ, చదువు అయిపోగానే కొడుకు తన దగరకే వస్తాడు అని. చివరి సంవత్సరం రానే వచ్చింది. చదువులో వేణు మంచి మార్కులు సాధించాడు. అతని కృషికి ఫలితంగా క్యాంపస్ సెలక్షన్స్ లో చక్కటి ఉద్యోగం కూడా సంపాదించాడు. అదే విషయం తండ్రి కి ఫోన్ చేసి చెప్పాడు, వేణు: నాన్న నాకు బెంగళూరు లో ఉద్యోగం వచ్చింది వెళ్తున్నా అని ఎదో formality కి చెప్పినట్టు చెప్పాడు. రమణయ్య: “చాలా సంతోషం బాబు.. నాకు ఇంత కంటే సంతోషం ఏం ఉంది ?? నీ అభివృద్ధేగా నేను కోరుకునేది.. ఉద్యోగంలో పడి ఈ నాన్నను మరచిపోకే”. వేణు:సర్సర్లే..ఉంటాను అని పొడిపొడిగా చెప్పాడు ఆ మాటలు బాధ కలిగించినా సర్దుకున్నాడు.. ఒకసారి రమణయ్య స్నేహితుడు ఇంటికి వచ్చి, స్నేహితుడు: నీ కొడుక్కి బెంగళూరు లో ఉద్యోగం వచ్చిందటగా.. నిన్ను తన కూడా తీసుకెళ్లచ్చుగా ఒకడివే ఎలా ఉంటావు?? వయసు పైబడుతోంది కదా రమణయ్య: “పర్లేదులేరా వాడు ప్రపంచం చూడాలనుకుంటున్నాడు చూడనీ.. కొత్త ప్రాంతం కొత్త భాష నేను వెళ్లి ఏం చేస్తానురా.. ఒక మంచి తోడును వాడికి చూడగలిగితే ఇద్దరు సంతోషంగా ఉంటారు” అని స్నేహితుడికి సర్దిచెప్పాడు, తన స్నేహితుడితో ధైర్యంగా మాట్లాడాడు కానీ ఎక్కడో ఒక మూల చిన్న కలవరం..!! కొడుకు ఎప్పడు వస్తాడా అని ఎదురుచూస్తూ వాకిలివైపు చూడని రోజు లేదు..!! గేట్ శబ్దానికి ఉలికిపడని రోజు లేదు..!! తన కొడుకు లేని లోటు తెలుస్తూ వచ్చింది. ఎన్నాళ్లైందో ఇద్దరు కలసి భోంచేసి..!! ఇద్దరు కలిసి మాట్లాడుకుని..!! తన మనసు లో ఒకటే భావన “నా కొడుకు ఏం చేస్తుంటాడో.. వేళకు తిన్నాడో లేడో ఆ ఊరు కానీ ఊరులో ఎలా ఉన్నాడో” అని.!!కానీ వేణు లోకం వేణు దే. తన తండ్రి బాగోగులు తనకు అవసరం లేదు. తన ఉద్యోగం స్నేహితులు తన లోకం తనదే..!! ఇలా ఉండగా వేణు కి మరో తెలుగు కుర్రాడైన రవి పరిచయం అయ్యాడు. రాను రాను వారి స్నేహం బలపడుతూ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. వేణు కుటుంబం తెలుగువారే అయినా బెంగళూరులోని స్థిరపడ్డారు. రవి కి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. రవి తండ్రి రామయ్య. తండ్రి అంటే వేణుకి అపారమైన గౌరవం. తల్లి లేని లోటు ఏనాడు తెలియనివ్వలేదని ఆయన అంటే ఎంతో ప్రేమ, ఎనలేని అభిమానం. అలాంటి తండ్రి రెండేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదానికి గురై మంచాన పడ్డాడు. తండ్రిని చూసుకోవడానికి మనిషిని పెట్టినా రోజూ సాయంత్రం త్వరగా ఇంటికెళ్లిపోయేవాడు. వేణు : “ఎందుకు రోజు సాయంత్రం త్వరగా వెళ్లిపోతావు? ఆఫీసులో పని లేదా??” అని అడిగాడు. రవి తన తండ్రి గురించి, అతని గొప్పదనం గురించి ఎంతో బాగా చెప్పాడు. చిన్న తనం నుండి తనకు లోటు అంటే ఏమిటో తెలియకుండా పెంచిన తండ్రిని చంటి పిల్లాడిలా తన తండ్రిని చూసుకోవాలని అన్నాడు. రవి: “వేణు …మా నాన్నే నా ప్రపంచం, నాకు జన్మనిచ్చి నాకోసమే బతికి, నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయన కంటే ఎక్కువ ఏముంటుంది?? నాకు ప్రపంచం లో అన్నిటికన్నా ముఖ్యం ఏది అని అంటే “నాన్న” అనే చెప్తాను” అది విన్న వేణుకు ఎక్కడో తను తప్పు చేశాడని అర్ధమైంది..!! కానీ ఇంకా తనలో పూర్తిగా మార్పు రాలేదు. రవితో స్నేహం బలపడింది. రవిని దగ్గరగా గమనించడం మొదలు పెట్టాడు. తన స్నేహితుడి ద్వారా మెల్లగా తన ఆలోచనలు మారాయి. రవిని అతని తండ్రిని చూస్తూ ఉంటే.. అతను చెప్పే మాటలు వింటూ ఉంటే, తన జీవితం గుర్తొచ్చింది. తన తండ్రి తన కోసం ఎంత తపన పడ్డాడో, తన ఆశలను తీర్చడం కోసం ఎంత కష్టపడ్డాడో, అన్ని చేసినా తన తండ్రిని తాను ఎంత దారుణంగా చూసాడో గుర్తుకొచ్చి తన మీద తనకే చెప్పలేనంత కోపం వచ్చింది. తన తండ్రికి దగ్గర కావాలనుకున్నాడు. అలా తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండగా.. తన తండ్రి తనకు ఉత్తరాలు వ్రాసే విషయం గుర్తొచ్చింది. తను అన్ని విసిరి పారేసాడే!! అంతా వెతికాడు.. తన పెట్టెలో ఏదో ఒక మూల ఒక ఉత్తరం అలాగే పడి ఉన్న సంగతి గుర్తుకొచ్చింది. బయటికి తీశాడు..!! ఆ ఉత్తరం మొత్తం చదివాడు.. ఆ ఉత్తరం లో ఇలా ఉంది.. రమణయ్య (VO):“బాబు వేణు.. నువ్వు లేకుండా క్షణం కూడా తోచడంలేదురా..!! ఇంట్లో ఏ మూల చూసినా నీ జ్ఞాపకాలే..!! నీ చిన్ననాటి సంగతులు గుర్తున్నాయా?? నీకు క్రికెట్ అంటే ఇష్టమని నీకొక కిట్ ని కొన్నాను..!! నీ వస్తువులన్నీ భద్రంగా దాచిన నేను అది కూడా దాచాను. అది చూసినపుడల్లా మనం ఆడిన ఆటలు గుర్తొస్తాయి..!! నీ చిన్ని చేతుల్లో ఓడిపోయి ఒకరకమైన ఆనందానికి లోనైన క్షణాలు గుర్తొస్తూ ఉంటాయి నాన్న..!! నీ చిలిపి అల్లర్లు, నీ చేష్ఠలు మరచిపోగలనా?? అవన్నీ ఇపుడు కేవలం జ్ఞాపకాలు మాత్రమే..!! నీకు ఈ తండ్రి గుర్తు రాడా బాబు?? ఈ ప్రాణం నీకోసమే ఇంకా ఉందని నీకు అనిపించలేదా?? ఈ తండ్రిని చూడాలని లేదా?? ఒక్కసారి వచ్చి వెళ్ళు బాబు..!! నీ రూపాన్ని కళ్లలో మరొక్కసారి నింపుకుంటాను. ఇట్లు.. మీ నాన్న..!! అది చదివిన వేణు కళ్లలో నీళ్లు తిరిగాయి, తాను ఎంత పెద్ద తప్పు చేసాడో అర్ధం అయ్యింది. వెంటనే ఒక కాగితం తీసుకుని తండ్రికి చెప్పాలి అనుకున్నవి అన్ని ఒక ఉత్తరంగా రాశాడు..!! వేణు (VO) “నాన్న.. నిన్ను నా ప్రవర్తనతో ఎంతో నొప్పించాను. నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోకుండా బాధపెట్టాను. నువ్వు నాకోసం చేసిన త్యాగాలు మర్చిపోయాను. నా జీవితం మొత్తం నేనే నిండిపోయాను కానీ నా ఈ జీవితం నువ్విచ్చింది అన్న గొప్ప సత్యాన్ని మరిచిపోయాను నాన్న..!! నిన్ను చూడాలనుంది.. వెంటనే వస్తున్నాను. ఈ ఉత్తరం నిన్ను చేరేలోగా నేను నీ ముందుంటాను” అని ముగించాడు.. ఉత్తరం రమణయ్య చేతికందింది.. అది చూసి ఆయనకు చాలా సంతోషమేసింది..!! ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి..!! అనుకున్నట్టుగా కొడుకు వేణు కళ్ల ముందుకొచ్చాడు.. ఇంతకు మించిన ఆనందం ఏమి ఉంటుంది అని లోపల సంబరపడిపోయాడు రమణయ్య. ఆ క్షణం వాళ్ల మధ్య మాటలు లేవు .. ఆ చల్లటి కౌగిలింత వేల మాటలతో సమానం అయ్యింది..!! తండ్రి విలువ తెలిసింది..!! కాసేపు అయ్యాక వారు మాట్లాడుకున్నారు.. రమణయ్య: అమాంతం ఈ తండ్రి మీద ఇంత ప్రేమ ఏంటి బాబు అన్నాడు వేణు: మీరు చూపించిన ప్రేమ గారాబం నా కళ్లను మూసేసాయేమో నాన్న. కానీ నా స్నేహితుడు రవి కారణంగా తన తండ్రిని తాను చూసుకునే విధానం చూసి, నాకు మిమ్మల్ని బాగా చూసుకోలేదు అని అర్థం అయింది. నా వ్యక్తిత్వం ఏంటో నాకు అద్దం లో చూపించినట్లు అయింది. అందుకే మీకు దగ్గారవ్వాలనుకున్నాను. అంతే నాన్న..!! అందుకే లేట్ చేయకుండా వచ్చేశాను అన్నాడు..!! వేణు మాటలకు రమణయ్య చాలా సంతోషించాడు. వేణు కి తండ్రి విలువ తెలియడమే కాదు.. తండ్రి మనసును అర్థం చేసుకున్న కొడుకుగా తండ్రి మాట నెరవేర్చే ఒక మనిషిగా మారాడు. తండ్రికి ఒక నందనవనం లాంటి ఇల్లు కట్టించాడు. తన తండ్రిని తక్కువ చేసి మాట్లాడిన ప్రతివారినీ దూరం పెట్టాడు. పెళ్లి కూడా తండ్రి ఇష్ట ప్రకారమే చేసుకుని.. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న తన కోరికను వదులుకున్నాడు..!! ఒకప్పుడు తండ్రి అంటే తన అవసరాలు తీర్చే ఒక యంత్రం అనుకున్నాడు, కానీ ఇప్పుడు తన తండ్రితో తండ్రికి అన్ని తానే అయ్యాడు.