ఆదివారం కావడంతో బాబా ఆశ్రమం భక్తులతో కిట కిటలాడుతుంది.
వేదికపై తన ఆసనంపై కూర్చున్నబాబా ' భక్తులారా అనేక సంవత్సరాలు
హిమాలయాల్లో గురువును సేవించి జ్ఞానం పొందాను. లోకకల్యాణార్ధం ఇక్కడ ఆశ్రమం నిర్మించుకుని పూజలు,యాగాలు నిర్వహిస్తున్నాను.
కనుక యాగార్ధం కర్చులకు మీవంతు సహయంగా ధనసహయం చేయండి.ఈరోజు మాగురుదేవులు ,వారి గురు దేవులు ఉపదేశించిన కొన్నివిద్యలు ప్రదర్శించబోతున్నాను' అన్నాడు.
స్వామిజి శిష్యుడు ఒకరు ఖాళీ తెల్లని ప్లాస్టిక్ ప్లేటు ఉంచి వెళ్ళాడు .ప్లేటు మద్యలో ముక్కుపొడి రంగు పుష్పం బొమ్మ ముద్రించి ఉంది.
తనముందు వరుసలో కూర్చున్న ఒక యువకుని చూస్తూ ' నాయనా నీవద్ద ఏవైన కాగితంఉంటే ఇవ్వు 'అన్నాడు స్వామిజి.వేదికపైకి వచ్చిన
ఆయువకుడు తన చేతి సంచిలోనుండి ఒక కాగితం ఇచ్చాడు. ' ఈఖాళీ ప్లేటులో ఏమిలేదు,అందరు చూస్తుండగా ' ఇప్పుడు ఈకాగితం ఎలా మంట లేకుండా కాలుతుందో చూడండి ' అని తన చేతిలోని కాగితాన్ని ప్లేటు లోనికి చూపించాడు. ఒక్కసారిగా వెలిగిపోతూ కాగితం కాలిపోయింది.
'నాయనా మరో కాగితం ఇవ్వు అని ,అతని వద్దకాగితం తీసుకుని పసుపు,కుంకుమలు ఆకాగితానికి రాసి,మంత్రాలు చదువుతూ ' ఇప్పుడు ఈకాగితం ఎంత ప్రయత్నం చేసినా కాలదు ,ఈకాగితాన్ని నామంత్ర శక్తి చే అలా చేసాను ' అన్న స్వామి ,ఆకాగితాన్ని పరిక్షించడానికి చాలామంది తమ వద్దనున్న సిగరెట్ లైటర్ తో ప్రయత్నంచారు.ఆకాగితం కాలలేదు.
ఆసభలోని ఒక యువకుడు ' స్వామి జీ తమకు నేను ఒక కాగితం ఇస్తాను దాన్ని ఇలాగే ఇప్పుడే ,ఇక్కడే మంత్రించి కాలకుండా చేయగలరా? ' అన్నాడు.
మౌనం వహించాడు స్వామిజి.
' అందరు గమనించండి ఆస్వామిజి ముందు ఉన్న ప్లేటులో జిగురు వంటి సానిటైజర్ వేసి దాన్ని వెలిగించి పెట్టి వెళ్ళాడు ఆయన శిష్యుడు.
కరోనా సమయంలో మనమంతా పలు రకాల సానిటైజర్లు వాడినవారమే. పగటిపూట వెలుగులో ఆశానిటైజర్ మండే వెలుగు మన కంటికి
కనిపించదు. దానిపై ఏకాగితం ఉంచినా మండిపోతుంది.
కాలని ఈకాగితం పటిక కలిపిన నీటిలో పలుమార్లు ముంచి ఆరబెట్టడం వలన మండదు.
పటిక నీటిలో పలుమార్లు పాదాలు ముంచి ఆరబెట్టుకుని నిప్పులపైన హయిగా నడవవచ్చు, అరచేతిలో పటిక నీటిని పలుమార్లు పూసి
ఆరబెట్టిన అనంతరం ,అరచేతిలో కర్పురాన్ని వెలిగించవచ్చు ఎలాంటి గాయము కాదు.
పలు మార్లు పత్తికాయను కోసి ఆరబెట్టిన కత్తితో నిమ్మకాయను కోస్తే రక్తవర్ణంలో కనిపిస్తుంది. సున్నం తేట నీటిలో పలుమార్లు ముంచి ఎండబెట్టిన టెంకాయిపై నీళ్ళు చల్లితే పగిలిపోతుంది.
మనిషి బలహీనతను ఏదోవిధంగా సోమ్ముచేసుకునేవారిలో ఇటువంటి బాబాలు కోకోల్లలు. అసలు ఏదేవాలయం వారు కానీ, ఏబాబా మనలను పిలవరు మనమే వెళ్ళి చందాలు ఇచ్చి వారి పాదాలు ముట్టుకుని వస్తాం. ఈభూమిపైన మనకు తెలిసినంతలో ఏబాబా అయీనా మరణం పొందకుండా ఉన్నాడా? మనిషిని దేవుడు ఎలా అవుతాడు.అయీనా పెరిగే వెంట్రుకలు సమర్పిస్తాం,తిరిగి రాని కాలో,చేయో దేవునికి ఇవ్వంగా! పెద్దలు చెప్పినట్లు మేకలను బలిఇస్తాం,కాని పులులను బలి ఇవ్వం.ఎంత రేటు చెల్లిస్తే అంత దగ్గరగా,తొందరగా దేవుని దర్శనం పనులు జరిగిపోతుంటాయి.
ఇక్కడ ధన బలమే కాని దైవబలం ఏది? వండి పెట్టిన వంటకాలు ప్రసాదం పేరున మనమే ఆరగిస్తాం. నిన్న కేట్టిన టెంకాయ నేడు మనంట్లో కొబ్బరి పచ్చడి అవుతుంది.
అసలు మనిషికి దేవునితో పనేముంటుంది. తల్లి,తండ్రిని మించిన దైవం వేరే లేదు. మన కష్టం మనం పడుతూ ఆకష్టపడి తెచ్చుకున్న ధనం మన అవసరాలకు వాకుంటున్నప్పుడు అది దేవుడు ఇచ్చినది ఎలా అవుతుంది. పెద్దలు శ్రమతేవజయతే ! అన్నారు.శ్రమలోనే స్వర్ణం ఉంది.కష్టించనిదే ఏది దక్కదు. గాలిలోదీపము ఉండదు దానికి మనం చేతిని అడ్డు ఉంచాలి.అన్నింట అమాక ప్రజలు శ్రమ,ధన దోపిడికి లోనౌతున్నారు.
వందమంద సూర్యులు, వేయి మంది చంద్రులు ఒకేమారు ఉదయించినా మనిషిలోని అజ్ఞానం తొలగిపోదు. మనిషా విజ్ఞానవంతుడు కావాలంటే విద్యా వంతుడు కావాలి.
ఆలోచించండి శాస్త్రీయతంగా పరంగా,ప్రకృతి పరంగా జరిగేవాటికి
దైవత్వన్ని అంట కట్టకండి. వీటిలో ఏమంత్రము మాయలు ఉండవు బాబాలను నమ్మి మోసపోకండి ' అన్నాడు ఆయువకుడు.