పూర్వం చక్ర వీరపురం అనే రాజ్యములో జయ దత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నిరంతరం అమ్మవారి అర్చన చేస్తూ నిరంతరం ఆ తల్లి నామస్మరణే చేసేవాడు. జయ దత్తునికి కొంతకాలం తర్వాత రాజు గారి కొలువు లో ఉద్యోగం లభించింది తన కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూ ఉండేవాడు జయ దత్తుడు. జయ దత్తుని పనితనం నచ్చి సేనాపతి గారు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు వారిరువురికి చక్కని సంతానము కలిగింది .ఇదంతా అమ్మ కృపే అని భావిస్తూ అమ్మను పూజిస్తూ ఉండేవాడు. అదే రాజు గారి కొలువులో మంత్రి పదవిని కూడా పొందాడు జయ దత్తుడు. ఒకనాడు రాజ్యములో దొంగలు చొరబడి రాజు గారి ఖజానా లో ఉండే విలువైన వజ్రాలను దొంగలించారు. ఈ విషయం తెలుసుకున్న జయదత్తుడు వెంటనే దొంగల్ని వెంబడించి వారు దొంగలించిన వజ్రాలను తిరిగి తీసుకుని రాజుగారి భవనంలోకి వస్తున్నాడు. దొంగల్ని వెంబడించిన జయ దత్తుని చూసి రాజుగారు జయదత్తుడే దొంగని జయ దత్తుని కఠినంగా శిక్షించాడు కారాగారంలో బంధించాడు. జయ దత్తుని కారాగారంలో బంధించిన వెంటనే రాజ్యంలో అంతు చిక్కని వ్యాధితో జనులు ఇబ్బంది పడ్డారు. మరో ప్రక్క శత్రు రాజులు రాజ్యంపై యుద్ధానికి వచ్చారు. ఎందుకు రాజ్యంలో ఈ వ్యాధి ప్రబలింది అసలు కారణమేమిటని చింతిస్తూ ఉన్నాడు రాజు ఆరోజు రాత్రి రాజు గారి కలలో సింహ వాహనంపై ఉన్న అమ్మవారిని దర్శించాడు అమ్మవారు రాజుని హెచ్చరించింది ఏ తప్పు చేయని నా భక్తుని ఇబ్బంది పెట్టినందుకు ఈ శిక్ష విధించాను అన్నది అన్యాయంగా చేయని తప్పుకు నా భక్తుల్ని హింసిస్తే నేను వారిని తప్పక శిక్షిస్తాను అన్నది. తర్వాత రాజుగారు నిద్రలేచి వెంటనే కారాగారానికి వెళ్ళాడు అక్కడ జయ దత్తుని విడిపించాడు తాను చేసిన తప్పును క్షమించమని వేడుకున్నాడు. నిజా నిజాలు పరిశీలించి అసలైన దోషులకు శిక్ష విధించాడు జయ దత్తును విడిపించిన వెంటనే రాజ్యంలో ఆ వ్యాధి తీవ్రత తగ్గింది .శత్రు రాజులను రాజు జయదత్తుని సలహా మేరకు యుద్ధము చేసి విజయం సాధించాడు . అమ్మవారి ఉపాసన చేసే జయదత్తుడు ఉన్నచోట కరువు కాటకాలు లేక సుఖశాంతులతో భోగభాగ్యాలతో ఆ ప్రాంతం అమ్మ కృపతో వర్ధిల్లింది.