పరిమళ వికాస్ శంకర రావు పార్వతి డాక్టర్ అద్వైత్ పరిమళ బాగా చదువుకున్న అమ్మాయి. జీవితం పట్ల ఎన్నో ఆశలు కోరికలు ఉన్న అమ్మాయి. పరిమళ నాన్నగారు ఆడపిల్లలను చక్కగా చదివించాలి వారు ఉన్నత స్థానాలకు ఎదగాలి అనుకునే మనస్తత్వం గల వ్యక్తి. కూతురి ఆశలను ఆశయాలను గౌరవించే వ్యక్తి. పరిమళ: “నాన్న నాకు ఉద్యోగం వచ్చింది. రేపే జాయినింగ్” సంతోషంగా తన తండ్రికి ఆఫర్ లెటర్ చూపించింది పరిమళ. శంకరరావు గారు: “చాలా సంతోషం అమ్మా.. నాకు తెలుసు నీకు ఈ ఉద్యోగం వస్తుందని” అన్నారు శంకరంగారు నవ్వుతూ.!! భార్య పార్వతి కూడా వాళ్ల ఆనందానికి శృతి కలుపుతూ.. పార్వతి గారు: మొదటి నుండి మన అమ్మాయి అదృష్టవంతురాలే అండి.. ఏది తలబెట్టినా విజయమే మన బంగారు తల్లికి” ఉండు పాయసం చేసి తీసుకొస్తాను” అలా అని అదే తడవుగా వొంటిలోకి వెళ్లారామె..!! ఇక పరిమళ ఉద్యోగంలో మొదటి రోజు ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తూ కలలు కంటూ ఆ రాత్రి నిదురలోకి జారుకుంది..!! మరుసటి రోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని ఆఫీస్ చేరింది పరిమళ. అందరితో పరిచయం ఏర్పరచుకుంది. సహజంగా కలిసిపోయే తత్వం కలిగిన పరిమళ అందరితో చక్కగా కలిసిపోయింది. తనకు తన ఉద్యోగం నచ్చసాగింది..!! తన సహోద్యోగుల్లో “వికాస్” అనే అబ్బాయి పరిమళతో స్నేహం చేయాలని తన వద్దకు వచ్చాడు. వికాస్: “ హాయ్ పరిమళ గారు నా పేరు వికాస్.. నేను కూడా మీ టీమే”..!! మొదట పరిమళ అంతగా స్పందించలేదు. తనకున్న సహజమైన సంకోచంతో. వికాస్: “ఏంటి పరిమళ గారు నేను ఎలాంటి వాడినో అని భయమా?? అలాంటి భయమేమి అక్కరలేదు..”ఐ యామ్ అ డీసెంట్ గయ్ యు క్నో”. మెల్లగా ఇద్దరు దగ్గరవసాగారు. కబురులు చెప్పుకోసాగారు. కలిసి టీ తాగేవారు. లంచ్ బాక్సెస్ పంచుకోవడం కలిసి ప్రాజెక్ట్స్ చేయడం టీ గట్రా కలిసి తాగడం ఇలా మెల్లగా ఒకరి భావాలు ఒకరు పంచుకోసాగారు.. అభిరుచులు పంచుకోసాగారు. ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజి చేసుకున్నారు. ఫోన్లలో కూడా మాట్లాడుకునేవాళ్లు. స్నేహం బలపడింది. ఇలా ఉండగా ఒక రోజు.. వికాస్: “నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పరిమళ మీ అందం మాట నడవడిక మీ చేష్టలు అన్నీ నాకు చాలా నచ్చాయి. నా భార్య అంటే అది మీరే..!! బాగా ఆలోచించుకుని చెప్పండి “. ఇలా అని తన మనసులోని ప్రేమను బయటపెట్టాడు వికాస్. పరిమళ: నేను ఆలోచించి చెప్తాను అన్నది” వికాస్ తో తనకున్న స్నేహమో ఏమో వికాస్ ను తప్పుగా ఏం అనుకోలేదు. తనకూ వికాస్ మీద మంచి అభిప్రాయమే ఉంది. అందుకే అలా ఆలోచించి చెప్తాను అన్నది కాని కోపగించుకోలేదు. మరుసటి రోజు వికాస్ తో ఇలా అన్నది పరిమళ: “నేను మా అమ్మ నాన్నలకు ఒకతే కూతురుని నేను తప్ప వారికి ఎవరు లేరు. నేనే వాళ్ళ ప్రపంచం. నేను పెళ్లి చేసుకునే వ్యక్తి వాళ్ళని కూడా చేరదీయాలని ఎలాంటి బేధ భావం చూపించకూడదు అంతే కాదు నేను ఉద్యోగం చేస్తాను వారిని చూసుకుంటాను” వికాస్: “ఓస్ ఇంతేనా మీ అమ్మ నాన్న నాకు కూడా అమ్మ నాన్న. వాళ్లకి ఏ లోటు రానివ్వను. ఇది నా మాట” అన్నాడు. అర్థం చేసుకున్న వ్యక్తి తన జీవితంలోకి వస్తున్నాడని పొంగిపోయింది పరిమళ. తల్లి తండ్రులకు చెప్పి ఒప్పించింది. అటు వికాస్ ఇంట్లో కూడా వాళ్ల పెళ్లికి ఒప్పుకున్నారు. కళ్యాణ ఘడియ వచ్చేసింది. తమకి ఉన్నంత లో చక్కగా పరిమళ వికాస్ వివాహాన్ని జరిపించారు శంకర రావు పార్వతి గార్లు..!! అంతా చాలా త్వరగా జరిగిపోయినా కూడా అంతా బాగానే జరిగింది కదా అని పరిమళ సంతోషించింది. ఏదో ఒక మూల చింత ఉన్నా దాన్ని ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరిగింది అన్న భావన తన చింతను దూరం చేసింది. మొత్తానికి మంచి జీవిత భాగస్వామిని పొందాలన్న తన కల సాకారమైంది.. కానీ మొదటి రాత్రి ఇక్కడ వద్దని హనీమూన్ పాకేజ్ బుక్ చేసానని పరిమళను తీసుకుని బయలుదేరాడు వికాస్. ఎక్కడో చిన్న కలవరం. మూడు నిద్రల ముచ్చట పుట్టింట్లో జరగలేదే అని. కానీ కోరుకున్న భర్త ఉండగా ఆ కలత దూరమైంది. కానీ తను చూస్తున్న వెలుగును కప్పేయడానికి చీకటొచ్చినట్లు పరిమళ ఆలోచనలకు కళ్లెం పడి తన కల నిజము కాదని ఆలస్యంగా తెలిసింది. తనని తన అత్తగారింట్లోకి తీసుకెళ్లాడు వికాస్.. పెళ్ళికిముందు ఉన్న వికాస్ వేరు.. ఇపుడు తను చూస్తున్న వికాస్ వేరు. నిజానికి తన వ్యక్తిత్వానికి భిన్నంగా తనని తాను చూపించాడు పరిమళ కి. పరిమళ చూసింది అర్థం చేసుకున్నాను అనుకున్నది నిజమైన వికాస్ కాదు. ఆ వికాస్ వేరు. వికాస్ అనే కుర్రాడు ఒక స్వార్థపరుడు. తన గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించని మనస్తత్వం కలవాడు. తల్లి ఏమీ చెప్తే దానికే తలాడిస్తాడు. తన లోకం తనదే. పెళ్లి చేసుకునే అమ్మాయి జీతం కూడా తన కోసమే అయుండాలి.. తన చెప్పు కింద నల్లిలా ఉండే పెళ్లాం కావాలి అనే ఆలోచనా ధోరణి కలవాడు. కానీ పైకి మాత్రం నిజమైన వ్యక్తిత్వం తెలియదు కదా. ప్రపంచం నిండా మేక వన్నె పులులే. పరిమళ లాంటి అమాయకుల కోసం వేచి చూస్తుంటాయి ఇలాంటి వారి కన్నులు. పరిమళ స్వేచ్ఛను లాగేసుకుంది ఆ పెళ్లి. తనలో తను లేనట్లు అయిపోయింది. వికాస్ కు తనంటే ఒక అవసరానికి పనికివచ్చే మనిషి. ప్రేమ అనేది దూరంగా కూడా కనపడేది కాదు పరిమళకి. రొజూ తనకు దెప్పిపొడుపులు, ఈసడింపులు తప్పేవి కాదు. తనని తన మాటల్తో బాధపెట్టేవాడు వికాస్. వికాస్: “చెప్పినట్లు పడుండు..!! నువ్వు ఉద్యోగం చేసి తెచ్చే జీతం మీ అమ్మనాన్నలకు అప్పనంగా ధారపోస్తానంటే చూస్తూ ఊరుకుంటానా?? ఇల్లు కదలాలన్నా నాకు చెప్పి కదులు..!! ఆఫీస్ కి నేనే తీసుకెళ్లి తీసుకొస్తాను. పిచ్చి వేషాలు వేస్తే బాగుండదు” అలా అని కుండ బద్దలు కొట్టాడు వికాస్..!! తన పేరులో ఉన్న వికాసం తన ఆలోచనల్లో లేదని తానొక పురుషాహంకారి అని అర్థమయింది పరిమళ కి.. పేరుకు తగ్గట్టుగా తనలో సహజసిద్ధంగా ఉంటే సుగుణాల పరిమళం ఎక్కడో అత్తగారింట్లో ఒక మూల అణగారిపోయింది..!! వికాస్: “నువ్వొక్కడానివే ఉద్యోగం వెలగబెడుతున్నావా?? వచ్చి నా మొహాన ఓ కాఫీ పడేసి పో.. నా బట్టెలు ఎవడు ఇస్త్రీ చేస్తాడు?? నా టవల్ ఇచ్చి తగలడు.. ఏం అన్ని ఆపసోపాలు “ ఇవి నిత్య సుప్రభాతం పరిమళకు..!! సాయంత్రం ఆఫీస్ లో లేట్ అయినా అదే ఆఫీస్ లో తనూ ఉన్నా… భార్య పరిస్థితి అర్థం కాదు వికాస్ కు. మళ్లీ ఇంటికొచ్చాక ఈసడింపులు, రుసరుసలు, విసుర్లు, ఇవే పరిపాటి. కానీ పెళ్లి అన్న బంధాన్ని వదులుకోలేదు. భర్తను దూరం చేసుకోలేదు. అందుకే ఆ బంధం నుండి బయటకు రాలేకపోయింది. ఎలాగో ఆ బంధాన్ని నెట్టుకొస్తోంది. ఇంతలో పరిమళకు ఒక విషయం తెల్సింది.. తాను గర్భవతి అని.. ఆ విషయం చెబితేనైనా భర్త ఆదరణ దొరుకుతుంది ప్రేమ దొరుకుతుంది అనుకుంది కానీ తన అంచనా తప్పైంది..!! పరిమళ: ఏవండీ నేను గర్భవతిని.. ఎందుకో అనుమానంగా అనిపించి కిట్ తెచ్చుకుని చూసుకున్నాను” అంది కానీ వికాస్ నుండి తాను ఊహించని సమాధానం వచ్చింది. వికాస్: మహా గొప్పలే.. నువ్వొక దానివే కంటున్నావా బిడ్డని” అని విసుగ్గా అన్నాడు భర్త.. కడుపు పేరు చెప్పి హాయిగా కూర్చుందాం అనుకుంటున్నవేమో..!! అవేమి కుదరవు అన్నాడు..!! అసలు ఆడదాని జన్మ హక్కు పిల్లలని కనడం అనుకునేవాడికి తన భార్యకి అదొక కొత్త జన్మలాంటిది అని ఎలా తెలుస్తుంది? ఆ మాటలకి పాపం కన్నీరులా కరిగింది పరిమళ..!! ఒకరోజు చెకప్ కు డాక్టర్ దగరకు వెళ్లారు వికాస్ పరిమళ. డాక్టర్: “మీ భార్య చాలా వీక్ గా ఉన్నారు కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఆమెకి రెస్ట్ అవసరం”. వికాస్ : ఓకే డాక్టర్ నేను చూసుకుంటాను. .అక్కడ అలాగే అని అన్న ఇంటికొచ్చాక మళ్లీ అదే ధోరణి. ఎందుకంటే ఒక నెల జీతం వొదులుకోవాలన్న కూడా అది తనకి ఇష్టం లేదు. తన ఆరోగ్యం సహకరించినా ఎలా ఉన్నా ఉద్యోగానికి వెళ్లాల్సిందే. భర్తను ఒప్పించలేక, తగిన విశ్రాంతి దొరకక తొమ్మిది నెలలు ఎలాగో నెట్టుకొచ్చింది పరిమళ.. ఆఖరు చెక్ అప్ కు వెళ్లినపుడు నార్మల్ డెలివరీ కష్టం అని తెగేసి చెప్పారు డాక్టర్ గారు..!! ఫార్మ్ మీద సంతకం పెట్టమన్నారు. అలాగే చేశాడు వికాస్. ఖర్చు చేయాలంటే మనసు రాని వికాస్ ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడు. పుట్టింటి వాళ్లకి డెలివరీ భారాన్నంతా అప్పజెప్పేయాలని. అపదివరకు పుట్టింటి వాళ్లకి కనీసం పరిమళ గర్భవతి అన్న వార్త కూడా చెప్పని వాడు వాళ్లకి ఫోన్ చేసి చెప్పాలని అనుకున్నాడు. అనుకున్న దాని ప్రకారం హాస్పిటల్ లో చేర్చాక ఇంటికి వెళ్ళిపోయాడు. పుట్టింటికి కబురు పెట్టి చేతులు దులుపుకున్నాడు. పరుగు పరుగున వచ్చారు శంకరరావు పార్వతి గార్లు..!! తమ బిడ్డ ఆలనా పాలన తొమ్మిది నెలలు కూడా చూసుకునేవాళ్లం కదా అనిపించింది వాళ్లకి. కానీ అల్లుడిని ఏమీ అనలేదు. డాక్టర్ తో మాట్లాడి తమ కూతురి పరిస్థితి తెలుసుకోవాలనుకున్నారు. పరిమళ తల్లిదండ్రులు: “ఎలా ఉంది డాక్టర్ మా అమ్మాయి?? ప్రసవం సుఖంగా ఔతుందా ?? తల్లీ బిడ్డ క్షేమమే కద డాక్టర్” డాక్టర్: “లేదండి కాన్పు కష్టం అయేలాగే ఉంది. కంగారు పడకండి మా ప్రయత్నం మేము చేస్తాం. ఆపైన దేవుడి దయ” ఆ మాటలు విన్న వారు కన్నీరు మున్నీరయ్యారు. వికాస్ కనీసం హాస్పిటల్ ఛాయలకు కూడా రాలేదు. అక్కడ చేయవలసినదంతా పరిమళ అమ్మానాన్నలే చూసుకున్నారు. భర్త అయిఉండి ఏ బాధ్యత తీసుకోలేదే అని అనిపించింది వాళ్లకి. ఇన్నాళ్లు కూతురుతో దూరం ఎందుకు పెరిగిందో, తను అన్నాళ్లు అత్తింట్లో ఎలా ఉందో అన్ని అర్థం అయ్యాయి వాళ్లకు. ఇక కూతురు అలాగే పుట్టబోయే సంతానం ఆరోగ్యంగా ఉండాలని వెయ్యి దేవుళ్లకు మొక్కారు..!! మానసికంగానే అనేక క్షేత్రాలు దర్శించేశారు..!! ఆ మొక్కుల ఫలితమో ఏమో కానీ పరిమళకు మగబిడ్డ పుట్టాడు.!! ఆ వార్త విని డాక్టరుకు అనేక ధన్యవాదాలు చెప్పారు. ఆస్పత్రిలో అందరికీ స్వీట్లు పంచి పెట్టారు. ఎంత అల్లుడు అంటే కోపం, ఒక రకమైన జుగుప్స కలిగినా, తమ ధర్మంగా అల్లుడికి ఫోన్ చేసారు..!! శంకర రావు: “అల్లుడు గారు మీకు కొడుకు పుట్టాడండి.. తల్లి బిడ్డ క్షేమం. “ వికాస్: వెరీ గుడ్. నా వారసుడు అనమాట.. ప్లస్ ఏ అయితే నాకు. ఎక్కడ మైనస్ ది పుట్టుకొస్తుందేమో అని కంగారైపోయాను” వీలు చూసుకుని వస్తాన్లెండి” అన్నాడు. ఆ మాటలు శంకరరావు తో పాటు పార్వతి పరిమళలు కూడా విన్నారు. సంకుచితపు ఆలోచనలుగల తన భర్త అంటే వెగటు పుట్టుకొచ్చింది పరిమళకి. తను ప్రేమించిన వ్యక్తి వేరు.. ఈ వ్యక్తి వేరు. మాటలతో మాయ చేసి స్వతంత్రంగా స్వయంప్రతిపత్తితో బ్రతికే తనని ఒక మారబొమ్మని చేశాడు.. కీ ఇస్తే కానీ ఆడని బొమ్మ తను. తాళితో ఏర్పడిన ఒక బంధం తనకు సంకెల ఔతుందని.. తమ వివాహానికి సాక్షి ఐన అగ్ని తన అస్తిత్వాన్ని కాల్చేస్తాడని.. ఏడడుగులు వేశాక తన అడుగుల సడి కూడా భర్త ఆనతికై వేచి చూస్తుందని.. ఆ రోజు తను ఊహించలేదు..!! ఇప్పుడు ఈ క్షణం తన బిడ్డతో పాటు తనూ మళ్లీ పుట్టాను అనుకుంది. పాత పరిమళ ఇక లేదని కొత్తగా కొంగొత్తగా ఉద్భవించి, వికసించిన పుష్పంలా , పూరి విప్పిన నెమలి లా ఇపుడే తనను తాను పొందింది అని గ్రహించింది.. ఒక భార్యగా కన్నా సమాజానికి ఒక మంచి బిడ్డను అందించే తల్లిగా తను మారాలని గ్రహించింది!! పరిమళ: “నాన్న ఇక ఈ బిడ్డకు తల్లి తండ్రి నేనే..!! నాకు ఆ మనిషికి ఏ సంబంధం లేదు.. నేను ఎవరికి భారం కాను. నా బిడ్డను ఒక ఆదర్శవంతమైనవాడిగా ఆడదాని మనసెరిగి మసలే వాడిగా ఒక ప్రయోజకుడిగా మార్చడమే నా జీవన పరమావధి. నేనేమైనా తప్పుగా ఆలోచించానా నాన్న?” శంకరరావు: లేదమ్మా.. నేను నీ పట్ల గర్వపడుతున్నానమ్మా.. నీ భవిష్యత్తు నిర్మించుకోవడానికి నీకు ఏ ఊతం అవసరం లేదు తల్లి.. కానీ నా చివరి ఊపిరి వరకు నేను నీ వెన్నంటి ఉంటానమ్మ..!! అల్లుడి ప్రవర్తన, కూతురి ఆవేదన అర్థమైన ఆయన కూతురికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పరిమళ.. చాలా థాంక్స్ నాన్న..!! అమ్మ మరి నువ్వేమంటావమ్మా?? పార్వతిగారు కూడా భర్త ఎలా ఆలోచించాడో తను కూడా అలాగే ఆలోచించింది. కూతురు కన్నా ఎవరు ఎక్కువ కాదు అనుకుంది. పార్వతి: తల్లి.. అందరు తల్లులలాగా నిన్ను మరచిపో సర్దుకుపో అని నేను అననమ్మా..!! నా భర్త నన్ను ఎంత అపురూపంగా చూసుకున్నారో నీ భర్త కూడా నిన్ను ప్రేమించాలని కోరుకుంటానమ్మా..!! నీ భర్త ఒక మనసు లేని మనిషని.. భార్య అంటే కుక్కిన పేనులా చూస్తాడు అని తెలిసాక.. ఇక నేను ఎలా సమర్ధిస్తానమ్మా?? నా కూతురు గొప్ప నిర్ణయం తీసుకుంది.. ప్రపంచం.. హ్మ్ మనం కష్టం లో ఉన్నపుడు మన వెన్ను తట్టక.. మనం ఆనందంగా ఉనపుడు ఏడ్చే ఈ ప్రపంచం అంటే ఏహ్య భావం వచ్చేసింది తల్లి..!! బంధువులు.. వాళ్లు మనను పొడుచుకుని తినే రాబందులు!! ఇలాంటి సమాజం మాకు అక్కరలేదమ్మా.. మా రక్తం నువ్వు.. మా జీవం నువ్వు. నీ మాటే మా మాట కూడా” ఆ మాటలు విని ధైర్యం గుండెనిండా నింపేసుకుంది పరిమళ. డిశ్చార్జ్ అయ్యాక తల్లిదండ్రులతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. వికాస్ హాస్పిటల్ కు వచ్చి వాకబు చేశాడు. విషయం తెల్సింది..!! ఆఘమేఘాలమీద శంకరరావు ఇంటికి వచ్చాడు..!! వికాస్: ఏమిటి మీ పద్ధతి. ఒక మాటైనా లేకుండా మీ కూతుర్ని తీసుకుపోయారేం?? మేము చచ్చాం అనుకున్నారా? వికాస్ మాటలు విన్న పార్వతి గారి ఆవేశం కట్టలు తెంచుకుంది..!! పార్వతి: ఔను బాబు ఎపుడు అయితే నా బిడ్డ అపాయంలో ఉండగా వదిలేసావో ఆనాడే.. ఏనాడు అయితే బాధ్యత లేకుండా ప్రవర్తించవో ఆనాడే అల్లుడుగా మా దృష్టిలో ఇక నువ్వు లేనట్లే..!! మా అమ్మాయిని కనీసం మనిషిలా చూడలేని నీకు మా దృష్టిలో ఏ విలువ లేదు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మాకు కనీస మర్యాద లేదు. అందుకే మీ ఇంటికి మా కూతుర్ని పంపేది లేదు. పరిమళ కూడా తను ఇన్నాళ్లుగా చెప్పలేని మాటలు చెప్పేసింది. తనలో ఉన్న బాధ బయటపెట్టింది పరిమళ: ఇన్నాళ్లు గ్రహణం పట్టిన నా జీవితం ఇపుడే వెలుగు దారులను చూస్తోంది. ఇకపై మళ్లీ రాహువు లాంటి నిన్ను నా జీవితం లోకి రానివ్వను. నువ్వు నా జీవితానికి అర్థం లేకుండా చేసావు అయినా సహించాను. పెళ్లి పేరుతో నా బతుకు చీకటి చేసావు .. ఇక అది చెల్లదు..!! నా కొడుకును ఆదర్శంగా పెంచుతాను.. నేనెందుకు అలా పెరగలేదు అని ప్రతి క్షణం ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతావు..! ఇంకెప్పుడు ఈ గుమ్మం తొక్కద్దు అని కరాఖండిగా చెప్పింది..!! చేసేది లేక వికాస్ వెనుదిరిగాడు. వికాస్ కి మాత్రం బుద్ధి రాలేదు. మరో ఆడపిల్లను తన బుట్టలో వేసుకునే పనిలో పడ్డాడు. మరలా పెళ్లి చేసుకున్నాడు. ఆ మరో ఆడపిల్ల గతి ఏమౌతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇక పరిమళ, జరిగినది మరచి ముందు ఏం జరగాలో ఆలోచించింది. తన జీవితాన్ని, తన బిడ్డ జీవితాన్ని తనే చక్కదిద్దుకునేందుకు ముందడుగేసింది..!! ఒక నిర్ణయం తన ఉజ్వల భవిష్యతు కి నాంది అయ్యింది..!! తన తండ్రిదండ్రుల అండతో, బతుకు మీద ఆశతో ముందుకు నడిచి కొత్త గమ్యం చేరడానికి అడుగులు వేసింది. ధైర్యంతో ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయమే తన చక్కటి జీవితానికి సోపానం అని నిరూపించింది..!! ఆ రోజు నుండి పరిమళ నిజంగానే పరిమళించింది..!!