మాతృవత్ పరదారేషు..!! - Lakshmi Priyanka

Matruvat paradareshu

శోభన్ సుప్రజ నీరజ్ మనోజ వెంకట్రావు సుబ్బారావు అంజని శర్మిష్ఠ కైలాష్ పార్వతి శోభన్ సుప్రజ భార్యాభర్తలు. అదొక చక్కని జంట. అరమరికలు లేని సంసారం. చిన్న చిన్న అలకలు గొడవలు ఉన్నా అవి తమరాకు మీద నీటి బోట్లే కానీ రాతి మీద చెక్కిన గీతలు కాదు. నలుగురూ చూసి మెచ్చుకునే జంట. శోభన్ తల్లిదండ్రులు వెంకట్రావు మరియు అంజని. వారి పెంపకం యొక్క ప్రభావం ఎంతైనా ఉంది శోభన్ మీద. కోడలు అంటే ఎంతో ప్రేమ వారికి. సుప్రజ కూడా అత్తమామలను తల్లిదండ్రులుగా భావిస్తుంది. శోభన్ సుప్రజలు ఉండేది హైదరాబాదులో. ఉద్యోగరీత్యా అక్కడ స్థిరపడ్డారు ఇద్దరూ. అంజని వెంకట్రావులు ఉండేది విజయవాడలో. సెలవల్లో , వీలు చిక్కినపుడల్లా విజయవాడ వెళ్తారు. ఇక వీరు వెళ్తే అంజని వెంకట్రావులకు పండగే. ఎంతో ఆనందంగా గడుస్తాయి వాళ్లందరూ కలిసి ఉన్న రోజులు. ఇక వీళ్లు ఇలా ఉంటే వీళ్లకు పూర్తిగా వేరుగా ఉండే కుటుంబం ఇంకొకటి ఉంది. సుబ్బారావు శర్మిష్ఠ దంపతులకు ఒకడే కొడుకు నీరజ్. నీరజ్ భార్య మనోజ. సుబ్బారావు ఒక పురుషాహంకారి. భార్య శర్మిష్ట అంటే తనకు అవసరాలు తీర్చుకునే ఒక సాధనం. ఇక శర్మిష్ఠ చాలా మృదు స్వభావురాలు. భర్త ప్రేమ ఆదరణ దొరకకున్నా అన్ని సంవత్సరాలు సంసారాన్ని నెట్టుకొచ్చింది. కొడుకు నీరజ్ ది కూడా తండ్రి పోలికే. అమ్మ అంటే చిన్న చూపు. యధా జనక తథా పుత్ర అన్నట్లు ఉంటుంది నీరజ్ వ్యవహారం. అన్ని అవసరాలు అమ్మ తీరుస్తుంది కానీ అమ్మకు ఉన్న ప్రేమ యొక్క కొరత తను తీర్చకపోగా ఇంకా ఆమెను బాధ పెడుతుంటాడు. ఇలా ఉండగా నీరజ్ పెళ్లి మనోజ్ అనే అమ్మాయితో జరిగింది. ఆ అమ్మాయి అమాయకురాలు. పుట్టింట్లో ప్రేమతో కూడిన వాతావరణం చూసిన ఆమెకి నీరజ్ ఇల్లు ఒక జైలు. కానీ అత్తగారు కోడలికి బాసట అయింది. అంతే కాదు ఇన్నాళ్లు తోడు లేక ఒంటరిగా ఉన్న శర్మిష్ఠకు కోడలు అండగా మారింది. రెండు ఒంటరి ప్రపంచాలు కలిసి ఒక కొత్త ప్రపంచం ఏర్పడింది. ఇది ఇలా ఉండగా నీరజ్ కూడా శోభన్ సుప్రజలు పని చేసే ఆఫీసులోనే పని చేసేవాడు. మనోజ చేసే ఉద్యోగాన్ని మాన్పించేశాడు నీరజ్. ఇక నీరజ్ ఒక్కడే ఆఫీస్ కి వెళ్లేవాడు. మనోజకు మాత్రం ఇల్లే ప్రపంచం అయిపోయింది. ఆఫీస్ లో తను చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవాడు. కనిపించిన అమ్మాయిలను ఇబ్బంది పెట్టేవాడు. కానీ ఎవరికీ తెలిసేది కాదు. తను ఒక టీమ్ లీడర్ కనుక ఎవరు కూడా బయటపెట్టడానికి ప్రయత్నించలేదు. నీరజ్ శోభన్ ఒకే ఆఫీస్ అయినా కూడా వేరే ప్రాజెక్ట్ అవడం వల్ల పెద్దగా పరిచయం లేదు. ఒక ప్రాజెక్ట్ లో ఒకేసారి కలిసి పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. మేనేజర్: నీరజ్ నువ్వు శోభన్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ లో పని చేయాలి. ఒక టీమ్ గా పని చేసి దీన్ని సక్సెస్ చేయాలి. మేనేజర్: శోభన్ నీరజ్ తో కలిసి పని చేయడం మీకు ఇష్టమే కద? శోభన్: తప్పకుండా సర్. మీ అంచనాలకు తగ్గట్టు నీరజ్ నేను పని చేసి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తాం!! మేనేజర్: గుడ్. అల్ ది బెస్ట్.. మనం డెడ్లైన్ మీట్ అయేలా చూసుకోవాలి.!! గో ఆహేడ్.!! నీరజ్: శోభన్ గారు..ఈ ప్రాజెక్ట్ లో మనతో పాటు ఎవరెవరు పని చేస్తారు? శోభన్: మా టీమ్ లో 3 మెంబర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ అయ్యారు. అందులో మా వైఫ్ కూడా ఉంది. తన పేరు సుప్రజ. తను ఒక సీనియర్ డెవలపర్. నీరజ్: ఓహ్ నైస్. మరి నాకు పరిచయం చేయరా??శోభన్: తప్పకుండా .. దానిదేముంది శోభన్ సుప్రజను పిలిచి నీరజ్ కు పరిచయం చేశాడు. సుప్రజను పలకరించాడు నీరజ్. నీరజ్: హాయ్ సుప్రజ గారు.. నైస్ టు మీట్ యు సుప్రజ: నమస్కారం నీరజ్ గారు. గ్లాడ్ టు మీట్ యు నీరజ్ కన్ను సుప్రజ మీద పడింది. స్వతహాగా స్త్రీల వెనకపడే నీరజ్ సుప్రజ అందానికి ముగ్ధుడు అయ్యాడు. సుప్రజ లాంటి భార్య దొరికినందుకు శోభన్ అదృష్టం చూసి కుళ్లుకున్నాడు. అసూయ తో కూడిన దుర్బుద్ధి నీరజ్ ది. ఇక పరిచయాలు అయ్యాక పని మొదలుపెట్టారు. శోభన్ సుప్రజ ధ్యాస అంతేలా ప్రాజెక్ట్ మీదే ఉంది కానీ నీరజ్ ధ్యాస సుప్రజ మీద ఉంది. కానీ అది గమనించలేదు శోభన్ సుప్రజలు. పని మధ్యలో చిన్న చిన్నగా మాట్లాడుకునేవారు. సుప్రజ: నీరజ్ మీకు పెళ్లయిందా..?? నీరజ్: లేదండి.. అలా అని తేలికగా అబద్ధం చెప్పేశాడు నీరజ్. సుప్రజ: ఓహ్ అలాగ మరి సంబంధాలు చూస్తున్నారా?! నీరజ్: ఔనండి.. మీలాంటి అందమైన అలాగే అణకువ కలిగిన అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి. ఆ ప్రశంస వెనక దాగిన ఆలోచన సుప్రజకు అపుడు అర్థం కాలేదు. శోభన్: మా ఆవిడలా ఇంకొకరు ఉండరు లెండి.. అన్నాడు నవ్వుతూ..!! నీరజ్ ముఖం చిట్లించాడు. అది గమనించలేదు శోభన్ సుప్రజలు. ప్రొజెక్ట్ పనులు నడుస్తూ ఉండగానే సుప్రజకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేశాడు నీరజ్. సుప్రజకు అనుమానం కలుగలేదు. టీ టైం లో మాటలు కలపడం, మాట మాటకూ పొగడ్తలు, చనువు తీసుకోడానికి ప్రయత్నించడం.. ఇది నీరజ్ దినచర్య. సుప్రజ అది కలుపుగోలుతనం అనుకుంది. వారి టీమ్ లో కైలాష్ పార్వతి మరో ఇద్దరు మెంబర్స్. చురుకైనవారు. వారికి నీరజ్ ప్రవర్తన ఎందుకో నచ్చేది కాదు. సుప్రజతో అతి చనువుగా ఉండడం వాళ్లు గమనించారు. కైలాష్: శోభన్ సర్ .. ఈ నీరజ్ ప్రవర్తన కొంచం ఇబ్బందిగా ఉంది. సుప్రజ మేడమ్ తో కావాలని మాటలు కలపడం, అకారణంగా నవ్వడం మాకు తేడాగా అనిపిస్తోంది సర్. మీ వెల్ విషెర్స్ గా చెప్తున్నాము.. మేడమ్ ని అతనికి దూరంగా ఉంచండి. మేము చెప్పాం అని కాకుండా అతన్ని దగ్గరగా పరిశీలించండి. అప్పటినుండి శోభన్ కూడా ఒబ్సెర్వె చేయడం మొదలుపెట్టాడు. నీరజ్: ఇవాళ నేను భోజనం తేలేదండి.. క్యాంటీన్ కి వెళ్తున్న వస్తారా? సుప్రజ: అలాగ ఉండండి మా ఆయనని కూడా పిలుస్తాను.. శోభన్ ఒక పక్కగా ఉన్న సంగతి తెలియక.. నీరజ్: శోభన్ గారు పని లో ఉన్నారండి. లేట్ గా తింటారట నాతో చెప్పారు.. అని అబద్ధం చెప్పాడు. అది గమనించిన శోభన్ కి నీరజ్ ఎందుకిలా చెప్తున్నాడో తెలుసుకోవాలన్న ఆలోచన కలిగింది. ఇంకా అతన్ని గమనుంచాడు. నీరజ్: బయట కాఫీ తాగుదాం వస్తారా?? మన ఆఫీస్ లో అంతగా బాగోలేదు.. మెషిన్ కాఫీ కదా.. సుప్రజ: ఔనండి నాకూ ఈ కాఫీ నచ్చలేదు. ఉండండి మా వార్ని కూడా రమ్మంటాను. నీరజ్: అయ్యో ఇపుడే నేను అడిగే వస్తున్నాండి.. ఆయన బిజీ ఆట.. మనని వెళ్లి రమ్మన్నారు ఇదంతా చూస్తూనే ఉన్నాడు శోభన్..!! సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వెళ్లే సమయం.. అందరూ వెళ్తుంటే.. శోభన్ మాత్రం వెళ్లలేదు. శోభన్: సుప్రజ.. నువ్వు ఆటోలో వెళ్లిపో నేను చిన్న పని ఉంది అది చూసుకుని వస్తాను అన్నాడు..!! సుప్రజ.. అయ్యో ఇంకా పని ఉందా వెయిట్ చేస్తాలెండి.. అంది..!! శోభన్: లేదు సుప్రజ కాస్త టైమ్ పట్టచ్చు.. నువ్ ఇంటికెళ్లి ఫ్రెష్ అయ్యి ఏదైనా తినడానికి చేసి ఉంచు.. నేను వస్తాను సుప్రజ.. అలాగేనండి..!! శోభన్ నీరజ్ ను అతనికి తెలియకుండా ఫాలో అయ్యాడు. నీరజ్ ఇల్లు చేరాడు. బెల్ కొట్టాడు. మనోజ తలుపు తీసింది. మనోజను చూసిన శోభన్.. ఎవరయి ఉంటుంది అనుకున్నాడు. తెలుసుకుందామని మెల్లగా గోడ దూకి కిటికీ పక్కగా నిల్చుని చూడసాగాడు. నీరజ్: ఒసేయ్ మనోజ.. నా మొహాన కాస్త కాఫీ నీళ్ళు తగలేయ్..!! మనోజ: అలాగేనండి. తీసుకొస్తాను ..!! ఈ రెండు మాటలు విని శోభన్ కు అర్థమైంది అతనకి పెళ్లైంది కానీ అవలేదని అబద్ధం చెప్పాడని. సుప్రజను తప్పుడు దృష్టితో చూస్తున్నాడని. వెళ్లిపోకుండా అలాగే కాసేపు అక్కడే ఉండి గమనించాడు. నీరజ్: నీకొక ఉప్మా చేయడం కూడా రాదా??!! ఎడిసినట్లు ఉంది. నీ మొహంలా.. ఒక పని కూడా చేతకాదు నీకు మనోజ: బానే ఉంది కదండీ నీరజ్: ఏంటి ఎదురు మాట్లాడుతున్నావ్ అని చేయి ఎత్తాడు. శర్మిష్ఠ గారు అడ్డు వచ్చారు. శర్మిష్ఠ ఎందుకు రా ఆ అమ్మాయిని అలా ఏడిపిస్తావు?? ఈలోగా శర్మిష్ఠ భర్త సుబ్బారావు వచ్చి..”మొగుడు పెళ్ళాల మధ్య నీకేం పని? నీ పని నువ్వు చూసుకో” అన్నాడు. నా గతి కూడా అదేగా అని మనసులో అనుకుని ఆమె మళ్లీ వంటింట్లోకి వెళ్లింది. ఇదంతా చూసిన శోభన్.. నీరజ్ ఎలాంటి వాడో అర్థం చేసుకున్నాడు. నీరజ్ కు బుద్ధి చెప్పాలనుకున్నాడు. వంటింటి కిటికి దగ్గరకు వెళ్లి మనోజను పిలిచాడు.. శోభన్: చెల్లమ్మా.. ఇలా రా అన్నాడు మనోజ: ఎవరు మీరు?? శోభన్: మీ ఆయన నీరజ్ పని చేసే కంపెనీ లో ప్రాజెక్ట్ మేనేజర్ ని. మీ ఆయన ప్రవర్తన మీద అనుమానం వచ్చి ఇలా అతనేంటో తెలుసుకుందామని చాటుగా వచ్చాను అన్నాడు. మనోజ: అలాగ.. మా మాటలు అన్ని విన్నారా? శోభన్: ఔనమ్మా..!! నేను చెప్పినట్లు చేయమ్మా.. మీ ఆయన మారతాడు. శోభన్ ను చూస్తే సహోదర భావన కలిగింది మనోజకు. తన జీవితం మీద ఒక ఆశ కలిగింది. మనోజ: ఏం చేయాలో చెప్పండి అన్నయ్య..!! మీరు ఏం చెప్తే అది చేస్తాను శోభన్: సరే అమ్మా.. జాగ్రత్త. మా అండ ఉందని మర్చిపోకు. మరుసటి రోజు శోభన్, పార్వతి కైలాష్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. కైలాష్: సర్ ఆ నీరజ్ కి బుద్ధి చెప్పాలి. దాని కోసం ఏమైనా చేద్దాం. శోభన్: నేనొక ప్లాన్ చెప్తాను. అలా చేద్దాం. పార్వతి: సరే సర్.. డన్..!! నీరజ్ యధావిధిగా మళ్ళీ సుప్రజకు దగ్గరగా రావాలని చూశాడు. సుప్రజతో మాట కలిపాడు. నీరజ్: సుప్రజ గారు గుడ్ మార్నింగ్ అండి సుప్రజ: గుడ్ మార్నింగ్ నీరజ్ గారు..!! నీరజ్: ఇవాళ మీ చీర చాలా చక్కగా ఉండండి..। సుప్రజ: ఎంతైనా మా ఆయన సెలక్షన్ కదండీ..!! ఇలా వాళ్లిద్దరూ మాట్లాడుతూ ఉండగానే… మనోజ ఆఫీస్ లోకి వచ్చింది..!! తను రావడం చూశారు అందరూ. నీరజ్ నోట్లో మాటలు లేవు. మనోజ ఎందుకు అక్కడికొచ్చిందో అర్థం కాలేదు అతనికి. తన ప్రపంచం తలకిందులు అయినట్లు అనిపించింది. మనోజ్ నీరజ్ దగ్గరికొచ్చి: నమస్తే అండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. నాకు ఇక్కడ ఆఫర్ ఇచ్చారండి. HR నీ కలవాలి. కొంచం హెల్ప్ చేస్తారా ? అంది నీరజ్ ఉన్న షాక్ లో తను ఏమీ మాట్లాడలేదు. ఈలోగా కైలాష్ వచ్చాడు. కైలాష్: ఎస్ మేడమ్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు?? మనోజ: నాకు ఆఫర్ లెటర్ ఉండండి. ఇవాళే జాయినింగ్. కొంచం హెల్ప్ చేస్తారా అండి ??!! కైలాష్: ఓ షూర్.. మీ ఆఫర్ లెటర్ ఇలా ఇవ్వండి అని తీసుకున్నాడు. మనోజను తీసుకెళ్లి తన సీట్ లో కూర్చోపెట్టాడు. టీ ఆఫర్ చేశాడు. కలిసి టీ తాగారు మాట్లాడుకున్నారు. అది చూస్తూ ఉన్న నీరజ్ నోట మాట రాలేదు. మనోజ: మన టీమ్ ని పరిచయం చేస్తారా? కైలాష్: అఫ్కోర్స్ .. అని శోభన్ ని సుప్రజను పార్వతిని పరిచయం చేశాడు. నీరజ్ ని కూడా పరిచయం చేశాడు. నీరజ్ ఎవరో తెలియనట్లే చేసింది మనోజ. సాయంత్రం ఇల్లు చేరాక నీరజ్ మండిపడ్డాడు. మనోజ జంకలేదు. నీరజ్ ఆశ్చర్యపోయాడు. ఏం చెప్పాలో తెలియలేదు. తను చెప్పినట్లు వినే తన భార్య, తను ఏం చెప్పినా చేసే భార్య తనకు ఎదురుతిరగడం జీర్ణించుకోలేకపోయాడు. మనోజ చాలా ధైర్యం ప్రదర్శించింది. ఆ రోజు నుండి ఆఫీస్ కి వీళ్లేది, అందరితో కలుపుగోలుగా ఉండేది. ముఖ్యంగా కైలాష్ మనోజతో చనువుగా ఉండేవాడు. తనతో స్నేహంగా ఉండేవాడు. ఫ్రీ టైం లో వాళ్లిద్దరే మాట్లాడుకునేవారు. కలిసి లంచ్ చేసేవారు. టీ తాగడం, జోక్స్ వేసుకుని నవ్వడం.. ఇలా ఉండేది వాళ్ల తీరు. ఇదంతా నీరజ్ కు నచ్చేది కాదు. ఒకరోజు సహనం ఓపలేక శోభన్ కు కంప్లైంట్ చేయాలని వెళ్లాడు. నీరజ్: సర్ ఆ కైలాష్ ప్రవర్తన ఏం బాగోలేదు సర్ శోభన్: ఔనా ఏం చేశాడు? మీకేమైనా ఇబ్బంది కలిగిందా?? నీరజ్: మనోజతో అతని ఇక ఇకలు పక పకలు నాకు నచ్చలేదు సర్. శోభన్: మనోజ గారికి లేని ఇబ్బంది మీకెందుకు? ఆవిడే ఎప్పడు కైలాష్ మీద చిన్న మాట నాతో చెప్పింది లేదు. నీరజ్: అదీ.. అదీ.. ఆమె నా భార్య సర్..!! శోభన్: మరి మీకు పెళ్లి కాలేదన్నారు?? సంబంధాలుంటే చూడమన్నారు?? నీరజ్: అదంతా అబద్దం సర్.. మీ వైఫ్ సుప్రజ గారికి క్లోజ్ అవాలని అలా చెప్పాను. సారీ సర్. కానీ ఆ కైలాష్ ని మాత్రం వదిలిపెట్టకండి. శోభన్: ఛీ.. నీకు అసలు సిగ్గుందా? పరాయి వాడి భార్య కోసం ఆశపడతావా? కానీ నీ భార్యతో ఒకరు మామూలుగా మాట్లాడినా నవ్వినా అది తప్పంటావా? ఏ ఆమెకి మనసుండదా?? ఆమెకి అందరితో కలిసి మెలిసి ఉండాలని ఉండదా? నవ్వుతూ మాట్లాడితే ఏదో ఉన్నట్లా?? అలాగే నా భార్య నీతో నవ్వుతూ మాట్లాడితే నీకు అవకాశం ఇచ్చినట్లా?? నీకు తోబుట్టువులు, అమ్మ విలువ తెలిస్తే ఇంకో స్త్రీ గురించి కూడా నువ్వు తప్పుగా ఆలోచించవు. కానీ నీకు మీ అమ్మ మీద కూడా గౌరవం లేదు. నీ మీద అనుమానం వచ్చే నేను నీ గురించి తెలుసుకున్నాకే మనోజ ను ఈ ఆఫీస్ లో చేరేలా చేసాను. నీకు బుద్ధి చెప్పాలనే ఇలా చేశాను. ఇపుడు తెలిసిందా నీకు?? ఆడదాని స్వేచ్ఛను నువ్వు లాక్కోలేవు అలాగే మరో ఆడది కాస్త నవ్విందనో మాట్లాడిందనో తను నీకు లొంగుతుందని కాదు. కాబట్టి ఇకనైనా బుద్ధిగా ఉండు. గుర్తు పెట్టుకో మన శాస్త్రాలే చెప్పాయి మాతృవత్ పరదారేషు అని.. అంటే పర స్త్రీ తల్లితో సమానం అని. అది తెలుసుకుని మసలుకో. లేదంటే నీ భార్య గురించి కూడా ఎవడో ఒకడు నీలాగే తప్పుగా ఆలోచిస్తూ ఉంటాడని, మనం చేసే కర్మ మనకే వెనక్కి తిరిగొస్తుంది అని తెలుసుకో..!! నీ ఉద్యోగానికి ప్రస్తుతం ఏ ఢోకా లేదు. మళ్లీ ఇలా చేస్తే ఊరుకునేది లేదు!! అలా నీరజ్ కి బుద్ధి చెప్పాడు శోభన్. ఇదంతా సుప్రజ కు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. నీరజ్ తన తప్పు తెలుసుకున్నాడు. సుప్రజ దగరకు వెళ్లి తనకు పెళ్ళైన సంగతి చెప్పి మనోజను పరిచయం చేశాడు. ఆశ్చర్యంగా ఆమె కూడా ఎక్కువ ప్రశ్నించకుండ వాళ్ళకి విషెస్ చెప్పింది. తర్వాత శోభన్ ఆమెని నీరజ్ మీద కోపం రాలేదా అని అడిగాడు?? అతను చేసింది నీకెలా తెలిసింది అన్నాడు? అతను చేసింది తెలీదు కానీ మీరు చేసింది తెలిసింది.. పార్వతి చెప్పింది అంది. ఇద్దరు పరస్పరం తమ మధ్య ఎంత ప్రేమ ఉందో అనుకున్నారు..!! ఈలోగా నీరజ్ శోభన్ ఇంటికి వచ్చాడు. నీరజ్ ముఖం మీద పశ్చాత్తాపం ఉండడం చూశాడు. శోభన్: ఏంటి నీరజ్ ఇలా వచ్చావ్?? నీరజ్: మీతో కొంచం మాట్లాడాలి.. సుప్రజ గారిని కూడా పిలుస్తారా? అన్నాడు. తను పిలిచిన పిలుపులో కూడా గౌరవం కనపడింది శోభన్ కి. శోభన్: సుప్రజ ఇలా రా!! సుప్రజ: వస్తున్నానండి..!! సుప్రజ కూడా రాగానే.. ఆ ఇద్దరి కాళ్ల మీద పడ్డాడు నీరజ్. శోభన్: ఏయ్ ఏంటిది పైకి లే అన్నాడు..!! నీరజ్: నన్ను క్షమించండి. నాకు మీరు చెప్పేంతవరకు నేను చేసిన తప్పు అర్థం కాలేదు. మీరు మామూలుగా వార్నింగ్ ఇచ్చుంటే నాకు అర్థం అయేది కాదేమో..!! కానీ మీరు నాకు అర్థమయేలా మనం చేసిన తప్పు మననే తిరిగి వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుండకపోతే.. నేను ఇలాగే ఆడవాళ్ల వెంట పడ్తు ఉండేవాణ్నేమో..!! నా భార్య పడే బాధ కూడా నాకు అర్థం అయేది కాదేమో..!! శోభన్: నాకు నీ మీద ఏ కోపం లేదు. నీ కుటుంబ పరిస్థితుల వల్ల ఆడవాళ్లను గౌరవించడం నీకు తెలీదని అర్థమైంది. అందుకే ఇలా చేశాను. నీ భార్యతో సంతోషంగా ఉండు..!! తనని ప్రేమగా చూసుకో..!! నీ జీవితం బాగుంటుంది అన్నాడు. నీరజ్: థాంక్ యు శోభన్ గారు. మీ మేలు నేను మర్చిపోలేను. మారిన మనిషిలా మీరు రేపటి నుండి నన్ను చూస్తారు. అటు ఇంట్లో ఆఫీస్ లో మంచి మార్కులు కొట్టేస్తా లెండి.. నా భార్య కూడా మన ఆఫీస్ లో ఉండడం.. చాలా సంతోషం. తనని ఇకపై ఎప్పడు బాధపెట్టాను. థాంక్స్ ఫర్ బ్రింగింగ్ హర్ ఇంటు అవర్ టీమ్” అన్నాడు..!! నీరజ్ లో మార్పు చాలా సంతోషమిచ్చింది శోభన్ సుప్రజలకి.. ఆరోజు నుండి నీరజ్ మనోజ అలాగే శోభన్ సుప్రజ మంచి స్నేహితులుగా colleagues గా అటు పర్సనల్ గా ప్రొఫెషనల్ గా చక్కటి జీవితం గడపసాగారు..!! శుభం

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.