సుందరి మారింది - జి.ఆర్.భాస్కర బాబు

Sundari maarindi

సుందరి గట్టిగా అరుస్తోంది విశాల్ మీద “ఏంటిదీ, నేనేం చెప్పాను నువ్వేం చేశావు.ఈ చీర వాషింగ్ మెషిన్ లో వేయకూడదు అని చెప్పేనా? ఒక్క పని సరిగా చేయటం రాదు మళ్ళీ ఏదో ఇంట్లో పనంతా వెలగబెడుతున్నట్లు పెద్ద ఆపసోపాలు పడుతుంటావు” విశాల్ మౌనంగా ఉండిపోయాడు.అతను తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి భార్యను పల్లెత్తు మాట అనడు. తన తండ్రి తల్లిని పెట్టిన హింస గుర్తు వచ్చినప్పుడల్లా అతని కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతాయి.అతని తండ్రి ఉన్నట్టుండి ఒక రోజు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు.అప్పటినుండి అన్నీ తానే అయి విశాల్ ని పెంచింది అతని తల్లి.విశాల్ కూడా బాధ్యతగా చదువు కొని మంచి ఉద్యోగం లో చేరిపోయాడు.అనువైన సంబంధం అని విశాల్ కి సుందరి తో వివాహం జరిపించారు. విశాల్ సుందరి ల పెళ్ళయిన కొత్తలో అతని తల్లి విశాల్ ని పిలిచి భార్యను ఎప్పటికీ ఒక్కమాట కూడా అననని మాట తీసుకుంది.అప్పటికి ఆమెకు తన జీవితంలో పడిన కష్టాలే మదిలో ఉన్నాయి. ఆ ఇచ్చిన మాట అతన్ని భార్య దృష్టిలో ఓ అసమర్థుడిగా ముద్ర వేసింది.’రౌతు మెత్తగా ఉంటే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తింది’అన్నట్లు ఆమెది ఆడింది ఆట పాడింది పాట లాగా సాగుతోంది.విశాల్ ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉండాల్సి రావడంతో ఆమె ఆగడాలకు అంతే లేకుండా పోయింది.ఇంటిపని ,వంటపని, ఆఫీసు పని వెరసి తడిసి మోపెడయేది ఆ మానవుడికి. ఆరోజు ఆదివారం కావడంతో బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసి, కూరగాయలు తేవటానికి సంతకెళ్ళి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయింది. “సరేలే సుందరీ, జరిగిందేదో జరిగిపోయింది.మంచి చీర మళ్ళీ కొంటాలే”అన్నాడు విశాల్ అనునయంగా. తోక తొక్కిన తాచు లాగా లేచింది “కొన్నావులే చీర మొన్న మా అన్నయ్య బట్టలకని డబ్బు పంపితే మొత్తం వాడుకుని ఓ వెకిలి నవ్వు నవ్వావు.అదేమంటే నా డబ్బు నీది కాదూ అంటూ ఓ పిచ్చి కామెంట్.” విశాల్ బిత్తర పోయి చూస్తున్నాడు.ఆమధ్య సుందరి వాళ్ళ అన్నయ్య విశాల్ ఎకౌంటు లో ఓ మూడు వేలు పంపాడు,పండక్కి బట్టలు కొనుక్కోమని.సుందరితో ఈ విషయం చెప్పాడుతను. “మూడు వేలకు ఏం వస్తాయి నా బట్టలు”అంది సుందరి. “సరే నువ్వు ఈ ఐదు వేలు తీసుకుని నీ బట్టలు కొనుక్కో” అంటూ పర్స్ లో నుండి డబ్బు తీసి ఇచ్చాడు విశాల్. చటుక్కున ఆ డబ్బు తీసుకుని పర్సులో పెట్టుకుంది. ఆ విషయం గుర్తుకొచ్చింది విశాల్ కి. “సరే సుందరి ఆ మూడు వేలుకూడా నీవే ఉంచుకో” అంటూ పర్సులోంచి మూడు వేలు తీసి ఇచ్చాడు విశాల్. “ఏం మనిషివో అసలు ఏ విషయం గ్రహింపే లేదు”అని గొణుక్కుంటూ ఆ డబ్బు తీసుకుంది సుందరి. ‘హమ్మయ్య’అనుకున్నాడు విశాల్.అక్కడికి ఆ ప్రహసనం ముగిసింది అలా. ఓం రోజు ఉదయాన్నే సుందరి వాళ్ళ దొడ్డమ్మ ఓ ట్రంకు పెట్టె వేసుకుని వాళ్ళ ఇంటికి వచ్చింది. “అలా చూస్తాడేమిటే అబ్బాయి,నన్ను గుర్తుపట్టనట్టు. నేనేనయ్యా బంగారమ్మను.దీని దొడ్డమ్మను ఇది చిన్న బొట్టిగా ఉన్నప్పటి నుండి మాఇంట్లోనే పెరిగింది.”ఆంటూ ఏవేవో విషయాలు చెప్పసాగింది. “నువ్వు రా దొడ్డమ్మా ఆ మనిషికి ఇవన్నీ అర్ధం కావులే.ఎన్నడయినా ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి ఉంటేగా”అంటూ ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళింది. దొడ్డమ్మ గారు కూడా అతని వంక అదోలా చూస్తూ లోపలికి నడిచింది. “ఇదిగో,మా దొడ్డమ్మ ఉప్మాలు, ఇడ్లీలు తనదు.కాస్త ఏం పూరీకూరో చపాతీ కుర్మా తయారు చెయ్యి ఈ పూటకి అంటూ హుకుం జారీ అయింది. ఓం పక్క ఆఫీసు టైం అవుతోంది ఆ వంటలు కావాలంటే చాలా సమయం పడుతుంది.స్విగ్గీలోనో జొమాటా లోనో ఆర్డర్ పెట్టేస్తే సరి అనుకున్నాడు. ఆ విషయమే సుందరి తో అన్నాడు. “ఏం మనిషివయ్యా నువ్వు ఆవిడ నిష్టగా పూజలు పునస్కారాలు చేసుకునే మనిషి.ఆవిడకు ఆ ఆర్డర్ తిళ్ళు పెడతానంటావేమిటీ?ఓం అరగంటలో టిఫిన్ తయారు చేసి నువ్వు ఆఫీసుకు వెళ్ళు.”అం‌టూ క్లాసు పీకింది ‘దేవుడా’అనుకుంటూ ఎలాగోలాగ ఆ పూటకు సుందరి చెప్పినవన్నీ చేసి బైట పడ్డాడు.అతని మధ్యాహ్నాం భోజనం తయారు చేసుకునే వ్యవధి దొరకలేదు. అలా ఓ వారం గడిచింది. ఓం రోజు ఉదయాన్నే లేచి కాఫీ తయారు చేస్తున్నాడు విశాల్.ఆసరికే తయారైన దొడ్డమ్మ గారు అతని పక్కనే వచ్చి కూర్చుంది.ఇంకా సుందరి నిద్ర లేవలేదు. “అబ్బాయ్ ఓ విషయం చెప్తాను విను,మరీ భభ్రాజమానం లాగా ఉంటే చెవులకు తాటాకులు కట్టి ఆడిస్తారయ్యా ఆడాళ్ళు.నేను వచ్చినప్పటినుండి చూస్తున్నాను మరీ అంతలా ఉండకు.నేను మావారికి పగలు పూట ఎదురు పడాలంటేనే హడలి చచ్చేదాన్ని.ఇప్పటి కాలంలో అలా ఉండటం కుదరదేమో కాని నీలా కూడా ఉండకూడదు. సంసారమన్నాక పట్టూవిడుపూ ఉండాలి.నీ భార్య పట్టు లోనే ఉంది,నీ చెవులు పట్టుకుని ఆడిస్తూ ఉంది.”అంది దొడ్డమ్మ గారు. “ఏం చేయను అత్తయ్య గారూ, ఏమన్నా అంటే తను ఎక్కడ ఏడుస్తుందో అని భయం.అదీకాక నేను భార్యను ఏమీ అనను అని మా అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు తనను పల్లెత్తు మాట కూడా అనలేదు.” అన్నాడు విశాల్. “అదంతా సరే అల్లుడు గారూ,ప్రతీ విషయం లోనూ నువ్వే సర్దుకుపోవాలంటే చూసే నాకే ఏదోలా ఉంది. సరేలేండి నేనే ఏదోఒకటి చేస్తాను”అందామె. నాలుగు రోజులు గడిచాయి.ఆ రోజు ఏదో పండుగ సందర్భంగా ఆఫీసుకు శెలవు.నిజంగా విశాల్ జీవితంలో పండుగే అయింది ఆరోజు.అతని జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఆ రోజు.కారణం సుందరి ఉదయాన్నే లేచి కాఫీ తయారు చేసింది.విశాల్ తయారైవచ్చే‌సరికి కాఫీ కప్పు తో ఎదురుగా నిలబడింది. విశాల్ తత్తర పడిపోయాడు అది చూసి. “నీకెందుకు శ్రమ నేను కలుపుతానుగా”అన్నాడు విశాల్. “ఇవాళ నుండి నేనే ఇంటిపని చేస్తానండీ.మీరు తాపీగా తయారై ఆఫీసుకు వెళ్ళవచ్చు.మధ్యాహ్నం భోజనం కూడా తయారు చేసి ఇస్తాను”అంది సుందరి. “అట్లాగే చేద్దూగానిలేవే అమ్మయ్ ముందు ఈరోజు నోటికి రుచిగా ఏదైనా చేసిపెట్టు అబ్బాయికి.నాక్కూడా జిహ్వ చచ్చినట్టుంది,నీవంట తడాఖా ఏంటో మాకు చూపించు” అంది దొడ్డమ్మ గారు. సుందరి వంటగది లోకి వెళ్లింది.ఇంకా విశాల్ షాకు నుండి తేరుకోలేదు. “ఏం మాయ చేశారు అత్తయ్య గారూ, నేను నమ్మలేక పోతున్నాను”అడిగాడు విశాల్. గుంభనంగా నవ్వుతూ “చెప్తాలే అల్లుడు గారూ,ముందు మీ ఆవిడ వంట రుచి చూద్దాం రండి”అంటూ భోజనాలబల్ల దగ్గరకు నడిచింది ఆమె. అలవాటు లేని శ్రమకు సుందరి వాడిపోయిన పువ్వులా తయారయింది.మధ్యాహ్నం భోజనాల తరువాత ఆదమరచి నిద్రాదేవి ఒడిలోకి చేరింది. విశాల్ , దొడ్డమ్మ గారు హాల్లో కూర్చుని మాట్లాడు కుంటున్నారు. “అత్తయ్య గారూ, నా ప్రశ్న కు సమాధానం చెప్పేరు కాదు, ఇంకా నన్ను సస్పెన్స్ లో పెట్టకండి”అన్నాడు విశాల్. “నీకు ఓ చిన్న కథ చెప్పాలి.మా ఊళ్ళో మీలాగే ఓ జంట ఉన్నారు.వాళ్ళు కూడా మీలాగే ఉప్పూ నిప్పూ లాగే ఉండేవాళ్ళు.ఓ రోజు చెప్పాపెట్టకుండా ఆ అబ్బాయి సన్యాసం తీసుకుంటానని ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. సంగతి తెలుసుకున్న పెద్దవాళ్లు పంచాయతీ పెట్టారు. అతను ససేమిరా రానని అన్నాడు.ఆ పిల్ల తరఫు వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమాలాడితే అతను సవాలక్ష షరతులు పెట్టి చివరకు ఒప్పుకున్నాడు.వాటిల్లో ముఖ్యమైనవి తను పుట్టింటికి ఎప్పుడూ వెళ్ళకూడదని, పుట్టింటితరఫు వాళ్ళు ఎప్పుడు వీళ్ళ ఇంటికి రాకూడదని వంటావార్పు ఎప్పుడూ తనే చేయాలని, అతని తరఫు బంధువులను ఏమీ విమర్శించకూడదని,అతని ఇంటి ఆడపడుచులను ప్రేమతో చూడాలని ఇలా ఓ పది పదిహేను ఉన్నాయి.” “నాకు ఈ కథకు ఏమిటి సంబంధం?”అన్నాడు విశాల్. “నేనేం చెప్పానంటే ఒకవేళ నీవు కూడా అతని లాగే సన్యాసం తీసుకుంటే నష్టం ఎవరికో ఆలోచించుకోమన్నాను.నీకునీ తరఫు వాళ్ళు లేక పోయినా సుందరికి తన వాళ్ళు తామరతంపరగా ఉన్నారు.ఈ విషయం నీకు తెలిసిందే.ఆమె బలమంతా వాళ్ళే.వాళ్ళు ఎప్పుడూ నీ ఇంటికి రాకపోతే అసలుకే మోసం అని చెప్పాను.రెండురోజులు బాగా ఆలోచించి తను మారటానికి నిర్ణయం తీసుకుంది.”అంది దొడ్డమ్మ గారు. “ఏదయితే ఏమి లేండి, తను మారాలనుకుంది అంతే చాలు,పోను పోను తనే అర్ధం చేసుకుంటుంది.అసలంటూ మార్పు జరిగితే పరిస్థితి అర్థం కావటం ఎంతో సేపు పట్టదు,”అన్నాడు విశాల్. “అవును అల్లుడు గారూ, ముందు ముందు తను పూర్తిగా మారి అందరిలాగే తన సంసారాన్ని దిద్దుకుంటుందన్న నమ్మకం నాకుంది.”అంది దొడ్డమ్మ గారు. కృతజ్ఞతగా ఆమె వంక చూశాడు విశాల్.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు