" అయ్యా నేను రేపటి నుంచి ఐదు రోజులపాటు మన రాములోరి గుడి దగ్గరే ఉంటాను అంటూ తండ్రితో చెప్పాడు పది సంవత్సరముల వయసున్న రాముడు . "ఏరా ఎందుకు నువ్వు గుడి దగ్గర కూర్చుంటే మనకు బువ్వ ఎవరు పెడతారు అంటూ ప్రశ్నించాడు తండ్రి పిచ్చయ్య. మర్చిపోయా వా ఏమిటి? మన రాములు వారి గుడిలో ఎల్లుండి శ్రీరామనవమి కదా సీతారాముల కళ్యాణం చేస్తారుగా. ఆ రోజు నుంచి ఐదు రోజులు పాటు రోజు ఊరందరికీ సంతర్పణ చేస్తారు కదా. ప్రతి ఏటా చేస్తారుగా. మర్చిపోయావా ఏమిటి అంటూ చెప్పుకొచ్చాడు రాము. మరి ఆ సందర్భంగా మనకి ఆకు వేసి భోజనం పెడతారా ఏమిటి? అంటూ సందేహం వెలిబుచ్చాడు పిచ్చయ్య. అవును నాన్న ఇక్కడ కులమత భేదం లేకుండా వచ్చిన వాడిని తిరిగి పొమ్మనకుండా అందరికీ చక్కగా భోజనాలు పెడతారు. ప్రతి ఏట జరుగుతోంది కదా. అయినా నువ్వు ఎప్పుడూ చూడలేదా అంటూ నేనే నీకు భోజనం అడిగి తెచ్చి పెడతాను ప్రతి ఏడాదిలాగే అంటూ తుర్రుమని వీధిలోకి పారిపోయాడు రాము. రాము పిచ్చయ్యకి ఒక్కగానొక్క కొడుకు. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం రిక్షా లాగి పక్షవాతం వచ్చి ఈ మధ్యనే మంచం మీద పడ్డాడు పిచ్చయ్య. రాముని చదివించే స్తోమత లేదు. ఆ వయసులో కూలి పని చేయలేడు రాము. ఇంకేముంది నోటితో తన కష్టం చెప్పుకుంటే ఏ అయ్యకైనా జాలి కలిగి చేతిలో ఉన్న సత్తు గిన్నె నింపితే ఆరోజు గండం గడిచినట్టే. రాము తల్లి కూడా పెద్ద పెద్ద పనులు చేయలేక రెండు ఇళ్లలో పాచి పనులు చేసి ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది. ఆ ఊరు గోదావరి పక్కనే ఉన్న ఒక పల్లెటూరు. ఆ ఊర్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఆ ఊరిలో పురాతనమైన రామాలయం ఒక శివాలయం అమ్మవారి గుడి ఒక చర్చి ఒక మసీదు ఉన్నాయి. ఉగాది వెళ్లిందంటే ఆ ఊర్లో మళ్లీ ఇంకో సందడి మొదలైపోతుంది. ఆ వీధి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద తాటాకుల పందిరి. పందిరి లోపల చుట్టూ మామిడాకుల తోరణాలు. రంగురంగుల విద్యుత్ బల్బులు కొత్త సినిమా పాటలతో అదరగొట్టే మైకులు. ఊరంతా ఎక్కడలేని హడావిడి. ఇంతకీ ఏమిటో హడావుడి. ఇంకేముంది సీతారాముల కళ్యాణం. ఆ ఊరు పెద్ద రెడ్డి గారు పీటల మీద కూర్చుని అంగరంగ వైభవంగా ప్రతి ఏటా చేసే ఐదు రోజుల కళ్యాణం. ఉదయం సాయంకాలం పూజలు ప్రసాదాలు మధ్యాహ్నం ఊరందరికీ భోజనాలు ఇదే అనాదిగా జరుగుతున్న కళ్యాణం సందడి. ఆరోజు ఉదయమే రాము స్నానం చేసేసి పరిగెత్తుకుంటూ వెళ్లి పందిట్లో వేసిన బల్ల మీద కూర్చున్నాడు. ఒకపక్క సీతారాముల కళ్యాణం జరుగుతోంది. రాముల వారి నైవేద్యానికి చలిమిడి వడపప్పు పానకం నాలుగు రకాల పళ్ళు నాలుగు రకాల స్వీట్లు వరుసగా పెట్టి ఉన్నాయి. రాము కడుపులో ఆకలి నకనకలాడుతోంది. ఈ వసంత నవరాత్రులు రాము లాంటి వాళ్ళ జీవితానికి వెన్నెల రాత్రులు. రోజు రెండు చేతులూ చాచి అమ్మ ఆకలి అంటూ అడిగితే కానీ డొక్క లేవని ఆ బ్రతుకులకి నిజంగా అవి పండగ రోజులే . అమ్మ అయ్యా అని పిలవకర్లేదు. ఊరువాడ తిరగక్కర్లేదు. గుడి దగ్గర వేసిన చల్లటి పందిరిలో బెంచి మీద కూర్చుంటే మైక్ లో పిలిచి మరి కడుపు నింపుతారు. కళ్యాణం అయిపోయింది కాబోలు ఇంతలో మైక్ లో అనౌన్స్మెంట్ వినిపించింది . అందరూ హారతి తీసుకున్న తర్వాత ప్రసాదాలు కూడా పుచ్చుకుని వెళ్ళండి అని. అందరికంటే చివరిగా నిలబడ్డాడు రాము. ఒకపక్క ప్రసాదాల అయిపోతాయేమో అని బెంగ. మాటిమాటికి ఆ ప్రసాదాలు పంచి పెడుతున్న వాళ్ళవైపు ఆశగా చూస్తున్నాడు. ఇంటి దగ్గర ఉన్న నాన్నకి అడిగి పట్టుకెళదామంటే వాళ్లు పెడతారా లేదో. ఏం చేయాలి అనుకొని ఆలోచనలో ఉండగా చెయ్యి పట్టమ్మా అంటూ పూజారి గారు పానకంపో సిన ప్లాస్టిక్ గ్లాసు, అన్ని రకాల పళ్ళు స్వీట్లు చలివిడి వడపప్పు ఉన్న పెద్ద ప్లేటు చేతులో పెట్టారు. ఆ ప్లేట్ ని అలాగే మడిచి ప్లాస్టిక్ గ్లాస్ లో పోసిన పానకo తో సహా దూరంగా దాచుకున్న సత్తు గిన్నెలో పెట్టి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి లైన్ లో నిలబడి ప్రసాదం తీసుకుని సత్తు గిన్నె తీసుకుని ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు రాము. అలా సీతారాములు ఆ తండ్రి కొడుకులు ఇద్దరికీ ప్రసాదం తోటి ఆ ఉదయం అలా కడుపు నింపేరు. కడుపునిండా ప్రసాదాలు తినేసి మళ్లీ రాములోరి గుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్లిపోయి ఆ పందిరిలో ఉన్న బల్లల మీద కూర్చుని ఆ మైక్ లో వచ్చే పాటలు ఆనందంగా వింటున్నాడు. ఆ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లోని భక్తి గీతాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి వినిపిస్తున్నాయి. అప్పటికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఊరు జనం అంతా పందిట్లోనే ఉన్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న బల్లల మీద అరిటాకులు పరిచి వడ్డన మొదలుపెట్టారు. ముందు బ్యాచ్ లో కూర్చుంటే ఏమనుకుంటారో ఏమో అనుకుని ఆఖరి బ్యాచ్ అయ్యేటప్పటికి సాయంకాలం అయిపోతుంది అంతమంది జనం ఉన్నారు అనుకుంటూ అయినా ఇది దేవుడు గుడి భోజనాలు ఇక్కడ అందరూ సమానులే అనుకుంటూ ఆఖరి బెంచీలో ఆఖరున కూర్చున్నాడు రాము. ఆ అరిటాకు చూస్తేనే సగం కడుపు నిండిపోయింది. దానినిండా పదార్థాలే. కొన్నింటి పేర్లు కూడా రాముకి తెలియవు. అలా ఎంతసేపు తిన్నాడో రాముకి తెలియదు. ఒక్కసారి తల పైకెత్తి చూసేటప్పటికి చేతులు కడుక్కోవడానికి బయటకి వెళ్ళిపోతున్నారు. రాము కూడా గబగబా తినేసి చేతులు కడుక్కుని సత్తు గిన్నె పట్టుకుని పూజారి గారి ఎదురుగుండా నిలబడ్డాడు. ఇప్పుడే కదరా అక్కడ తిన్నావు మళ్లీ ఏమిటి మరో మాట మాట్లాడే అవకాశం లేకుండా కసిరి కొట్టాడు పూజారి. నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళిన రాముకి తండ్రి అన్నం తింటూ కనిపించాడు. నీకు అన్నం ఎక్కడిది అని అడిగిన రాము ప్రశ్నకి మీ అమ్మ పూజారి గారి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది. పూజారి గారి భార్య గుడి నుంచి వస్తూ అమ్మకు కూడా భోజనం తీసుకొచ్చి ఇచ్చిందట.రాము తల్లి పూజారి గారింట్లో పని చేస్తోంది.భగవంతుడి ప్రసాదం తినాలని రాసిపెట్టి ఉంటే ఎంత దూరంలో ఉన్న వారికే నా అది అందుతుంది. చూడండి ఎవరో తిరుపతి వెళితే మనకు కూడా ప్రసాదం అందుతుంది ఒక్కొక్కసారి. అలాగే కదల లేని స్థితిలో ఉన్న ఆ పిచ్చయ్యకి ప్రసాదం అందజేశాడు ఆ రామచంద్ర మూర్తి పూజారి భార్య ద్వారా. రోజు సాయంత్రం పూట పెట్టిన ప్రసాదాలతో కడుపు నింపుకునేవారు. ఒక రకమైన ప్రసాదం కాదు ప్రజల్లో దైవభీతి పాప భీతి బాగా పెరిగిపోయింది. అబ్బా ఎంత బాగుంది చక్కెర పొంగలి. పచ్చగా మెరిసిపోతోంది పులిహోర. కమ్మని పెరుగు తోటి తయారు చేశారేమో ఈ దద్దోజనం. కారం వేసిన కమ్మటి సెనగలు ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా , బందర్ లడ్డు, మాడుగుల హల్వా స్వామి వారిది ఏమీ అదృష్టం. స్వామి వారిది కాదు భక్తులదే అదృష్టం. ఇదివరలో రోజు ఒక ప్రసాదం పెట్టేవారు . ఇప్పుడు రోజుకు రెండు మూడు ప్రసాదాలు. అలా ప్రసాదాలతో పాటు ఐదు రోజులపాటు కడుపు నిండుగా భోజనం చేశారు ఆ పిచ్చయ్య కుటుంబ o. రోజు రాత్రిపూట సినిమాలు హరి కథలు బుర్రకథలు నాటకాలు అబ్బా ఎంత బాగుంది. రోజు గుళ్లో కళ్యాణం జరిగితే బాగుంటుంది కదా అనుకునేవాడు రాము. ఆ చిన్ని బుర్రకి అంతకంటే ఏమీ తెలియదు. ఆఖరి రోజున సీతారాముల విగ్రహాలని పల్లకిలో కూర్చోబెట్టుకుని ముందు మేళతాళాలు బ్యాండ్ మేళం నడుస్తుంటే ఊరంతా ఊరేగింపు అయ్యి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి పన్నెండు గంటలు అయింది. మర్నాడు ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త చూసి పెద్ది రెడ్డి గారు గర్వంగా మీసాలు తిప్పుకున్నారు. పళ్లెంలో వేసిన డబ్బులు చూసి సంతృప్తి పడి న పూజారి గారు గత సంవత్సరం కంటే ఈ ఏడాది బాగా వచ్చారు జనం అనుకుని ఆనందపడ్డారు. మొన్న ఉగాదికి కడుపునిండా తిన్నాం. మళ్లీ ఈ ఐదు రోజులు రాములోరి కళ్యాణానికి కడుపునిండా తిన్నాం మళ్లీ ఊళ్లో పండగలు ఎప్పుడు వస్తాయో అనుకుంటూ ఎదురు చూశారు పిచ్చయ్య కుటుంబం. రాములోరి గుడి ముందు కిళ్లి షాపు యజమాని సరుకు అంతా ఖాళీ అయిపోవడం చూసుకుని అంతా రాములోరి దయ అని ఆనందపడ్డాడు. రాత్రిపూట హరి కథలు బుర్రకథలు చెప్పిన వాళ్ళు చదివింపులు బాగా వచ్చాయని ఆనంద పడుతూ ఉంటే రాములోరి దర్శనానికి టిక్కెట్ల ద్వారా వచ్చిన సొమ్ము పెద్ది రెడ్డి గారి ఖాతాలో జమ అయ్యిందన్న విషయం ఎవరికీ తెలియదు ఒక గుమస్తాకు తప్పితే. ఇదంతా చూస్తూ చూడనట్టు నటిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి సమయాలలో చేసే అన్నదానం పిచ్చయ్య లాంటి కుటుంబాలకు కడుపు నింపినందుకు గుడిలోని దేవుడు నవ్వుతూ కనిపించాడు.