విమానాశ్రయంలో పాప - మద్దూరి నరసింహమూర్తి

Vimanashrayam lo papa

“లతా, పాప ఏది” ఆతృతగా అడిగేడు రమణ.

“ఇక్కడే ఆడుకుంటూ ఉంటుంది” ఎందుకంత ఆతృత అన్నట్టుగా జవాబు చెప్పింది లత.

“అంటే, ఇప్పుడు పాప ఇక్కడ లేదు అని కూడా నీకు తెలియదన్నమాట. పాపని చూసుకుంటూ ఉండు అని నీకు చెప్పే నేను వెళ్ళేను కదా, కనీసం నేను వచ్చే వరకూ చూసుకో అక్కరలేదా”

“ఇక్కడే కూర్చో ఎక్కడకు వెళ్లకు అని దానికి ఇష్టమైన బొమ్మ ఇచ్చి నా పక్క కుర్చీలోనే కూర్చో పెట్టేను. కొంతసేపటికి, బొమ్మతో నాకు ఫోటో తీయి అని పాప అంటే తీసి, మీకు పంపించేను కూడా. నేను ఇక్కడే ఆడుకుంటున్నాను అని ఇటూ అటూ తిరుగుతూ ఉండెను. మరి ఎప్పుడు ఎక్కడకు వెళ్లిపోయిందో నేను చూసుకోలేదు” అని రుద్ధ స్వరంతో మాట్లాడుతున్న లతతో -

“నీకు మొబైల్ తప్ప మరేమీ - ఆఖరికి పాప కూడా – కనపడవు” అని విసుగ్గా పాప ఎక్కడైనా కనిపిస్తుందా అని చూస్తున్నాడు రమణ.

“నేను చేసిన తప్పుకు మీరు అలా అనడం న్యాయమే” అని, లత కూడా పాప కోసం కన్నీళ్లతో అటూ ఇటూ చూడసాగింది.

వారి సంభాషణ వింటూ అక్కడే కూర్చున్న ఒక పెద్దావిడ “అమ్మాయి, మీ ఇద్దరిలో ఎవరిది తప్పో తరువాత తేల్చుకోవొచ్చు, ముందు మీ పాప ఎక్కడుందో వెతకండి” అని సలహా ఇవ్వడంతో ---

కుడి పక్కగా రమణ, ఎడమ పక్కగా లత పాపను వెతకడానికి ఆందోళనతో బయలుదేరేరు.

వాళ్ళు అలా వెళ్ళగానే అక్కడ కూర్చున్న ఇతర జనం --

“పాపని చూసుకోకుండా మొబైల్ చూసుకుంటూ కూర్చుంటే ఇలాగే జరుగుతుంది మరి”

“ఈరోజుల్లో చిన్న పిల్లల తల్లులు ఆ పిల్లలు కంటే మొబైల్ చేతిలో ఉంటే చాలు అన్నట్టు మరీ అన్యాయంగా వ్యవహరిస్తున్నారండీ”

“ఇది విమానాశ్రయం కాబట్టి దొరుకుతుంది లెండి. అదే ఏ బస్ స్టాండ్ గానీ రైల్వే స్టేషన్ గానీ అయితే ఆ పిల్ల దొరకడం గగనమే”

“ఈ రోజుల్లో చిన్న పిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు, వారిని ఎత్తుకొని పోతున్న దొంగ వెధవలు ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నారు”

“ఆ మాట నిజమే కానీ, విమానాశ్రయంలో పిల్లలను ఎత్తుకొని వెళ్ళడం అంత సులువు కాదు లెండి”

“అలా అనకండి. ఆ వెధవలకు బోలెడు మార్గాలు సులువులు తెలుసు”

“పాప దొరుకుతుందని ఆశిద్దాం”

---అంటూ మాట్లాడుకోసాగేరు.

-2-

కనబడ్డ వాళ్ళకల్లా వారి మొబైల్ లో ఉన్న పాప ఫోటో చూపించి “ఈ పాపను ఎక్కడైనా చూసేరా” అని అడిగి, అటునుంచి రమణ ఇటునుంచి లత ఇద్దరూ రిక్త హస్తాలతో వచ్చి తల పట్టుకొని కూర్చున్నారు.

అక్కడే కూర్చున్న ఒక యువకుడు “కొంతసేపటి క్రిందట ఇక్కడ ఆడుకుంటున్న పాపను వెనక రెండో వరసలో ఆడుకుంటున్న బాబు పిలిస్తే వెళ్ళడం చూసేను. ఆ పాప మీ పాప కాదు కదా” అనగానే –

“ప్లీజ్ ఈ ఫోటో చూడండి. మీరు చూసిన ఆ పాప ఈ ఫోటోలో పాపేనా” అని ఆతృతగా అడిగేడు రమణ.

“ఈ పాపే, ఇదే బొమ్మ ఆ పాప చేతిలో కూడా ఉండడం నేను చూసేను”

ఒక చిన్న ఆచూకీ దొరకడంతో ----

“పాప ఎక్కడికి వెళ్ళిందో చూసేరా, దయచేసి గుర్తుకు తెచ్చుకోండి”

“ఈ పాప ఆ బాబూ కలిసి ఈ మెట్ల దగ్గర నిలబడి ఉండగా చూసేను. కొంతసేపు తరువాత ఆ బాబూ ఈ పాప ఇద్దరూ నాకు కనబడలేదు”

ఆ యువకుడు అలా చెప్పగానే –

రమణ లత ఆ మెట్ల దగ్గరకు వెళ్ళి అటూ ఇటూ చూసి, ఆ మెట్లు దిగి క్రిందకు వెళ్ళి చూద్దామని బయలుదేరేరు.

అక్కడ ప్రయాణికులు విమానంలోనికి నేరుగా ప్రవేశించే మార్గం దగ్గర పోలీసులు దగ్గర ఎవరో చిన్న పిల్లలు నిలబడి ఉండడం కనిపించి, రమణ లత అక్కడకు పరిగెత్తేరు. దగ్గరకు వెళ్ళి చూసిన వారికి నిరాశే మిగిలింది. ఆ పిల్లలలో వీరి పాప లేదు.

ఆ ప్రదేశమంతా అణువణువు వెతికినా, పాప ఆచూకీ తెలియకపోవడంతో పైకి ఎస్కలేటర్ ద్వారా వస్తున్న వారికి, ఆ పక్కనే ఉన్న మెట్లు దిగుతూ ఇద్దరు చిన్నపిల్లలు కనబడ్డారు.

ఎస్కలేటర్ పైకి చేరుకోగానే ఇద్దరూ ఆ మెట్ల వేపు చూస్తే ఆ మెట్ల మీద కానీ, క్రిందన కానీ, కనుచూపుమేరలో కానీ ఏ పిల్లలూ లేరు.

ఇదేమి మాయ, ఇంతకీ ఆ పిల్లలిద్దరిలో ఒకరు తమ పాప కాదు కదా – అని అనుకుంటూ భార్యాభర్తలిద్దరూ అనాలోచితంగా ఎస్కలేటర్ వైపు చూస్తే, ఎస్కలేటర్ మీద ఉన్న మెట్ల మీద ఇద్దరు చిన్న పిల్లలు కూర్చొని కనిపించేరు.

ఆ పిల్లలు ఇద్దరూ కొంత దూరం పైకి వచ్చేసరికి చూస్తే – అందులో కూడా వీరి పాప లేదు.

ఏమిటి చేయడం పాపను ఎలా పట్టుకోవడం అని రమణ ఆలోచిస్తూంటే –

“తప్పంతా నాదేనండీ, పాపను నా ఒళ్లో కూర్చో పెట్టుకోక ఆడుకుందికి వదిలేయడం నేను చేసిన పెద్ద తప్పు”

అంటూ లత ఏడవసాగింది.

-3-

“లేదు, నాతో వస్తానన్న పాపను తీసుకొని వెళ్ళక నేనూ తప్పు చేసేను. నాతో పాపను తీసుకొని వెళ్ళి ఉంటే, ఇప్పుడు మనకు ఈ పరిస్తితి వచ్చేది కాదు”

అంతలో--

“మేము సెక్యూరిటి కౌంటర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాము. మా దగ్గర చేతిలో ఉన్న బొమ్మతో ఏడుస్తున్న నాలుగేళ్ల ఒక పాప ఉంది. ఆ పాప ఫోటో ఇప్పుడు టి‌విలో కూడా చూపిస్తాము. ఆ పాప తల్లితండ్రులు ఎవరో ఇక్కడకు వచ్చి, ఆ పాప వారి పాపే అని మాకు ఋజువు చూపించి పాపను తీసుకొనివెళ్ళగలరు” –

అంటూ మైకులో ప్రకటన వినిపించిన రెండు నిమిషాలకి అక్కడే ఉన్న సర్క్యూట్ టి‌వి లో చేతిలో ఉన్న బొమ్మతో పాప ఫోటో చూపించేరు.

టి‌వి లో పాప ఫోటో చూడగానే రమణకు లతకు ప్రాణం తిరిగి వచ్చినట్టైంది.

ఇద్దరూ సెక్యూరిటి కౌంటర్ దగ్గరకు పరుగు పరుగున వెళ్ళి ఆ పాపను చూసి ఆనందం దుఃఖం కలగలిపిన మానసిక స్టితితో ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చొని పాపను పట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. పాప కూడా అమ్మా నాన్నను చూసిన ఆనందంతో నవ్వు కలగలిపిన ఏడుపుతో ఏడవనారంభించింది.

రెండు నిమిషాల తరువాత, రమణ తన మొబైల్ లో భార్య మొబైల్ లో ఉన్న పాప ఫోటో, ఇద్దరి మొబైళ్లలో పాపతో కలిసి వారిద్దరూ తీసుకున్న ఫోటోలు, ముగ్గిరి పేర్ల మీద ఉన్న విమాన ప్రయాణ టిక్కెట్లు, బోర్డింగ్ పాసులు సెక్యూరిటి వారికి చూపించి, ఆ పాప తమ పాపే అన్న నమ్మకం కలిగించి –

వారికి ధన్యవాదాలు తెలిపి పాపతో కలిసి తాము కూర్చోనే చోటుకి వచ్చేసరికి –

వారు వెళ్లవలసిన విమానం లోనికి ప్రయాణికుల ప్రవేశానికి అనుమతి ఆరంభమైంది.

*****

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు