ఒక రోజు వరహాలు శెట్టి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తన పిల్లి కోసం వెన్న పూసిన రొట్టెను తెచ్చాడు. చిన్న చిన్న ముక్కలు చేసి పిల్లికి తినిపించసాగాడు. పిల్లి కూడా గారాలు పోతూ వయ్యారంగా లొట్టలేసుకుటూ తింటోంది. వెన్న రొట్టె వాసనకు కలుగులో నుంచి చిట్టెలుక బయటకు వచ్చింది. పిల్లి గారాలను చూసి దానికి ఒళ్ళు మండింది. వరహాలు శెట్టి ఉన్నంతవరకు వెనక్కు నక్కిన చిట్టెలుక, శెట్టి అటు వెళ్ళగానే “ఏంటి పిల్లి బావా! వెన్న రొట్టె అంతా నువ్వే తినేస్తావా?” అంది. కళ్ళు మూసుకుని తింటున్న పిల్లి చిట్టెలుక మాటలకి కళ్ళు తెరిచింది. తీరా చూస్తే పక్కన శెట్టిలేడు. “నువ్వెప్పుడు వచ్చావు ఎలుక బావా?” అంది హీన స్వరంతో. “ఎప్పుడు వస్తే ఏం లే! నాకు రొట్టె ఇవ్వకుండా తినేస్తున్నావుగా!” అంటూనే చిటుకు చిటుకు మంటూ రొట్టెముక్కను తినేసింది చిట్టెలుక. అంతటితో ఊరుకోకుండా పిల్లి మూతి దగ్గరకు వెళ్ళి వాసన చూసింది. వెన్న వాసన రావడం తో పిల్లి మూతిని కొరికింది. పిల్లి మ్యావ్ మ్యావ్ మంటూ గుర్రుగా చూసి పక్కకి తిరిగి పడుక్కుంది. చిట్టెలుక పిల్లికి ఎదురుగా వెళ్లి “ముందే నన్ను పిలిచి ఒక చిన్న ముక్క ఇచ్చి ఉంటే బాగుండేది కదా” అంది మళ్ళీ. “ఏమన్నా నీతో కష్టమే! ఇప్పుడు మాత్రం ఏమయ్యింది? రొట్టె మొత్తం నువ్వే తినేసావుగా.” అంది అలకతో పిల్లి. “నువ్వు తింటే ఒకటి నేను తింటే ఒకటీనా” అంది గడసరి ఎలుక. ఇంతలో వరహాలు శెట్టి అడుగుల చప్పుడు వినబడడంతో తుర్రున కలుగులోకి వెళ్ళిపోయింది చిట్టెలుక. “అబ్బో నీకు బాగా ఆకలి వేసినట్లు ఉంది. చిన్న ముక్క కూడా మిగలకుండా తినేసావు.” అన్నాడు వరహాలు శెట్టి పిల్లి తలపై నిమురుతూ. “ఏం తిన్నాను నా బొంద. నువ్వూ వెళ్ళగానే ఆ మాయదారి చిట్టెలుక తినేసింది.” మ్యావ్ మ్యావ్ అంటూ చెప్పింది. వరహాలు శెట్టికి దాని భాష అర్థం కాక “సరేలే! నీ కోసం ఈసారి తాపేశ్వరం కాజాలు తెప్పిస్తాను కమ్మగా తిందువుగాని.” అని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లి గబుక్కున కలుగువైపు చూసింది. చిట్టెలుక లేదు. కానీ, “ఇదిగో వినవే సుందూ వహ్వా వహ్వా విందు కాజాలతో పసందు అవి నాకే దక్కును ముందు” అంటూ పిల్లి చెవిలో గట్టిగా అరచింది చిట్టెలుక. పిల్లి పంజాతో కొట్టబోయింది. ఎలుక కలుగులోకి తుర్రుమంది.