రాము 7వ తరగతికి వచ్చాడు. 6వ తరగతిలో ఉండగా చదువులో చాలా వెనుకబడే వాడు. 7వ తరగతికి వచ్చేసరికి చదువుపై ఆసక్తి పెరిగింది.
తెలుగు ఉపాధ్యాయుడు రాఘవను వ్యాకరణంలో వచ్చిన అనుమానాన్ని అడుగుతాడు "నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. నీకు అనుమానాలు? కూర్చో!" అంటూ విసుక్కున్నాడు. రాము చాలా బాధపడి, ఏ సబ్జక్టులో అనుమానం వచ్చినా ఉపాధ్యాయులను అడుగడం లేదు. కానీ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఆ తరగతిలో మొదటి ర్యాంకు వచ్చే వాసు స్నేహాన్ని కోరాడు రాము. ఆయా సబ్జెక్టులలో తనకు వచ్చే అనుమానాలను వాసు సహాయంతో నివృత్తి చేనుకుంటున్నాడు.
ఇప్పుడు రాము, వాసులలో ఎవరు మొదటి ర్యాంకు వస్తారో చెప్పడం కష్టం. ఒకరోజు రాము ఒక మైదానంలో కూర్చుని చదువుకుంటున్నాడు. క్రికెట్ బాల్ వచ్చి రాముకు బలంగా తగులుతుంది. అటువైపు వచ్చిన సోము తన క్రికెట్ బాల్ తనకు ఇవ్వమంటాడు. "ఇస్తా కానీ నాకు తగిలిన దెబ్బలకు ఎవరు వైద్యం చేయాలి?" అని అడిగాడు. రాముతో పాటు చదువుతున్న రంగ, మహేంద్ర రాముకు బాసటగా నిలిచారు. సోము క్షమించమని కోరతాడు. "క్షమించడం కాదు. మీ ఇంటికి వచ్చి, మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి. నా గాయాలకు డబ్బులు ఎవరు ఇస్తారు?" అన్నాడు రాము. మహేంద్ర సోము ఏ పాఠశాలలో చదువుతాడో తనకు తెలిసని, అక్కడ తెలుసుకుందామని అంటాడు.
సోము వద్దని బ్రతిమాలుతాడు. అప్పుడు రాము "ఒక రెండు నెలల పాటు పుస్తకాలు తెచ్చుకొని నాతో కలసి చదవాలి. ఒక తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రోజు నీకు విముక్తి." అంటాడు. సోము ప్రతిరోజూ రాము వద్దకు చేరి, సందేహాలను నివృత్తి చేసుకుంటూ పట్టుదలతో చదువుతూ తెలివైన విద్యార్థి అయ్యాడు. పాఠశాల ఉపాధ్యాయులు సోము తల్లిదండ్రులను పిలిపించి అభినందించారు. వారు ఆశ్చర్యపోయారు. జరిగింది పూస గుచ్చినట్లు చెప్పాడు సోము.
ఆ తల్లిదండ్రులు తర్వాత రోజు మైదానానికి వచ్చారు. ఆశ్చర్యపోయాడు తండ్రి రాఘవ. తాను చులకన చేసిన తన శిష్యుడు తన వల్ల కాని పని తన కుమారుడిని మార్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. 'కృతజ్ఞతలు వద్దండీ గురువు గారూ! సోమూను కూడా మన పాఠశాలలో చేర్పించండి గురువు గారూ!" అన్నాడు రాము. ఒప్పుకున్నారు రాఘవ మాస్టారు.