"'గాంజే లోగ్ అంటే ఎంటి బ్రో" ఆన్లైన్లో పాఠం వింటున్న హరి భుజాన్ని తట్టి అడిగాడు రాజేష్ . "ముందా సిగరెట్ నోట్లోంచి తియ్" అప్పుడు చెప్తా!!" పాఠం వింటూనే చెప్పాడు హరి. సిగరెట్ పీక ఆరుబయటకి విసిరేసి "సోరి బ్రో" అన్నాడు రాజేష్. "గాంజే లోగ్ అంటే బట్టతలోడా అని అర్థం" "మరి బేషరమ్ బచ్చో అంటే" మళ్ళీ ప్రశ్నించాడు రాజేష్. "సిగ్గులేని పిల్లల్లారా అని అర్థం" అన్నాడు హరి. "అయితే మీ సారు భలే తిడతారు బ్రో" "హా ..నాకు సార్ అలా తిడితే భలే ఇష్టం" అని రాజేష్ మొహం చూశాడు హరి 'నేను బయటికి వెళ్ళాలి' సైగ చేశాడు రాజేష్ ఒక ఐదు నిముషాలని తన చేతివేళ్ళతో చూపించి ఆన్లైన్ లో పాఠంలోకి కళ్ళు దూర్చేశాడు హరి. "ఈ సారి మీకు ఏ డిజైన్ జాకెట్టు కావాలో ప్రింట్ తీసుకురండమ్మా!" అన్నాడు హరి వాళ్ళ నాన్న నానాజి. "అదేంటి నానాజి గారు ఇప్పటికిప్పుడు ప్రింట్ అంటే ఎలా అండీ!"అందామె. "వెనకాల మా అబ్బాయి ఫ్రెండు ఉన్నాడు అడగండి తీసుకొస్తాడు.ఈ ఫోన్ మా అబ్బాయికవ్వండి" సూదిలో దారం గుచ్చుతూ..బల్ల మీదున్న ఫోన్ ని చూపించి, సమాధానం చెప్పాడు. "థాంక్యూ ఆంటీ!., మీరెక్కడికి వెళ్ళాలి?" ఫోన్ తీసుకుని అడిగాడు హరి "కొత్త గాజువాక" అని, రాజేష్ కి ప్రింట్ తీయాల్సిన ఫోటోలు చూపించింది. "మావాడు అటే వెళ్తాడాంటి కొత్త కారు కూడా కొన్నాడు. మిమ్మల్ని తీసుకెళ్తాడు. వీలుంటే అందరికిచ్చేదానికన్నా ఒక రూపాయి ఎక్కువ ఇవ్వండి" రాజేష్ వైపు చూసి నవ్వుతూ చెప్పాడు హరి. "నానాజి గారు మీ అబ్బాయి తెలివి తేటలు చూడండీ!!" గట్టిగా చెప్పి నవ్వి., ఆమె రాజేష్ కారులో వెళ్ళిపోయింది. "ఎందుకురా నీకివన్నీ!!" వెనకకు తిరిగి కొడుకుని చూసి అన్నాడు నానాజీ. "పోన్లే నాన్నా. వాడికో బేరం దొరుకుతుంది. ఆంటీ జాగ్రత్తగా ఇంటికెళ్ళిపోతుంది" ఫోన్ చూసి నోట్స్ రాసుకుంటూ చెప్పాడు హరి. "నేను అడుగుతుంది అది కాదురా!!మనకంత ఖరిదైన చదువులెందుకనీ? నాకు కొంచెం సాయం వుండి పని నేర్చుకుంటే రోజుకో వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు" కొడుకువైపే తధేకంగా చూస్తూ చెప్పాడు. "పరిక్ష ఫీజులే కద నాన్న! మిగిలిన వన్నీ నెట్లో చూసి నోట్స్ రాసుకుంటున్నాను. ఇంకొక సంవత్సరం నాన్నా! . ఎలా అయిన పూర్తి చేసేస్తాను!! ఇదిగో " అని లేచి ఫోన్ తిరిగి ఇవ్వడానికి వస్తున్న కొడుకుని ఆపి, రావద్దు అని సైగ చేసి తలతిప్పి., కుట్టు మిషన్ చక్రం తిప్పాడు నానాజి. "నాన్నా!!" "ఫోన్ నీ దగ్గరే ఉంచుకో. వచ్చిన కష్టమర్లని వాళ్ళకి నచ్చిన డిజైన్లు ప్రింట్ తీసుకురమ్మంటానులే!! బాగా చదువుకో" కొడుకు బాగుండాలన్న తాపత్రయంతో మరింత సంపాదించటానికి రెట్టింపు ఉత్సాహంతో కుడుతున్నాడు నానాజీ. ***** "నాన్నా!! రిజల్ట్స్ వచ్చాయి. పాసయ్యాను." అని ఆనందంగా చెప్పాడు హరి. "ఇంక చదువు అయిపోయినట్టేగా!?" సంశయంగా అడిగాడు నానాజి. "లేదు నాన్న ! ఇంకో ఆరు నెలలు తరువాత వేరో ఎగ్జామ్ ఉంది అది పూర్తి చేస్తే అయిపోయినట్టే!!.నాన్నా తమ్ముడొచ్చాడు.అభి రారా!! " అని లోపలికి పిలిచాడు. "సూపర్ అన్నయ్యా! కంగ్రాట్స్ సిఏ పరీక్ష పాసయ్యావంట కదా!? పెదనాన్న నేను అన్నయ్యలా చదువుకుంటాను. నాన్న డబ్బులు నాన్న తాగుడుకే సరిపోతున్నాయి. ఫీజు కట్టమంటే కట్టట్లేదు నువ్వు కొంచెం సాయం చేయవా పెదనాన్నా!!"అర్థించాడు అభి. "ఓరై అభి!నేనెంత కష్టపడినా ఇంటికి, అన్నయ్య చదువుకి, అక్క పెళ్ళికి సరిపోవట్లేదురా!.ఇక నీకెక్కడునుంచి తెచ్చేదిరా. నా దగ్గరుంటే అన్నయ ఒకటి, నువ్వొకటినా!?" అని చెప్పి కుట్టుమిషను దగ్గరికి వెళ్ళిపోయాడు నానాజి. "ఓకే అన్నయ్యా! ఉంటాను" అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అభి. **** "ఒరై ఇదిగోరా ఈ వెయ్యి దాయ్" రాజేష్ చేతిలో డబ్బులు పెట్టాడు హరి. "పరీక్ష పాసయిన ప్రతిసారి ఇలా డబ్బులిచ్చి దాయమంటావు మధ్య మధ్యలో ఐదొందలు ఇచ్చి దాయమంటావు ఎందుకురా!!" "మా మోహిత్ సార్ కి గిఫ్ట్ కొందామని" "గిఫ్ట్ ఎందుకురా!?" తల గోక్కుంటూ అడిగాడు రాజేష్. "యుట్యూబ్ లో మాలాంటోళ్ళకి ఎన్ని ఫ్రీ క్లాసెస్ పెడతారో తెలుసా పైగా నేను మెయిల్ లో రిక్వెస్ట్ చేస్తే ఫ్రీగా నోట్స్ కూడా పంపుతారు.కమెంట్ పెడితే, బాగా చదవమని బ్లెస్ చేస్తారు. అంత మంచి సార్ కి ఏమిస్తే రుణం తీరుతుంది. ఏదో నేను అప్పుడప్పుడు కుడితే వచ్చిన డబ్బులని నీ దగ్గర దాస్తున్నాను. నా సిఏ పూర్తయిన తరువాత మా సార్ కి మంచి బహుమతి పంపిస్తాను" కళ్ళల్లో మెరుపులతో చెప్పాడు హరి. "ఇంతకీ మీ సార్ వాళ్ళు ఎక్కడ ఉంటారు?"ప్రశ్నించాడు రాజేష్. "మా మోహిత్ సార్ కలకత్తాలో ఉంటారు" హుషారుగా సమాధానం చెప్పాడు హరి. "మీ మొహిత్ సార్ పేరు చెబుతుంటే నీ మొహంలో ఎంత సంతోషమొరా!!ఎంతైనా మీ సారు గట్టొడే రా కలకత్తాలో స్విచ్చేసి ఇక్కడ నీ కళ్ళల్లో లైట్లు వెలిగిస్తున్నాడు." హరి భూజాలని పట్టుకుని ఉపూతూ అన్నాడు రాజేష్. ***** "పోయి చదువుకోరా!! నేను కుట్టుకుంటాను" అన్నాడు నానాజీ. "పండగ టైం కద నాన్న నేను కొంచెం సాయం చేస్తాను. పరీక్షలకింకా టైం ఉందిలే !" కాజాలు కుడుతూ చెప్పాడు. "బ్రో! రా చిన్న పనుంది" అని హరి చేయిపట్టుకుని బయటికి తీసుకెళ్ళి బైకెక్కమన్నాడు రాజేష్. "నాన్నా! ఇప్పుడే వస్తాను" అని చెప్పి బైకెక్కాడు హరి. "బ్రో ! ఎక్కడకి వెళ్తున్నాం?. నాన్నకి చాలా పనుంది., నువ్వు నన్ను మధ్యలో తీసుకొచ్చేశావు" కినుకుగా అన్నాడు హరి. "అసలీమధ్య చదువుతున్నావా!?" గదమాయించాడు రాజేష్ . "అదేంట్రా అంత కోపంగా అడిగావ్?. ముబైల్ లో చదవటం వల్ల కళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అందుకే వారం రోజుల నుంచి చదవట్లేదు., పైగా పండగ సీజన్ కదా! నాన్నకి సాయం చేద్ధామని అంతే!! ఇంతకీ ఎక్కడికిరా" విసుగ్గా అడిగాడు. "నువ్వే చూడు ఎక్కడికి తీసుకొచ్చానో" బైక్ ఆపి ఎదురుగా చూపించాడు రాజేష్. "ఇదేంట్రా! అప్పికొండ బీచ్ కి తీసుకొచ్చావ్" హరి గొంతులో అసహనం. "బ్రో! ఎందుకంత చికాకు. రా కూర్చో" హరి చేయి పట్టుకు లాగి కుర్చోబెట్టాడు. "ఒరై నాకక్కడ బోలెడు పనివుందిరా!! ఇలా బీచ్ కి తీసుకొచ్చి తీరిగ్గా కూచోమంటేవేంట్రా!? మనం ఎప్పుడూ చూసే బీచేగా?నన్ను షాపుకి తీసుకెళ్ళు." అరిచాడు హరి. "తీసుకెళ్తాలే! ఒక్క నిమిషం ఆగరా. నువ్వు బాగా చదువుకున్నావు కదా!నాకో విషయం చెప్పు ఆ అలలు కింద పడతాయి, మీద పడతాయి, వెనక్కి వెళతాయి, ముందుకు వస్తాయి కానీ, ఎప్పుడైనా కిందెదుకు పడ్డామని గాని వెనక్కెందుకు వెళ్తున్నామని ఆలోచిస్తాయంటావా!?" రెండు కాళ్ళు మడిచి కూర్చుని మోకాళ్ళ మీద చేతులు ఆన్చి చిరునవ్వుతో అడిగాడు రాజేష్. "ఎరా కథలేమన్నా రాద్దామనుకుంటున్నావా!? ఏంట్రా పనికిమాలిన ప్రశ్నలు. కింద,మీద,వెనక, ముందు తర్వాత సంగతి ఆ అలే అరక్షణంలో మాయమయి కొత్త అల వస్తుంది. అన్నిటికీ విచారిస్తూ కూచుంటే ముందుకెళ్ళలేం బ్రో!! అవి అలలైనా, మనమైనా, అందుకే అవి ఆగవు పడిలేస్తూ ఉంటాయి, లేచి పడుతూ ఉంటాయ్" "ఏం చెప్పావ్ బ్రో" అలల వైపే తీక్షణంగా చూస్తూ అన్నాడు రాజేష్ "ఓరై ప్లీజ్ రా వెళ్ళిపోదాం. పనుంది " బ్రతిమాలాడు హరి. "బ్రో! ట్రిబ్యూట్ అంటే ఏంటి" తల సముద్రం వైపే వుంచి కళ్ళు మాత్రం హరి వైపు తిప్పి అడిగాడు రాజేష్. "ట్రిబ్యూట్ అంటే నివాళి రా" చిరాగ్గా సమాధానమిచ్చాడు హరి. "అంటే ఇదేనా" ఫోన్ లో యూట్యూబ్ వీడియో ఆన్ చేసి హరి చేతిలో పెట్టి సిగరెట్ నోట్లో పెట్టుకొని కొంచెం దూరంగా వెళ్ళాడు రాజేష్. హరి కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. నోట్లో నుంచి మాట రావట్లేదు. ఇదంతా దూరంగా నుంచుని గమనిస్తున్న రాజేష్ హరి దగ్గరకి వెళ్ళి "చాలా సేపయింది. ఇక వెళ్థాం దా!! ఇక ఎక్కువ ఆలోచించకు" ఒక దమ్ లాగి అన్నాడు. "మా సార్ చాలా చిన్నోడురా నిండా నలభైళ్ళు కూడా లేవురా,.. ఎంత మంచోడురా..నాలాంటోళ్ళెంతమందికి మంచి చదువు అందిస్తున్నాడురా. మా సార్ రా మా సారు" వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు హరి. "మీ సారు ఎంత మంచోడో నువ్వు చెప్పక్కర్లేదురా!! ఏ రోజు ఆయనని నేరుగా చూడకుండా నెట్లో అతని పాఠాలు చూసి నేర్చుకుని ఏడుస్తున్నావు చూడు. ఆ ఏడుపు చెప్తుందిరా!! మీ సార్ ఎంత మంచి సారో. ఇక చాలు ఎక్కువ ఆలోచించకు. రా! వెళ్దాం" హరి చేయి పట్టుకులాగి అన్నాడు. చేయి విదిలించుకుని "ఎక్కడ కలకత్తారా? ఎక్కడ ఆంధ్రారా? మా సారు ఏదైనా డౌటడిగితే వెంటనే సమాధానం చెప్పేవాడు. మంచిగా చదువుకోమనేవాడు. బుద్దిగా ఉండమనేవాడురా. దేవుడురా మా మోహిత్ సారు. మా దేవుడెలా చనిపోయాడ్రా" రెండు చేతులతో తలను బాదుకుని ఏడుస్తున్నాడు హరి. "విచారిస్తే ముందుకెళ్ళలేం! అని నువ్వేనా ఇందాక అన్నావ్!! ఈ చావు బతుకులు మన చేతుల్లో ఉండవ్ రా హరి. రా!" భుజం మీద చేయి వేసి అన్నాడు రాజేష్. "సార్ కి గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బులు దాచాను గాని ఒకసారైనా ఫోన్ లో సార్ తో మాట్లాడటానికి ప్రయత్నించలేదురా!!ఎంత పిచ్చి బుఱ్ఱరా నాది. సార్ వెళ్ళిపోయి నాలుగు రోజులయింది. నువ్వొచ్చి చెప్తే గాని నాకు తెలీలేదు. అయ్యో మా మొహిత్ సార్ మాకు ఇక లేడురా" అని పైకి లేచి రాజేష్ చేతిలో ఉన్న సిగరెట్ తీసుకుని హరి నోట్లో పెట్టుకున్నాడు. "నీకు నిజంగానే పిచ్చెక్కిందిరా! నాకు లేని అలవాటు లేదని మామకి తెలుసు కానీ నాతో తిరగొద్దు అని మామ నీతో ఎప్పుడూ అనలేదు ఎందుకో తెలుసా!? నిన్ను చెడగొట్టనని మామకి నమ్మకం. ఒరై నువ్వు బాగా చదువుకొని పెద్దవాడివై నీ కారు స్టీరింగు నాకివ్వు అంతేగాని నా చేతిలోని దరిద్రాన్ని నువ్వు తీసుకోకు" హరి నోట్లో సిగరెట్ తీసి విసిరేసాడు రాజేష్. **** ఫోన్ లో వచ్చిన యూట్యూబ్ బీప్ సౌండ్ నోటిఫికేషన్ తో నిద్రలేచాడు హరి యూట్యూబ్ ఆన్ చేయగానే "మీరు బాగా చదివి సిఏ పాసవ్వండి., అదే మీ సార్ కి ఇచ్చే అసలైన నివాళి. అంతేగాని సార్ చనిపోయారు; ఆ బాధతో ఈ సారి పరీక్ష సరిగ్గా రాయలేదు అనే వంక వెతకొద్దు. మీరు ఎంత బాగా చదివి రాస్తే సార్ ఆత్మ అంత శాంతిస్తుంది" మోహిత్ సార్ బార్య కళ్ళ వెనుక నీళ్ళు అణిచిపెట్టి వీడియోలో మాట్లాడింది. అంతటి బాధలో కూడా చదవమని చెప్తున్న ఆ తల్లిని చూస్తుంటే హరికి కన్నీళ్ళాగలేదు. కాసేపటి తరువాత తమాయించుకుని కన్నీళ్ళు తుడుచుకుని పుస్తకం తెరిచి చదివాడు. **** ఓ పెద్దాయన "ఏంటి నానాజీ కొడుకు సిఏ పాసాయ్యాడంట మరేటి పార్టీ మాకు?" షాపు వైపుగా వెళ్ళిపోతు అడిగాడు. దానికి బదులుగా చిన్న చిరునవ్వు నవ్వాడు. కొండంత సంతోషాన్ని గుండెల్లోనే దాచుకుని తన ఆనందాన్ని కుట్టు మిషన్తో పంచుకుంటున్నట్టుగా కదులుతున్నాయి నానాజీ కాళ్ళు చేతులు. నానాజీ తన చేతులతో కుట్టిన షర్టు కోడుకు చేతికిచ్చి "నాన్నా!! ఇందులో రెండు వేలు ఉన్నాయి.నీకు నచ్చినట్టుగా పార్టీ చేసుకో సంతోషంగా ఉండు" అని షర్టు జేబును చూపించి.., వద్దన్నా ఆగని ఆనంద భాష్పాలని తుడుచుకున్నాడు. "అలాగే నాన్న !!" అని షాపు నుంచి బయటకొచ్చాడు హరి. రాజేష్ కి ఫోన్ చేసి "బ్రో ఎక్కడున్నావ్! నేను దాచిన డబ్బులు తీసుకురా సార్ కి గిఫ్ట్ కొనాలి" అన్నాడు హరి. "అదేంటి మీ సారు!?.......అలాగే ఇక్కడ దగ్గరలోనే ఉన్నా ఐదు నిమిషాల్లో తీసుకొస్తా " అన్నాడు రాజేష్. "అరే! ఐదు నిమిషాల కన్నా ముందే వచ్చావ్ బ్రో" ఆశ్చర్యంగా అన్నాడు హరి. "ఇక్కడే ఉన్నాన్రా! నువ్వు దాచుకున్న ఎనిమిది వేలు " అని హరి చేతిలో డబ్బులు పెట్టాడు. "నా దగ్గరో రెండు వేలు ఉన్నాయ్ రా!" అన్నాడు హరి. "ఇప్పుడు గిఫ్ట్ కొని కలకత్తాలో ఉన్న సార్ భార్యకి గిఫ్ట్ పంపిస్తావా!?" ఉత్సుకతతో అడిగాడు రాజేష్ వెంటనే "లేదురా!" అన్నాడు హరి "మరి!?" విస్మయంగా చూసాడు. "ఇదిగో వీడి సిఏ ఫీజు కట్టడానికిస్తాను" అప్పుడే అక్కడకి వచ్చిన అభి చేతిలో పెట్టాడు హరి. రాజేష్ కి హరి మరో దీపం వెలిగిస్తున్నట్టుగా కనిపించాడు. అభి కళ్ళ వెలుగులో హరికి మోహిత్ సార్ కనిపించాడు.