క్యా హువా - కె. తేజస్వని

Kya huvaa

నా ఎక్సిస్టెన్సుకి ఫస్ట్ మెమరీ: అప్పుడు నాకు ఐదేళ్ళేమో. తిరుపతిలో గుండు కొట్టించుకుని వచ్చి స్కూల్ కి వెళ్ళాను. మిను నన్ను చూడంగానే మొహం అదోలా పెట్టి వెళ్లిపోయింది. మిను నేను పక్క పక్క ఇళ్ళ వాళ్ళమే. కాబట్టి ఈ దెయ్యం తోనే ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది. బై డిఫాల్ట్, మా ఇద్దరి మధ్య/వలన ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే అది నా ఫాల్ట్, ఏదైనా మంచి జరిగితే క్రెడిట్ అంతా దానికే. ఇంకా అది క్లాస్ టాపర్ పైగా సొద వేయటంలో ఫస్ట్, అంతేకాదు టీచర్స్ పెట్ కూడా. ఇద్దరం కలిసి లంచ్ తినేవాళ్ళం కనుక లంచ్ అవర్లో మామూలుగానే వెళ్లి తన పక్కన కూర్చున్నా. పిచ్చి చూపులు చూస్తూ సడన్ గా స్కూల్ బాగ్లోనుంచి పెన్సిల్ తీసి నా గుండు మీద గట్టిగా గుచ్చింది. లేత గుండేమో, రక్తం కారటం మొదలైంది. పెన్సిల్ నా గుండు మీద నిలబడిపోయింది. మిను అది చూసి భయపడి గట్టిగా అరుచుకుంటూ బయటకి పరిగెత్తి టీచర్ ని వెంట పెట్టుకుని వచ్చింది. తర్వాత ఏమయ్యుంటుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. మా రెండు కుటుంబాలు ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అవటం వలన ఇష్యూ కాలేదు. కానీ అందరూ గుండు చేసుకుని వచ్చి దాన్ని భయపెట్టినందుకూ, పెన్సిల్ తో పొడవంగానే రక్తం కారే గుండు నాకు ఉన్నందుకూ నన్ను అదోలా చూసారు. అప్పట్నుంచి నాకు ఏదైనా కొత్త విషయం మినుకి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే భయం ఉండిపోయింది. గుండుని అంత దగ్గర్నుంచి చూడటం లైఫ్ లో ఫస్ట్ టైం అని తర్వాత ఎన్నో ఏళ్ళకి నాతో చెప్పింది.

మిను, నేనూ కలిసి చదువుకున్నాం, కలిసి కార్పొరేట్ ఆఫీసులో జాబ్ చేస్తున్నాం. ఇంటర్లో అనుకుంటా ఎవడో సిగరెట్ స్మోక్ చెస్తుంటే ఇన్స్పైర్ అయి మిను, నేనూ చెరొకటి కొని ట్రై చేసాము. ఆ తరువాత మిను మళ్ళీ ఎప్పుడూ సిగరెట్ కొనలేదు! నేను స్మోక్ చేస్తుంటే నా దగ్గర లాక్కుని రెండు దమ్ములు పీల్చి, స్మోక్ రింగ్స్, హార్ట్ సింబల్స్ ఊది నెక్స్ట్ జెనరేషన్ని మెస్మరైజ్ చేసేది. ఇద్దరం ఒకటే ప్రాజెక్టులో పని చేస్తున్నాం. బ్రేక్ లో కిందకి పైకి లిఫ్టులో తిరిగి ఆఫీస్ బయట బండ్ల దగ్గర సందర్భానుసారం ఓ సారి జ్యూస్, ఓ సారి సిగరెట్, మరో సారి గాసిప్, ఒక్కో సారి టీం లీడ్ నో, ఎండి నో బండ బూతులు తిట్టుకుని, ప్రతి సారీ బసంత్ బండి దగ్గర కాఫీ తాగి మళ్ళీ వచ్చి మా సీట్లలో పడే వాళ్ళం.

నేను లవ్ లో పడ్డానన్న విషయం నా కంటే ముందే మినుకి తెలుసు. ఎలాగంటే, ఓ సారి సెకండ్ ఫ్లోర్ క్యాంటీన్లో ఓ మెరుపు మెరిసింది. రోజూ కార్పొరేట్ డ్రెస్సింగ్లో కనిపించే న్యూ రిక్రూట్ మధు ఎత్నిక్ డ్రెస్సులో వచ్చింది. స్లీవ్ లెస్ కుర్తి, చాంద్ బాలి, ఐ లైనర్ పెట్టుకుని జిగేల్మనిపించింది. నవగ్రహాల్లా నిల్చున్నా నాలో చేంజ్ మినుకి వెంటనే తెలిసి పోయింది. "ఏంట్రా అష్టవంకర్లు తిరుగుతున్నావ్? లవ్వా?" అని అడిగింది. నాకు గుండె గుభేలుమంది. వెంటనే నా సీట్ కొచ్చి పడ్డా.

సిక్స్ మంత్స్ లో మధుకి నాకు పెళ్ళి అయిపోయింది!

పెళ్ళి అయి ఇది ఫిఫ్త్ మంత్.

ఈ రోజు ఫస్ట్ టైం నాకు డివోర్స్ తీసుకుందామన్న ఆలోచన వచ్చింది!

ఏడుపు అంతా గుండెల్లో అదిమి పెట్టి వర్క్ చేస్తున్నా. చిన్నపట్నుంచి బాయ్స్ డోంట్ క్రై అని వింటూనే ఉన్నాగా!

మిను వచ్చింది. "ఏంట్రా ఈ మధ్య ఎర్లీగా వచ్చి లేట్ గా వెళ్తున్నావ్? ప్రమోషన్ కొట్టేయటానికా?" అని అడిగింది.

నేనింకా ఏడుపు అదిమి పెడ్తూనే ఉన్నా. రెస్పాండ్ అవలేదు.

రివాల్వింగ్ చైర్ మీద గిర్రున తిరిగి, నా హ్యాండ్రస్ట్ మీద కాలు పెట్టి, "ఏంట్రా చెవులు దొబ్బాయా?" అని అడిగింది.

నేను సమాధానం చెప్పలేదు. నా కణతలు కదిలాయి.

కాలు కింద పెట్టింది. నా మొహం తన వైపు తిప్పుకుని "క్యా హువా" అంది.

కార్పొరేట్ ఆఫీసులలో చాలా రొటీన్ క్వశ్చన్. వేగంగా మాట్లాడితే "క్యావా" అని వినిపిస్తుంది. పిచ్ ని మార్చి దానిలో ప్రశ్నోలేక స్నేహమో లేక అనురాగమో ఒలికించొచ్చు. మనసు పెట్టి అడిగేసరికి ఇంక నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను. "నాకు డివోర్స్ కావాలి" అని తల డెస్క్ పై ఉన్న చేయి మీద పెట్టుకుని ఓ ఐదు నిముషాలు ఏడ్చేసా. తల ఎత్తేసరికి మిను హారర్ సినిమా చూస్తున్నట్లు సీట్ ఎడ్జ్ మీద కూర్చుని, హ్యాండ్రెస్ట్ లని గట్టిగా పట్టుకుని ఉంది. ఆ పిచ్చి చూపులు నన్ను మళ్ళీ ఐదేళ్ల వయసుకి తీసుకెళ్ళాయి. లాప్టాప్ తీసుకుని నా గుండు మీద వేస్తుందేమో అని భయం వేసింది. పెళ్ళాం పోతే పోయింది ప్రాణం ఉంటె చాలు అనుకుని బయటికి వచ్చి టీం లీడ్ కి ఫామిలీ ఎమర్జెన్సీ, మా అమ్మమ్మకి సీరియస్ అని చెప్పి మ్యాట్నీ సినిమా కెల్లా. సినిమా మొదలైంది. సినిమా చూస్తున్నానే గాని నేనెంత పిచ్చి పని చేసానో తలుచుకుంటూనే ఉన్నా. మిను పుణ్యమా అని ఆఫీస్ కెళ్ళే ఛాన్స్ కూడా పోగొట్టుకున్నానా అని భయం వేసింది. ఈ పాటికి ఆఫీస్ అంతా ఊదేసి ఉంటుంది. ఇంటికి ఎటూ వెళ్ళాలని లేదు కానీ వెళ్ళక తప్పదుగా. రాబర్ట్ ఫ్రాస్ట్ అన్నట్టు "హోమ్ ఇస్ ద ప్లేస్ వేర్ వెన్ యూ హావ్ టు గో దేర్ దే హావ్ టు టేక్ యూ ఇన్." కొంప కొల్లేరవుతుంటే ఇంగ్లిష్ బాగా వస్తున్నట్లుంది!

వెనక సీట్లో వెధవెవడో కాలు నా సీటుపైన పెడ్తున్నాడు. నా తలకి తగిలేట్టు. నాకు మండింది. ప్రతోడికి నా గుండు లోకువే! సీరియస్ గా వెనక్కి తిరిగి కాలు విసురుగా తోసానా, ఆ శాల్తీ ఎవరనుకున్నారూ? మిను! అది లేచి నుంచుంది. నోర్మూసుకుని లేచి దానితో పాటు బయటకొచ్చా.

"చెప్పు" అంది.

మొదలెట్టా.

"ఏం చెప్పనే? ఇల్లంతా తన ఇష్టం వచ్చినట్లు అరైంజ్ చేసుకుంటుంది. నేను ఏదైనా చెప్పబోతే, 'యూ డోంట్ నో ఎనీథింగ్' అంటుంది. ఎక్కడ చూసినా మొక్కలు, పువ్వులు, రియల్ వి ఆర్టిఫిషియల్ వి, గుమ్మం దగ్గర్నుంచి బాల్కనీ దాకా పువ్వులే పువ్వులు. సోఫాల మీద కోజీ కుషన్స్ విత్ ఫ్లోరల్ కవర్స్ . ప్లేస్ మొత్తం అవే ఆక్రమిస్తాయి. కూచోడానికి ప్లేస్ ఉండదు. అవి పక్కన పెడితే ఇంకో ఏడుపు. మంచం మీద జైంట్ ఫ్లోరల్ బెడ్ షీట్స్, త్రో పిల్లోస్, ఫ్లోరల్ బ్లాంకెట్. ఫ్లోరల్ కర్టెన్స్! పెళ్ళికి ముందు మంచం మీద దుప్పటి వేసుకుంటే ఒట్టు. ఇలా చుట్టూ పువ్వులు చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుందే. కామన్ సెన్స్ ఉండదే మీకు! ఓ మగాడు ఎలా ఉండగలుగుతాడు అని ఆలోచించరే? ఆ వాల్ హ్యాంగింగ్స్! ఫోటో ఫ్రేమ్స్! పెయింటింగ్సూ! మాంసం తిన్నామని బొయికలు మెడలో వేసుకుని తిరగరుగా! పెళ్ళి చేసుకున్నామని గోడలనిండా పిడిఏ ఫోటోసేనా? ఇంకా పిల్లో కవర్ల మీద, కాఫీ మగ్గుల మీదా, చివరికి మౌస్ పాడ్ మీద కూడా! పోనీ హోమ్ మేకర్ కూడా కాదు కదా 24 అవర్స్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తనకి నచ్చినట్లు డిసైన్ చేసుకుంటుంది అనుకోటానికి! ట్విన్నింగ్ డ్రెస్సులు, 'బెస్ట్ హస్బెండ్' 'బెస్ట్ వైఫ్' అన్న క్యాప్షన్స్ తో టీ షర్ట్సు! చిన్నపుడు మన ఇళ్ళు ఎలా ఉండేయే? ఈ చెత్త ఉంటేనే కలిసి ఉండగలమా? మా అమ్మా నాన్నల పెళ్ళి అయి థర్టీ సెవెన్ ఇయర్స్ అయింది! ఎప్పుడో ఓ సారి వాళ్ళ పెళ్ళి ఫోటో చూసినట్టు గుర్తు. వాళ్ళు హ్యాపీగా లేరా? మొగుడిని మగాడిలా కాకపోయినా మనిషిలా చూడండే! నాకు ఇష్టాలు ఉండవా? ఏమైనా అంటే నెత్తి మీద కుళాయి తిప్పుతారు. ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు, రీళ్ళు! మెమరీ ఫుల్ అయితే ఫోన్ చేంజ్, కొత్త సెల్ఫీస్ షురూ. ఓ నిమిషం ఆగి లైఫ్ ని ఆస్వాదించనివ్వండే. ఇంత వరకు పెళ్ళి ఫొటోస్ ఆల్బం రెడీ కాలేదు తెలుసా? పెళ్ళికి ముందు ఫోటోషూట్, పెళ్ళి ఫొటోస్, పెళ్ళి తరువాత ఫొటోస్, డ్రోన్ ఫొటోస్, డెస్టినేషన్ ఫొటోస్, మొత్తం 7000 ఫొటోస్ తీసాడు వాడు. పది లక్షలు ఇచ్చా ఫోటోగ్రాఫర్ కి! ఇంతా చేస్తే, ఎవడికీ టైం లేదు ఫొటోస్ ఫైనలైజ్ చేయటానికి. నా డివోర్స్ కూడా అయిపోతుంది కానీ పెళ్ళి ఆల్బం రెడీ కాదు. మేము మాట్లాడుకుని టూ మంత్స్ అవుతుంది. ఆ దిక్కుమాలిన టూ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఇద్దరం చెరో బెడ్రూమ్ లో ఉంటున్నాం. ఎవరి తిండి వాళ్ళదే. అది ఆఫీసుకి వెళ్తుందో లేదో నాకు తెలియదు. నేను ఉన్నానో పోయానో దానికీ తెలియదు."

ఆవేశం కట్టలు తెంచుకుంటే మాటల వరదలు పారతాయేమో!

అయ్యో! నా ఆవేశంలో దీని సంగతి మరచిపోయా! మళ్ళీ పిచ్చి చూపులు మొదలెట్టింది. ఈ సారి నేనూ రెడీ. షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కున్నా. చేయి చేసుకుంటే ఊరుకునేది లేదు! "క్యా హువా?" అని వాయిస్ పెంచి గట్టిగా అడిగా. "నీ పెళ్ళికి నైంటీన్ థౌసండ్ పెట్టి కంచి టిష్యూ సారీ కొనుక్కున్నారా! బ్లౌజ్ వర్క్ కి సిక్స్ థౌసండ్ అయిందిరా!" అంది ఏడుపు గొంతుతో. ఇదీ దాని బాధ! నాకు మండింది. "అయితే నాకేంటే? నా డివోర్స్ కి ఇంకోటి కొనుక్కో" అని చెప్పి సర్రున బైక్ పోనిచ్చా. అది ఎలా వెళ్తుందనేగా మీ డౌట్? పెళ్ళా, పెటాకులా, సిగరెట్టులా, ఒక్క ఖర్చు లేదు! ఈ మధ్యే ఆటో కార్ కొనుక్కుంది. దాని దారి అది చూసుకుంటుంది లెండి. నేనే పాపం! అందరూ బాగానే ఉన్నారు.

మర్నాడు పొద్దునే ఆఫీస్ కి వచ్చా. నన్ను అవాయిడ్ చేస్తున్నట్లుంది. నేనూ పట్టించుకోలా. సిగరెట్ కి తయారవుతుందిగా. నీ సిగరెట్ నువ్వు కొనుక్కో అని నిర్మొహమాటంగా చెబుతా. బ్రేక్ లో కూడా కలవలేదు. మాంఛి పంచ్ డైలాగ్ రెడీ చేసుకున్న తరువాత సందర్భం రాకపోతే ఎలా ఉంటుంది!

ఇంక ఉండబట్టలేక మిను కనిపించట్లేదేంటని విజ్జుగాడిని అడిగా. వాడు నన్ను వింతగా చూసి, "మీ అమ్మమ్మకి సీరియస్ అంటగా, చూడటానికి వెళ్తున్నానని లీవ్ పెట్టింది. నేను రేపు సాయంత్రం వద్దామనుకుంటున్నారా. ఓకేనా?" నా మోహంలో ఎక్సప్రెషన్ ఆశ్చర్యంగా చూసి, "క్యా హువా?" అని అడిగాడు. చూసారా! ఇంకా సింపతీ ఉందా దాని పైన? గుండుని గుచ్చటానికి పెన్సిల్ కావాలేమో కానీ గుండెని తూట్లు చేయటానికి నా చూపులు చాలు! శాల్తీయే కనబడలేదు! ఛ్ఛా . . .

ఎవరో మహానుభావుడు ఆల్రెడీ అన్నాడు, "ద ఫిమేల్ అఫ్ ద స్పీసీస్ ఇస్ మోర్ డేంజరస్ థేన్ ద మేల్!"

సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి, బెడ్ రూంలో ఇకఇకలు, పకపకలు. మేడంగారి ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు! ఈ రోజు చెప్పేస్తాను అని డిసైడ్ చేసుకుంటూ దాని బెడ్ రూమ్ డోర్ కొట్టా. విషయం చెబుదామని. తలుపు తెరిచిందెవరు? మిను!

నా కళ్ళని నేనే నమ్మలేక ఓ సారి చుట్టూ చూసా. ఫ్లాట్ లో కొంచెం చేంజ్ కనిపిస్తుంది. పువ్వుల శాతం తగ్గినట్లుంది. అయ్యో! కోజీ కుషన్స్ ఏమైనాయి?

ఇంట్లో దొంగలు పడ్డారా?

మరి మిను ఇంట్లో ఉందేంటి? మిను దొంగా? ఇది మా ఇల్లు కాదా? నా బుర్ర గిర్రున తిరిగిపోయింది. మిను గురించి ఆలోచిస్తూ పొరపాటున మిను ఇంటికి వచ్చానా? కొత్త ఇల్లు కొనుక్కుందా? నాకేమీ అర్థం కావట్లేదేంటి?

మిను వెనుక మధు మెల్లగా బయటికి వచ్చింది. బెడ్ రూమ్ లోపల మంచం మీద చిన్న పూవుల దుప్పటి, త్రో పిల్లోస్ మిస్సింగ్, ఫొటోస్, వాల్ హ్యాంగింగ్స్ మిస్సింగ్, ఆర్టిఫిషల్ ఫ్లవర్స్ అన్నీ మిస్సింగ్! చాలా సోబర్ గా, ప్లెసెంట్ గా ఉంది ఇల్లు.

"జానూ!" అంటూ వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుంది.

నేను మాత్రం ఏం తక్కువ? "బేబీ" అని గట్టిగా హగ్ చేసుకున్నా! హెయిర్ జాస్మిన్ స్మెల్ వస్తుంది. ఎంత మత్తుగా ఉంది!

ఓ కన్ను తెరిచి మిను ఉందా పోయిందా అని చూసా. పోలే.

మిడిగుడ్లేసుకుని కళ్ళార్పితే ఏ సీన్ మిస్ అవుతానో అన్నట్టు చేటలంత కళ్ళేసుకుని చూస్తుంది. లైఫ్ లో ఎప్పుడూ పిడిఎ చూడనట్టు! అసలు నాకు తెలియక అడుగుతా, మొగుడు పెళ్ళాలు అంటే మాట మాట పడ్తారు. అంటే వాళ్ళిద్దరూ విడిపోయినట్లేనా? కామన్ సెన్స్ ఉండదు జనాలకి! కొంచెం ప్రాబ్లెమ్ ఉంటె చాలు సినిమా చూడటానికి రెడీ అయిపోతారు.

మధు "కాఫీ తాగుదాం జానూ," అని విడిపించుకుంది.

"ఓకే బేబీ"అని సోఫా మీద కూర్చున్నా. ఎంత ప్లేసో! ఎంత కంఫర్టబల్ గా ఉందో! జిందగీ మళ్ళీ షురూ అయినట్లుంది. ఈ లోపు మూడు బ్లూ కలర్ కాఫీమగ్స్ ఓ బిస్కెట్ ప్యాకెట్ తో ఇద్దరూ బయటికి వచ్చారు. కాఫీలు అయినాయి.

"ఇంక వెళ్తాన్రా" అని మిను లేచింది. మధు దానిని గట్టిగా హగ్ చేసుకుని ఏడిచేసింది. ఏమిటో ఇద్దరూ ఏడ్చుకుంటూ మాట్లాడుకున్నారు. నాకేం అర్ధం కాలా. ఇద్దరం డోర్ దాకా వెళ్ళాం. మిను వెనక్కి తిరిగి, "ఏ రిలేషన్షిప్ అయినా సక్సెస్ఫుల్ అవ్వాలంటే గివ్ అండ్ టేక్ ఉండాలి. కలిసి బ్రతకటం ఓ ప్రాజెక్ట్, ఇందులో కూడా సాక్రిఫైస్లు అప్రిసియేషన్లు ఉంటాయి. జాబ్ కోసం ఎన్నో ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు జీవితం కోసం ఎందుకు పెట్టకూడదు? మీరిద్దరూ సేమ్ టీం మెంబర్స్ అని మరిచిపోకండి" అని నవ్వుతూ బై చెప్పింది.

ఎంత చక్కగా చెప్పింది! రెండు నెలల టార్చర్ ఒక్క పూటలో తీసేసింది! ఇది నిజంగా దిగి వచ్చిన దేవత సుమా!

చిన్నప్పుడు గుండు మీద పెన్సిల్ గుచ్చితే ఇది ఒక సైకోగా మారుతుందేమోనని అపుడపుడూ వర్రీ అయ్యే వాడిని. ఇలా రిలేషన్షిప్ అడ్వైసర్ అయి గుండె గాయాలు ట్రీట్ చేస్తుందనుకోలా!

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు