విద్యానగరం ఉన్నత పాఠశాలలో లలిత, అనితలు 10వ తరగతి చదువుతున్నారు. చదువులో పోటాపోటీగా చదివేవారు. ఎవరు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తారో చెప్పడం కష్టం. అనితకు చదువుతో పాటు ఓర్వలేని తనం చాలా ఎక్కువ. అందుకే లలితతో ఎప్పుడూ మాట్లాడదు. దాంతో లలిత కూడా పట్టించుకోవడం మానేసింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అంతకు ముందు ప్రీ ఫైనల్స్ పరీక్షలు ఉన్నాయి. ప్రధానోపాధ్యాయులు ఈ ప్రీ ఫైనల్స్ లో క్లాస్ ఫస్ట్ వచ్చిన వారికి 2000 రూపాయలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు. అనిత, లలితలు పట్టుదలతో చదివారు. ఇంకా కొందరు విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడాకి పట్టుదలతో చదివారు. ప్రీ ఫైనల్స్ లో లలిత క్లాస్ ఫస్ట్ వచ్చింది. హెడ్ మాస్టర్ లలితకు 2000 రూపాయలు బహూకరించాడు. లలిత ఇలా అన్నది. "ఈ డబ్బులతో నాకు ఇష్టమైన పని చేయడానికి అనుమతి ఇవ్వండి సర్." అని అనుమతి అడిగింది. "ఇక ఈ డబ్బులు నీవి. నీ ఇష్టం తల్లీ!" అన్నారు ప్రధానోపప్రధానోపాధ్యాయులు. అప్పుడు లలిత ఇలా అన్నది. "క్లాస్ అంటే ఒక్క 10వ తరగతి మాత్రమే కాదు. మన పాఠశాలలో అన్ని తరగతులూ ముఖ్యమే. అందుకే ఈ ఫైనల్స్ పరీక్షలలో 6 నుంచి 9 తరగతుల వరకు అందరిలో ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వారికి ఈ 2000 రూపాయలు గిఫ్ట్ గా ఇస్తా." అని ప్రకటించింది లలిత. హెడ్ మాస్టారు ఆశ్చర్యపోయాడు. ఫైనల్స్ పరీక్షలలో 8వ తరగతి ఆమ్మాయి విజయకు అత్యధిక మార్కులు వచ్చాయి. విజయ ఎవరో కాదు. అనిత తోడ బుట్టిన చెల్లెలే. లలిత విజయను ప్రేమగా దగ్గరకు తీసుకుని, మెచ్చుకొని 2000 రూపాయలు బహూకరించింది. అనిత ఆశ్చర్య పోయింది. అనిత ఇన్ని రోజులు తనతో సరిగా మాట్లాడనందుకు లలితను క్షమించమని కోరింది. లలిత గొప్ప మనసు ముందు తాను చాలా చిన్నదని అనిత ఒప్పుకుంది. ఇక నుంచి మనం ఇద్దరం స్నేహితులం అని అనిత అన్నది. లలిత సంతోషించింది.