"తల్లీ విధిజ్ఞ! అదేమిటీ, కడుపు నిండా తినకుండా అలా లేచేశావూ! నువ్వు తిన్నది కడుపులో ఉన్న బిడ్డకు పెడితే సరిపోతుంది అనుకున్నావా! నువ్వు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదమ్మా! నేను వండింది అంతా నీకు పడేదే, ఏమీ విపరీతాలు లేవు! అలాగే ఇవాళ్టి వంట అంతా ఆరోగ్యాన్ని అందించేదే. తిను తల్లీ,", అంటూ ప్రేమగా కోడలు తలని మృదువుగా నిమురుతూ మరింత కొసరి కొసరి తినిపిస్తోంది అత్తగారు వింధ్య. ఇటు విద్య, అవి డైనింగ్ టేబుల్ మీద అటు పక్కగా కూర్చున్న తన అత్తగారు సరళకు కంచంలో బెల్లం వెయ్యని సాంబారు విడిగా తీసినది, అంటూ, వడ్డిస్తూ అందులో రవ్వంత నేతి ౘుక్క వేసింది, అలా తింటేనే అడుగుతుందంటూ. ఈ తల్లి కూతుర్లలో వచ్చిన ఈ మార్పుని అటు విధిజ్ఞ కానీ, ఇటు సరళ గారు కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. భోజనాలయ్యి, అంతా లోపల ౘల్లని బెడ్రూమ్స్ లోకి వెళ్ళారు. మగవాళ్లంతా మేడ మీద గదిలోనూ, ఆడవాళ్ళంతా కింద బెడ్ రూమ్ లోను. "అసలిలా ఎలా పెరిగావే నువ్వు? సిగ్గన్నది పెట్టలేదా నీకు ఆ దేవుఁడసలూ", అంటూ ఆడి పోసుకునే ఈమేనా? లేదా నేను ఆ రోౙు ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నానా?", అనుకుంటూ ఇంకా కలలో నుంచి తేరుకోలేదు కోడలు విధిజ్ఞ. పెళ్లయిన ఆరు నెలలకి ఆమె నెల తప్పినందుకు, పుట్టింటికి వెళ్లి ౘనివిడి పెట్టింౘుకోవాలి అని చెప్పారు కూతురు విద్య అత్త గారు సరళ గారు. అలాగే అంటూ అటు ఆమె కూడా తన తల్లి, తండ్రి రావడంతో బొట్టు పెట్టుకుని, మౌనంగా ఉన్న మామగారి కాళ్ళకూ, అయిష్టంగానే అనుమతించిన అత్తగారి కాళ్ళకూ, దండం పెట్టి, భర్తకి చెప్పి పుట్టింటికి వెళ్ళింది. బయలుదేరింది అన్న మాటే గాని, నిన్నటి అత్తగారి మాటలే ఆమెకి గుండెల్లో, చెవిలో మార్మోగుతున్నాయి. "సిగ్గులేదేమి, పెళ్లయిన ఆరు నెలలు తిరగకుండానే నెల తప్పటమా? మేమెరుగమమ్మా, ఇలా మొగుడిని కొంగుకు కట్టేసుకోవటం, అయినా అంతా నీకు పిల్లలు పుట్టడం పట్ల ఉన్న ప్రేమానుకుంటామా ఏంటి? మర్యాదలు అంటూ అటు పుట్టింటికీ తిరగవౘ్చునూ, ఇటు "గర్భిణి"నన్న వంకతో ఇంట్లో పని తప్పింౘుకుంటూ సేవలూ కూర్చుని చేయించుకోవచ్చు! ఏం పథకం వేశావే మా తల్లి, ఆహాహాహా," అంటూ, చేతులు తిప్పుతూ ఆడి పోసుకోవటమే ఆవిడ, కోడలు నెల తప్పిందని తెలియగానే. "అటువంటి అత్తగారు ఇలా మారిపోయింది ఏంటో చెప్పమ్మా" అనుకుంటూ గదిలో ఉన్న అమ్మవారి పటం వైపు చూసింది కోడలు విధిజ్ఞ. పుట్టింట్లో ౘనివిడి పెట్టింౘుకున్న తర్వాత ఒకే ఊరు కాబట్టి, మూడు రోజులు నిద్ర చేసి ఆరోజు పొద్దున, ఆదివారం అని దింపటానికి తల్లిదండ్రులు వెంటరాగా, బయలుదేరి మధ్యాహ్నానికి ఇంటికని వచ్చేసింది విధిజ్ఞ. తను వచ్చేసరికి, వెళ్ళేటప్పుడు ఉన్న ఆడపడుచు విద్యతో పాటు, ఆమె భర్త, అత్తమామలు కూడా ఉన్నారు. ఇంతమందికి విసుక్కోకుండా తల్లి కూతుర్లు ఇద్దరే వంట చేయటం, ఆలస్యంగా వచ్చినందుకు తనని ఏమీ అనకుండా ప్రేమగా చూడటమూ, ఇదంతా వింతగా అనిపిస్తుందామెకూ, అలాగే విద్య అత్తగారు సరళ వాళ్ళకూనూ. నవ్వుతూ అందరికీ రెండు మంచినీళ్లు బాటిళ్లు పట్టుకొచ్చిన అత్తగారు వింధ్య, ఆ ముచ్చట ఈ ముచ్చట చెబుతూ, బెడ్రూంలోని టీవీలో ఒక వీడియో ఆన్ చేసింది. ################################## కోడలు విధిజ్ఞ పుట్టింటికి బయలుదేరగానే పొద్దున్నే వండిన పదార్థాలు ఉన్నాయి కనుఁక ఇక పనేమీ లేదని కూతురు విద్యతో బాతాఖానీ వేస్తుండగా ఫోన్ ౘప్పుడు, మెసేజ్ నోటిఫికేషన్ తో. "ఏమిటా", అని వాట్సప్ గ్రూపు తెరిచి ౘూస్తే కాలనీ లోని ఆడవాళ్ళందఱూ ఒక రోౙు పిక్నిక్ కి రావలిసిందిగా వెనక వీధి భారతి గారి పిలుపు. "అమ్మో, భారతి గారంటే ఎంత సేపూ 'సమాజ సేవా, పర్యావరణ పరిరక్షణ', అంటూ మనని అడవుల వెంట తిప్పుతుంది, నా వల్ల కాదు", అనేసింది వింధ్య. కానీ "పిక్నిక్" వంకన మఱో రోౙు ఇక్కడే ఉండవౘ్చని అమ్మను ఒప్పించింది విద్య. నిౙానికి వింధ్య కోడలు విధిజ్ఞ కూడా అందఱి లాంటి ఆడపిల్లనే, ఆలోచనలలో కొంత ఆధునికత, జీతం చేతిలో ఉందనే సరికి వచ్చిన లెక్క లేని తనం వంటివి ఉన్నాయి. విద్య అత్తగారు కూడా పూర్తిగా సాత్వికమేమీ కాదు, కొడుక్కు వినపడకుండా కోడలి పై గొణుగుడు, ఊరందఱికీ ఆమె పై ౘాడీలూ వంటి లక్షణాలు బాగానే కలిగిన "అత్తగారు" ఆమె. ఒక రకంగా చెప్పాలంటే "ఏ మనిషీ పూర్తిగా మంచీ కాదూ, అలాగని పూర్తిగా చెడూ కాదు"కు వీళ్ళే తార్కాణాలు. ఇళ్ళల్లో మగవాళ్ళూ ఏమీ తక్కువ తినలేదు. కోడలికీ, అల్లుడికి ఇప్పుడు మామగారు అయిన వాళ్ళంతా, నిన్నటిదాకా అటు తమ భార్యకి, ఇటు తల్లికీ మధ్య సమన్వయము ఏర్పరచలేదు, అలాగని వాళ్ళేమి మంచి వాళ్ళనో, చేత కాని వాళ్ళనో కాదు. బయటి వ్యసనాలు, ధనం పై కేవలం తామే అధికారం కలిగి ఉండటం, పై మాట తమది అవ్వాలనే తత్వం, పిల్లల్ని ఏనాడూ పట్టించుకోని నిర్లక్ష్యం, భార్య, నా తల్లి అయినా బయటికి వెళ్ళకూడదు, అని అలసత్వం వంటి దుర్లక్షణాలన్నీ కలిగి ఉన్న వారే. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వఱకూ, వాళ్ళ మార్కుల శాతం ఎంత, ఇష్టం ఏమిటి, అయిష్టం దేనిపైన, ౘదువు స్థితిగతులు ఏమిటి, వంటివేవీ పట్టింౘుకోలేదు సరి కదా, పండుగ వస్తే ఇంట్లో ఏం చేయాలి, సెలవులు వస్తే బయటకి ఎక్కడ తిప్పాలి, వంటి ధ్యాసలేమీ లేని కూడా లేవు. ౘుట్టాలైనా, పుట్టిన రోౙులూ, పెళ్ళి రోౙులైనా అంతా భార్య బాధ్యతే. మళ్ళీ తల్లికి శ్రమ ఉండకూడదు. అలాంటి వాళ్ళు, ఇప్పుడు కోడలు వచ్చాక, పని బాధ్యత కోడలిది, "నిర్ణయాల ఎలా?", అన్న బాధ్యత అత్తగారిది. అంటే ఇదంతా "భార్యల పట్ల ప్రేమేనా?", కాదు, కోడలి మీద పెత్తనాలు. అలాగే, ఇప్పుడు అల్లుడు మాత్రం, కూతురు అడిగిన ప్రతి ౘోటికీ తిప్పాలి, కోరక ముందే ప్రతిదీ కొనాలి. కోడలు పుట్టింటికి బయలుదేరకూడదు కానీ, కూతురు ఇక్కడికి వచ్చి అన్ని తినేయాలి. కోడలు పుట్టింటికి తాము కూడా వెళ్ళి, అతిథి మర్యాదలు స్వీకరించి, "భోజనాలు బాలేదు", వంటి వంకలు పెట్టాలి, కానీ కూతురు మాత్రం అత్త, మామ లతో రాకూడదు. అలాగే జీతాలూ, పని మనిషి వంటి వాటిల్లోనూ వ్యత్యాసాలు. ఇది అంతా నిౙంగా బిడ్డలు పట్ల ప్రేమేనా? అజమాయిషీ కోసం ఆరాటం కాకపోతే!. అందుకే యువతరం కూడా పెడసరంగా తయారవుతోంది. "వీళ్ళ బామ్మలతో, అమ్మమ్మలతో, అత్తారింటి వారి వేడుకలలో, విషాదాలలో, - కోడలు లేదా అల్లుడు పాత్రని మీరు ఏ మేరకు నిర్వహించారు, చిత్తశుద్ధి ఎంత?" వంటివన్నీ ఇప్పుడు తరాౙులో వేస్తున్నారు. "ఇవాళ కోడలు లేదా అల్లుడు సరిగ్గా లేరు అంటే, రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటో, అని ఇప్పుడు అనటం దేనికి? 'ముందు మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి'" - ఇదీ నేటి తరం వాదన. సమాజ శ్రేయస్సు కోసం ఎంతో పరిశోధన, కృషి చేస్తున్న భారతీ దేవి గారూ, ఇటువంటివీ గ్రహిస్తూ ఉంటారు, కానీ ఎవ్వఱినీ నొప్పించేలా ఏదీ మాట్లాడరూ, అలాగని ఏదీ విడచి పెట్టటమూ చేయరు. చేతనైనవి చేయాలనే, అప్పుడప్పుడు కాస్త అందరం కలిసి కబుర్లు కలబోసుకుంటూ, సంతోషాలని పెంచుకుంటూ, బాధల్ని పంచుకుంటూ ఉంటే, మనసులు, తద్వారా ఆరోగ్యాలూ, తేలిక పడతాయి అనే భావనతో అందర్నీ ఒక తాటిన కలుపుకుని పోతూ ఉంటారు. "కలిసి ఉంటే కలదు సుఖము" కదా. అలాగే ఆ రోౙూ ఆ సందేశం పంపారు. అయితే, "ఎండలు కావడం మూలాన ఎక్కువగా బయటకు తిరగలేము", అని కొందఱూ, "సెలవులు దగ్గర పడుతున్నాయి, మనవళ్ళు వేరే ఊళ్ళ నుంచి వస్తారు వాళ్ళ కోసం అన్నీ సిద్ధం చేయించాలి", అంటూ కొందఱూ "పిక్నిక్" వద్దు, అనేశారు. దాంతో "రోగి కోరిన మందే వైద్యుడు ఇచ్చాడు", అని, ఆవిడ దాన్ని కుదించి, "ఆడవారి వరకు మా ఇంట్లోనే కిట్టి పార్టీ మీటింగ్" రేపు మధ్యాహ్నం అందఱూ ౘక్కగా ఒంటిగంట కల్లా వచ్చేయండి, భోజనాలు కూడా ఇక్కడే అని చెప్పడంతో అందఱూ అందుకు బదులుగా ఆ వాట్సప్ మెసేజ్ వద్ద థంబ్సప్ ఇమోజీ పెట్టి, తమ అంగీకారం తెలిపారు. "భారతీ దేవి గారు సిద్ధం చేసే భోజనం అంటే ఏమీ లోటుపాట్లు ఉండవు. మనం చేతులు ఒప్పుకుంటూ వెళ్లవౘ్చు", అనుకుని కొందఱు ఉట్టి చేతులతో వెళితే, కొందఱు మాత్రం మొహమాటంగా, *తృణమో, పణమో" అన్నట్లు పళ్ళు, పువ్వులు, కారప్పూస, జంతికలు వంటివి పట్టుకు వెళ్ళారు. భోజనాలు మేడ మీద డూప్లెక్స్ రూమ్లో. ప్రొజెక్టర్ టీవీ ఆన్ చేసి స్పీకర్స్ పెట్టి మఱీ, కలర్ఫుల్ లైట్స్ వేసి, బల్లల మీద పదార్థాలు అన్నీ పెట్టి, కూర్చుని తినటానికి కుర్చీలు డైనింగ్ టేబుల్ కడా అరేంజ్ చేసింది ఆవిడ. "మై గాడ్, కిట్టి పార్టీ కోసం, అదీ మా ఎవ్వఱి నుంచి ఏమీ ఆశింౘకుండా, ఇంత ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారా?", మీరు నిౙంగా శ్లాఘనీయులు, మెౘ్చుకున్నారో పెద్దావిడ, సుభాషిణి గారు, తెలుగు ఉపాధ్యాయిని. చిరునవ్వు వదనం మీద నుంచి చెదరనివ్వని చిద్విలాసిని భారతీదేవి గారు, "ఇదే మాట భోజనాలయ్యాక చెప్పండి", అంటూ టీవీ ఆన్ చేశారు. "ఏర్పాట్లు ఇంత ఘనంగా ఉన్నాయంటే, భోజనాలు ఇంకెలా ఉంటాయో, అదీ మీ సమర్థత తెలిసిన మేము ఆ ముక్క చెప్పడానికి భోజనాలు అయ్యేదాకా ఆగాలా", అంటూ శృతి కలిపింది మరో పెద్దావిడ ఎలిజిబెత్. "మీ మాటలే కాదు, మీ పలుకులు తీపే,", మెౘ్చుకోకుండా ఉండలేకపోయింది రజియా. "పలుకులే కాదు, మొహం మీద జరిగిన చిరునవ్వు కూడా భలే ఉంటుంది", తను ఏదో మాట కలపాలి అన్నట్టు, ఓ పొగడ్త విసిరింది విద్య. అందఱి పెద్దవాళ్ళ మధ్యన, తాను ఉనికి ౘాటుకోవాలన్నట్లు ఏదో ప్రయత్నం ఆమెది. "నేను కాదమ్మా, ఈ తరం మీరంతా ఇలాగే ఉండాలి మాకన్నా ఎప్పుడు శక్తివంతంగానూ, కాంతియుతంగానే ఉండాలి", వదులిచ్చింది ఆప్యాయతతో భారతీ దేవి. "మీ మాటలు తీపే కాదు, స్ఫూర్తి మంత్రాలు కూడా", క్రింద వెనక వైపు పోర్షన్లో వారి ఇంట్లోనే అద్దెకు ఉంటున్న రేణుక కళ్ళల్లో ఆరాధనతో చెప్పింది. "ఎప్పుడూ అందఱూ మాట్లాడుతూనే ఉంటారు, ఈ పక్కనున్న వాగ్దేవి గారు మాత్రం, మాట్లాడితే పలుకులు రాలిపోతాయో, లేక మమ్మల్ని అందరినీ ఆవిడ భోజనానికి పిలవ వలసి వస్తుందీ, అనే భయమో, అసలు పెదవి విప్పదు", అందఱూ భారతీదేవి గారిని పొగుడుతూ ఉంటే, ఓర్వలేని రామలక్ష్మీ అన్నది, టాపిక్ డైవర్ట్ చేద్దామని, పనిలో పనిగా, "తమ ఇంటి ప్రక్కనే ఉంటూ, ఎప్పుడూ పలకరింౘనీ, చివఱికి ఉబుసు పోక, 'మీ ఆకు మా వాకిట్లో వాలింది, నీ పిల్లి మా పళ్ళెం ఎత్తుకొచ్చింది', అంటూ గొడవ పెట్టుకుంటూ, ఆ రకంగానైనా పలకరిద్దాం అన్నా, మౌనంగా లోపలికి వెళుతుందే తప్ప, పెదవి విప్పని ఆ వాగ్దేవి మీద ఈ రకంగా అక్కసూ తీర్చుకోవౘ్చు" కూడా, అని ఈ అస్త్రం వేసింది రామలక్ష్మి. అప్పుడు కూడా మౌనమే వాగ్దేవిది. నిౙానికి వాగ్దేవి ఈ వేడుకకు కూడా రాకపోయేదే, భారతీదేవి గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి, "రావలసిందే" అని పట్టు పట్టడంతో, వచ్చింది వాగ్దేవి. "విధి నిర్వహణలో భర్తను కోల్పోయిన" నాటి నుంచి, ఆమె ఇలా గుప్పెట అంత గుండెలో బాధలు దిగమింగుకుంటూ, కొడుకుని పైకి తీసుకువచ్చింది. ఇప్పుడు అతను మంచి కంపెనీలో ఉద్యోగంలో స్థిరపడ్డాడు. 'ఇక కొడుకు పెళ్లి చేసి ఆమె విశ్రాంతి తీసుకోవడమే' అనే భావనలో ఉంది. తన దైన ప్రపంచంలోనే ఉంటుంది కానీ, ఈ లోకంలో ఇమడదు. అటువంటి తల్లిని జాగ్రత్తగా ౘూసుకోవాలి అని, సమర్థురాలు, సచ్ఛీలత అయిన మంచి అమ్మాయిని ౘూసి, ౙల్లెడ పట్టీ పెళ్ళి చేసుకోవాలి అని, కొడుకు వచ్చిన సంబంధాలన్నీ దాటవేస్తున్నాడు. ఇక్కడ రామలక్ష్మికి ఏమో, పెద్ద కొడుక్కి తనకు నచ్చిన సంబంధమే చేసినా, కోడలు కొడుకుని తీసుకుని వేరే వెళ్ళి పోయింది. "అందుకు తల్లి, తండ్రి, వాఱి మాటలు వినే అన్నయ్యా కలిసి, వదినను పెట్టిన హింసలు కూడా కొంత కారణం, ఇప్పుడు వేఱేగా వెళ్ళినా, వదినకు, అన్నయ్యకు మధ్య బంధం అంతంత మాత్రమే, అదీ వాళ్ళ పిల్లల కోసమే, వదిన కొంత సహిస్తోంది,", అని అనుకున్న ఱెండవ కొడుకు, తనకు నచ్చిన అమ్మాయిని పట్టుబట్టి చేసుకుని మఱీ, ముందరే భార్యని తీసుకుని వేఱేగా వెళ్ళి పోయాడు. "తన కేమో కొడుకులు ఇట్లా, వాగ్దేవికేమో అట్లా." అది కూడా కొంత అసహనానికి కారణం. అందుకే అంత మాట అనేసింది, "మీ ఇంటికి భోజనానికి వస్తామని భయమా", అని. "అంటే నీ కొడుక్కి పెళ్లి చేసి, పప్పన్నం పెట్టి మమ్మల్ని అందఱినీ పిలవవా", అనే శ్లేష. అసలే మౌనంగా ఉండే వాగ్దేవి మొహం ఈ మాటతో మరింత మ్లానమైపోయింది. అది గమనించిన భారతీదేవి గారు, సున్నితంగా రామలక్ష్మిని, "మీకేం వడ్డింౘమంటారు", అన్నారు, మిగతా వాళ్ల విస్తళ్ళలో అన్నీ వడ్డిస్తూ, వరుసలో ఆమె వద్దకు వచ్చి. "ఈ విస్తర్లు అన్నీ మన ఊరి చివఱ చేరి నేటితరం యువత తయారు చేస్తున్నవి. 'ఉద్యోగం అంటే కేవలం పెద్ద పెద్ద ౘదువులు ౘదివి, కంప్యూటర్ ముందర కూర్చుని ఏసీ గదులూ అవి పెట్టుకుని చేసేవే కాదు, మనకి తిండి పెడుతూనే, సమాజానికి మేలు చేసేవి కూడా అయ్యుండాలి', అంటూ, స్వయం సహాయక బృందంగా ఏర్పడి, ప్లాస్టిక్ ఆకులు కాకుండా, ఇలా చెట్ల నుంచీన తీసిన వాటితో తయారు చేస్తున్నారు. బదులుగా ఇంతకు ఇన్ని చెట్లని ౘక్కగా, నగరాల మధ్యలోనూ, చివర్లా, మొదలా అన్ని ౘోట్లా నాటుతున్నారు.", అంటూ చెప్పారు భారతీ దేవి గారు. "అందుకే ఆంటీ మీ దగ్గర ఉంటే స్ఫూర్తి మంత్రం", అన్నాను నేను ఇందాక, అన్నది రేణుక రెట్టించిన అభిమానంతో. "నేనే కాదమ్మా, మీరందరూ కూడా అలా ఉండగలరు", సాధారణంగా పొగడ్తని ఒప్పుకొని ఆవిడ, ఇతరులను ప్రోత్సహించడానికి ఆ మాట అలా అన్నారు అక్కడ. ఇంతలో టీవీలో వీడియో ఆన్ అయింది. అయితే, అందరూ ఊహించినట్టు అది సినిమా కాదు, కనీసం పాటలో, లేక ఇతర కార్యక్రమాల వీడియోలో కాదు, ఓ సరి కొత్త ఆవిష్కరణ. ఆ వీడియో ఈ ఉపోద్ఘాతం తో మొదలైంది. "విశాలమైన ఈ భూ గ్రహం మీద, మనం కేవలం ఓ అణువంత ప్రాణులం. మనం తెలియని వారు ఎందఱో. మనకు తెలియని విషయాలు ఎన్నో.", అంటూ. ఆ తర్వాత ఓ చిన్న కథ. "తల్లి ౘుట్టూ తిరుగుతున్న చిన్న పిల్ల ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడి పోవటం, ఆ తర్వాత పెద్ద వ్యాధి బయట పడటం, చికిత్సకు ఆ మధ్య తరగతి కుటుంబానికి తలకు మించిన భారమే అయినా, ఓ పోరాటంలా ముందుకు సాగింౘటం, కానీ ఆ పాప నొప్పి తో అవస్థ పడుతుంటే ౘూస్తూ వాళ్ళూ ౘాటుగా కళ్ళు తుడుౘుకోవటం..." అక్కడున్న అందఱికీ కాస్సేపు"తాము భోజనం చేస్తున్నాం" అన్న విషయం కూడా మరచి పోయి స్తబ్దుగా అయిపోయారు. అటు నుంచీ వీడియో లో మఱో ఘట్టం. తల్లిదండ్రుల వద్ద ఎంతో గారాబంగా, డాబుగా పెరిగిన పిల్లవాడు యువకుడయ్యాక, సైన్యం లో ఇష్టంగా చేరటం, ఆ పై మంౘు కొండల్లో, "ఫ్రాౙెన్ స్టేట్" లో ఉన్న ౘోట విధులు నిర్వర్తింౘటం, సరైన సమయంలో, సరైన విధంగా ఆహారం అందక, "అందినదే అమృతం" అనుకుంటూ పాచి పోయిన ఆహారం అందుకోవటం - ఎంత దయార్ద్ర పరిస్థితి! కానీ అక్కడ ఎవఱూ "అది తమ దురదృష్టం " అనో, "కర్మ" అనో అనుకోవడం లేదు. ఎవఱినీ బాధ్యులను చేయటమో, నిందింౘటమో లేదు. "అది తనకెంతో ఇష్టమైన బాధ్యతగానే చేస్తున్నారు, సరిహద్దులలో ఆ సేవ." ఈ వీడియోకి కొనసాగింపుగా, క్లుప్తంగానే అయినా రైతుల కష్టాలు కూడా ౘూపబడ్డాయి. ఆసరికి అందరూ భోజనాలు పూర్తయ్యాయి కూడా. నిౙానికి అందఱూ అక్కడికి భారతీదేవి గారి విందు అని ఇష్టంగా వచ్చినా, ఇప్పుడు అసలు ఇక్కడ "తాను ఏమి తిన్నారో", అనేది పట్టింౘుకోలేదు సరి కదా, కనీసం "కడుపునిండా నైనా భోజనం చేశామా", అని కూడా గుర్తింౘలేదు. అప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు భారతీదేవి గారు, ఓ చిన్న ప్రసంగం. "మీ అందఱినీ ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి. కానీ, తినేటప్పుడు కూడా సరదాలో, వ్యాఖ్యానాలో దొరలే మన సంభాషణలు ఎప్పుడూ ఉండేవే. భోజనం తర్వాత నేమో, మీలో కొందఱు పనుంది అంటూ వెళ్లిపోవౘ్చును, అందు వలన, నేను చెప్పాలనుకున్న విషయం చెప్ప లేక పోవౘ్చు. అందుకే అందఱినీ ఇక్కడ ఇలా కట్టేసి, కనీసం మీ భోజనాల గుఱించి కూడా మాట్లాడకుండా, ఇలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. అన్యధా భావింౘ వలదని మనవి. ఎవఱి నైనా నొప్పించి ఉంటే క్షమింౘ మనవి", అని ఆగారు. "మీరు ఏం చెప్పినా, చేసిన అర్థం ఉంటుంది భారతి గారూ, కానివ్వండి", ముక్త కంఠంతో పలికారు అందఱూ. అతిశయోక్తి కాదు ఇది, అందఱి లోనూ ఏ మూలనో ఉన్న మానవత్వం కానీ, "ఆవిడ ఏం చెప్తారు", అన్న ఉత్కంఠ కానీ, వాళ్ళ చేత ఇలా పలికించాయి. కొనసాగింపుగా ఆవిడ అన్నారు, "ఇటువంటి వాళ్ళందరికీ మనం సాయం చేయలేమా?", అని. "అది అర్థమైంది, కానీ ఎలా? మనమంతా ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఇన్నాళ్ళూ నేమో, పిల్లల బాధ్యతలు కదా, పైగా, ఇంట్లో పిల్లలు మన వాళ్ళ బాధ్యతలయ్యే", అన్నారు, శ్యామలా బెనర్జీ గారు, ఉద్యోగాలకు వెళ్ళే కోడలు, కూతురు తమ పిల్లల్ని ఆవిడ వద్ద వదిలి వెళ్ళటం తలుౘుకుంటూ. "మీ, మీ బాధ్యతలను నెరవేర్చండి. కాదనను. కానీ, మీ విశ్రాంత, విరామ సమయాలనూ, బాధ్యతాయుత సమయాలనూ దాటాకనే, ఏ మాత్రం ఖాళీ ఉన్నా, కాస్తంత సమయాన్ని సమాజం కోసం వెచ్చించండి" అన్నారు. "అమెరికాలో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని 13 ఏళ్ళు వచ్చాక, వదిలేస్తారట, అవసరమైతే మేము కూడా అలాగే వదిలి వచ్చేస్తాం", నవ్వుతూ ఉంది రామలక్ష్మి ఈసారి మాత్రం చిత్తశుద్ధితోనే సుమా! "అలాగైతే, సింగపూర్లో, వయసు అయిపోతున్నది అనుకునే వాళ్ళు కూడా, తమకు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, తమ కంటే చిన్నవాళ్ళు ఏమి సంబంధం లేని వాళ్ళకి కూడా సహాయం చేస్తారట, సేవలూ చేస్తారట", మఱి ఈ సూత్రాన్ని కూడా అనుసరిస్తే పోలా? "ఏదో ఆదేశానికి ఈ దేశానికి సమతూకమని కాదు, మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలని", బదులిచ్చింది వాగ్దేవి గారు. ౘప్పట్లతో, కళ్ళతో మెౘ్చుకోలు తెలియజేశారు భారతీదేవి గారు. సైనికులకు సంబంధించిన వీడియో ౘూపిస్తూ ఉన్నప్పుడు ఆవిడ కళ్ళు వర్షింౘడాన్ని గమనించారు భారతీదేవి గారు. వాగ్దేవి గారి భర్త పోలీస్ ఆఫీసర్ మఱి, శత్రుమూక దాడిలో తన తన తోటి సిబ్బందిని కాపాడుతూ, విరోచితంగా పోరాడి నేల కొరిగారు. ఆ విషయాన్ని ఇక్కడ భారతీ దేవి గారు ప్రస్తావిస్తూ, వాగ్దేవి గారిని అభినందించే సరికి, రామలక్ష్మి గారు కూడా ఉద్వేగంతో వెళ్ళి, వాగ్దేవి గారిని అనునయంగా భుౙాల మీరు చేయి వేసి సంభాళించారు. "కలుస్తూ ఉంటే, వైరాలూ, వైరాగ్యాలూ పోయి, అపార్ధాలు తొలగిపోయి, మమతలు పెరిగీ, మంచితనమే చివరికి అంకురిస్తుంది, అది వటవృక్షమై చిగురుస్తుందీ" అన్నారు భారతీ దేవి గారు. "మన ఇంట్లో ఉండేవి మాత్రమే కష్టాలు అనుకుంటూ ఇంతకాలం బ్రతికేస్తూ వచ్చాము. కానీ ప్రపంచం విశాలమైనది. మన మనసులే చిన్నవి కాకూడదు. ఇలా ఎంతోమంది కష్టాలలో ఉన్న వాళ్ళు, అవసరాలు ఉన్న వాళ్ళూ ఉన్నారు. సహాయమే కాదు, సానుభూతి కూడా. ఏంటి కష్టాలు మనకి? ఓ గొప్ప రచయిత వ్రాసినట్లు, 'వార్తల్లో ముఖ్యాంశాలు మనకు వచ్చే చిలిపి కష్టాలు', ఎంతో స్ఫూర్తి ఉన్న యువత, నూతన ఆవిష్కరణలు చేస్తూ, దాని ప్రజలకు చేరువ చేయడానికి చేతకాక, కావలసిన ఆర్థిక ఇతర వనరులూ లేక, ఇబ్బందులు పడుతున్నారు. మన పిల్లలు ఇక్కడ ఇళ్ళలో ౘక్కగా టక్ చేసుకుని డ్యూటీకి వెళుతూ, ఇంట్లో మనం వండి పెట్టినది తింటూ, సంతోషంగా కుటుంబాలతో తిరుగుతూ ఉన్నారు. మన వాళ్ళకు వచ్చే కష్టాలు ఏమిటి? వియ్యాల వాఱు భోజనానికి పిలవలేదనో, ధనం కోసం కట్నం తీసుకోలేదు కాబట్టి అది ఆర్థికపరంగా నష్టమనో, కోడలు పని చేయలేదనో, అల్లుడు మర్యాద ఇవ్వడనో!" కానీ ప్రపంచంలో ఇంతకు మించిన కష్టాలూ, మనం నెరవేర్చవలసిన బాధ్యతలూ ఎన్నో ఉండగా, ఇలాంటి వాటికే ఎంత సేపూ ముక్కులు చీదుకుంటూ ఉంటే ఎట్లా? పోనీ, 'విలక్షణత' కోసమైనా, కాస్త క్రొత్త కష్టాల వైపు ౘూపు సారిస్తూ, 'మానవత్వాన్ని' 'ౘాటుకోవటానికైనా' కాస్తంత సమాజానికి మేలు చేకూర్చే వారి కోసం ఆవేదన పడితే కొంచెం సలక్షణంగా ఉంటుంది కదా!, ఏమంటారు, కనీసం వారానికో గంటైనా ప్రతీ కుటుంబమూ ప్రపంచ శాంతి కోసం, దేశ ప్రగతి కోసం, భావి తరాల క్షేమం కోసం ఏమి చేయాలో ఆలోచిస్తూ, ఆ పై చేతనైనంత వఱకూ ఆచరిస్తూ ముందడుగు వేయలేమా? ", అంటూ ముగించి, కూర్చున్నారు భారతీ దేవి గారు. "ఇంకా ఏమంటామమ్మా, ఎన్నో 'ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్' కళ్ళ ముందు పెట్టుకుని, 'మేం పడుతున్నవే కష్టాలూ' అనే భ్రమ లో 'కూపస్థ మండూకాల'లా బ్రతికేస్తున్న మమ్మల్ని బాహ్య ప్రపంచానికి నడిపించి, భావి తరాలను నిర్మిస్తున్న మీరు అందించిన ఈ 'చైతన్యాన్ని' ౙార విడుౘుకోమమ్మా", అంటూ ఓ ప్రవాహంలా మాట్లాడేసింది విద్య. ################################### "అదర్రా సంగతీ! భారతీ దేవి గారి పుణ్యమా అని, మా ఇద్దఱి ఆలోచనా విధానాలలో మార్పు వచ్చింది, అదే ఇప్పుడు ఆచరించి ౘూపిస్తున్నాము కూడా!" అన్నది వింధ్యాదేవి. అప్పటి దాకా ఇటు సరళగారూ, అటు విధిజ్ఞా కూడా, ఈ మార్పుకు ఆశ్చర్య పోతూనే, ఆ మార్పు "నిలకడ" ఎంత సేపు లే, అనుకుంటూ ఉన్న వాఱి నైరాశ్యాన్ని త్రుంచి వేసి, అప్పటి దాకా ౘూసిన ఆ వీడియో లోని కష్టాల లాగానే కనీసం వాఱి కనుల ముందున్న ఇతరుల కష్టాలు తీర్చాలనుకున్నారు. అప్పటి దాకా మౌనంగా ఉన్న విధిజ్ఞ తల్లి జ్ఞాన ప్రసూన గారు, భారతీ దేవి గారిని అభినందిస్తూనే, మఱొక్క మాట ౙత కలిపారు. "అనారోగ్యాల వలననో, భయంకరమైన ౙబ్బువ వలననో, ప్రకృతి ఉపద్రవాల వలననో, ప్రమాదాల వలననో, ఎటూ మనుష్యులు చెప్పనలవి కాని బాధలననుభవిస్తున్నారు. అవి నివారింౘలేనివి, తప్పక అనుభవింౘ వలసినవి. ఇవి ౘాలవన్నట్లు, మళ్ళీ మనమంతా ఒకఱికొకఱం కొరక రాని కొయ్యలుగా తయారవుతూ, ఈ కుళ్ళూ, కుట్రా, మోసం, ద్వేషం, స్వార్థం, వ్యసనాలూ వంటి దుర్గుణాలనెందుకు పట్టుకోవాలి? వేఱే ఏ ఇతర అశుద్ధాలనీ తాకటానికి కాదు కదా, కనీసం ౘూడటానికైనా ఇష్టపడని మనం, ఎందుకు ఆలోచనలలో మాత్రం ఇటువంటివి అందుకోవాలీ? మనిషికి ఎన్ని బట్టలు ఉన్నా, ఒక్క సారికి ఒక్క ౙతనే తొడగగలదు. కడుపుకు పట్టినంతనే తినగలడు, గొడుగెంత ఖరీదైనదైనా ౙడివానను ఎంతసేపని ఆపగలదు? అప్పుడు ఎంత సంపద ఉండీ ఏమి లాభము?" అంటూ "తానావేశ పడ్డానేమోననుకుంటూ, మౌనంగా మారి పోయింది వెంటనే. "ఎప్పుడూ మౌనంగా ఉండే మీరు ఎంత బాగా మాట్లాడారు వదిన గారూ? 'వియ్యపురాలి హోదా' అంటూ నేను మిమ్మల్ని తక్కువ చేసినప్పుడల్లా మీ ముందు ఎంత కుంచించుకు పోయానో నాకిప్పడు తలౘుకుంటుంటే..." అంటూ ఉండగా, "అయ్యో వదిన గారూ, మనలో మనకు ఈ పశ్చాత్తాపాలెందుకు, అలా ఉంటే మళ్ళీ మనం ఈ 'కూపం'లోనే పడిపోతున్నట్టు! ఆ చట్రం లో నుంచీ ఇక బయటకు రండి", అంటూ ఆపేక్ష కురిపించారు. మఱి మనం కూడా ఈ మార్పు మొదలు పెడదామా?