వారధులు - Bhagya lakshmi Appikonda

Vaaradhulu

"ఏం చెల్లెలా!?మా మరిదిని ముగ్గులో పడేసినంత ఈజీ అనుకుంటున్నావా ముంగిలిలో ముగ్గు వేయ్యడమంటే!!" ముందరి గుమ్మానికి మావిడి తోరణాలు కడుతూ తోడికోడలిని మేళమాడింది మంజరి. "బావగారిని కొంగున కట్టేసుకున్నట్టనుకున్నావా!? తోరణాలు కట్టడం అంటే!?…చూసుకో అక్కా!!బల్ల ఊగుతోంది" జాగ్రత్త చెప్పి., ముగ్గుకు రంగులు అద్దుతుంది సంజన. "అవునవును మీరే చెప్పాలి ముగ్గుల గురించి తోరణాల గురించి. అలవాటు లేని పనులు మీకెందుకే!? ఇటివ్వండి నేను చూసుకుంటాను!!" వెంకటగిరి జరి అంచు చీర కొంగు దోపి ముంగాలి మీద కూర్చుని రంగులు వేయడానికి సిద్దపడింది సీతామహాలక్ష్మీ . "పెళ్ళికూతురు ఇలాంటి పనులన్ని చేయకూడదు. మేం చూసుకుంటాంలే మీరు వెళ్ళండత్తమ్మా!!" ఒకేమాటగా అన్నారు తోడికోడళ్ళు. "పెద్దమ్మా!! ఇదిగో పూలమాల " మంజరి చేతికందించింది ఏడేళ్ళ హాసిని. "అమ్మా!! అని పిలువమన్నానా!?" మందలింపుగా అంది సంజన హాసినిని. ఆ మాట అనేటప్పటికే తువ్వాయిలా గెంతుకుంటూ ఆరుబయట ఆటలోపడిపోయింది హాసిని. "నువ్వు అమ్మవైతే నేను నీకన్నా పెద్ద అమ్మని అలాగే పిలవని., దాన్నేమనకు సంజు" అని., బల్ల దిగింది మంజరి "ఏమి చెప్పిన అదెక్కడ వింటుదక్కా దానాటదానిదే!!" రంగులద్దుతూనే మంజరివైపు చూసి అంది. "చిన్నపిల్ల ఆటలాడకపోతే మీతో వాదులాడుతుందేవిటే!?" నవ్వుతూ అంది సీతామహాలక్ష్మి . "అది వాదులాడటం తరువాత సంగతి దాన్నేమన్నా ముందు మీరు కర్రపట్టుకు వచ్చేస్తారు" కొంచెం భయం నటిస్తూ కొంటెగా అంది సంజన. "నిజంగానే కొట్టేస్తాను దాన్నేమైనా అంటే!!" సంజన భుజాలను ఆసరా చేసుకొని నెమ్మదిగా పైకి లేచి నుంచుంది సీతామహాలక్ష్మి. "అమ్మా!....నీకో మాట చెప్పాలి" అన్నాడు పెద్దకొడకు మోహన్ తటపటాయిస్తూ "ఏంటి విషయం!?" సంజన మంజరి వైపు చూసి కళ్ళతోనే అడిగింది. మంజరి మొహం ముభావంగా మారిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సీతామహలక్ష్మి "ఏంట్రా విషయం!" చేతికంటిన రంగులను తుడుచుకుంటూ అడిగింది. "అమ్మా!! మీ షష్ఠిపూర్తి రోజునమేము ఒకపాపని దత్తత తీసుకుంటాము" అని నిశ్చయంగా చెప్పాడు. ఆ మాట వినబడిన వెంటనే సీతామహాలక్ష్మి " ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పనులొద్దని. మీకు ఏమంతవయసైపోతుందని…ఇలాంటి ఆలోచనలు. అక్కడా ఇక్కడా తిరగడానికి మీరు ఇబ్బంది పడుతున్నారా!? ఏం పర్లేదురా పండంటి బిడ్డ పుడితే ఇవేమి గుర్తుకు రావు. పెళ్ళైన పదిహేను సంవత్సరాలకి నాలుగు కాన్పులు పోయిన తర్వాత మీరిద్దరు పుట్టారు. మీకింకా పెళ్ళై పుష్కరం కూడా నిండలేదు. ఎందుకురా నీకంత కంగారు. వారసులని ఇవ్వడానికి మీ ఆవిడ ఆ మాత్రం కష్టపడలేదా!?" అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా మంజరి వైపు చూసింది. మంజరి తలదించుకుంది…నేరుగా ఆమె కన్నీరు గుండెల మీద నుంచి జారి నేల మీద పడుతుంది. "ఏవిటే !? ఇలా ఇవ్వు ఆ బొమ్మలు నావని చెప్పానా!? " అని హసిని చేతుల్లోంచి బొమ్మలు తీసుకుంది సీతామహాలక్ష్మి. అటునుంచి వస్తున్న వెంకటరత్నం నాయుడు "అవునమ్మా!! ఇవ్వివ్వు మీ నాన్నమ్మ ఆడుకుంటుందీ ఆ బొమ్మలతో" చిన్నగా నవ్వాడు. కొడుకు పక్కగా వచ్చి "మంజరిని లోపలికి తీసుకెళ్ళు" అని నెమ్మదిగా చెవిలో చేప్పాడు. గుర్రుగా చూసింది సీతామహాలక్ష్మి నాయుడు వంక "ఎందుకే అంత ఆవేశం సీతా!!అందం చెడిపోతుంది. వెళ్ళి నీ చేత్తో కమ్మటి కాఫి తీసుకురా!" వాలు కుర్చీ మీద కూర్చుని పురమాయించాడు. "అవును పెద్దదానిగా ఒక మంచి మాట చెప్పబోతుంటే నేనేదో అత్తగారిలా పెత్తనం సాధిస్తున్నట్టు…మీరు అడ్డుకొని మహానుభావుడిలా ఫోజు కొట్టారుగా. వెళ్ళి మీరే పెట్టుకొండి కాఫి. లేదంటే ఇద్దరు ముద్దుల కోడళ్ళున్నారుగా వాళ్ళ చేత పెట్టించుకొండి" తిరస్కార ధోరణిలో చేతిలో బొమ్మలు పట్టుకోని వంటగదివైపు వెళ్ళింది. కూర్చి మీద కూర్చునే మెడ కాస్త వెనక్కి తిప్పి "హమ్మయ్యా!!" అని నిర్థారణాపూర్వకమైన ఒక నిండైన నవ్వు నవ్వాడు నాయుడు. పెట్టనంటుంది కాని కాఫి పెట్టే తీసుకొస్తుంది అన్న తన నమ్మకాన్ని వమ్ము చేయలేదన్న ఆనందం నిండి వుంది ఆ నవ్వులో. శుక్లపక్ష త్రయోదశి చంద్రుడు పసుపు పూసిన గడపలకి జాజులు అద్దుతున్నట్టు ఉంది వాకిట్లో వెన్నెల. రాగి చెంబులో నీళ్ళు పట్టుకొని పడకగదిలోకి వచ్చి నాయుడు పక్కన కూర్చుంది సీతామహాలక్ష్మి. ఆమె మొహం వాలిపోయింది. కన్నీరు కార్చి కార్చి కళ్ళు వాచి పోయినట్టున్నాయి. అది గమనించిన నాయుడు ఆమె తలపైకెత్తి "ఏవైందే అంతలా బాధపడుతున్నావ్!? నీ ఇష్టం అయితేనే కదా! పిల్లలు దత్తత తీసుకుంటాం అంటున్నారు. నువ్వంతలా మనసు కష్టపెట్టుకుంటే ఎలా? అయినా పిల్లలు ఇప్పటి తరం వాళ్ళలా సహజీవనం అంటున్నారా!? చిన్న తేడా వస్తే విడాకులంటున్నారా!? చక్కగా కలిసుంటూ ఒకరికి జీవితాన్నిచ్చి వీళ్ళు ముగ్గురయి ముచ్చటైన కుటుంబం అనిపించుకుంటున్నారు అంతే కదా!! ఈ మాత్రానికే అంతలా కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా సీతా!!" అని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు. ఆమె కన్నీళ్ళే ఆగకుండా కారిపోతూ సమాధానపరిచాయి నాయుడిని. మాట మారిస్తే మంచిదనిపించి నాయుడు "వీటిని మనవరాలి దగ్గర లాక్కొని మరి దాచెయలా!? " అని మంచం పక్కబల్ల మీద వాటిని చేతుల్లోకి తీసుకొని గుండెల్లోని జ్ఞాపకాలని సుతారంగ తడుతున్న ఆ బొమ్మలని సున్నితంగా తడిమాడు. "ఇవి ఎవరు తీసుకొచ్చారో గుర్తుందా!?" చిలిపిగా కన్ను గీటుతూ అడిగాడు నాయుడు. "అవే కాదు ఇంట్లో ఉన్న అన్నిటిని ఎవరు తీసుకొచ్చారో నాకు తెలుసు" ఉద్వేగంతో కూడిన సమాధానం. "బొమ్మలని, పిల్లలని ఒకేలా చూస్తానంటే ఎలా? చూడు ఇవి కూర్చొమన్న దగ్గర కూర్చున్నాయి. మన పిల్లలు ఎదిగారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నువ్వొప్పుకో సీతా" లాలనగా అన్నాడు. "బేగం.. వ…చ్చింది" నిలువెల్లా కన్నీరైపోతు అంది. ఆమె కన్నీటికి కారణం తెలిసిన నాయుడికి ఆమెను ఎలా సమాధాన పరచాలో అర్థం కాక మౌనంగా మళ్ళీ ఆ బొమ్మలని తడిమాడు. "ఈ బొమ్మలని తెచ్చినట్టు మన పిల్లలని తెచ్చి నా ఒళ్ళో పెట్టేయడమేనా!!. నాకో మాట!?" దు:ఖంతో మాట పెగలలేదు సీతామహాలక్ష్మి. "నీకు గుర్తుందా!? ఈ పెళ్ళి బొమ్మలు నువ్వు నన్ను తెమ్మన్నప్పుడు నీ వయసు పదమూడు నా వయసు ఇరవై నాలుగు. నువ్వెంత పేచి పెట్టావంటే ఆ బొమ్మలు తేకపోతే నన్ను పెళ్ళిచేసుకోనన్నావు.అప్పటికప్పుడు ఏటికొప్పాక నుండి తెచ్చాను" సీతామహలక్ష్మి తల నిమిరాడు. ఆమె గుండెలో ఉప్పొంగుతున్న లావాపై ఆ మునివేళ్ళ స్పర్శ మంచు చిలకరిస్తుంది. ఇక నాయుడిని ఏమి అడగకుండా మౌనంగా ఉండిపోయింది. " పిల్లల కోసం నువ్వు గుళ్ళు, గోపురాలు తిరిగి ఏవేవో మందులు వాడి నాలుగు సార్లు పురిట్లోనే పిల్లలు చనిపోయినా ఇంకా పిల్లలంటూ పసిపిల్లలా ఏడుస్తూ ఉంటే నాకు ఆ బొమ్మల కోసం పేచి పెట్టిన సీతలాగే కనిపించావు. ఎందుకో తెలుసా సీతా!? పిల్లలయినా సరే కొంత వయసు వరకే ఆ తరవాత ఎవరి జీవితాలు వారివి ఆ మాట నీకు చెప్పినా వినిపించుకోలేదు." నెమ్మదిగా ఆమె చీర కొంగు కాస్త పైకి లాగి ఆమె కళ్ళను తుడిచి "ఇదిగో ఇప్పటికి అదే పేచి" అరనవ్వు నవ్వాడు నాయుడు. "అందుకని ఇలా చేస్తారా!?" మాటలకందని దు:ఖం ధ్వనించింది ఆ ప్రశ్నలో. "ఏం చేసాను సీతా!? నేను అసలేమి చేయలేదు. అసలు చేసిందంతా నువ్వు. కండల్లా తెచ్చి నీ పక్కన పెట్టిన పిల్లలని కంటికి రెప్పలా కాచి కొండంత చేసావు. ఎంతో సంస్కారవంతంగా పెంచావు. వాళ్ళు నీ పిల్లలు కారని ఎవరంటారు చెప్పు" ఆమె చేతిని అతని చేతుల్లోకి తీసుకున్నాడు. "మరి నాకెందుకు ఈ విషయం చెప్పలేదు" నిస్సహాయంగా అడిగింది. "అప్పట్లో నువ్వు నాకు వారసుడునివ్వడమే నీ బాధ్యత అన్నట్టు ఆలోచించేదానివి. పుట్టిన బిడ్డలు పురిట్లోనే చనిపోతే అదేదో నువ్వు చేసిన తప్పు, నేరం అని నీకు నువ్వే అనుకుని, ఆలోచించుకుని కుమిలి కుమిలి ఏడ్చేదానివి. నాలుగోసారి పురిట్లోనే మన బిడ్డ చనిపోయింది. అప్పుడు బేగం తన కవలబిడ్డలని సాకలేనని ఒకవేళ ఏదోలా కష్టపడి పెంచినా సరే, తాగుబోతైన అనుమానపు మొగుడు ఎప్పుడు చంపెస్తాడో తెలియదు అని ఏడ్చి బిడ్డలని తీసుకొని తనకి దుబాయ్ కి వెళ్ళే ఏర్పాట్లు చేస్తే చాలని వేడుకుందీ. నేను ఎవరికి చెప్పకూడదని ఒట్టు వేయించుకుని ఆ ఏర్పాట్లు చేశాను" అని నిట్టూర్చాడు. "ప్రతి రెండు మూడెళ్ళకి వచ్చి చూసి వెళ్తుంటే చుట్టపు చూపుగా అనుకున్నాను కానీ పేగు పాశం అనుకోలేదు. ఎంతైనా కన్నప్రేమ కదా!! ఆగలేక నాకు చెప్పేసింది నా బిడ్డలు తన పిల్లలని" అని వెక్కి వెక్కి ఏడిచింది. "లేదు!! నేనే చెప్పమన్నాను" మంద్ర స్వరంతో అన్నాడు నాయుడు. "మీరా!? ఎందుని?" ఆశ్చర్యంగా అడిగింది. "నీకు ఎప్పటికి ఉండేది ఈ పిల్లాడే కనుక" సీతా మహలక్ష్మి ఒళ్ళో పడుకుని అన్నాడు నాయుడు. అర్థం కానట్టుగా నాయుడు వైపు చూసింది. "సీతా!! అప్పుడు నీకు ఈ విషయం చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నీ మమకారంతో నీకే తెలియకుండా నువ్వే వారిని కట్టడిలో పెడదామనుకుంటున్నావు" అన్నాడు. "నేనా!?., కట్టడా!?" గొంతులో ఎదో అడ్డు పడినట్టు అడిగింది. "కట్టడి అంటే కట్టడని కాదు గాని పెద్దాడు దత్తత తీసుకుంటానని బతిమిలాడుతున్నాడు నువ్వు ఒప్పుకొవట్లేదు. మనకేం తెలుసు సీతా వాళ్ళు ఎంత మదనపడి ఆ నిర్ణయానికొచ్చారో!? నాకు నీ సంతోషం, నీ ఆరోగ్యం మన ఆనందం ముఖ్యం అందుకే అప్పట్లో నువ్వెమైపోతావో అన్న భయంతో మన పిల్లలని తీసుకొచ్చాను. నిజం చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకని అనిపించింది అందుకే నీకు చెప్పలేదు. కానీ ఈతరం మునిపటిలా కాదు వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని మంచి పరిష్కారం ఎంచుకొని బాధ్యతని పంచుకుంటున్నారు. అన్నిటికన్నా నాకు సంతోషకరమైన విషయమేంటంటే మా నిర్ణయం మాది అని కాకుండా నీ అనుమతి అడుగుతున్నారు చూడు! అది మా సీత పెంపకం అంటే!!" అని చెప్పి ఒళ్ళో నుంచి లేచాడు నాయుడు. "అయినా నేనేం తప్పుగా చెప్పానండి!? వారసుడు పుడితే వాళ్ళకే మంచిది కదా!" నాయుడి వైపు తిరిగి కూర్చుని అంది. "పిచ్చి సీతా!! ఈ ప్రపంచంలో తరానికి తరానికి మధ్య ఉండేది వారధులే తప్ప వారసులు కాదు. ఈ భూమ్మీద అంత ధృడమైన వారధులు నీ లాంటి తల్లులు మాత్రమే నిర్మించగలరు. అయినా లేని మనవళ్ళ కోసం ఉన్న పిల్ల అదే మన కోడలి ఆరోగ్యం పాడుచేసుకుంటామా చెప్పు!?"ఆమె గడ్డం పట్టుకుని అడిగాడు. "ఇంకా నన్ను అనుమతి అడిగవలసిన అవసరం ఉందంటారా!?" ధైన్యం నిండి ఉంది ఆమె మొహంలో, ఆ ప్రశ్నలో. "ఛ,ఛ…అంత ఢీలా పడిపోతావేంటి సీతా!! రేపటి పొద్దున ఎప్పుడైనా నేను లేనప్పుడు నీకీవిషయం తెలిస్తే నీ పరిస్థితి నేను ఊహించలేను అందుకే నీకీ విషయం చెప్పమని చెప్పాను బేగంకి అంతేగాని వాళ్ళు అచ్చంగా నీ పిల్లలు. నువ్వు కాక ఎవరున్నారు అనుమతినిచ్చేవాళ్ళు" అని సీతామహాలక్ష్మీ కళ్ళు తుడిచాడు. "పెద్దాడా!! ముందు దత్తత కార్యక్రమం చేద్దాం. షష్టిపూర్తికి తాత మీసం తిప్పడానికి కి మనవరాలు ఉండాలి కదా!" అని చెప్పి కాల్ కట్ వెనక్కి చూసింది సీతామహాలక్ష్మీ. మంచంపైకి నడుం వాల్చి " మరో వారధి నిర్మాణం మొదలవుతుందా!?" హుందాగా నవ్వుతూ అడిగాడు నాయుడు. "అవును" తన కళ్ళలోని మెరుపులతో సమాధానం చెప్పింది సీతామహాలక్ష్మీ.

మరిన్ని కథలు

Vaarthallo headloinega
వార్తల్లో హెడ్లైన్సా
- ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
Goppa manasu
గొప్ప మనసు
- సరికొండ శ్రీనివాసరాజు
O magaadi katha
ఓ మగాడి కథ
- జి.ఆర్.భాస్కర బాబు
Kotta oravadi
Kotta oravadi
- Prabhavathi pusapati
Kallu nettikekkayi
కళ్ళు నెత్తి కెక్కాయి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Devuniki Kanukalu
దేవునికి కానుకలు
- సరికొండ శ్రీనివాసరాజు
Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ