నేను మామూలు సగటి వ్యక్తి ని . నేను పెద్ద ధైర్య వంతుడిని కాను . నాయకుడి లక్షణాలు , ఇసుమంతయినా నాలో లేవు. వుండాలనికాని ,తెచ్చుకోవాలని కానీ ,ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ఒక సంఘటన పరిస్తితి అంతా మార్చేసింది. నాలాంటి వాళ్ళని, నాతో సహా అందరిని నాయకులని, ధైర్య వంతులని చేసేసింది. మా వూరినీ, మా వూరి ప్రజలని, పూర్తిగా మార్చేసింది. దానికి సంబంధించిన, కధనం మామూలుగా అయితే చెప్పాలనుకున్నా , చెప్పేవాడిని కాను . కానీ ,చెప్పానుగా . ఇప్పుడు మారిపోయను అని. అందుకె ధైర్యం గా , ఆ కధనం చెప్పాలనే , ఈ ప్రయత్నం .
***
ప్రతీ రోజు లానే మొదలయింది ఆ రోజు. రోజూ లానే ,ఉదయాన్నే ,కాఫీ తాగి వాకింగ్ కి , బయలుదేరాను . ప్రతీ రోజూ ఉదయం వాకింగ్ చేసి , తిరిగి ఇంటికి వెళ్ళేడప్పుడు ,కూరగాయలు తీసుకు వెళ్ళడం, నాకు అలవాటు.
ఆ రోజూ అలానే మార్కెట్ కి వెళ్ళాను. యాంత్రికంగా , ఆ పని ముగించుకుని ఇంటి దారి పడ్తున్న నాకు , రమణ కనపడ్డాడు
" హలో మూర్తీ ! " అంటూ.
" హలో ! " అంటూన్న నాలో ఎప్పుడూ లేనిది ఏదో తెలియని ప్రకంపన . " నీ శత్రువు ! " అంటూ లోపలనుంచి ఎవరిదో గొంతు .
నవ్వుతూ పలకరించిన రమణ కూడా , ఒక్కసారి గంభీరంగా అయ్యాడు. కొంచెం అసౌకర్యం గా ఫీలవు తున్నట్లు , ఇబ్బంది గా మొహం పెట్టి , వచ్చీ రాని నవ్వు నవ్వుతున్నాడు
నా పరిస్తితీ అలానే వుంది.
ఇద్దరమూ, ఒకరిని ఒకరం ,తప్పించుకుంటూ, బయట పడ్డాం.
ఇంటి దారి పట్టిన , నాకు దారిలో, తెలిసి వున్న వాళ్ళు , ఎవరు పలక రించినా , లోపలనుంచి అదే మాట , వినపడుతోంది.
దానితో నాకు , ఆందోళన, కంగారు మొదలు అయ్యాయి.
లోపల నుంచి ఇలా మాటలు వినపడడం మానసిక వ్యాధి లక్షణాలంటారు . నాకు. అటువంటిది ఎదయినా వచ్చిందా ఆలోచన వచ్చిందోలేదో , నాలో ఆందోళన ఇంకా ఎక్కువ అయింది.
ఇంటికి వెళ్ళి , తలుపు తట్టాను . తలుపు తీసింది ,నా భార్య వనజ. వెంటనే మళ్ళీ అదే , గొంతు . " నీ శత్రువు " అంటూ.
లోపలకి వెళ్ళి , కూరగాయల సంచి పక్కన పడేసి, సోఫాలో కూల పడి , కళ్ళు మూసుకున్నాను.
" వనజా ! నాకు కాస్త కాఫీ ఇస్తావా! ", అంటూ .
వనజ కాస్సేపటికి , కాఫీ తెచ్చి నాకు అందించింది , తనూ ఒక కప్ లో కాఫీ. తెచ్చుకుని,నా పక్క కూర్చుంది.
నేను తల ఎత్తకుండా , కాఫీ తాగడం మొదలు పెట్టాను. చెప్పాలా వద్దా, అను కుంటూనే , మొదలు పెట్టాను.
" వనజా ! నాకు లొపల నుంచి , ఏదో గొంతు వినపడు తోంది. ఎవరిని చూసినా " నీ శత్రువు ", అంటూ చెప్తోంది."
అని ఇబ్బంది గా వనజ కేసి చూసాను.
" ఏమిటంటావు ? " అంటూ అన్నానో లేదో , వనజ అంది ." నాకూ అలాగే వినపడుతోంది " అని.
నేను, నోరు వెళ్ళబెట్టాను అశ్చ ర్యం తో .
ఇద్దరమూ, కాస్సేపు ఒకళ్ళని ఒకళ్ళం, చూసుకుంటూ , వుండి పోయాము. ఏమి మాట్లాడాలో , తెలియలేదు నాకు.
వనజ పరిస్తితి కూడా , అలానే వుందని నాకు అర్ధం అయింది.
" ఒకళ్ళకంటే, అర్ధం చేసుకోవచ్చు . ఇద్దరికీ , అలా అనిపించడం ఏమిటి ? "
" ఇది ఎమయినా మానసిక రుగ్మతా ? "
నా మాటలు పూర్తి కాకుండానే , " ఇద్దరికీనా ?" , అంది వనజ , ఆశ్చర్యం గా నూ , ఆందోళన గానూ .
కాస్సేపు వుండి అన్నాను. " రెడు రోజులు చూద్దాము . అప్పటికీ , ఇలానే వుంటే, సైకాలజిస్ట్ దగ్గరకి వెళ్దాం "
" ఊ ! " అంది వనజ .
ఇంక ఇద్దరమూ, రోటీన్ లో పడిపోయాము.
ఆఫీసు కి, వెళ్ళానే కాని, ఎవరిని చూసినా , లొపల నుంచి 'నీ శత్రువు ', అనే మాటలు వినిపిస్తూంటే , నన్ను నేను సంభాళించు
కోవడం కష్టం అవసాగింది.
ఆఫీసు క్లోజింగ్ టైం కోసం, ఎదురు చూడ సాగాను నేను. ఎప్పుడు టైం అవుతుందా అని చూస్తున్న నాకు , వున్నట్లుండి అనిపించింది , అందరూ, రోజూ లాగ లేరని .
రోజూ లాగ , ఒకరిని ఒకరు పలకరించు కోవడం లేదు. ఎవరి మొహం లోను నవ్వు లేదు. అందరి లో నూ, దాచినా దాగని , ఆందోళణ కనిపిస్తోంది .
ఎప్పుడూ లేని విధం గా , ఆఫీసు అంతా, ఒక విధమయిన గంభీర వాతా వరణం , నెల కొన్నట్లు అనిపించింది.
ఆఫీసు అయ్యక , ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాను.
****
ఇద్దరమూ, నీకు ఎలా వుందంటే, నీకు ఎలా వుందని, ప్రశ్నించుకున్నాం . " రోజంతా ఆ గొంతు వినిపిస్తూనే వుంది ." అంది వనజ .
నాకూ అలానే వుందంటూ , నేను చెప్పబోతూంటె అంది , " నా ఫ్రెండ్ సుజాత . ఆమెకీ కూడా , అలానే వినిపిస్తోందని, చెప్పింది. "
ఇద్దరమూ కాస్సేపు భయపడ్డాము.
" ఎందుకో ఆఫీసు లో కూడా, ఏదో తేడా అనిపించింది ." అన్నాను , నేను .
" కొంప తీసి , మనకి అనిపించినట్లే , అందరికీ అనిపించటం లేదుగదా . నువ్వంటే, నాకూ అనిపిస్తోంది , మా ఆఫీసు లో కూడా, అలానే వుంది ." ఆందోళనగా అంది వనజ .
" నీ ఫ్రెండ్ కి కూడా అనిపిస్తొంది అంటే , అది పాజిబెల్ . " అన్నాను.
ఇద్దరమూ అయోమయం గా, ఒకళ్ళని ఒకళ్ళు ,చూసుకుంటూ వుండిపోయాం. ఏమి మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు , మా ఇద్దరికీ .
కొంచెం ఆందోళన, కొంచెం అర్ధం చెసుకోలేని అశక్తత , కొంచెం భయం..... ఇలాగ, చాలా రకాల, ఆలోచనల పరంపర తో ఇద్దరమూ, నిద్రలోకి. జారాము .
****
మర్నాడు , నేను యధాలాపంగా, నా దైనిందిక కార్యక్రమం, మొదలు పెట్టాను . వాకింగ్ చెస్తూ , దూరంగా రమణ ని చూసి పరుగు లాంటి నడక తో , అతనిని చేరుకున్నాను.
" రమణా ! .." అంటూ అతని చేయి అందించుకుని , బలంగా పట్టుకున్నాను.
అనుకోని పరిణామానికి , ఆగి కంగారు పడుతూ, అతని చెయి విడిపించు కోడానికి ప్రయత్నిస్తూ , నాకేసి కాస్త అసహనంగా చూసాడు.
అతని చేయి విడవకుండా, " కోపం తెచ్చుకోకు. నీతో మాటాడాలి. విషయం సీరియస్. నాకు లొపలనుంచి మాటలు
వినిపిస్తున్నాయి . ఎవరిని చూసినా " శత్రువు " అని చెప్తున్నాయి. నన్ను తప్పించుకొని , తిరుగుతున్నావంటే, నీకు కూడా అలా వినిపిస్తున్నాయనే అనుకుంటున్నా. " గబ గబా అన్నాను,
రమణ మొహం లో, అసహనం మాయ మయింది. అతని కళ్ళ ల్లోకి చూస్తున్న నా కళ్ళ ల్లోకి , ఆశ్చర్యం గా చూస్తున్నాడు.
" నీకు అలాగే వినిపిస్తున్నాయి కదా ? " తీవ్రం గా , అతనినే చూస్తున్న, నాకళ్ళని తప్పించుకుంటూ " అవును .. " అన్నాడు.
అతని చేయి, ఏమాత్రం వదలకుండా మళ్ళీ అన్నాను. ,
" నాకు, నీకే, కాదు . నా భార్య వనజ కి , ఆమె ఫ్రెండ్ సుజాత కి , కూడా అలానే వినిపిస్తున్నాయి. నా ఊహ సరి అయినదే అవుతే , చాలమందికి , ఇలా జరుగు తోందని చెప్పొచ్చు.
నీకు భయం గా వుందని నాకు తెలుసు. మొదటిలో నాకూ భయం వేసింది. తర్వాత నాభార్య కి , ఆమె ఫ్రెండ్ కి , అలానే అయింది, అని తెలిసాక, ఇది భయపడాల్సిన విషయముంకాదు, ఆలోచించాల్సింది, అని అనిపించింది. అందుకే నిన్ను ఆపాను."
అతని చేయి మీద , నా పట్టు సడలించాను. ఈ సారి అతను చేయి విడిపించుకునే ప్రయత్నం చేయలేదు.
అతను నా కేసి ఆశక్తిగా చూస్తున్నాడు
". కాస్సేపు మాట్లాడుకుందామా. " అంటూ అతనిని , కాస్త దూరం లో వున్న బల్ల మిద , కూర్చో బెట్టి , నేను కూర్చున్నాను,
" ఇప్పుడు, నువ్వు చెప్పు " అన్నాను
" నువ్వు చెప్పింది నిజమే. ఎవరిని చూసినా , ‘నీ శత్రువు ‘ అంటూ లొపలనుంచి, ఒక గొంతు, వినిపిస్తోంది. లోపలనుంచి అలా వినపడడం తో , నాకు భయం వేసి, అందరిని తప్పించుకొని, తిరుగుతున్నాను. ఏమి చేయాలో కూడా తెలియ లేదు. ఇప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది , నువ్వు చెప్పింది విన్నాక . " అన్నాడు రమణ
" మనకేకాదు, ఇంకా చాలామందికి , ఇలా జరిగి వుండొచ్చు. అది తెలియాలంటే, మనం ఎంత మంది తో , వీలవుతే అంత మంది తో, మాటాడాలి. ."
రమణ కాస్త తేరు కుని అన్నాడు. " నువ్వు సరి గా నే చెప్పావు. "
" మనలాంటి వాళ్ళు అందరూ చేరితే , ఎందుకు ఇలా జరుగు తోంది ? ఏమి చేయాలి ? అని ఆలోచించచ్చు. " అన్నాను నేను .
" ఊ ! .."
" నేను కొంత మందిని , నువ్వు కొంత మందిని , చేరేసి సాయంత్రం మళ్ళీ కలుద్దాం , ఏమంటావ్ ? "అన్నాను
" అలాగే " అన్నాడు తల పంకిస్తూ.
*****
ఆ రోజు సాయంత్రం మేము అనుకున్నట్లే , ఒక పది మందిమి , అనుకున్న చోటుకి , చేరాము .
అందరమూ, ఒకరి గురించి ఒకరం, చెప్పుకున్నాము.
" దీనికి కారణం , దీని నుంచి బయట పడే మార్గం గురించి, ఆలొచించాలి మనం. దానికి , మన లాంటి వాళ్ళని ఎక్కువ మందిని. కలవడం , .... అందరమూ , ఒక చోట, సమావేశ మయ్యేటట్లు , చేయ్యాలి. ఎక్కువ మంది కలిస్తే, ఎక్కువ సూచనలు వస్తాయి , కదా ?! " అన్నాను నేను.
" అవును. " అన్నాదు రమణ.
" అధికారం కోసం , ఆధిపత్యం కోసం , మనిషి ని, మనిషిని , వేరు చేయడానికి , సవా లక్ష పన్నాగాలు పన్నుతారు . అలాంటివారికి, మన శ్రేయస్సు కన్నా ముఖ్యం , మనమీద ఆధిపత్యం సంపాదించడం. ఇదీ అలాంటిదేమో . ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగిందిగా . " అన్నాడు వాసు , తనదైన సోషలిస్ట్ ధోరణిలో .
" అది కూడా అయి వుండవచ్చు . కానీ , తెలియాలంటే. మనం ఎక్కువ మంది తో మట్లాడాలి . " మూర్తి అన్నట్లు , అన్నాడు ప్రకాష్.
అలా, మేము పది మంది , సాధ్యమయినంత మంది తో , ఈ విషయం గురించి మాట్లాడదం మొదలుపెట్టాము.
మొదటలో మమ్మల్ని తప్పించుకుని తిరిగినా , అందరూ ఒక్కక్కొరూ వాళ్ళకీ , అలానే మాటలు వినిపించినట్లు చెప్పుకు వచ్చారు.
నెమ్మదిగా , చాలామంది జమ అయ్యాము. అందరమూ ఒక చోటు సమావేశం అయ్యాము.
ముందుగా మొదలు పెట్టాను . " నా పేరు వామన మూర్తి . ఇక్కడ అందరమూ , ఇలా ఎందుకు సమావేశము అయ్యామో , వేరే చెప్పక్కర్లేదు. అందరమూ మన అభిప్రాయాలు , ఆలొచనలు పంచుకుందాం . ఇల ఎందుకు జరుగుతోంది అనే విషయం లో క్లారిటీ వస్తే గాని , మనం ఏమీ చేయలేమేమో . "
" ఇంత మందికి , ఇలా జరిగిందంటే , దీని వెనుక ఎవరో , ఉండే వుంటారు. ఒకరికి ఒకరం , పడకుండా చేసి , ముందుగా మనని , ఒంటరి వాళ్ళని చేయడం ,.... ఆ తర్వాత , మనని కంట్రోల్ చేయడం , వాళ్ళ ఉద్దేశం అయి వుంటుంది..." వాసు అన్నాడు.
తర్వాత అందరూ , ఒకరి తర్వాత ఒకరు , వారిని వారు , పరిచయం చేసుకుని మాటాడడం మొదలు పెట్టారు.
" నా పేరు అన్వర్ . ఇంత మందిని ఎవరో ఇలా కంట్రోల్ చేస్తున్నారంటే , నమ్మ శక్యం గా లేదు . అది అసలు ఎంత వరకూ సాధ్యం ? "
" నా పేరు అనీల్ . అది సాధ్యమే అనిపిస్తోంది, నా పరిమితమయిన జ్ఞానం తో కూడా . ఆండ్రయిడ్ ఫోన్ లు , మన ప్రతీ కదలికని గమనించి , మనం ఎక్కడ వున్నాము అనేది, చెప్పేస్తాయి కదా . "
" అవునవును . సిరి ఆప్ మన మాటలని వింటుంది. మన ఇష్టా యిష్టాలు, గమనించి సలహాలు కూడా ఇస్తుంది. మన డేటా అంతా సర్వీస్ ప్రొవైడెర్ దగ్గర సేవ్ అయే వుంటుంది. ఇప్పుడు ఫోన్ వాడని వాళ్ళు ఎవరు వున్నారు. ఫోన్ వాడేవాళ్ళ సమచారం అంతా ఫోన్ కంపెనీ దగ్గర తప్పకుండా వుంటుంది. ఆ విధం గా కంట్రోల్ చేయడం సాధ్యమే అనిపిస్తుంది. .. సారీ ! నాపేరు చెప్పలేదు . నా పేరు ,చార్లెస్ ". అన్నాడు
“ కానీ ఇది మన లోంచి వస్తూ, మనకి మాత్రమే , వినిపిస్తున్న శబ్దం . మనలోంచి ,అలాంటి స్ఫురణ కలిగేలా చేయడం , సాధ్యమేనా ? సారీ! .... నా పేరు విక్రం ."
" కరోనాలో కూడా , వాక్సినేషన్స్ గురించి కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి. అందరినీ , కంట్రోల్ చేయడానికి , వాక్సినేషన్ పేరు తో , ఏదొ మందు కలుపుతున్నారు అని.... నా పేరు ప్రతాప్ ! " అలా అందరూ తలో అభి ప్రాయమూ వెళ్ళబుచ్చారు.
". ఇప్పుడు అందరమూ కలిసి , మనం ఈ విషయం పంచుకుంటున్నాం , చర్చించు కుంటున్నాము , కాబట్టీ మనం భయపడటం లేదు. కానీ ఇది కొంచెం ముందుకు వెళ్తే ..ఒకరికి ఒకరం అపకారం చేసుకునే పరిస్తితి వస్తే ... 'వాడిని కొట్టు ! వీడిని చంపు !' అనే మాటలు వినిపిస్తే , మనల్ని కంట్రోల్ లో కి తీసుకుని, ఆ పని చేయిస్తే , అప్పుడు .....???.... ఆలోచిస్తేనే భయం వేస్తోంది గదా ! ...అప్పుడు మన పరిస్తితి ఏమిటి .." నా మాటలకి అందరు స్తబ్దులు అయ్యారు.
అందరిలోనూ , మళ్ళీ భయం చోటు చేసుకుంది.
ఒక్కొక్కరూ మాట్లాడడం మొదలుపెట్టారు.
" నీ కులం కాదనో , నీ మతం కాదనో , నీ రాష్ట్రం కాదనో , నీ దేశం కాదనో ఏదో ఒక కారణం తో , 'నీ శత్రువు ' అన్నా అర్ధం వుంది. కానీ ఇదేదో , భార్యా పిల్లలని కూడా, శత్రువులే అంటొంది. "
" మీరు చెప్తున్నట్లు, మనని కంట్రోల్ చేయాలనేదే , వారికి కావాల్సినది అవుతే, ఇది పెద్ద మారణ హొమానికి , దారి తీస్తుందేమో హ్యుమన్ రేస్ నే తుడిచి పెట్టేస్తుందేమో .."
". ముందు మనం ఆలోచించాల్సింది, ఈ మాటలు , మనకి ఎవరు ఎలా స్పురింప చేస్తున్నారు , అని. ఎలా ఆపాలని ?! "
" నా కజిన్ ఒకడు పోలీస్ డిపార్ట్మెంట్ లో, పని చేస్తున్నాడు. వాళ్ళు , ఈవిషయం పరిశోధిస్తున్నారు అని , వాళ్ళు కూడా భయపడ్తున్నారు అని చెప్పాడు. "
" శత్రువు ఎవరో తెలియకుండా, ఎవరు అయినా , ఏమి చేస్తాము ? ... ఎవరికి , అయినా భయమే ! ..."
" ఎవరో , ఏమిటో , తెసుకోవడానికి , మనకి వెంటనే సాధ్యం కాకపోవచ్చు. కనీసం ఆపగలమా ? ఎలా ఆపగలం ? ... ఇలా ఆలోచిస్తే మంచిది కదా ... ప్రభుత్వమో , పోలీసులో , ఏదో చేస్తారని కాకుండా, మనం కూడా ఆలోచించాలి . చివరకి , మనమే ఎఫెక్ట్ అయ్యేది కాబట్టి. "
" ఎక్కడ , ఎవరు , వాళ్ళ వాళ్ళ , స్వ ప్రయోజనాల కోసం, ఏమి చేసినా మనలాంటి వాళ్ళే, వాటి ఫలితాల వల్ల బాధలు పడేది. అందుకే మనమే జాగ్రర్త పడాలి . మనమే ఆలోచించుకోవాలి. "
" అవును! .. అవును ! ... " అందరూ కలిసిగట్టుగా అన్నారు.
" ఇది మనలో , ద్వేషాన్నీ , కోపాన్నీ రేకెత్తించే, ప్రయత్నం చేస్తొంది. దానికి కౌంటెర్ గా మనం ప్రేమని పెంచుకునే ప్రయత్నం చేస్తే , .." అంది ఒక ఆమె
అందరూ ఆమె కేసి దృష్టి సాగించడం తో " నా పేరు సుజాత . " అంది ఆమె.
" కానీ ప్రేమని పెంచుకోవడం, అనేది మనకి తెలియని విషయం. ఎప్పుడూ మనము, ఈ విషయన్ని గురుంచి ఆలోచించ లేదు . ఆ అవసరం కూడా, ఎపుడూ రాలేదు. చాలా , యంత్రికంగా బతికేస్తున్నాము " అన్నాడు ఒక అతను , చాలా , పెసిమిస్టిక్ గా.
" అవును!, ఈ మేడం చెప్పింది సరి అయినదీ గానే తోస్తోంది. మెడిటేషన్ కూడా, సాయం పడుతుందేమో . "
" అదే ! ..మేడిటేషన్ , .. మళ్ళీ , .. ప్రేమని పెంచుకోవడం .వీటి మీద మనం దృష్టి పెట్టి, ప్రయత్నంచడమే . ఎవరో, మనని ద్వేషం వైపు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే , మనం ప్రేమ తో నే కదా, తిప్పి కొట్టాల్సింది. "
" ఎలా , ప్రేమని పెంచు కోవడం. ?? "
సుజాతే మళ్ళీ మాట్లాడింది, " ముందుగా మనని ద్వేషం వైపు , తీసుకు వెళ్ళే వాటిని, గుర్తుపట్టి , దూరంగా పెట్టాలి. "
మనని ఎక్కువ గా పొల్యుట్ చేసేది, టి వి లు. వాటికి దూరం గా వుండడానికి ప్రయత్నించాలి . ప్రయత్నించడం కాదు. చేయాలి. "
" ముఖ్యం గా న్యూస్ చానెల్స్ కి ..." అన్నాడు ఒక అతను.
“ అసలు , వాటి వలనే ఏమో, మనకి ఈ విధం గా అవుతోంది . మన చుట్టూ నెగెటివిటీ ని , ప్రొత్సహిస్తూ వున్నాయి అన్నీను . అలాంటప్పుడు , మన కి తెలియకుండానే , మనం ప్రభావితం కావడానికి అవకాశం చాలావుంది. ఇది దాని ప్రభావం కూడా కావొచ్చు . "
" అవునవును . అది కూడా పాజిబెల్ .. " అందరూ గొంతు కలిపి అన్నారు.
" ద్వేషానికి , సేలబిలిటీ ఎక్కువ. ప్రేమకి , స్నేహానికి ఎక్కువ సేల బిలిటీ వుండదు. మనం చూస్తూనే వున్నాము గదా . అందుకే మీడియా , ఆ ధోరణి లో పని చేస్తుంది. ఎవరి ప్రయోజనాలు వారు నెరవేర్చుకుంటున్నారు. వారిని తప్పు పట్టి ప్రయోజనం లేదు . మనమే జాగ్రర్తలు తీసుకోవాలి . నెగెటివిటీ ని , దానిని ప్రొత్సహించే వాటిని అన్నిటినీ , దూరం పెట్టాలి . పెడ్దాము. "
అందరమూ ఆ ప్రొపోజల్ కి వత్తాసు పలికారు . ఆ సమావేశానికి ముగింపుపలుకుతూ, నేను అన్నాను.
" మనం ఇలా , రోజూ కలుద్దాం . ఎందుకంటే , ఎప్పటి కప్పుడు , మనం ఒకరి పట్ల ఒకరికి వున్న , సౌహర్ద్రత్వాన్ని నొక్కి వక్కాణించుకోవాల్సిన , అవసరం వుంది. అలాగే ఎవరికయినా, ఇంతకి మించి , మాటలు వినిపిస్తూంటే , పంచుకోవడానికి
వీలుగా కూడా , వుంటుంది. మనం ,ఎంత వరకూ క్షేమం గా వున్నామో , ఎప్పటికప్పుడు, సమీక్షించు కునే , అవకాశం వుంటుంది ."
" అవునవును మనం అంతా, ఇలా షేర్ చేసుకొవడం వల్ల, భయం లేకుండా వున్నాం. అంతే కాదు ఒకరికి, ఒకరం వున్నామనే విషయం , చాలా ధైర్యాన్ని ఇస్తోంది . ". అందరూ కలిసిగట్టు గా , అన్నారు.
అలా, అందరమూ , ప్రతీ రోజూ కలుసుకోవడం మొదలు పెట్టాం .
అందరిలొనూ, లొపల నుంచి , మాటలు రావడం మానలేదు . కానీ , ఇంక అంతకు మించి, ఏమీ జరగక పోవడం తో , కాస్త రిలీఫ్ కలిగింది . భయం కూడా తగ్గింది.. ఒక కొన్ని రోజులు అలా జరిగేక, ఒక రోజు, సమా వేశం లో, ఒక వ్యక్తి చెప్పాడు, " నాకు ఇప్పుడు మాటలు వినిపించటం లేదు " అని.
అందరూ , ప్రశ్నలతో , అతనిని ముంచెత్తారు.
అన్ని ప్రశ్న లకి , ఓర్పుతోనూ , ఓపిక గాను సమధానాలు చెప్పాడు. చెప్తూ , అన్నాడు ,
" నాకు. ధ్యానం చేయడం , అలవాటు . అందుకే నేమో, కొన్ని రోజులకే, నేను బయట పడ్డాను. మనం అందరమూ అనుకున్నట్లే , నేను ప్రేమ గా వుండడము మీద, నా ధ్యాస పెట్టాను. కాన్షస్ గా, కల్టివేట్ చేసుకుంటూ వచ్చాను.
ధ్యాస, దేని మీద పెడితే , అది ఎక్కువ అవుతుంది అంటారు కదా !
ఇంకొక విషయం కూడా మీకందరికీ చెప్పాలి. ప్రేమ , కోపం , ద్వేషం , ఏ ఫీలింగ్ అయినా , ఒక ఎనెర్జీ. అందుకే మనం ఒక్కరిని ప్రేమించాము, ఒక్కరిని ద్వేషించాము , అనుకోవడానికి లేదు. ఒక్కరి తో ఆగదు ఆ ఎనెర్జీ . చుట్టూ అందరినీ అలముకుంటుంది."
" బాగా చెప్పారు. మీరు చెప్పింది , సరి అయినదే. నెగెటివ్ ఎమోషన్స్ కి దూరం గా వుండాలి . దూరం గా వుంచాలి. "
" అందుకే , హెట్ స్పీచెస్ కి , న్యూస్ చానెల్స్ కి , దూరం గా వుండాలి . పిల్లలని కూడా, విడియొ గెంస్ కి , ఆన్ లైన్ గేంస్ కి దూరం గా వుంచాలి. వున్నట్లుండి , వాళ్ళకి , వాళ్ళని చంపు , వీళ్ళని చంపు , అని వినిపిస్తె ..."
మళ్ళి అందరిలోనూ, భయం, అయొమయం , ఆందోళణ , చోటు చేసుకున్నాయి .
ఒక్కసారిగా, వాడిపోయిన అందరి మొహాలు చూస్తూ, నేను అన్నాను . " భయపడకండి. ఇప్పటివరకూ మనం చూస్తున్న పరిణామాల బట్టి , మనం ఎక్కువ భయ ప డాల్సిన అవసరం , కనిపించటం లేదు.
ఒకరు, దీనిలోంచి , బయట పడడం చూస్తున్నాము . అందరమూ అదే మార్గం లో , నిజయితీ తో , కృషి చేద్దాం. నిజాయితీ ముఖ్యం అని , నేను చెప్పక్కర్లేదు . " ఆ మాటలకి అందరి మొహాల్లో కి మళ్ళీ వెలుగు వచ్చింది.
రోజులు గడుస్తూంటే , ఒక్కొక్కరూ , బయట పడడం , మొదలు పెట్టారు. దానితో , అందరికీ విశ్వాసం , కలిగింది. అందరిలోనూ , క్రమేణా , ప్రేమ , అభిమానాలు, చోటు చేసుకో సాగాయి. అందరూ , అందరికీ , బంధువులే ! కావాల్సిన వాళ్ళే ! అందరికి, అందరూ ఆప్తులే !
వూరిలో, అందరిలోనూ , వెల్లుబికే ప్రెమ అబిమానాలతో , ఒక పండుగ వాతావరణం లాంటిది , నెలకొంది.
పోలీసు ల పరిశోధన వల్ల కూడా , ఏవిషయమూ తెలియలేదు , అని తెలిసింది.
ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడకుండా , మేము చొరవ తీసుకుని చేసిన ప్రయత్నం ఫలించింది. అందరూ , ఒకరు ఒకరు , దీని నుంచి బయట పడ్డారు. దానితో , అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అందరికీ , ఒక విషయం అవుతే , బాగా అర్ధం అయింది. ప్రేమ ఒక శక్తి . దానితో సాధించలేనిది, ఏదీ లేదని. అందరినీ ఏదో ఒక పేరు తో , ప్రాతిపదిక తో విడగొట్టి , చివరకు అందరూ , ఒకరిని చూసి ఒకరు , భయపడే స్తితికి తీసుకు వచ్చి , అందరి మీద ఆధిపత్యం చలాయించాలను కోవడమే, ఇట్లాంటి సంఘటణలకి కారణం అయి వుంటుందని , మేమంతా అనుకున్నాము .
అందరమూ మా మధ్య వున్న , బేధాలన్నీ మరిచి పోయి , కలిసిగట్టుగా, ఇలా ఒక పెద్ద సమస్యని పరిష్కరించుకున్నాక , మా మీద మాకు, ఆత్మ విశ్వాసం, గట్టిగా కలిగింది. అందరమూ సంఘటితంగా వుండడం వల్ల , మాకు కలిగిన ధైర్యాన్ని ఎప్పటికీ ఎవరమూ మర్చి పోలేము. అందుకే , తర్వాత కూడా, మేము వారానికి ఒకసారైనా సమావేశం. అయ్యే వాళ్ళం . మంచి చెడు మాట్లాడుకునే వాళ్ళం.
అందరమూ, గాడ్జెట్స్ కి దూరం గా వుండడం క్షేమం అని , దూరం గా వుండడం మొదలు పెట్టాము. దానితో మాకు చాలా సమయం వుండేది . ఆ సమయం లో, అందరితోనూ మాట్లాడడం , అలవాటు చేసుకోవడం తో , అది మా అందరిలోనూ, స్నేహ భావాన్ని పెంచింది.
ఒక రోజు వాసు అన్నాడు " మూర్తీ ! ఈ సమస్య మనని అందరినీ, ఒకటి చేసింది. ఏ స్వార్ధ పరులూ వేరు చేయలేనంత ! .." , అంటూ నవ్వాడు గట్టిగా . మళ్ళీ అన్నాడు , " నువ్వు చొరవ తీసుకోవడం వల్లే, ఇదంతా జరిగింది. "
" అలా అనకు . అందరమూ కలిసేము , కాబట్టే ఇది జరిగింది, అలా ఒక్కరికే, అంతా ఆపాదించడం , వాళ్ళకి ఆధిపత్యం కట్ట బెట్టడమే . దానికి అలవాటు పడ్డాక , దానిని నిలబెట్టు కోవడానికి , ఇలాంటివి ఏవో చేయ డానికి ప్రయత్నిస్తారు. " అన్నాను
" బాగా చేప్పావు మిత్రమా " అంటూ సంతోషం గా నా భుజం మీద చేయి వెసాడు. "
మళ్ళీ ఆన్నాడు వాసు, " భయానికో ఏమిటొ , మన లో ఎవ్వరూ , ఏవిధం గా నూ, ఎవరి గొప్పని , వాళ్ళు ప్రదర్శించుకునే ప్రయత్నం కూడా , చేయలేదు. ఆశ్చర్యం కాదూ ?! "
" మంచిదే కదా . ఏదయినా క్లిష్ట పరిస్తితి వచ్చినపుడే , ఎవరిదైనా అసలు స్వరూపం బయట పడేది. "
". ........."
" అయినా ఊనికి కే ప్రమాదం వచ్చే పరిస్తితిలో , ఏది ముఖ్యం అనిపిస్తుంది కనక . మనమంటూ వుంటే కదా గొప్పలు ప్రదర్శించు కునేది . ". అంటూ, నవ్వాను నేను.
వాసు కూడా నవ్వాడు,
"ఈ సంఘటన వల్ల , మనమంతా ఇలా ఆత్మీయులవడం , బాగుందికదా . ఎటువంటి పొర పచ్చాలు , లేకుండా ఇలా వుండడం వల్ల , ప్రతి రోజూ, పండుగ లాగే వుంది. కదా? !" అన్నాడు వాసు మళ్ళీ .
" నువ్వు , నేను , మానేసి , ఏ ప్రాతిపతిక తో సంబంధం లేకుండా, మనం, అనడం నేర్చు కున్నాము కదా . మనసు నిండా , ఆత్మీయత నింపుకుంటే , పండుగలానే వుంటుంది , మరి ." అన్నాను నేను, గుండె నిండా నిండిన , ప్రేమని , ఫీల్ అవుతూ.
********
.