![KalpitaBetala kathalu.1 KalpitaBetala kathalu.1](https://www.gotelugu.com/godata/articles/202502/KalpitaBetala kathalu.1-Story picture_1738930758.jpg)
నిజమైన విజయం. .
పట్టువదలని విక్రమార్కుడు చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజపై వేసుకుని మౌనంగా నడవసాగాడు.
శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు " నిజమైన మహీపాల మన ప్రయాణంలో బడలిక తెలియకుండా నీకు నిజమైన విజయం అనే కథ చెపుతాను విను...
చిత్రావళి రాజ్యాన్ని శూరసేనుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన రాజ్యంలో పుష్కలంగా నీరు లభించడంతో వ్యవసాయం, పశువుల పెంపకం బాగా అభివృధ్ధి చెందింది. ఇంకా విద్య, వైద్యా రంగాలలో ఎంతో అభివృధ్ధి సాధించింది. రాజ్యప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించ సాగారు. ప్రజలు సంతోషంగా పన్నులు చెల్లించడంతో రాజుగారు తన రాజ్యనికి చతురంగ రక్షణ దళాన్ని బలంగా రూపొందించాడు.
పొరుగు రాజ్యమైన మగధ రాజు సేతుపతి భోగ లాలసుడు. ప్రజల కష్టాలు గమనించకుండా నిత్యం మధుపాన లోలుడుగా నృత్య గాన విలాసాలతో కాలం గడుపుతూ ఉండేవాడు. ఇతను పలుమార్లు చిత్రావళి రాజ్యంపై దండెత్తి ఓటమి పాలైనాడు.
ఒక సంవత్సరం సమయానికి వర్షాలు పడక మగధ రాజ్యంలో వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నది.ప్రజలు ఆహారంతో పాటు తాగు నీటికి ఇబ్బంది పడసాగారు.
ఈ విషయం చిత్రవళి రాజు శూరసేనుడి దృష్టికి వెళ్ళింది. వెంటనే తన పరివారంతో అత్యవసర సమావేశం ఎర్పాటు చేసి మగధ రాజ్యానికి తమ ధాన్యాగారాల నుండి అత్యవసరంగా కావలసిన ధాన్యం, వ్యవసాయానికి నీటి కాలువలు తొవ్వించి నీరు వెంటనే అందజేసాడు. మగధ రాజ్య ప్రజలు శూరసేనుడి దయాగుణానికి బ్రహ్మరధం పట్టారు " .
" విక్రమార్క మహారాజా తన శత్రువు అయిన సేతుపతి మగధ దేశరాజుగా ఉండి పలుమార్లు తనపై దండెత్తినప్పటికి శూరసేనుడు అతని రాజ్య ప్రజలకు ధాన్యం, నీరు ఎందుకు సహాయంచేసాడు. తెలిసి నాప్రశ్నకు సమాధానం చెప్పక పోయివో తలపగిలి మరణిస్తావు'' అన్నాడు బేతాళుడు.
'' బేతాళ అన్నదానంతో సమానమైన దానం మరేది ఉండదని పెద్దలు చెపుతారు.ఇంకా మరణభయంతో విలవిల లాడే వారికి అభయ ప్రదానం చేయడం,వ్యాధి గ్రస్తునకు సరి అయిన చికిత్స చేయించడం,విద్యను ఆర్జించేవారికి విద్యా దానం చేయడం,ఆకలిగా ఉన్నవారికి అన్నదానం చేయడం మెదలగు నాలుగు దానాలను ఉత్తమ దానాలని లోకంలో చెప్పుకుంటారు.
శూరసేనుడు గొప్ప మానవతావాది.ఎంతో ముందుచూపు కలిగినవాడు తన రాజ్యనికి ఇరుగు పొరుగున ఉండేవారు ఎప్పుడూ బాగుండాలని కోరుకునేవాడు. ఎందుకంటే ఆదేశ ప్రజలు తమ దేశానికి వలస వస్తే పలు సమస్యలు ఉత్పన్నమౌతాయి. పైగా మగధ దేశ ప్రజలను ఆదుకుని ఆదేశ ప్రజలకు తాను ఎంతో ఉన్నతుడిగా గుర్తింపు, మన్ననలు పొందాడు. భవిష్యత్తులో ఎన్నడు మగధ రాజు తనపై యుధ్ధం చేయడానికి సాహసం చేస్తే ఆదేశ ప్రజలే రాజుపై తిరగబడతారు. అన్నంపెట్టి ఆదుకుని, వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చిన శూరసేనుడి రాజ్యంపై యుద్ధం చేయడానికి మగధ ప్రజలు ఎన్నటికి అంగీకరించరు. ముందు చూపు కలిగిన శూరసేనుడు వారి అవసరాలకు ఆదుకుని, తన దయాగుణంతో మగధ ప్రజల ఆదరణ,అభిమానం తోపాటు వారి విశ్వాసానికి పాత్రుడు అయ్యడు'' అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా మయమై తిరిగి చెట్టు వద్దకు చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.
***********************
తగిన శిక్ష.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు స్మశానంలో ప్రవేసించి, బేతాళుడు ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చెర్చుకుని మౌనంగా స్మశానం నుండి బయలుదేరాడు .
" మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల, శ్రమ మెచ్చదగినదే! మనప్రయిణంలో నీకు అలసట తెలియకుండా తగిన శిక్షఅనేకథ చెపుతాను విను... అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు. అతని మంత్రి పేరు సుబుద్ది. రాజుకు పలు రకాల వస్త్రాలు సేకరించి తను ధరించేవాడు. ఒకరోజు రాజుగారు సభలో ఉండగా ఇద్దరు యువకులు రాజ సభలో ప్రవేసించి "ప్రభువులకు వందనాలు మా పేర్లు రామ లక్ష్మణులు, నేతపనిలో ఈభూమండలంలో మమ్ము మించినవారు ఎవ్వరూ లేరు. దేవగురు ముఖంగా అభ్యసించిన నేతవిద్యను ప్రదర్శిస్తూ తొలిసారిగా మేము తయారు చేసిన వస్త్రాన్ని తమరికే ఇవ్వలని ఎందరో రాజులు కోరినా త్రోసిపుచ్చి, వస్త్ర ప్రియులైన తమకే ఇవ్వలని నేరుగా తమరి కొలువుకే వచ్చాం" అన్నారు.
"చాలా సంతోషం ఎందరో రాజులను కాదని అదే వస్త్రం నాకే ఇవ్వలి అన్న మీ నిర్ణయం అభినందనీయం. ఆ వస్త్రం తయారికి మీకు ఎంత ధనం కావాలో తీసుకొండి. మీరు నేసే వస్త్రం విశిష్టత ఏమిటో కాస్త వివరించండి" అన్నాడు చంద్రసేన మహారాజు.
"ప్రభూ ఆ దివ్య వస్త్రం తయారీకి మూడు సంవత్సరాల కాలం పడుతుంది... కానీ..." అంటూ ఆగి పోయారు రామలక్షణులు.
"ఏం ఆగిపోయారే ధనం గురించా?" అన్నాడు మహారాజు.
కాదు మహా రాజా! ఆ దివ్య వస్త్రం ప్రతేకత ఏమిటంటే, ఆ వస్త్ర తయారి దార్లకు మరియు పుణ్యాత్ములకే కనిపిస్తుంది. పాపాత్ముల కంటికి కనిపించదు. ధర్మప్రభులు, దయార్ధహ్రుదయులు అయిన మీరు తప్పక పుణ్యాత్ముల కోవలోకే వస్తారు. మిగిలిన వారి సంగతి మాకు తెలియదు" అన్నారు రామలక్ష్మణులు.
"భయపడకండి మీకు కామలసిన మగ్గం, నూలు, ధనం అన్ని సౌకర్యాలు ఏర్పాటు మీరు కోరిన విధంగా ఏర్పాటు చేయబడతాయి. మా వసంత మండపం మీకు విడిదిగా ఈ మూడు సంవత్సరాలు ఏర్పాటు చేయబడుతుంది. మీ నేత పనికి ఎటువంటి అంతరాయం, ఆటంకం కలగుకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయిస్తాను మంచి రోజు చూసుకుని మీ నేత పని ప్రారంభించండి" అన్నాడు చంద్రసేన మహారాజు.
"ధన్యులం ప్రభు" అన్నారు రామలక్ష్మణులు.
అలా రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు గడచి పోయాయి. రామలక్ష్మణులు కోరిన మూడు సంవత్సరాల కాలం గడచి పోయింది. సామంత రాజులు, పుర ప్రముఖులు, తన పరివారంతో తను వస్తున్నట్లు రామలక్ష్మణులకు కబురు పంపిన రాజు, దివ్య వస్త్రం చూడటానికి వచ్చి వసంత మండపంలో ఆసీనులై ఉన్నారు. రాజుగారికి నమస్కరించిన రామలక్ష్మణులు ఉట్టి చేతులు ముందుకు చాపుతూ "తిలకించండి మహారాజా! ఈ దివ్యవస్త్రాన్ని మూడు సంవత్సరాల మా కష్టంపడ్డాం!" అన్నారు.
రామలక్ష్మణుల చేతులపై రాజు గారికికానీ ఆయన తో పాటు వచ్చిన వారికి గాని ఎవ్వరికి ఎటువంటి వస్త్రం కనిపించలేదు. ఆ దివ్య వస్త్రం తమకు కనిపించలేదంటే తము ఎక్కడ పాపాత్ముల లెక్కలోనికి వస్తామని అందరూ మౌనం వహించారు. రామలక్ష్మణులు తెలివిగా తమను మోసగించారని గ్రహించాడు. ఏంచేయాలో తెలియని రాజు గారు జరిగిన మోసాన్ని గ్రహించి, నలుగురిలో నవ్వులపాలు కాకుండా ఉండాలని "భళా! మీ కళా చాతుర్యం, నీలిరంగు వస్త్రానికి సింధూరపు రంగు అంచు ఎంతఅందంగా ఉందో" అన్నాడు.
"అవును దివ్య వస్త్రం రమ్యంగా, కళాత్మకంగా ఉంది" అని రాజు గారి వెంట వచ్చిన వారంతా వంత పాడారు. "చల్లని ప్రభువుల పాలనలో మీ రాజ్యంలో అందరూ పుణ్యాత్ములుగానే కనిపిస్తున్నారు" అన్నారు రామలక్ష్మణులు.
"కళాకారులారా! ఏంకావాలో కోరుకొండి" అన్నాడు రాజుగారు.
"దానకర్ణులు, లక్ష వరహాలు ఇప్పించండి మహాప్రభు" అన్నారు రామలక్ష్మణులు.
రాజు గారి చెవి వద్ద గుసగుస లాడాడు మంత్రి సుబుద్ది. తక్షణమే స్పందించిన రాజు "భటులారా ఈ రామలక్ష్మణులను జీవిత ఖైదీలు గా చెరసాలకు తరలించండి" అన్నాడు. అప్పటి వరకు కథ చెపుతున్న బేతాళుడు "విక్రమార్క మహారాజా రాజుగారి చెవిలో మంత్రి ఏంచెప్పాడు? రామలక్ష్మణులకు రాజు జీవిత ఖైదు ఎందుకు విధించాడు నాకు తెలియాలి. నా ఈ ప్రశ్నలకు తెలిసి సమాధానం చెప్పకపోయావో తల పగిలి మరణిస్తావు" అన్నాడు. భేతాళ మంత్రి సుబుధ్ధి చాలా తెలి వైనవాడు. సాటి వారిముందు రాజు మోసపోయినట్లు తెలియకుండా, రాజు గారి చెవిలో ప్రభూ రామలక్ష్మణులు కోరిన ధనం ఇచ్చి మన రాజ్యం దాటి పోనిస్తే వీళ్లు లోకం అంతటా పలు రాజ్యాలలో తమ దివ్య వస్త్ర ప్రదర్సన చేస్తారు. అప్పుడు దివ్య వస్త్రం అందరి వద్ద ఉంటుంది. అప్పుడు మన వద్ద ఉన్న దివ్య వస్త్రానికి విలువ ఉండదు. అందుకు వీరిని బ్రతికినంతకాలం ఖైదీలుగా మనవద్దే ఉంచుకుంటే ఆ దివ్య వస్త్రం మన వద్ద మాత్రమే ఉంటుంది. ఆ ఖ్యాతి మనకు దక్కాలి అంటే మరో దారి లేదు వీరిని చెరసాలకు పంపవలసిందే!" అని రామలక్ష్మణులు చేసిన మోసానికి దెబ్బకు దెబ్బ అనేలా మంత్రి సుబుధ్ధి ప్రవర్తించాడు" అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌన భగం కావడంతో శవంతో సహా మాయమై చెట్టు పైకి చేరాడు బేతాళుడు. పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెను తిరిగాడు.
*********
కళాకాంతి కథ
పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకువచ్చి శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజానవేసుకుని మౌనంగానడక సాగించాడు. శవం లోని బేతాళుడు 'మహరాజా నీకార్యదీక్ష, పట్టుదల, ప్రశంసనీయం. నాకు చాలా కాలంగా ఉన్నసందేహం సందేహం కళాకాంతుని కథ నీకు ప్రయాణ అలసట తెలియకుండా కళాకాంతి కథ చెపుతాను విను......
పూర్వం మహిరి అనే ఊరి అగ్రాహారంలో అర్జునశర్మ అనే బ్రహ్మణుడు ఉండేవాడు. అతనికి అందాల రాశి అయిన కళాకాంతి అనే కుమార్తె ఉంది. ఆమెకు వివాహ ప్రయత్నాలు ప్రారంభించగానే, ఒక రోజు ఆమెను వివాహం ఆడదలచి, శూరుడు, మహాజ్ఞాని, కల్పనుడు అనే ముగ్గురు బ్రాహ్మణ యువకులు ముందుకువచ్చి అర్జునశర్మను కలసారు. మాట్లాడుతుండగా, పూతోటలో సాయంకాలం పూలు సేకరిస్తున్న కళాకాంతిని ఆకాశమార్గాన వచ్చినమాంత్రికుడు అందరూ చూస్తుండగా తన మాయ విద్యతో రెప్పపాటు కాలంలో తీసుకెళ్లాడు.
అది చూసిన అర్జునశర్మ విలపిస్తూ తన కుమార్తెను ఎవరు రక్షించగలరో వారికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు. అక్కడ ఉన్నముగ్గురు యువకులలో మహాజ్ఞాని ఆ రాక్షసుడు ఎక్కడ ఉన్నాడో తన జ్ఞానదృష్టితో తెలియజేసాడు. అది విన్న కల్పకుడు తనవద్దనున్న మాయ ఉంగరాని శూరుడికి అందించి' దీన్ని ధరించి నువ్వు ఎక్కడకు వెళ్లాలంటే అక్కడకు క్షణకాలంలో వెళ్లగలవు' అన్నాడు. ఆ ఉంగరం ధరించి కత్తి చేతపట్టి మహాజ్ఞాని చెప్పిన ప్రదేశానికి చేరి, మాయావిని సంహరించి కళాకాంతిని ఆమె తండ్రికి అప్పగించాడు.
అప్పటి వరకు కథచెపుతున్నబేతాళుడు 'విక్రమార్క మహారాజా అలా వారు ఆ ముగ్గురు యువకులలో కళాకాంతిని వివాహం చేసుకోవడానికి ఎవరు అర్హులు. తెలిసి చెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు అన్నాడు.
అందుకు విక్రమార్కుడు 'బేతాళా మహాజ్ఞాని, కల్పనుడు, వారు నేర్చిన విద్యను ప్రదర్శించారు. మనిషికి ఉండవలసిన ధైర్యం, శౌర్యం, వీరుడు అయిన శూరుడే ఆమెకు తగిన వరుడు. కనుక కళాకాంతను శూరుడు వివాహం చెసుకోవడం న్యాయం' అన్నాడు. విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయం అయ్యాడు. పట్టువదలని విక్రమార్కుడు బెతాళునికై వెనుతిరిగాడు.