శాశ్విత పరిష్కారం.
పట్టువదలని విక్రమార్కుడు, తన ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చేర్చుకుని మౌనంగా స్మశానంనుండి బయలుదేరాడు.
"మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! నీ ఉజ్జయిని రాజ్య గొప్పదనం లోక విదితమే. మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా శాశ్విత పరిష్కారం కథ చెపుతాను విను...
అవంతగిరి రాజ్యాన్ని గుణవర్ధనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఇతను గొప్ప సాహాసవంతుడు, వీరుడు. కత్తి పట్టిననాటి నుండి ఓటమి ఎరుగడు. ఇతని మంత్రి పేరు సుబుధ్ధి. అవంతికి సంవృధ్ధిగా నదులనీరు ఉండటంతో పంటలు బాగా పండేవి. ప్రజలందరూ సుఖంగా ఉండేవారు. అవంతికి సరిహద్దు రాజ్యం ఉత్కళ. దీని పాలకుడు వక్రకేతు అనేరాజు. ఇతను యుధ్ధ పిపాసి. పలుమార్లు అవంతిపై దండెత్తి ధన, జన నష్టంతో ఓటమి చవిచూసాడు. ఏనాటికైనా అవంతిని జయించి తీరాలని పట్టుదలతో ఉన్నాడు.
వరుసగా రెండేళ్ళు వర్షం సకాలంలో పడకపోవడంతో ఉత్కళ రాజ్యంలో కరువు సంభవించింది. ఉత్కళ రాజ్య ప్రజల ఆదుకునేందుకు తన ధాన్యాగారంలోని ధాన్యాన్ని ఉత్కళ ప్రజలకు ఉచితంగా తరలించడం తోపాటు తనరాజ్యలో ఎప్పుడూ నీటితో కళకళలాడే జీవనది ఐన గంగానది నీటిపాయను ఉత్కళ రాజ్యానికి కాలువగా తరలించాడు. ఉత్కళ ప్రజలు తాము శత్రుదేశమైనప్పటికి మానవతా దుృష్టితో ఆదుకున్న గుణవర్ధనుడిని అతని దయార్ధ దయాన్ని మెచ్చుకున్నారు.
గురు కులంలో విద్య పూర్తిచేసి సంవత్సరకాలం వివిధ దేశాలలో పర్యటించి లోకానుభవం పొందిన తనకుమారుని పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సమయంలో యువరాజు పట్టాభిషేకం ఘనంగా నిర్వహించిన గుణవర్ధనుడు "చిరంజీవి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. త్వరలో మహారాజుగా పట్టాభిషేకం, మరియు వివాహం నీకు జరిపించాలి అనుకుంటున్నాను. ఈ ఆనందసమయంలో నీకు ఏంకావాలో కోరుకో" అన్నాడు .
తన మనసులోని కోరికను వెల్లడించాడు యువరాజైన విజయుడు. యువరాజు కోరిక వింటూనే గుణవర్ధనుడు, అతని మంత్రి సుబుధ్ధి ఆశ్చర్యపోయారు.
అనంతరం మంత్రితో సమావేశమైన గుణవర్ధనుడు "మంత్రివర్యా నా కుమారుడు ఇలాంటి కోరిక కోరతాడు అనుకోలేదు. ఇచ్చినమాట తప్పలేను అతని కొరిక మనం తీర్చవలసిందే!" అన్నాడు .
" ప్రభు మన యువరాజు గారు ఉత్కళ దేశపు రాజకుమారితో వివాహం జరిపించమని కోరాడు అంటే అమెతో మన విజయునికి గతపరిచయం ఉండి ఉండాలి" అన్నాడు మంత్రి.
"నిజమే ఉత్కళ రాజకుమారి నగర పొలిమేరలలోని ఆలయానికి కొద్దిమంది సైనికుల రక్షణలో, తన చెలికత్తెలతో వచ్చిందట అప్పుడు బంధిపోటు దొంగలు కొందరు ఆమె వంటిపై నగల కొరకు దాడిచేయగా , అలయంలో ఉన్న మన యువరాజు బంధిపోటు దొంగలను తరిమి కొట్టాడట, అక్కడ వారి మనసులు కలిసాయి అని చెప్పాడు" అన్నాడు గుణశేఖరుడు.
" విక్రమార్కమహరాజా కుమారుడి కోరిక తీర్చడంకోసం శత్రువుతో వియ్యమందడం న్యాయమా? తెలిసి సమాధానం చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు "అన్నాడు.
" బేతాళా గుణశేఖరుడు ఆడినమాట తప్పలేడు. చాలా దూరదృష్టి కలిగినవాడు, ఉత్కళదేశ ప్రజలను ఆపద కాలంలో ఆదుకుని వాళ్ళకు వ్యవసాయానికి నిరంతరంగా నీరుఇచ్చి వారి అభిమానానికి పాత్రుడు అయినాడు.
తమ యువరాజుకు ఉత్కళ రాజకుమారితో వివాహంజరిపించాలి అనుకుంటున్నామని ఉత్కళ పాలకుడు వక్రకేతుకు సందేశం పంపితే ఎంతో సంతోషంగా అంగీకరిస్తాడు. పైగా ఆదేశపు రాజకుమారి కూడా గుణశేఖరుని యువరాజును ప్రేమిస్తుంది. వారి వివాహం జరిపిస్తే రెండురాజ్యాలకు శత్రు వుల బాధ ఉండదు. ఈ వివాహంతో శాశ్విత పరిష్కారం లభిస్తుంది " అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
*******
దొంగ బావి.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు స్మశానంలో ప్రవేసించి,బేతాళుడు ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చెర్చుకుని మౌనంగా స్మశానంనుండి బయలుదేరాడు.
" మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల, శ్రమ మెచ్చదగినదే! మన ప్రయిణంలో నీకు అలసట తెలియకుండా దొంగ బావి అనే కథ చెపుతాను విను ...
అవంతి రాజ్యంలో సిరిపురం అనే ఊరిలో రంగనాధం అనే ధనవంతుడు ఉన్నాడు. తనకు ఉన్నంతలో పేదవారికి వడ్డిలేని రుణాలను ఇచ్చి అవసరాలకు ఆదుకునేవాడు. అదే గ్రామంలో శివయ్య రైతు ఉంటూ, దైవదర్శనానికి , ఏదైనా పని పైన కుటుంబ సభ్యులతో ఊరు దాటి వెళ్ళేముందు తన వద్దనున్న ధనం, నగలు మూటకట్టి రంగనాధాం వద్ద భద్రపరచమని పలుమార్లు ఇచ్చి తీసుకు వెళు తుండేవాడు. ఎప్పటిలా ఒకరోజు చేతిలోని మూటతో రంగనాధం ఇంటికి వచ్చిన శివయ్య " అయ్యా రంగనాధం గారు నేను కుటుంబ సభ్యులతో దైవదర్శనానికి పొరుగు ఊరు వెళుతున్నా తిరిగి రావడానికి వారంరోజులు పడుతుంది. ఊళ్ళో దొంగల భయం ఉంది కనుక నాఈ నగదు, నగలు తమరి వద్ద దాచి వెళదామని వచ్చాను" అని తన చేతిలోని మూట రంగనాధానికి అందిస్తు "మూట ఒక్కసారి విప్పి చూడండి " అన్నాడు శివయ్య.
"అవసరంలేదు ఇలా పలుమార్లు నువ్వు నావద్ద దాచుకుని వెళ్ళావు ఏనాడైనా అలా చూసానా ? నువ్వు ఇచ్చిన మూటకు నీ పేరున చీటి రాసి దానికి తగిలిస్తాను" అని శివయ్య చేతిలో మూట తీసుకున్నాడు రంగనాధం. నమస్కరించి వెళ్ళాడు శివయ్య.
వారం తరువాత వచ్చిన శివయ్య, రంగనాధం వద్ద ఉన్న మూటను తీసుకుని విప్పిచూస్తూ " మోసం, దగా, తమరు పెద్దమనిషి అని నమ్మి ధనం, నగలు దాయమని ఇస్తే ధనం ఉంచి నగలు మాయంచేస్తారా ?" అని అరుచుకుంటూ వెళ్ళి రాజు గారికి ఫిర్యాదు చేసాడు శివయ్య. మరుదినం రాజుగారి సభలో రంగనాధం ,శివయ్యలు ప్రవేశ పెట్టారు రాజభటులు.
శివయ్య ఆరోపణ విన్న మంత్రి సుబుధ్ధి " రంగనాధం గారు ఈ ఆరోపణపైన తమరి సమాధానం ఏమిటి? " అన్నాడు.
"ప్రభూ ధనవంతుడైన నేను దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది ? మా ఇరువురి గురించి మాఊరిలో తమరు విచారీంచి తీర్పు ఇవ్వమని వేడుకుంటున్నాను" అన్నాడు. నలుగురు భటులను పిలిచి వారి చెవి వద్ద గుసగుసలాడి వారిని పంపించిన మంత్రి "మీ ఇరువురు మా రాజభటుల రక్షణలో సాయంత్రం వరకు ఇక్కడే మీకు భోజన, విశ్రాంతి కల్పిస్తాను వెళ్ళండి" అన్నాడు మంత్రి సుబుధ్ధి. భటులతో రంగనాధం, శివయ్యలు వెళ్ళారు.
సాయంత్రం రాజ సభలో రంగనాధం, శివయ్యలు ప్రవేశపెట్టారు భటులు .
తన చేతిలోని నగల మూటను, శివయ్యకు చూపిస్తు " ఈనగల మూట ఎవరిది ? నువ్వు పోయినవి అని చెప్పిన నగలు అన్ని ఇందులో ఉన్నాయి. ఈమూట నీఇంటి భోషాణంలో దాయబడి ఉంది . అన్నాడు మంత్రి సుబుధ్ధి. మౌనంగా తలవంచుకు నిలబడ్డాడు శివయ్య. "రంగనాధం ఇంట్లో ఎందరో దాచుకున్న ధనం,నగలమూటలు ఉన్నాయి. అతను నమ్మకమైనవాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. పైగా అతనికి దొంబుధ్ధి ఉంటే నగలు మాత్రం దొంగిలించి ధనం నీకు తిరిగి ఇవ్వడు. ప్రభు ఉత్తముడైన రంగనాధాన్ని ఇలా అవమాన పరిచినందుకు శివయ్యకు తగిన శిక్ష విధించండి "అన్నాడు మంత్రి సుబుధ్ధి. " శివయ్య చేసిన తప్పుడు ఆరోపణకు తగిన శిక్షగా వారి గ్రామంలో మంచినీటి బావి నీ తొవ్విస్తూ దానికి అవసరమైన ధనాన్నీ అంతా శివయ్య భరించాలని ఆదేశిస్తున్నాం "అన్నాడు రాజుగారు.
" విక్రమార్క మహరాజా అలా సిరిపురంలో ఏర్పడిన బావికి దొంగబావి అనేపేరు ఎలావచ్చిందో ,తెలిసి నాకు చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు " అన్నాడు బేతాళుడు.
" బేతాళా ఇది చాలా తేలిక అయిన ప్రశ్న . ప్రజలు అందరికి తెలిసేలా రాజుగారు శివయ్యకు తప్పుడు ప్రవర్తనకు శిక్షగా తొవ్వించ బడినందున బావి అది అందుకే ఆగ్రామ ప్రజలందరూ దాన్ని దొంగ బావి అని పిలవసాగారు " అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో తను ఆవహించి ఉన్న శవంతో సహ మాయమయ్యాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.
*******
బావి తెచ్చిన బడి.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికొరకు స్మశానంలో ప్రవేసించి, బేతాళుడు ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చెర్చుకుని మౌనంగా స్మశానంనుండి బయలుదేరాడు.
" మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల, శ్రమ మెచ్చదగినదే! మన ప్రయిణంలో నీకు అలసట తెలియకుండా బావి తెచ్చిన బడి అనేకథ చెపుతాను విను...
సిరిపురం అనే గ్రామం లో ఆ ఊరుకి సమీపంలోని చుట్టుపక్కల గ్రామాలకు చలమయ్య ఇంటిలోని మంచినీటి బావి అందరికి తాగునీటికి ఆధారం, ఊరు తెల్లవారక ముందు రెండు గిలకలపై నీరు తోడటం ఆరంభమై రాత్రి పొద్దు పోయే వరకు అందరు తమ అవసరాలకు నీరు తోడుకు వెళుతుంటారు.
ప్రతీ పదిహేను రోజులకు ఒక సారి బావి చాంతాడులు కొత్తవి మారుస్తుండే వాడు చలమయ్య.
తమ ఊరి పిల్లలతో పాటు ఇరుగు, పొరుగు గ్రామాల పిల్లలు పట్నం వెళ్ళి చదువుకోవడం కోసం చాలా కష్టపడటం గమినించిన చలమయ్య గ్రామ పెద్దలను సమావేశపరచి ''అయ్య మన పిల్లలు, పొరుగు గ్రామాల పిల్లలు ఎండా, వానలలో అంత దూరం వెళ్ళి చదువుకోవడం బాధకరం మనం స్ధలం, ఆర్ధికంగా సహయం చేసుకుని పాఠశాల నిర్మించుకోగలిగితే ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇవ్వడానికి సంసిధ్ధత తెలియజేసింది. ఊరి మధ్యలోని నా ఖాళీ స్ధలం పాఠశాలకు ఉచితంగా ఇస్తాను మరియు పాఠశాల నిర్మాణానికి అయ్యే కర్చులో సగభాగం ఇస్తాను. మిగిలిన సగ భాగం ఊరిలో ప్రజలనుండి మనం విరాళంగా సేకరించ గలిగితే మనమే స్వయంగా పాఠశాల నిర్మించుకోవచ్చు" అన్నాడు.
" కుదరదు అది ప్రభుత్వ భాధ్యత కనుక మీరు ఈ పాఠశాల నిర్మాణానికి మేం అంగీకరించం " అని ఆసమావేశం నుండి చాలమంది వెళ్ళిపోయారు.
సహకార భావం, సమిష్టి పోరాటం లేని వారితో కలసి ఏపని చేయలేమని, ఈ ప్రజలంతా ఏనీటి బావిని ఆధారం చేసుకు బ్రతుకుతున్నారో ఆనీటి బావి ద్వారానే బడి నిర్మించాలని చలమయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు.
సంవత్సరకాలం అనంతరం పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాడు చలమయ్య. మూడునెలల కాలంలో పాఠశాల నిర్మాణం జరిగింది.
" విక్రమార్క మహరాజా చలమయ్య ఆబావి ద్వారానే బడి ఎలా నిర్మించాడు. తెలిసి చెప్పకపోయివో తలపగిలి మరణిస్తావు " అన్నాడు బేతాళుడు.
" బేతాళా మనిషికి నీరు ఎంత అవసరమో తెలిసిన చలమయ్య , తెలివిగా ఆనీటి బావి ద్వారానే బడి నిర్మించాలి అనుకుని , మరుదినం తప్పటపై దరువు వేస్తూ ఊరిలోని వచ్చిన ఒవ్యక్తి 'ఇందుమూలంగా తెలియజేయడమేమనగా రేపటి నుండి చలమయ్య గారి బావిలోని మంచినీరు తెచ్చుకునేవారు బిందెకు అర్ధ రూక చెల్లించాలి అని తెలియజేయడమైనది ఒహో ' అని పొరుగు గ్రామాలలో కూడా ప్రచారం చేసాడు. అది విన్న గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. షావుకారు నీళ్ళు అమ్ముకుంటున్నాడు ఏమిటి అనుకుని, వేరే దారిలేక నీళ్ళు అవసరం కనుక బిందెకు అర్ధరూక చెల్లించి అంతా మంచినీళ్ళు తెచ్చుకోసాగారు. సంవత్సరకాలం అనంతరం పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాడు చలమయ్య. మూడునెలల కాలంలో పాఠశాల నిర్మాణం జరిగింది. ప్రజలనుండి వసూలు చేసిన ధనంతో బడి నిర్మించగలిగాడు చలమయ్య" అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహ మాయమైయ్యాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికకై మరలా వెనుతిరిగాడు.